Ap state bifurcation a mystery

AP State bifurcation a mystery, AP State Reorganization Bill 2013, Chief Minister, MLAs of AP, Central Ministers, GoM, Union Cabinet, Ministers, Sonia Gandhi

AP State bifurcation a mystery

రాష్ట్రవిభజన గురించి ఎవరికీ తెలియని నిజం

Posted: 02/06/2014 08:57 AM IST
Ap state bifurcation a mystery

రాష్ట్రవిభజన విషయంలో నాయకులకు ఎవరికీ స్పష్టత లేదన్నది వారి మాటల్లోనే తెలుస్తోంది.  కేంద్ర మంత్రులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు ఎవరికీ ఏ మాత్రం అవగాహన లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కూడా తెలియకపోవటం శోచనీయమే అవుతోంది. 

సరే బంతి కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి మనవాళ్ళకేమీ తెలియటం లేదనుకుందాం.  కనీసం కాంగ్రెస్ పెద్దలకైనా ఏమైనా తెలుసా అంటే అదీ ప్రశ్నార్ధకంగానే ఉంది.  దీని మీద మీడియా అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి షిండే కానీ, కాంగ్రెస్ ఛీఫ్ సెక్రటరీయే కాకుండా రాష్ట్ర వ్యవహారాలను కూడా చూసే దిగ్విజయ్ సింగ్ కానీ, మంత్రుల బృందంలో హడావిడి చేసే జైంరాం రమేష్ కానీ ఇలా ఎవరూ ఏమీ ఇదమిద్ధంగా చెప్పలేకపోతున్నారు. 

ప్రధానమంత్రి మాత్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.  ఇంతవరకు అసలు చక్రమంతా తిప్పుతున్న యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ విషయంలో నోరు విప్పలేదు.  అసలు వీళ్ళకైనా స్పష్టత ఉందా అన్న అనుమానం కలగటం సహజమే.  జరుగుతున్న పరిణామాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారేమో అనిపిస్తోంది.  అందుకే అందరూ వాళ్ళవంతు భాగంగా వారివారి సూచనలను, నిరసనలను అధిష్టానానికి అందజేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఎవరికివారు మీడియాలో తాము తెలుసుకున్నది, తాము నమ్ముతున్నది కాక ఏ చెప్తే బాగుంటుందో, ఆ రోజుకి పబ్బం గడుస్తుందో అది చెప్పి రోజులు గడిపేస్తున్నారు. 

రాష్ట్ర నాయకులంతా ఎవరికి వారు పోరాడుతున్నామనో లేకపోతే మద్దతునిస్తున్నామనో అనుకుంటున్నారు.  కానీ వీళ్ళు చేసేదానికి అక్కడ జరుగుతున్నదానికి సంబంధమేమీ ఉండకపోవచ్చు కూడా.  ఆందోళనలు పెచ్చుమీరిపోకుండా ఉండటం కోసమేమో, కాంగ్రెస్ పార్టీ ఏ విషయమూ ఆఖరు క్షణం వరకు బయటపెట్టకుండా ఉంటోంది. 

అనవసరమైన రాద్ధాంతం చేసుకోవటం ఎందుకనుకుంటున్నారేమో కానీ కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఏమో చూద్దాం, సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్నిబట్టి వుంటుంది లాంటి మాటలతో నెట్టుకొస్తున్నారు. 

అయితే విషయాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు చెప్పేదేమిటంటే నిర్ణయం జరిగిపోయింది, బిల్లు ప్రవేశపెట్టటానికి తయారుగా ఉంది కానీ ఈ చర్చలు ఇవన్నీ కేవలం మభ్య పెట్టి ఎవరికీ ఏమీ ముందుగా తెలియకుండా ఉండటం కోసం చేస్తున్నవే, లేకపోతే ఆంటోనీ కమిటీ ఏమైంది అని అడుగుతున్నారు.  ఒక పక్క ఆంటోనీ కమిటీతో సమావేశాలు జరుపుతూనే మరోపక్క రాష్ట్ర విభజన బిల్లును టేబుల్ ఐటమ్ గా పెట్టటం, హడావిడిగా రాష్ట్రపతికి పంపటం, అక్కడ నుండి ఏమో మాకు ఇంకా అందలేదు అని ఒక పక్క హోం మంత్రి చెప్తూనే మరోపక్క రాష్ట్రానికి వాటి ప్రతులను ప్రత్యేక విమానంలో పంపించటం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే బిల్లు ఆమోదింపజేసుకోవటానికే కేంద్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ అంతా బావుందనుకున్న క్షణంలో అకస్మాత్తుగా బిల్లుని ప్రవేశపెట్టి గెలిపించుకునే అవకాశం ఉంది.

ఇప్పుడు ఏదో చేసేస్తున్నామనుకుంటూ ఢిల్లీలో ప్రతి ఒక్కరినీ కలిసి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి రాష్ట్రపతి దగ్గర టైం తీసుకుంటూ, వాళ్ళు చెప్పింది చాలా బాగా విన్నారని తృప్తి పడి బయట కూడా చెప్పుకుంటున్నవాళ్ళంతా చివరకు వాళ్ళంతా నిమిత్తమాత్రులే, ఎవరూ ఏమీ చెయ్యలేదు, అంతా ముందు అనుకున్న పథకం ప్రకారమే జరుగుతోంది అన్న భావన కలుగక మానదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles