Bjp chooses devendra fadnavis as maharashtra cm

NCP, Maharashtra assembly election, BJP, Narendra Modi, union minister, Nitin Gadkari, Devendra Fadnavis, RSS

bjp chooses devendra fadnavis as maharashtra cm

మరాఠా గడ్డపై విదర్భయోధుడు..? ‘మహా’ సీఎంగా దేవేంద్ర ఫెడ్నావిస్

Posted: 10/22/2014 07:01 PM IST
Bjp chooses devendra fadnavis as maharashtra cm

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయినా,  తీవ్ర ఉత్కంఠకు తెరతీసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్కే ఈ పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకుంది. క్యాంపు రాజకీయాలతో కలకలం రేపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా.. శివసేన ఒత్తిడికి తలొగ్గకుండా పార్టీని విజయపథంలో నడిపించిన ఫడ్నవిస్నే ఎంచుకుంది.

ఎన్నికలకు ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన పొత్తును శివసేన తెంచుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. దేవేంద్ర ఫడ్నవిస్ చాలా గట్టిగా నిలబడ్డారు. కనీసం 135 స్థానాల్లో పోటీ చేయాల్సిందేనని అధిష్ఠానానికి చెప్పారు. అవసరమైతే పొత్తును తెంచుకోవాలని కూడా అధిష్ఠానం దగ్గర ఫడ్నవిస్ వాదించారు. ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన నాయకుడు. సాధారణంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మారాఠ్వాడా ప్రాంత నాయకులదే హవా నడుస్తుంటుంది. ఈసారి ఆ ప్రాంతాన్ని కాదని.. కరువు కాటకాలతో రైతు ఆత్మహత్యలలో ముందున్న విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడికే కమలనాథులు పట్టంగట్టారు.

సోమవారం నాడు మహారాష్ట్ర సీఎంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం ఊపందుకుంది. గత ఆదివారం నాటి ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. బయటి నుంచే మద్దతిస్తామంటూ ఎన్సీపీ చేసిన ఆఫర్ ను అటు వద్దనలేక, ఇటు కాదనలేక బీజేపీ సందిగ్ధంలో పడిపోయింది. ఈ తరుణంలోనే సీఎం పీఠంపై నితిన్ గడ్కరీ ఆశలు పెట్టుకుని క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. కానీ సీఎంగా ఫడ్నవీస్ అయితేనే బాగుంటుందంటూ పార్టీ శ్రేణులు ఎలుగెత్తుతున్నాయి.

మొన్నటి ఎన్నికల సందర్భంగా ఫడ్నవీస్ అనుసరించిన వ్యవహార సరళి పార్టీ నేతలనే కాదు అధిష్టానాన్ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. సీట్ల సర్దుబాటులో మొండికేస్తున్న శివసేనతో తెగదెంపులు చేసుకోవాలని ప్రతిపాదించిడంతో పాటు ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు దోహదపడ్డ నేత ఫడ్నీవీసేనని పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు పార్టీకి సహకరించిన ఫడ్నవీస్, ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం రచించిన ప్రణాళికలు బాగానే పనిచేశాయి. దీంతో ఎన్నికల్లో ధైర్యంగా అడుగేసేందుకు తోడ్పడి, పార్టీ విజయానికి బాటలు వేసిన ఫడ్నవీస్ కే సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు అర్హత ఉందని ఆ పార్టీ నేతల వాదన. ఈ క్రమంలోనే ఫడ్నవీస్, వచ్చే సోమవారం మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles