దశలవారీ ఎన్నికలు మోదీకి లాభం చేకూర్చాయా అంటే ఔననే చెప్పవలసివుంటుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలు 9 దశలలో ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు అంటే 36 రోజుల కాలవ్యవధిలో విస్తరించి జరుగుతోంది. దీనివలన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేంద్ర మోదీకి అన్ని ప్రాంతాలకూ తిరుగుతూ వోటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం లభించింది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా చేసిన ప్రసంగాలు 400 కి పైగానే ఉన్నాయి. పోలింగ్ ఇన్ని దశలలో జరగకుండా ఇంత కాల వ్యవధి ఇవ్వకుండా ఉంటే మోదీ అన్నిచోట్లకు వెళ్ళగలిగేవారు కాదు. అయితే ఈ అవకాశం మోదీకి ప్రత్యేకమేమీ కాదు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్కువగా ఉపయోగించుకున్నది మోదీయే. ఇది ఆయనలో దాగివున్న శక్తిని కూడా చాటుతోంది. ఎంత విమానాలలో ప్రయాణం చేసినా, ఎసిలో ఉన్నా వేసవిలో సభలను నిర్వహించటం తేలికైన పని కాదు.
అయితే అన్నిచోట్లా ఒకే విధంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ప్రాంతాన్నిబట్టి పార్టీ మానిఫెస్టో మారుతుంది, నాయకుల వాగ్దానాలు మారుతాయి, ప్రాంతీయంగా స్థానిక ప్రత్యర్థుల మీద ప్రహారాలకూ కావలసినంత అవకాశం దొరుకుతుంది. ఎక్కడికి పోతే అక్కడివారితో ఆత్మీయంగా ఆ ప్రాంతమంటే ఎంతో ఇష్టమున్నట్లుగా మాట్లాడి స్థానికుల మనసుని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని మోదీ బాగా వాడుకున్నారు. ఇతర నాయకులు అలా చెయ్యలేకపోయారు అంతే.
మన రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణాలో ముందు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. అందువలన ఇరు ప్రాంతాలలో పోటీచేసే నాయకులంతా ముందు తెలంగాణా మీద దృష్టి పెట్టటానికి అవకాశం లభించింది. తెలంగాణా అంటే ఇష్టమని, తెలంగాణా ప్రాంత అభివృద్ధే ధ్యేయమని, రాష్ట్ర విభజనకు సహకరించామని, తెలంగాణా సంస్కృతిని కాపాడుతామని చెప్పటానికి వీలు కలిగింది. అక్కడ ఎన్నికలు అయిపోగానే సీమాంధ్రలో పర్యటిస్తూ, రాష్ట్ర విభజన అంశం పైకెత్తి ఒకరి మీదొకరు అందుకు కారకులంటూ విమర్శించటానికి వీలు చిక్కింది.
ఈ విషయంలో ఏ ఒక్క పార్టీనీ, ఏ ఒక్క నాయకుడినీ ప్రత్యేకంగా అనటానికి లేదు. ఇరు ప్రాంతాలలోనూ విడివిడిగా మాట్లాడటానికి దొరికిన అవకాశాన్ని ఏ ఒక్కరూ వదిలిపెట్టలేదు. దానితో పాటు అక్కడ స్థానిక సమస్యలలాంటివి వారి ఉపన్యాసాలలో చోటుచేసుకున్నాయి.
అలా అని ఇలా జరిగటం ఇది మొదటిసారేమీ కాదు. దీన్ని మొదలుపెట్టిన నాయకుడు దివంగత వైయస్ ఆర్. 2009 లో ఈ విధానాన్ని అమలుపరుస్తూ తెలంగాణా సీమాంధ్ర రెండు ప్రాంతాలను తనకు అనుకూలంగా చేసుకున్నారాయన.
ఈ విధానంలో రెండు అజెండాలను తయారుచేసుకోవచ్చు. ఒకటి జాతీయ లేక రాష్ట్ర స్థాయిలోను, రెండవది వాళ్ళు పర్యటిస్తున్న ప్రాంతానికి ప్రత్యేకమైన అజెండాను తయారు చేసుకునే వెసులుబాటుంటుంది. అందువలన మోదీ తను నిలబడుతున్న స్థానాలలోనే కాకుండా తనకు మద్దతునిచ్చే అందరి కోసం దేశమంతా పర్యటించి వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యగలిగారు. దానితో దేశంలోను, రాష్ట్రంలోను రాజకీయముఖచిత్రమే మారిపోయింది.
