Brexit Vote Throws Britain and Europe Into Turmoil

What does brexit mean

Brtain Prime Minister David Cameroan, Brexit, Britain, Denmark, Sweeden, Itally, German Chancellor Angela Merkel, UK, European Union

Control over the UK’s borders will be one of the big issues in the EU divorce negotiations

బ్రెగ్జిట్ అంటే ఏమిటీ..? ఇది ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

Posted: 06/24/2016 08:01 PM IST
What does brexit mean

కలసి వుంటే కలదు సుఖము అన్న నానుడి తెలుసా..? ఒంటరిగా సాధించలేని అనేక పనులను ఐక్యతతో సాధించవచ్చన్న విషయాలు, వాటికి సంబంధించిన కథలను చిన్నప్పుడు పాఠ్యాంశాలలో అనేకం చదివాం. వాటిలో పాపురాల కథ ఒకటి, పాపురాలపై వల వేసిన వేటగాడిని ఖంగుతినిపించిన పావురాలు.. వలతో పాటుగా అకాశంలో విహరించుకుంటు వెళ్లిపోతాయన్నది కథ సరాంశం. అయితే నేటి కాలంలో ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లినట్లే.. ఎవరి కుటుంబం వారిదే. మీకు మీరే.. మాకు మేమే అన్నట్లుగా తయారైంది. సరిగ్గా ఈ విధంగానే బ్రిటెన్ వాసులు తమ రెఫెరండాన్ని ప్రకటించారు. యూరోప్ యూనియన్ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి తమకు తామే స్వేచ్ఛగా వుండాలని తీర్పుకే మొగ్గుచూపారు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకోవడమే (బ్రిటెన్ ఎగ్జిట్)ను షార్ట్ కట్ గా బ్రెగ్జిట్‌ అంటున్నారు.

ఐరోపాలో మిగతా దేశాలతో పోలిస్తే బ్రిటన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్‌ ఇపుడు గుంపులో గోవిందయ్యలా, ఇయులో ఒక దేశంగా ఉండడంపై బ్రిటన్‌లో కొంతమంది కినుకగా ఉన్నారు. ఇయుతో సంబంధం లేకుండా బ్రిటన్‌ స్వీయ ఆస్తిత్వాన్ని చాటుకోవాలన్నది వారి వాదన. బ్రిటన్‌ ఇయు సభ్య దేశంగా మారడంతో, తూర్పు ఐరోపా దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసలకు అడ్డుకట్ట తెగి పోయింది. ఈ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని తూర్పు ఐరోపా దేశాలకు చెందిన అనేక మంది బ్రిటన్‌కు క్యూ కడుతున్నారు. బ్రిటన్‌ ప్రస్తుత జనాభాలో 21.5 లక్షల మంది వలస ప్రజలే. దీంతో బ్రిటన్‌లో జీతాల పెరుగుదల వృద్ధి రేటు పడిపోయింది. ప్రత్యేక గుర్తింపుతోపాటు తమ ఉద్యోగ అవకాశాలనూ దెబ్బతీస్తున్న ఇయుకి గుడ్‌బై చెప్పడమే మంచిదన్న వాదనకు పేద, మధ్యతరగతి బ్రిటిష్‌ ప్రజల్లోనూ మద్దతు పెరిగి పోయింది.

బ్రిటెన్ తప్పుకుంటే లాభమా..? నష్టమా..?

ఐరోపా నుంచి తప్పుకోవడంతో తమకు లాభం జరుగుతుందని భావిస్తున్నారు బ్రిటెన్ దేశస్థులు.. అందుకనే ఏకంగా ఈయులో కొనసాగడానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో తమ దేశానికి ఆర్థిక స్వాలంభన లభిస్తుందని భావిస్తున్నారు. స్వేచ్ఛా అర్థిక విధానాలతో పుంజుకోవచ్చని భావిస్తున్నారు. వలసల పోటు తగ్గి, తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు తమ దేశ ప్రత్యేక సాంస్కృతిక విలువలూ నిలబడతాయని బ్రిటెన్ వాసులు భావిస్తున్నారు.  ఇయు నుంచి తప్పుకున్నా జిడిపి వృద్ది రేటుకు ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు. 2030 నాటికి జిడిపి వృద్ధి రేటు ప్రస్తుతం ఉన్నదానికంటే మరో 1.6 శాతం పెరుగుతుందని లెక్కలు గట్టి మరీ చెబుతున్నారు.

అయితే బ్రెగ్జిట్ వ్యతిరేకులు మాత్రం, ఇయు నుంచి తప్పుకుంటే బ్రిటెన్ కు తీవ్ర పరిణామాలు తప్పవని హచ్చరిస్తున్నారు. బ్రిటెన్ మరింత అర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం తప్పదని, మరోలా చెప్పాలంటే ఆర్థిక వినాశనం  తప్పదని అంటున్నారు. జిడిపి వృద్ధి రేటులో రెండు నుంచి ఏడు శాతానికి గండి పడుతుందని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక ఇప్పటికే హెచ్చరించింది. జార్జ్‌ సోరస్‌ వంటి ప్రఖ్యాత ఇన్వెస్టర్లయితే బ్రెగ్జిట్‌ ఖాయమైతే.... బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అదే జరిగితే డాలర్‌తో బ్రిటిష్‌ కరెన్సీ పౌండ్‌ స్టెర్లింగ్‌ మారకం రేటు 20 శాతానికి మించి పడిపోయే ప్రమాదం ఉందన్నారు.

బ్రిటన్‌ విదేశీ వాణిజ్యంలో సగం ఇయు దేశాలతోనే జరుగుతోంది. బ్రిటన్‌కు అందే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఇయు దేశాల నుంచే వస్తోంది. లండన్‌ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదగడానికీ ఇయు సభ్యత్వం ఎంతో దోహదం చేసింది. ఈ లాభాలన్నీ కొనసాగుతాయి. గుడ్డిగా ఇయు నుంచి తప్పుకుంటే ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్‌ తప్పదని బ్రెగ్జిట్‌ వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని కామెరూన్‌తో సహా ప్రధాన బ్రిటిష్‌ రాజకీయ నాయకులు కూడా, బ్రిటన్‌కు ఇయు సభ్యత్వం అద్భుత అవకాశం అని కాకుండా, ఆర్థిక అవసరం అని మాత్రమే చెప్పడం విశేషం.

ఇయులో కొనసాగేందుకు బ్రిటెన్ వాసులకు ఎందుకంత అసంతృప్తి?

యూరోపియన్ యూనియన్ లో చేరిక నుంచి బ్రిటెన్ వాసుల్లో కొంత అందోళన రగులుతూనే వుంది. పేరుకు యూరోప్ లో భాగమైనా బ్రిటన్‌ ఎపుడూ మిగతా యూరప్‌ దేశాలతో పెద్దగా కలిసింది లేదు. ఇండస్ట్రియల్ రివెల్యూషన్ సమయంలో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వలసల స్థాపన కోసం మిగతా యూరప్‌ దేశాలతోనే పోటీ పడింది. యుద్ధాలకూ దిగింది. 1957లో ప్రస్తుత ఇయుకు ప్రతి రూపమైన యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటీ (ఇఇసి) ఏర్పడినపుడు కూడా అందులో సభ్యత్వం కోసం బ్రిటన్‌ ఆసక్తి చూపలేదు. సుమారుగా 26 ఏళ్ల తరువాత 1973లోనే సభ్యత్వం తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయం కరెక్టా..? లేదా అన్న విషయమై పున:సమీక్షించుకుంది.

అంటే ఆ తర్వాత రెండేళ్లకే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో ఉండాలా? వద్దా? అన్న విషయమై రిఫరెండం జరిపింది. 67 శాతం మంది అనుకూలంగా ఓటేయడంతో ఆ వివాదానికి తెరపడింది. ఇటీవల సభ్య దేశాలపై ఇయు పెత్తనం ముఖ్యంగా ఆర్థిక, వలసల విషయాల్లో బాగా పెరిగి పోయింది. దీనికి తోడు తరచూ తలెత్తుతున్న ఆర్థిక సంక్షోభాలతో ఇయు పరువు గంగలో కలుస్తోంది. ఇష్టమున్నా లేకపోయినా సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాల ఆర్థిక భారాన్ని సభ్య దేశాలూ మోయాల్సి వస్తోంది. బ్రిటన్‌ పౌరులకు ఇది ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఇవన్నీ ఇయు నుంచి బ్రిటన్‌ తప్పుకోవాలనే వాదనకు ఊతం ఇస్తున్నాయి.

