ముంబై దాడి భారత్ లో భీకర మారణ కాండతో రక్త చరిత్రకు నిదర్శనంగా నిలిచింది. 133 మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయిన ఈ ఘటనకు సూత్రధారి, ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తొయ్యబా ఆపరేషనల్ కమాండర్ 55 ఏళ్ల జకీవుర్ రెహమాన్ లఖ్వీని రావల్పిండిలోని ఆదియాలా జైలునుంచి విడుదల చేయడం ద్వారా పాకిస్తాన్ మరోసారి భారత్ విశ్వాసాన్ని దెబ్బతీసింది. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్వరుల్ హక్ ఈ విడుదలకు ఆదేశించడంతోపాటు రూ.10లక్షలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించమని ఆదేశించడం, చెల్లింపుల లాంఛనాలు ముగిసిన నేపథ్యంలో గురువారం రాత్రే పాక్ అధికార్లు ఒక రహస్య మార్గంద్వారా లఖ్వీని విడుదల చేసినట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైలు బయట జమాత్-ఉద్-దవాకు చెందిన దాదాపు 55 మంది కార్యకర్తలు ఘనస్వాగతంకూడా పలికారట.
లఖ్వీని తిరిగి అదుపులోకి తీసుకోవాలన్న పంజాబ్ ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాం తప్ప, చట్టాన్ని ఉల్లంఘించలేదని పాక్ పైకి చెబుతున్నా, ముష్కరుణ్ణి వదిలిపెట్టడంలో అక్కడి కార్యనిర్వాహక, న్యాయశాఖల కుమ్మక్కును ఎవ్వరూ కాదనలేరు. పాక్‌లో సైన్యం చెప్పుచేతల్లోనే న్యాయవ్యవస్థ పనిచేస్తున్నదన్నది బహిరంగ రహస్యమే. పాక్ సైన్యం మాట శిలాశాసనమన్నదీ అందరికీ తెలిసిందే. కోర్టులు కూడా సైన్యం చెప్పమన్న విధంగానే తీర్పులు చెబుతాయ. జమాత్-ఉద్-దవా అధినేత హఫీజ్ సయాద్ సైన్యానికి సన్నిహితుడు. హఫీజ్ సరుూద్‌కు లఖ్వీ సన్నిహితుడు! మరి లఖ్వీ విడుదల నల్లేరు మీద నడక కాక మరేమవుతుంది?కోర్టు తీర్పును పైకి సాంకేతిక కారణంగా చూపినా ఈ చర్య ద్వారా భారత్ అంటే విద్వేషం వెళ్లగక్కేవారిని అక్కున చేర్చుకొని ఆదరించే తన విధానంలో ఏమాత్రం మార్పు లేదని పాక్ మరోసారి నిరూపించింది.
2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై జరిగిన దాడులకు కారకుడైన లఖ్వీని అరెస్ట్ చేయాలని అప్పట్లో భారత్, అమెరికా వంటి దేశాలనుంచి వచ్చిన విపరీతమైన వత్తిళ్లను తట్టుకోలేక 2009 నవంబర్ 25న పాక్ ప్రభుత్వం లఖ్వీతో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. వీరు దాడుల్లో పాలు పంచుకున్నారన్న దానికి ఋజువులుగా భారత్ ఎన్ని సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు పాక్ వాటిని పట్టించుకున్న పాపాన పోకపోవడం దాని వంచన క్రీడకు తార్కాణం. 26/11 దాడుల్లో మొత్తం 166 మంది అమాయకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టన పెట్టు కున్నారు. ఈ దాడులకు లఖ్వీ ఆపరేషనల్ హెడ్‌గా ఉన్నాడని మన నిఘావర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. ఈ కారణం చేతనే లఖ్వీని విడిచిపెట్టవద్దంటూ పాకిస్తాన్‌కు మనదేశం విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుత చర్యతో అవన్నీ గాల్లో కలిసిపోయనట్లయంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా లఖ్వీని విడుదల చేయడం తగదని భారత్ చెప్పిన మాటలు చెవిటివాని ముందు శంఖం పూరించినట్టయంది.
ఈ పరిస్థితుల్లో లఖ్వీ విడుదల తమకు ఎంతో నిరాశ కలిగించిందని హోంమత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేయడం సహజమే. తమ దేశ భద్రతకు ప్రమాదకరం కాని ఉగ్రవాదులను అస్మదీయులని, తమకు ప్రమాదకరంగా మారిన వారిని తస్మదీయులన్న విధానాన్ని అమలు చేస్తున్న పాక్ దృష్టిలో లఖ్వీ మంచి ఉగ్రవాది అందువల్లనే ఆదియాలా జైలులో అతడికి రాజభోగాల వంటి సదుపాయాలు కల్పించింది. బయటి దేశాలను మభ్యపెట్టడానికి మాత్రమే జైలు నాటకం. నిజానికి లఖ్వీకి ఇంటికన్నా జైలే పసందుగా ఉంది. అత్యంత కట్టుదిట్టమైన జైలులో అతనికి వివిఐపి స్థాయి సౌకర్యాలు కల్పించారు. కుటుంబ సభ్యులతో కలిసే అవకాశం కల్పించారు. రోజువారీగా అతగాడిని సందర్శించే వారిలో ఉగ్రవాద కమాండర్లే అధికమట. ఎప్పటికప్పుడు టెర్రరిస్టులతో మాట్లాడుతూ వారికి తగిన సలహాలిస్తుండటం నిత్యకృత్య వ్యవహారం. అక్కడ అమల్లో ఉన్న ‘కాంజుగల్ రైట్స్’ పుణ్యమాని జైలుకు భార్యను రప్పించుకొని 2010లో కొడుకును కన్నాడు. జైల్లో అతనిది ఒక సెల్ కాదు..‘సూటు’ అనే చెప్పాలి. టెలివిజన్, పేపర్లు ఏది కావాలంటే అది క్షణాల్లో అందుబాటులోకి వచ్చే సదుపాయాలున్నాయి. 2012లో జైలు అధికారులు అతగాడి జన్మదిన వేడుకలను కూడ నిర్వహించారట. మరి ఇన్ని సదుపాయాలు కల్పించడమంటే లఖ్వీని పాక్ ఎంతటి సన్నిహితుడిగా భావించి ఉండాలి?
పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక విధానం అమెరికాకు ఇబ్బందికరంగా మారిందనేది స్పష్టం. అందువల్లనే ఉగ్రవాదుల పట్ల ‘ఎంపిక’ చేసిన రీతిలో వ్యవహరించడం కూడదని అమెరికా హెచ్చరించినప్పటికీ పాక్‌కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాది అంటే ఉగ్రవాదే. అందులో మంచివారు, చెడ్డవారు ఉండరు. అందువల్ల టెర్రరిస్టులందరితో ఒకేమాదిరిగా వ్యవహరించాలని యుఎస్ కోరుతోంది. పాక్ సైన్యం అన్ని రకాల ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ వస్తున్న ప్పటికీ ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ అమెరికానూ మోసగిస్తోంది. గత మార్చి నెలలో సైన్యం మద్దతు పూర్తిగా ఉన్న ఇస్లామాబాద్ హైకోర్టు లఖ్వీ నిర్బంధం విషయంలో ప్రభుత్వ వాదనలను పక్కన పెట్టి అతగాడి విడుదలకు ఆదేశించడం సైన్యానికి మరో ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నది. అంతేకాదు గత డిసెంబర్లో పెషావర్ స్కూల్‌పై జరిగిన ముష్కర దాడిలో దాదాపు 130 మంది అమాయక పిల్లలు మృతి చెందిన సంఘటన జరిగిన రెండు రోజులకే, పాక్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడం మరో విచిత్రం.
ఈ సంఘటనలను పరిశీలిస్తే పాక్ సైన్యం భారత్‌కు ఒక గట్టి హెచ్చరికను జారీ చేసినట్టే భావించాలి. లష్కరే తొయ్యబాను భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఉపకరణంగా వాడుకుంటామన్నదే ఆ పరోక్ష హెచ్చరిక సారాంశం. ఇదే సమయంలో తెహ్రిక్-ఎ-తాలిబాన్‌ను మాత్రం మట్టుపెట్టడానికి పాక్ సైన్యం కృతనిశ్చయంతో ముందుకు సాగింది. అంటే తెహ్రిక్-ఎ-తాలిబాన్ వల్ల పాక్‌కు ప్రమాదమున్నది కనుక దాని నిర్మూలనకు చర్యలు తీసుకుంటుంది. అదే లష్కరే తొయ్యబా విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకైనా లఖ్వీని జైల్లో ఉంచారంటే అందుకు కారణం అమెరికా నుంచి అందే మిలియన్ల కొద్దీ ఆర్థిక సహాయం ఆగిపోతుందనే భయంతో మాత్రమే. ప్రస్తుతం లఖ్వీని విడుదల చేయడం భారత్‌కే కాదు, అమెరికాకూ ఆందోళన కలిగించే అంశం. అయితే పాకిస్థాన్ ఇలా కరడు కట్టిన ఉగ్రవాదులకు కూడా ఎర్రతివాచీ పరిచి మరీ బయటకు పంపించి వెయ్యడం నిజంగా అంతర్జాతీయ సమాజానికి కూడా మంచిది కాదు. మరి ప్రమాదకారి, అతి కిరాతక ఉగ్రవాది అయిన లఖ్వీ విడుదలపై పాకిస్థాన్ న్యాయ వ్యవస్థ కూడా మానవతా దృక్పథంలో చూడాలి. ఎంతో మంది ప్రాణాలను తీసిన వారికి ఇలా స్వేచ్ఛ ఇస్తే ఇంకా ఎంత మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అన్న కోణంలో కోర్టు ఆలోచించాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more