మరో ప్రయోజనం మోదీకి కలిగింది ఏమిటంటే, ఒక ప్రాంతంలోని ప్రజల స్పందన మరో ప్రాంతవాసుల మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. సమాచార వ్యవస్థ పుణ్యమాంటూ ఎన్నికల నియమావళి ప్రకారం వోటర్లను ప్రభావితులను చేసే ప్రసంగాలను పోలింగ్ కి 48 గంటల లోపు ఇవ్వకూడదు కాబట్టి అక్కడ చెయ్యరు కానీ చెయ్యగలిగిన ప్రాంతాలలో చేసిన ప్రసంగాలను టివి ఛానెల్స్ ప్రసారం చేస్తే వాటిని అందరూ చూస్తారు. అంటే వోటరు అభిప్రాయం పోలింగ్ జరుగుతున్న కాలమంతా మారిపోతూనేవుంటుంది.
మోదీ ఉపయోగించుకున్న ఈ వెసులుబాటును నెమ్మదిగా అర్థం చేసుకున్న ఇతర పార్టీ నాయకులు కూడా టివి ఇంటర్వ్యూలు, ప్రత్యర్థుల మీద అభియోగాలు మోపుతూ వస్తున్నారు. ఉదాహరణకు మాయావతి, మమతా బెనర్జీ మోదీకి వ్యతిరేకంగా ఆయన మీద ఉన్న ఆరోపణల మీదా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడివుండటానికి ఒక కారణం, మోదీ లాంటి బలమైన నాయకుడు, దేశమంతా అలుపెరుగకుండా పర్యటించి అన్నిచోట్లా వోటర్లను తన వైపు తిప్పుకోగలిగే సమర్ధత కలవారు లేకపోవటం. రెండవ కారణం ఓడిపోకముందే కాంగ్రెస్ నాయకులలో ఓటమి భయం కలగటం అని చెప్పుకోవచ్చు.
అందువలన, 9 దశలుగా 36 రోజుల పాటు ప్రచారానికి ఎన్నికల కమిషన్ చేసిన వెసులుబాటు కేవలం మోదీకే కలుగలేదు కానీ, దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నవారు ఆయనే. దానితో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణా ప్రాంతంలోను, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను విడివిడిగా ఎన్నికలను నిర్వహించటంతో భాజపా, తెదేపాలకు ప్రయోజనకారిగా మారింది.
ఈ రెండు ప్రాంతాలలోను నాయకులు మాట్లాడిన మాటలు చూస్తే, ఎవరూ ఎవరికి తీసిపోరని తెలుస్తుంది. ప్రాంతాన్నిబట్టి వారి ఉపన్యాసంలో చోటుచేసుకున్న అంశాలు మారుతూ వచ్చాయన్నదాంట్లో అనుమానం లేదు. తెలంగాణా అభివృద్ధి మంత్రం, భాష సంస్కృతి సాంప్రదాయల పొగడ్తలు అప్పడు అక్కడైతే, రాష్ట్ర విభజన ఇక్కడి ప్రత్యర్థుల వలన జరిగిందంటూ ఆ అంశాన్ని లేవనెత్తటం, రాజధానిని ఇలా నిర్మిస్తాం, అలా చేస్తాం, హైద్రాబాద్ బాబులా తయారు చేస్తాం, ఢిల్లీ తలదన్నేలా తయారవుతుంది అంటూ ఇక్కడ అనటం జరిగింది. తెలంగాణా ఇచ్చింది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ కూడా సీమాంధ్ర ప్రజల మనసు నొచ్చుకోకుండా ఇక్కడ అభివృద్ధి మాతోనే సాధ్యమవుతుంది అని అన్నారు.
అలా, రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా నాయకులకు వోటర్లను ప్రభావితులను చెయ్యటానికి కావలసినంత అవకాశం లభించింది. ఇక చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత కాబట్టి మే 16 న వచ్చే ఫలితాలతో వాళ్ళ అంచనాలను పోల్చి చూసుకోవటమే మిగిలింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more