Road cleared for telangana state

Road cleared for Telangana state formation, TRS party, KCR, Million march, Sakala Janula Samme, T bill passed in Loksabha

Road cleared for Telangana state formation

లోక్ సభలో బిల్లుకి ఆమోదం తెలంగాణా ప్రజలకు మోదం

Posted: 02/18/2014 05:11 PM IST
Road cleared for telangana state

లోక్ సభలో తెలంగాణా బిల్లుకు భాజపా మద్దతు ప్రకటించటంతో దాదాపూ రాష్ట్రం ఏర్పడ్డట్టే.  విజయసోపానాన్ని ఎక్కినట్టే.  కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చతురతంగా ఉపయోగించి తను అన్న మాటను నెగ్గించుకుని తెలంగాణాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. 

సభలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి కాని అవి కేవలం సీమాంధ్రకు ఆర్థిక పొట్లాలు అందించి ఆటలో అరటి పండు అని వాళ్ళకు కలుగుతున్న బాధను తగ్గించటానికే.   ఒక పక్క రాజనీతిని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరనే విమర్శలు వస్తున్నా, మమతా బెనర్జీ శరద్ యాదవ్ లాంటి నాయకులు వాకౌట్ చేసి బయటకు వచ్చేసినా, ఎన్నో ఏళ్ళుగా తెలంగాణా ప్రజలు కంటున్న కలలకు సాకార రూపమిచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా తమ బాగోగులు తాము చూసుకుంటూ ఎక్కువ చదువుకున్నవాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు కాబట్టి మాకు రావలసింది రానివ్వరు, మాకు దక్కవలసింది దక్కనివ్వరని ఆక్రోశిస్తూ మా ఏలుబడి మాకివ్వండంటూ దశాబ్దాలుగా పోరు సాగిస్తున్న తెలంగాణా ప్రజల కోరిక ఈ నాటికి తీరుతున్నదన్న సంతోషం తెలంగాణా అంతా అలుముకుంది. 

హైద్రాబాద్ రాష్ట్రంలో నవాబులు, దొరల పెత్తనం నుంచి విముక్తి లభించిన తర్వాత కూడా సీమాంధ్ర వాసులు మా మీద పెత్తనం చెలాయిస్తున్నారే అనే ఆవేదన రగులుతూ వచ్చింది.  కానీ ఇందిరా గాంధీ కాలంలో దాన్ని పూర్తిగా అణచివేయబడింది.

ఎన్ని పార్టీలు, సంఘాలు పోరాటాలు సలిపినా, మరోసారి తెలంగాణా రాష్ట్రం కావాలని పట్టుబట్టి తిరిగి ఆ వేడి చల్లారకుండా చూసిన కీర్తి మాత్రం తెలంగాణా రాష్ట్ర సమితికి, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకే దక్కుతుంది.  తెలంగాణా కోసమే ఆవిర్భవించిన పార్టీ, అది సాధించటమే మా ధ్యేయం అంటూ చెప్తూ వచ్చిన తెరాస దానికోసం రాజకీయంగా కూడా ఎన్నో ఎత్తులు వేయవలసి వచ్చింది. 

తెలంగాణా ఇవ్వకపోతే మీకు మనుగడ లేదు అని కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చెప్పటం వలనే, శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను కానీ ఉప్పెనలా వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కానీ, సొంత పార్టీ నుంచి వ్యతిరేకతలను కానీ పట్టించుకోకుండా ఒకే ధ్యేయంతో కాంగ్రెస్ ముందుకు పోయి బిల్లును లోక్ సభలో ఆమోదం పొందేంత వరకూ తీసుకెళ్ళిందంటే అలా చెయ్యవలసిన అగత్యం కలిగించిన తెరాసను మెచ్చుకోక తప్పదు.

2007 వ సంవత్సరం ఏప్రిల్ 27 న సిద్ధిపేటలో స్థాపించిన తెరాస పార్టీ 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మి 26 సీట్లు గెలిపించారు.  5 పార్లమెంటు సీట్లు కూడా దక్కించుకోగలిగింది.  కానీ కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోకపోవటంతో 2006 లో తెరాస మద్దతును ఉపసంహరించుకుంది. 

2006 లో ఉప ఎన్నికలు జరపవలసిన అగత్యాన్ని కలిగించిన కెసిఆర్ ఆ ఎన్నికలలో అఖండమైన విజయాన్ని సాధించారు.  2008 లో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన మాట నిలబెట్టుకోకపోవటంతో ఊకుమ్మడి రాజీనామాలు చెయ్యటం జరిగింది.  ఉప ఎన్నికలలో తెరాస తిరిగి తెలంగాణాలో దాదాపు సగం సీట్లను సంపాదించుకుంది.  2009 లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరిగింది. 

అయితే తెరాస కు అసలు మలుపు కెసిఆర్ నవంబర్ 29 2009 లో చేసిన నిరాహార దీక్షతో మొదలైంది.  అక్కడి నుండి వెనుతిరిగి చూడని కెసిఆర్ తెలంగాణా ప్రాంత ప్రజల నుండి విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నారు.  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులచేత కూడా రాజీనామా చేయించ గలిగారు, అందులో కొందరిని తెరాస లో కలుపుకోగలిగారు. 

తెరాసకు తోడుగా తెలంగాణా రాజకీయ ఐకాస ఆవిర్భవించి ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో ఐకాస కార్యక్రమాలు తెరాసకు మద్దతుగా జరిగి, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, తెలంగాణా ఎన్జీవో సంఘాలు మద్దతుగా నిలిచి ఎన్నో ఉద్యమాలు చెయ్యటం జరిగింది.  అందులో ముఖ్యంగా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లు విజయవంతంగా జరిగాయి.

మొత్తానికి అందరి సహకారంతో తెలంగాణా ప్రజల ఆకాంక్షలు ఫలించగా ఈ రోజు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం లభించటం తెలంగాణా రాష్ట్రాన్ని ఆశించినవారందరికీ మోదాన్ని కలిగించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles