Shivaramakrishnan committe report a shock to chandrababu naidu

tdp, chandrababu naidu, telangana, andhra pradesh, ap government, ap capital, shivaramakrishnan committee, telangana bill, central government, modi, latest news

shivaramakrishnan committee on capital given a shock to chandrababu naidu : ap government shocks by shivaramakrishnan committee report on capital

క్యాపిటల్ పై కమిటీ క్లారిటీ. టిడిపిలో కలకలం

Posted: 08/30/2014 11:13 AM IST
Shivaramakrishnan committe report a shock to chandrababu naidu

ఏపీ రాజధాని ఎంపికపై ఎట్టకేలకు క్లారిటీ

రాజధాని ఎంపికపై కేంద్రానికి శివరామకృష్ణన్ నివేదిక

కమిటి నివేదిక ఆమోదించిన కేంద్రం

ఏపీ ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా నివేదిక

ఏపీ సర్కారులో శివరామ కమిటి కలకలం

ఏపీ రాజధానిపై నెలకొన్న సస్పెన్స్ కు ఇక తెరపడినట్లే. ఎట్టకేలకు రాజధాని ఎంపికపై నివేదికను శివరామకృష్ణన్ కమిటి కేంద్రానికి అందించింది. నెలాఖరు వరకు గడువున్నా రెండ్రోజుల ముందుగానే పని పూర్తి చేసి శబాష్ అనిపించుకుంది. అయితే ఈ నివేదిక టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. వీటీటీఎం, మెట్రో నగరాలు, అంటూ ప్రకటనలు చేస్తున్న నేతల నోళ్ళకు తాళం వేసింది. కమిటి ఇచ్చిన నివేదికను కేంద్రం ఆమోదించటంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక ఏపీ ప్రభుత్వం నానా హైరానా పడుతోంది.

విజయవాడ -గుంటూరు వద్దే వద్దు !!

రాష్ర్ట విభజన జరిగినప్పటి నుంచి ఏపీ క్యాపిటల్ విజయవాడ అవుతుందని లేదా గుంటూరు ఖాయమని ఈ రెండు కాకపోతే..., రెండు ప్రాంతాల మద్య ఉంటుందని నేతలు చెప్తూ వస్తున్నారు. వారి ప్రకటనలు వెలువడటంతోనే ఈ ప్రాంతంలో రియల్ భూం వచ్చి కూర్చుంది. లక్ష రూపాయల లోపు ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా కోట్లకు పెరిగాయి. స్వయంగా ప్రభుత్వ పెద్దల అనుచరులు, సహచరులే రియల్ దందాలకు దిగటంతో ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు అడ్డుకుంటామనే నోటి మాటలు తప్ప. ఎలాగు రాజధాని నిర్మించి ఇచ్చేది కేంద్రమే కదా.., భూములు కొనుక్కుంటే ఢిల్లీ దిగివచ్చి తమకు డబ్బులు చెల్లిస్తుందని అంతా ఆశించారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం కూడా  విజయవాడ గుంటూరు మద్యే రాజధాని ఉంటుందని పరోక్ష సంకేతాలు ఇచ్చింది. ఇందుకోసం మంత్రి నారాయణతో ప్రత్యేక కమిటి  వేసి ప్రతిపాదనలను శివ కమిటికి పంపింది. ప్రత్యేకంగా విజీటిఎం ప్లాన్ అని ఒక అంశం తెరపైకి తెచ్చింది. అన్ని నగరాల అభివృద్ధి.. ఏపీ సమగ్రాభివృద్ధి అని ప్రకటనలు చేసింది.

ఈ అంశాలన్నిటినీ కమిటీ పరిశీలించింది. నేతలు చెప్తున్నట్లు అన్ని ప్రాంతాల అబివృద్ధి మాట అటుంచితే ఇక్కడున్న వ్యవసాయం, సాంద్రమైన నేలలు నాశనం కావటం ఖాయమని స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు నట్టేట మునుగుతారని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు ఇచ్చిన నిబంధనలు, పరిధికి లోబడి కమిటీ పనిచేసింది. రాష్ర్టంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ..., అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించి కేంద్రానికి ఇచ్చింది. విజయవాడ-గుంటూరు అనే ప్రతిపాదన పూర్తిగా పక్కన బెట్టాలని తీర్పు చెప్పింది.

 టిడిపిలో కలకలం - తలపట్టుకుంటున్న ప్రభుత్వం

శివరామకృష్ణన్ కమిటి నివేదికతో తెలుగుదేశంలో కలకలం మొదలయింది. అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం చెప్పిన ప్రతిపాదనలు పక్కనబెట్టి.., కమిటీ వ్యవహరించటాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమను నమ్మి రియల్ దందాలు నడిపిన వారు, సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని భవిష్యత్తుకు పెట్టుబడులు అంచనా వేసుకన్న వారు ఇప్పుడీ నివేదికతో లబోదిబో మంటున్నారు. తామొకటి తలిస్తే.., శివరాముడు మరొకటి విన్పించాడని అనుకుంటున్నారు. అటు ప్రభుత్వం కూడా ఈ నివేదికపై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటోంది. స్వయంగా మంత్రులే విజయవాడకు ఆనుకుని రాజధాని ఉంటుందని ప్రతిపాదించారు. అయితే కమిటీ మరొకలా నివేదిక ఇవ్వటంతో వారికి నోట్లో వెలగపండు పడినట్లయింది. నివేదికపై స్పందించేందుకు కూడా ప్రభుత్వ పెద్దలెవరూ ఇప్పుడు సాహసించటం లేదు. 1న కేబినెట్ భేటీలో చర్చించి ప్రకటన చేస్తామని అంటున్నారు.

 వీజీటీఎంపై ఎందుకింత పట్టు?

ఏపీ రాజధాని ఎంపికలో ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా రాజధానిపై అన్ని ప్రాంతాల ప్రజలు, నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరు పరిసర ప్రాంతాలకే పరిమితం అయింది. అదేమంటే చెప్పే ప్రదాన కారణం అన్ని ప్రాంతాలకు మధ్యలో అనుకూలంగా ఉంది అని. కాని అసలు విషయం మరొకటి ఉందని అందరికి అర్థమవుతోంది. విభజన పనులు జరుగుతున్నపుడే.., విజయవాడ గుంటూరు మద్య రాజధాని ఉంటుందని ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మొలక వేయని బంజరు భూమి కూడా కోట్ల ధర పలికింది. ఈ దందాలో నేతలు, వారి అనుచరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయ్యారు. దీంతో వారికి ఈ ప్రాంతంపై మక్కువ ఏర్పడింది. ఎలాగైనా ఇక్కడే రాజధాని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసమే విజయవాడ గుంటూరులకు పరిమితం చేయకుండా పక్కనే ఉండే మంగళగిరి, తెనాలిని కలుపుకుని వీజీటీఎం కారిడార్ ప్రకటించారని తెలుస్తోంది.

వీజీటీఎం అయితే రాష్ర్టం మధ్యలో ఉందని చెప్పిన నేతలు.., భూ లభ్యతపై మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అమాంతంగా పెరిగిపోయిన ప్రైవేటు భూమి ధరలు, నాణ్యమైన వ్యవసాయ భూములను కొనుగోలు చేయటం వల్ల కలిగే నష్టాలపై స్పష్టత ఇవ్వలేదు. ఇవే వారి కొంప ముంచాయి. వీటిని పరిగణలోకి తీసుకునే శివరామకృష్ణన్ వీజీటీఎంను పక్కనబెట్టి మరో ప్రతిపాదన సూచించింది. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించేలా.., పరిపాలన వికేంద్రీకరణ జరిగేలా సూచనలు చేసింది. సొంతలాభం చూసుకున్న నేతలు.., ఉన్నదంతా ఊడ్చి పెట్టి భూములు కొన్నవారు ఇప్పుడీ నివేదికతో ఒక్కసారిగా కుదేలవుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital  chandrababu naidu  shivaramakrishnan committee  latest news  

Other Articles