ఋణ మాఫీ అవసరమా?
ఋణ మాఫీ అనేదాన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే నిజానికి చాల మంచి విధానం. ఆర్థికంగాచితికిపోయిన వ్యక్తి తిరిగి పుంజుకోవటానికి ఒకసారి ఆ వ్యక్తి తలమీది నుంచి ఋణభారాన్ని తీసేసి, భవిష్యత్తులో వెనక్కి చూడకుండా ముందుకు ఆడుగులు వెయ్యటానికి పనికివస్తుంది. దీన్ని రాజకీయ లబ్ధికోసం కాకుండా నిజంగా ప్రయోజనకారిగా చెయ్యాలీ అంటే దారీతెన్నూ తెలియకుండా ఉన్న ఋణగ్రస్తుడిని ఋణవిముక్తుడిగా ఒక్కసారి చేసి మళ్ళీ పైకి ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ప్రకృతి మీద ఆధారపడ్డ రైతు రెక్కలు ముక్కలు చేసుకుని ఎండనకా వాననకా శ్రమించి చివరకు ప్రకృతి వైపరిత్యం వలన పంటనష్ట పోయినప్పడు ఆ రైతుకి ప్రభుత్వ సాయం చాలా అవసరం.
అయితే కొత్తగా అవతరించిన తెలంగాణా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి కూడా ఈ ఋణ మాఫీ ఆర్థికంగా పెద్ద భారమే అవుతుంది. అందువలన ఆ భారాన్ని సాధ్యమైనంత తగ్గించటం వలన ప్రభుత్వం నడవగలుగుతుంది. అయితే వాటికి మార్గదర్శకాలు తయారు చెయ్యటం అంత సులువైన పని కాదు. ఒక విధానాన్ని తీసుకుని వచ్చేటప్పుడు కొందరికి నష్టం కలగటం కూడా జరుగుతుంది.
లబ్ధిదారులు ఎవరు?
ప్రస్తుతం లక్షరూపాయల వరకు ఋణమాఫీ అని అంటే లక్ష వరకు ఋణం వున్నవాళ్ళకి పూర్తి ప్రయోజనం కలుగుతుంది, లక్షకంటే తక్కువ ఉన్నవాళ్ళకి ఇందులో పూర్తి లాభం కలుగలేదే అన్న బాధ పట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్లు ఏ బంగారమో లేక నోటి మాటతోనో నోటుతోనో ప్రైవేటు ఫైనాన్స్ తీసుకుని ఉండవచ్చు. అది బ్యాంక్ లో లేకపోవటం వలన ఆ బాకీ మిగిలిపోతుంది. లక్షకు పైగా ఋణం ఉన్నవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినట్లే ఉంది కానీ పూర్తిగా బయటపడటం జరగటం లేదు. అయితే లక్షకు పైగా ఋణం తీసుకున్నారూ అంటే వాళ్ళ స్తోమతు బీద రైతుకంటే ఎక్కువదే కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఆర్థికంగా నిలదొక్కుకుంటారన్న ధీమా కూడా ఉండివుండవచ్చు.
బ్యాంక్ ల చుట్టు ఏం తిరుగుతాంలే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకుందామని అనుకున్నవాళ్ళకి ఈ ఋణమాఫీ వర్తించదు. వాళ్ళు తీసుకున్నదీ పంటకోసమే అయినా దాన్ని పంట ఋణం కిందికి తెలంగాణా ప్రభుత్వం తీసుకోవటం లేదు.
బ్యాంకర్లకు లాభామా నష్టమా?
బ్యాంకర్లను పిలిచి సమావేశపరచినప్పుడు మాఫీకి నోచుకునే ఋణాల విషయంలో బ్యాంకర్లెందుకు విముఖత చూపిస్తున్నారు అంటే రైతు ఋణం మాఫీ అయినా, బ్యాంక్ కి మాత్రం వెంటనే పైకం మొత్తం రాదు. పైగా ప్రభుత్వంతో ఒప్పందం అయిపోగానే ఋణం తీరినట్లే లెక్క. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైకం మొత్తం వచ్చేంత వరకు దాని మీద వడ్డీ నష్టమే అవుతుంది. అంటే బ్యాంక్ లు ప్రభుత్వానికి వడ్డీలేని ఋణం ఇచ్చినట్లే. అయితే అసలుకే దిక్కు లేనప్పుడు వడ్డీ పోతేనేం అంటే, ఆ వడ్డీయే కదా బ్యాంక్ కి వచ్చే ఆదాయం. కాకపోతే పూర్తిగా రానిపద్దుగా వేసుకోకుండా పనికివస్తోంది.
