Happy merry christmas

christmas festival, christmas eve, christmas tree, christmas food recipes, christmas news, christmas festival season, christmas gifts, christmas wishes, christmas greetings

wishing all happy merry christmas on the eve of birth of jesus chirst

కరుణామయుడు క్రీస్తు పిలుస్తున్నాడు..!

Posted: 12/24/2014 07:49 PM IST
Happy merry christmas

దైవ కుమారుని జననం, ధరిత్రి చరితనే మార్చిన సుధినం, కరుణామయుని కరుణ కటాక్షాలతో పులకించిన మానవాళి తలరాతను మార్చి మరో ప్రపంచానికి తీసుకెళ్లిన పయనం, శాంతి ప్రేమ సమ్మోహనం.. స్మరించిన వారి హృదయం పావనం, స్తుతించిన వారి పాపాలు మాయం.. ప్రపంచ మానవాళికి ఆయన చూపిన మార్గదర్శకాలు అజరామరం.. అనిర్వచనీయం.. యేసు పునరాగమనం కోసం విశ్వం సహస్ర నయానాలతో నిరీక్షిస్తున్న సమయం.. ఈ నేపథ్యంలో మరాలా వచ్చింది క్రైస్తవుల పర్వదినం.. అదే ఏసు ప్రభువు జననం.

యేసుక్రీస్తు జన్మించి రెండు వేల సంవత్సరాలు 14 పూర్తి చేసుకున్న సందర్భంగా క్రిస్ట్ మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. పలు దేశాలలో నెల రోజుల ముందు నుంచే క్రిస్ట్ మస్ వేడుకలు జరుపుకుంటారు. ఇటీవల మన దేశంలో కూడా క్రిస్ట్ మస్ పర్వదినానికి పక్షం రోజుల ముందు నుంచి వేడుకలను ప్రారంభిస్తున్నారు. యేసు క్రీస్తును కరుణారస మూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు. పర్వదినం సందర్భంగా చర్చ్ లు కొత్తగా క్రిస్ట్ మస్ శోభను సంతరించుకున్నాయి. విద్యుత్ వెలుగుల కాంతిలో.. శ్వేతవర్ణపు దుస్తులతో క్రిస్టియన్లు బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలలో నిమగ్నమయ్యారు.

క్రిస్‌మస్‌ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులు తమ ఇళ్ళను, చర్చీలను చక్కగా అలంకరిస్తారు. వెదురు బద్దలతో రంగు కాగితాలతో, ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తుగా పెడతారు. రాత్రి వేళ దీపాలంకరణతో ఇళ్ళు, చర్చీలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోను ఒక క్రిస్‌మస్‌ చెట్టును ఏర్పాటు చేసి, దానికి రంగు కాగితాలతోను, కాగితపు నక్షత్రాలతోను చిరుగంటలతోను చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు.

క్రిస్‌మస్ క్రిందటి రాత్రి ' శాంతా క్లాజ్ ' ఆకాశం నుండి ధృవపు జింకలు లాగే తన బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందు కోసం పిల్లలు తమ మేజోళ్ళను వేలాడదీసి ఉంచుతారు. శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను పెట్టి వెళ్తాడు. క్రిస్‌మస్ రోజున బంధువుల ఇళ్ళకు మిత్రుల ఇళ్ళకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్‌మస్ శుభాకాంక్షలు చెబుతారు. క్రిస్‌మస్ సంవత్సరానికి ఒక రోజున వస్తుంది కాబట్టి అది వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖ సంతోషాలను తెస్తుంది.

క్రీస్తు జననం :

రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్‌తో పెళ్ళికుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి 'ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి 'యేసు' అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు' అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది.

ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచి పెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తన్ను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు.' అని చెప్పాడు. జోసఫ్ న్యాయవంతుడు భక్తుడు. కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు.జోసఫ్ స్వగ్రామం బెత్లేహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది.

ఆ రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెలకాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి. ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు.

దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైనారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్ లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి యేసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ పండుగ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : christmas festival news  god jesus christ  festival news  

Other Articles