Severe tense situation at nandyala bhuma nagireddy absconding

ysrcp, bhooma nagireddy, nandyala, severe tense situation, TDP, Nandyal Municipal Council, YSR Congress Party

severe tense situation at nandyala.. bhuma nagireddy absconding

నంద్యాలలో ఉద్రిక్తత.. భూమానాగిరెడ్డి అబ్ స్కాండింగ్..

Posted: 11/01/2014 10:01 AM IST
Severe tense situation at nandyala bhuma nagireddy absconding

వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకున్న స్వల్ప తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై.. హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకూ సిద్ధపడింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించింది.

నిన్న జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్ దేశం సులోచన నిర్లక్ష్యపూరిత సమాధానం ఉద్రిక్తతకు దారితీసింది. అజెండాలోని అంశాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసిందని చైర్మన్ ప్రకటించారు. భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే చైర్మన్ మరోసారి సమావేశం ముగిసిందని బెల్ కొట్టడమే కాకుండా.. ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదని టీడీపీ కౌన్సిలర్లను ఆదేశించారు. దీనికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వారితో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు.

టీడీపీ వర్గీయులు దాడికి దిగటంతో పరిస్థితి కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే భూమా సర్దిచెప్పబోయినా ఫలితంలేకపోయింది. ఘటనలో వైఎస్‌సీపీకి చెందిన మైనార్టీ కౌన్సిలర్లు ముర్తుజా, కరీముల్లా గాయపడ్డారు. టీడీపీకి చెందిన వెంకటసుబ్బయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌లకూ గాయాలయ్యాయి. చైర్మన్, మునిసిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో భూమానాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా గత రాత్రి నుంచి భూమా నాగిరెడ్డి పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు టీడీపీ నంద్యాల బంద్కు పిలుపునిచ్చింది. నిన్న మున్సిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. దాంతో నంద్యాల అంతా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు సంఘటనతో ఎలాంటి సంబంధం లేని సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను అడిగినా ఎలాంటి సమాధానం రావట్లేదు. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles