Teegala and 3 other mla s to join trs

Telugu Desam Party, theegala Krishna Reddy, TRS, KCR, prakash goud, TTDP, Manchireddy

Teegala and 3 other MLA's to join TRS

అయిననూ.. షి‘కారు’కు వెళ్లిరావలె...

Posted: 10/01/2014 08:41 AM IST
Teegala and 3 other mla s to join trs

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనిక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. టీడీపీ పార్టీ నేతలను, కార్యకర్తలను చేర్చుకునేందుకు మైండ్ గేమ్ అడుతోంది. అది మైండ్ గేమ్ అని విమర్శలకు అనినా.. ఆపరేషన్ ఆకర్ష్ అని సానుకూలరు అన్న టీడీపీ కనుమరుగు చేసేందుకు పకడ్బంధీ ప్రణాళిక మాత్రం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం నేతలను సెంటిమెంట్ పేరుతో ఆకర్షించి.. వారికి పలు పదవులను కట్టబెట్టేందుకు కూడా ప్రభుత్వం, అధికార పార్టీ సుముఖంగా వున్నట్లు సమాచారం.

షికారు వెళ్లాలని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న శాసనసభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు కలసి మాట్లాడినా.. అవి నిష్పయోజనం అవుతున్నాయి. జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నవారితో మాట్లాడినా.. లాభం లేకుండా పోతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలలో చంద్రబాబు బిజీబిజీగా వుంటూ.. తమను అసలు పట్టించుకునే పాపన పోవట్లేదని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ పార్టీ నేతలు పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో జారుకునే అవకాశాలు వున్నాయిని ఇదే జరిగితే పార్టీ ఉనికే ప్రమాదంగా పరిణమించవచ్చునని తెలంగాణ టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చంద్రబాబు బుజ్జగించినా..

హైదరాబాద్ నగర మాజీ మేయర్, మహేశ్వరం శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. దసరా తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికార పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీలో చేరిన వెంటనే తీగలకు హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. పది రోజుల క్రితం సీఎంతో తీగల భేటీ కావడంతోనే పార్టీ మారుతున్నారన్న ప్రచారం మొదలైంది. తీగలతోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ముఖాముఖి చర్చలు జరిపారు. దీంతో కొంత స్తబ్ధత ఏర్పడింది. అయితే తన కూతురి వివాహానికి ఆహ్వానించేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను మరోసారి కలవడంతో కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం తెరపైకొచ్చింది.

అందుకు అనుగుణంగానే తీగల కృష్ణారెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. దీంతో చంద్రబాబు మరోసారి తీగలను పిలిపించి మాట్లాడారు. పార్టీ మారే ఆలోచన మానుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అయితే, నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడి తీవ్రంగా ఉందని, వారితో మాట్లాడి నిర్ణయం చెబుతానని బాబుకు చెప్పి వచ్చిన తీగల.. వెంటనే మీర్‌పేటలోని కేటీఆర్ కళాశాలలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మెజారిటీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆయనకు సూచించారు.

ఆదే బాటలో మరో ముగ్గురు..

సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరడం ఇక లాంఛనమే. ఆయన బాటలోనే తీగల కృష్ణారెడ్డి పయనిస్తుండగా, వీరికి మరో ముగ్గురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు తోడయ్యే అవకాశం ఉంది. పదిరోజుల క్రితం బాబుతో సమావేశానికి హాజరు కాని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం: తీగల

టీఆర్‌ఎస్‌లో చేరే విషయంలో మంతనాలు సాగుతున్న విషయాన్ని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ధ్రువీకరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, కార్యకర్తల మనోభీష్టం మేరకు నిర్ణయం ఉంటుందని చెప్పారు. మరోసారి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి తన నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబుతో సమావేశమైనప్పుడు కూడా ఇదే విషయం చెప్పానని వెల్లడించారు.
 
టీడీపీ కార్యకర్తల నైతికస్థైర్యం దెబ్బతీస్తున్నారు: చంద్రబాబు

తెలంగాణలో టీడీపీ కార్యకర్తల నైతికస్థైర్యం దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. టీడీపీలో చేరిన ఎంపీలకు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదని, వారు సభ్యత్వం స్వీకరించిన వెంటనే ఎంపీ పదవులకు రాజీ నామా చేయిస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహ కరించుకుని అభివృద్ధిలో ముందుకు సాగాలి. తెలంగాణ అభివృద్ధిలో ఎన్‌టీఆర్ సహా తన పాత్ర ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ కేడర్ బలం గా ఉంది. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Desam Party  theegala Krishna Reddy  TRS  KCR  prakash goud  TTDP  Manchireddy  

Other Articles