Telugu actor sunil birthday wishes

sunil telugu actor, telugu cinema, poolarangadu cinema, nandi awards, filmfare awards, movie, bachelor of arts, six pack body

sunil telugu actor, telugu cinema, poolarangadu cinema, nandi awards, filmfare awards, movie, bachelor of arts, six pack body

sunil-actor-1.gif

Posted: 02/28/2012 12:40 PM IST
Telugu actor sunil birthday wishes

sunil-actor-title

sunil

దశాబ్దకాలంగా వెండితెర మీద నవ్వులు పండిస్తూ, హాస్య నటుడుగా తనదైన విశిష్టమైన ముద్ర వేసుకున్న సునీల్ పూర్తిపేరు ఇందుకూరి సునీల్ వర్మ. విడుదల అయినవి, ఇంకా నిర్మాణంలో ఉన్నవీ కలుపుకుని దాదాపూ 80 సినిమాల్లో నటించిన సునీల్ హాస్య నటనలో కొత్తబాణీని కనబరచినా, ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. పాత్రల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఒదిగి ఉండే లక్షణంతో తానుగా ఎవరినీ నొప్పించని సునీల్, అన్నిటినీ తేలిగ్గా తీసుకున్నట్టున్నా, నిజానికి అతనిది చాలా సున్నితమైన మనస్తత్వమని, ఎవరైనా ఏమైనా అంటే ఇంటికి వచ్చి బాగా బాధపడతారని, బహుశా ఆ గుణం వలనే తనెవరినీ నొప్పించగూడదనుకునే స్వభావం అబ్బివుంటుందని సునీల్ సన్నిహితులంటుంటారు.

అందరూ ఫక్కుమని బయటకు నవ్వుతారు. కానీ సునీల్ నవ్వుని లోపలికి తీసుకుంటూ చేసే శబ్దంతో, ఆ నవ్వుతో పాటు అమాయకత్వాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఏ పాత్రనైనా సవాల్ గా తీసుకుని చేసిన సునీల్ డైలాగ్ డెలివరీ, ముఖంలోని హావభావాలు, వీటన్నిటితో పాటు ప్రధాన పాత్రలోనూ నటించటం, నటనే కాకుండా నాట్యం మీద కూడా తనకున్న ప్రతిభను ప్రదర్శించటం, తాజాగా పూలరంగడు కోసం తన శరీరాన్ని కూడా అసలు హీరో స్థాయిలో తీర్చిదిద్దుకోవటం ఇలా ఒక్కో మెట్టూ ఎదుగుతూ తారాపథంలో పైకి చేరుకుంటున్నారు. తనకి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శమని సునీల్ తరచుగా చెప్తుంటారు. నటనలోనూ, నాట్యంలోనూ, క్రమశిక్షణ, టైమింగ్ ఇత్యాదుల్లో చిరంజీవి చూసి తనని తాను తీర్చిదిద్దుకుంటున్నానని అంటుంటారు. before-after

తన రంగుమీద తన ముఖం మీద తనే వ్యాఖ్యలు చేసుకునే పద్ధతి వీటన్నిటితోపాటు సినిమా ప్రోమో కార్యక్రమాలు, చిత్ర విజయోత్సవాల్లో పొంగిపోకుండా అణకువతో దర్శకుడు, ఇతర కళాకారులకూ సాంకేతిక సిబ్బందికే గొప్పంతా కట్టబెడుతూ తనెంతో చిన్నవాడిగా, ఏమీ తెలియనివాడిగా మాట్లాడటం, అందరికీ గౌరవమివ్వటం, ఏం మాట్లాడినా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే చంద్రబోస్ రాసిన మౌనముగానే ఎదగమని... అన్న పాట సారాన్ని సునీల్ వ్యవహారంలో మనం పూర్తిగా చూడవచ్చనిపిస్తుంది.