కట్టవలసిన ఋణాన్ని సమయానికి కట్టకపోతే బ్యాంక్ నియమాల ప్రకారం అది ఎన్ పి ఏ అవుతుంది. అంటే నాన్ ప్రొడక్టివ్ గా మారిపోతుంది. ఇప్పుడా రైతులకు తిరిగి వ్యవసాయ ఋణాలు ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించటానికి సరైన పద్ధతిలో రికవర్ అయిన మొత్తం కూడా కాదు.
ఋణమాఫీతో అంతా చక్కదిద్దుకుంటుందా?
అన్నిటికన్నా ముఖ్యంగా అసలా ఋణాలు దేని వలన రైతులకు భారంగా మారాయన్నది అధ్యయనం చెయ్యవలసివుంది. అప్పు తీసుకోవటమంటే భవిష్యత్తులోని ఆదాయాన్ని ఇప్పుడే వాడుకోవటం మొదలుపెట్టినట్లు. కానీ ఆ భవిష్యత్తు మాత్రం ఎవరిచేతిలోనూ లేదు. భవిష్యత్తులో ఆశించిన ఆదాయం వస్తుందో రాదో, అనుకున్న రేటు పలుకుతుందో లేదో ఏమీ తెలియదు. రైతులకు గిట్టుబాటు ధరే పలకలేదన్న వార్తలు తరచుగా వినిపిస్తుంటాయి. అలాంటప్పుడూ వాళ్ళ ఋణాలు ఆగిపోతుంటాయి ఒక్క ప్రకృతివైపరిత్యం వలనే కాకుండా.
అందువలన ఋణమాఫీలు చేసేసినంత మాత్రాన రైతులకు మేలు చేసినట్లు కాదు. వాళ్లు మళ్ళీ ఋణగ్రస్తులు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచించి సత్వర చర్యలు తీసుకోవాలి. మళ్ళీ సంవత్సరం ఇట్టే తిరిగి వస్తుంది.
ఋణమాఫీతో ప్రభుత్వం మీద పడ్డ భారాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుంది?
ఇంకా మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోను, ప్రభుత్వం నడుస్తోంది ఎక్కువగా ప్రజలు చెల్లించే పన్నుల మీదనే. ఒక చోట రాయితీ ఇచ్చిందంటే మరో చోట పన్ను భారం పడక తప్పదు. లేకపోతే ఉద్యోగుల జీతాల దగ్గర్నుంచి రాష్ట్రంలోని అభివృద్ధి పనుల వరకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది. ప్రైవేటు రంగంతో భాగస్వామ్యంతో పరిశ్రమలు అభివృద్ధి చేసినా వాళ్ళూ దేశవాసులే. ఆ సంస్థలు కూడా లాభాలు ఆర్జించేది దేశవాసుల దగ్గర్నుంచే. అయితే ప్రభుత్వ రంగం లాభసాటిగా నడిచినప్పుడే ప్రజల మీద భారం తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వాలు కూడా వ్యాపార సరళిలో ఆలోచించాలి. రాష్టర్ ప్రజలతో కాదు ఆ వ్యాపారం చేసేది. బయటివారితో. అప్పుడే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అది విద్యుత్ ఉత్పాదన వలన కావొచ్చు, ఆహారధాన్యాల ఎగుమతి వలన కావొచ్చు లేదా పర్యటన, ఇతర ఉత్పత్తుల సేవల వలన కావొచ్చు.
గుజరాత్ లో నరేంద్ర మోదీ సాధించింది అదే. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం వెయ్యటం కాకుండా ప్రభుత్వం దగ్గరున్న సొమ్ముని వ్యాపార సరళిలో వృద్ధి చేసి తద్వారా వచ్చిన సొమ్ముతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యటం.
కాకపోతే పూర్తిగా ఆ పంథాలో పోవటం కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే రాజకీయపుటెత్తులు వెయ్యకపోతే ఎక్కడ తప్పు దొరకుతుందా అని భూతద్దం పెట్టి వెతుకుతూవుండే ప్రతిపక్షానికి అవకాశం దొరుకుతుంది. దానితో అసలుకే మోసం రావొచ్చు.
ఋణమాఫీ మొత్తాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద రుద్దటం కాకుండా రాష్ట్రం ప్రత్యామ్నాయ విధానాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే మాత్రమే రాష్ట్ర ప్రజలకు నిజమైన సాయం చేసినవారవుతారు. అలాగే ఋణగ్రస్తులు మరోసారి అప్పుల్లో చిక్కుకోకుండా కూడా ప్రభుత్వ విధానాల్లో మార్పులను తీసుకునిరావలసివుంటుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించవలసివుంటుంది.
చూడాలి- తెరాస, తెదేపా లు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేరుస్తారో!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more