అయితే తాజాగా గ్రీకు ఆర్థిక సంక్షోభం యూరోపియన్ యూనియన్ కు కుదిపేసింది. దీని నుంచి ఎలాగోలా బయటపడ్డామని యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే సిరియా రాజకీయ సంక్షోభంతో కాందిశీకుల సమస్య తలెత్తింది. వీటిల్లో ఏ సంక్షోభాన్నీ ఇయు సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయింది. వరుస పెట్టి ఎదురవుతున్న సంక్షోభాలతో ఇయు ఇప్పటికే బీటలు వారింది. ఇలాంటి పరిస్థితిలో మునిగిపోయే నావను పట్టుకుని వేలాడడం కంటే, వీలైనంత త్వరగా బయట పడి, మన దారి మనం చూసుకోవడం మంచిదని బ్రిటిష్‌ ఓటర్లు రెఫరండం ఇచ్చారు.

బ్రిటన్‌కు నిజంగా మేలు చేస్తుందా...

ఇయులో జర్మనీ తర్వాత బ్రిటన్‌ రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ.
స్వల్పకాలంలో మాత్రం బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు కష్టాలు తప్పేలా లేవు.
బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు ఇయు దేశాల స్వేచ్ఛా మార్కెట్‌ చెక్ పడుతుంది.
ఇయు దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే పెట్టుబడులకు గండి
ఇయు దేశాలకు బ్రిటన్‌ నుంచి జరిగే ఎగుమతులపై పన్నుల భారం
ఎగుమతులూ దెబ్బతినే ప్రమాదం
బ్రిటన్‌లో ఉండాలా? వద్దా? అన్న విషయంపై మళ్లీ రిఫరెండం జరిపించాలని స్కాట్లాండ్‌
బ్రిటన్‌ రాజకీయాలు మళ్లీ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.

బ్రిగ్జిట్ స్పూర్తితో స్వెగ్జిట్.. ఇయు విచ్చిన్నం..

ఈయూలో జర్మనీ తరువాత రెండో అతిపెద్ద దేశం బ్రిటెన్ విడిపోవాలని అక్కడి ప్రజలు తీర్పునిచ్చిన తరువాత అదే స్పూర్తితో మూడో అతి పెద్ద దేశం స్విడన్ కూడా స్వెగ్జిట్(స్విడన్+ఎగ్జిట్) నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. గురు, శుక్రవారాల్లో ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఓటింగ్ లో స్విడిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకే మొగ్గుచూపారు. నిజానికి నిన్నమొన్నటి వరకు కూడా స్విడన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేకుండేది. ఎప్పుడైతే కల్లోలిత మధ్య ఆసియా దేశాల నుంచి శరణార్థులు రాక పెరిగిందో.. అప్పటి నుంచి వారి మనోభావాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈయూ నంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి వస్తోన్నారు స్విడిష్ లు. బ్రిగ్జిట్ విషయంలో బ్రిటిషర్లు చెబుతున్న కారణాన్నే స్విడిష్ లు కూడా వల్లెవేస్తున్నారు. అది.. తమ దేశాలపై 'బ్రెసిల్స్ పెత్తనం'. స్విడన్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు స్టాక్ హోమ్ (స్విడన్ రాజధాని)లో కాకుండా బ్రెసిల్స్ నుంచి వెలువడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఈయూలో ఉండటం వల్ల నష్టమేతప్ప లాభం లేదని, ఈయూలో ఉన్నందుకే శరణార్థుల బాధ్యతలను బలవంతంగా తలకెత్తుకోవాల్సి వస్తోందని ఓటింగ్ లో పాల్గొన్న స్విడిష్ లు అంటున్నారు.

టీఎన్ఎస్ సిఫో సంస్థ నిర్వహించిన పోలింగ్ లో 36 శాతం మంది స్విడిష్ లు ఈయూ నుంచి వైదొలకేందుకు ఓటు వేయగా, 32 శాతం మంది ఈయూలో కొనసాగేందుకు మద్దతు పలికారు. మిగిలిన 32 శాతం మంది ఏమీ తెలియదని చెప్పారు. బ్రిటన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న వాదన ఊపందుకోవడంలో రాజకీయ పక్షాలు కీలక పాత్ర పోశించాయి. అదే స్విడన్ లో ఈ ఉద్యమంలోకి ఇంకా రాజకీయ శక్తులు ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశిస్తేగనుక సెగ్జిట్ నిర్ణయానికి విపరీతమైన మద్దతు లభించే అవకాశం ఉంది. స్విడన్ కాకుండా ఈయూ సభ్యులైన బల్గేరియా, హంగరీ, రొమేనియా, పోలండ్, గ్రీస్, ఆస్ట్రియా వంటి దేశాలు శరణార్థి సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి.

అదే బాటలో డెన్మార్క్, ఇటలీ..

బ్రిటన్ ప్రజల చారిత్రాత్మక విజయం యూరోపియన్ యూనియన్ స్వరూపాన్నే మార్చేయనుందని బ్రిటన్ నేత, నైజిల్ పరాగే వ్యాఖ్యానించారు. బ్రిటన్ వాసుల మాదిరిగానే కూటమిలోని పలు దేశాల ప్రజలు వైదొలగాలని భావిస్తున్నారని, వారంతా ఇక ఉద్యమిస్తారని అన్నారు. తమ వెంట నడిచే తొలి దేశంగా డెన్మార్క్ నిలుస్తుందని, ఇక అక్కడ 'డ్రెగ్జిట్' (డెన్మార్క్ ఎగ్జిట్) ప్రచారం ఊపందుకుంటుందని, దాని వెనుకే ఇగ్జిట్ (ఇటలీ ఎగ్జిట్) తెరపైకి వస్తుందని అన్నారు. వీటితో పాటు స్వీడన్, ఆస్ట్రియాలు సైతం కూటమిని వీడుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయూ ఇక మరణశయ్య మీదకు చేరినట్టేనని అన్నారు.

ఇకపై కూడా యూరప్ దేశాలన్నీ కలిసి వ్యాపారం చేసుకోవచ్చని, అభివృద్ధి దిశగా ఒకరి కొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగవచ్చని అన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా, స్నేహితులుగా కలిసే వుందామని అన్నారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఈయూ నుంచి బయటకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా వారు అడుగులు వేయకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజల నుంచి చారిత్రాత్మక తీర్పును అందుకున్న జూన్ 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని నైజిల్ పరాగే డిమాండ్ చేశారు.

ప్రధాని పదవికి కామెరాన్ గుడ్ బై

బ్రెగ్జిట్ పై బ్రిటన్ ప్రజల నిర్ణయానికి ప్రధాని డేవిడ్ కామెరాన్ తలోగ్గారు. యూరోపియన్ యూనిన్ లోనే బ్రిటన్ కొనసాగాలన్న ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని అంటూనే.. తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పోరాడానని చెప్పారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అక్టోబర్ లో కొత్త ప్రధాని వస్తారని సంచలన ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నట్టు చెప్పారు. యూకే ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయన్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కామెరాన్ రెండో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా.. బ్రెగ్జిట్ తీర్పుతో మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా ప్రకటన చేశారు.

ఒప్పందాలపై ఏంజిలా మార్కెల్ హెచ్చరికలు..

బ్రెగ్జిట్ పై ప్రజాతీర్పు బాధాకరం అంటూనే పాత ఒప్పందాల విషయంలో బ్రిటన్కు హెచ్చరికలు జారీచేశారు జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారయిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆమె.. బ్రెగ్జిట్ ఫలితం ఈయూనే కాక యావత్ యూరప్ ఐక్యతను విచ్ఛిన్నం చేసిందని అన్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిణామాలపై మాట్లాడన మోర్కెల్.. నిన్నటివరకు ఈయూతో చేసుకున్న అన్ని ఒప్పందాలను సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. 'విడిపోయే ప్రక్రియ పూర్తయ్యే చివరి నిమిషం దాకా బ్రిటన్ తన వాగ్ధానాలు నిరవేర్చాల్సిన అవసరం ఉంది' అని మోర్కెల్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈయూ నేతలు, సభ్యదేశాధినేతలు బ్రిటన్ కు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం మనమున్నది గందరగోళ ప్రపంచమని, శాంతిసమాధానాలతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.   

ఇంకా.. 'ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటిషర్ల నిర్ణయం బాధాకరం. అది ఐరోపా సమాజ ఐక్యతను విచ్ఛినం చేసింది. యూరప్ దేశాలు వేటికవే భిన్నత్వాన్ని కలిగిఉన్నాయో, ఈయూ అంతకంటే భిన్నమైనది. రెండో ప్రపంచ యుద్ధానంతరం తోడ్పాటును అందించుకునేందుకే ఈయూ ఏర్పాటయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం కూటమిలోని సభ్యదేశాలే ఈయూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పటాపంచలు చేయాల్సిన సమయం వచ్చింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఈయూ మనుగడ సాధించగలదన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు అందరితో చర్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే సోమవారం యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఇటలీ ప్రధాని మాటియో రెంజీలతో భేటీ అవుతున్నా' అని ఏంజిలా పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : David Cameron  Angela Merkel  Brexit  britain  UK  European Union  

Other Articles