sunil-6-packఇప్పటి వరకూ మూడు నందులూ మూడు ఫిల్మ్ఫేఫేర్ పురస్కారాలను అందుకున్న సునీల్, 2000 సంవత్సరంలో సినిమారంగంలో చిన్నగా కాలిడినా, నువ్వే కావాలి సినిమాతో గుర్తింపు రావటం మొదలైంది. చిన్న చిన్న హాస్య సన్నివేశాల్లో నటిస్తూ వెకిలితనం లేని చక్కని హాస్యాన్ని అందిస్తూ, సునీల్ కథానాయకుడిగా అందాలరాముడు సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. అందులో హీరోయిన్ గా వేసిన ఆరతీ అగర్వాలే నిజమైన హీరో అనేసారు సునీల్. అలాగే రాజమౌళి దర్శకత్వంలో మర్యాదరామన్న చిత్రంలో మరోసారి హీరో పాత్రలో నటించిన తర్వాత, ఇంటర్వూలో తనతో నటించిన సలోనీకే క్రెడిటంతా ఇచ్చేస్తూ మాట్లడారు సునీల్. మరోసారి కధానాయుకుడిగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు బాక్స్ ఆఫీస్ లో బోల్తా పడ్డా, సునీల్ నటన, డ్యాన్స్ లకు షోకేసైంది. సునీల్ ప్రతిభను అందరూ గుర్తించేట్టుగా చేసింది. ఇక పూలరంగడు విజయంతో సునీల్ తారాపథంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

sunil-dance1974 సంవత్సరం ఫిబ్రవరి 28 న భీమవరంలో జన్మించిన సునీల్ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. తల్లి పెంపకంలోనే పెరిగిపెద్దై సుగుణాలను సంతరించుకున్నారు. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసి అనుకరిస్తూ, అదే విధంగా డ్యాన్స్ లు చేస్తూ, స్థానికంగా జరిగే డ్యాన్స్ పోటీల్లో పాల్గొనటం చేస్తూ, నట జీవితం మీద మక్కువ ఏర్పరుచుకున్నారు. సునీల్ లోని ప్రతిభను, ఆసక్తిని గుర్తించిన ఆయన టీచర్ చేసిన సూచన మీద బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చేరి ఆ తర్వాత డ్రామాల్లో భాగంవహించటం మొదలుపెట్టారు. డైరెక్టర్ త్రివిక్రమ్ తో మంచి స్నేహం ఉండటం వలన హైద్రాబాద్ లో ధైర్యంగా అడుగుపెట్టి సినిమారంగంలో డ్యాన్స్ లతోనే అడుగుపెట్టారు.   ఆ తర్వాత హైద్రాబాద్ లో డ్యాన్స్ స్కూల్ లో చేరి డ్యాన్స్ నింకా అభివృద్ధి పరచుకున్నారు. తన ఒడ్డు పొడుగునిబట్టి సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలను చేపడదామనుకుంటే, దర్శకులు ఆయనకి హాస్యపాత్రలనంటగట్టారు. నేను ఫలానా పాత్రనే చేస్తానంటూ ముద్ర వేసుకుని కూర్చోకుండా అవకాశం ఏ పాత్రనిస్తే దానిలో ఒదిగిపోయి దాన్ని పండించే నేర్పుని అలవరచుకున్నారు.

సపోర్టింగ్ యాక్టర్ గా, హీరోకి సన్నిహితుడిగా సునీల్ చాలా సినిమాలో నటించారు. హీరో ఇమేజ్ ని పెంచేది నిజానికి సపోర్టింగ్ యాక్టర్లే. అందుకే వాళ్ళకే పేరొచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన సునీల్ పూర్తి సపోర్ట్ ఇచ్చి హీరోలను తెరమీద అందలమెక్కించారు. అందరికీ అనుకూలమైన వర్తనం సునీల్ కున్న విశిష్టమైన లక్షణం.

innocent-sunilఅమాయకత్వాన్ని రాజ్ కపూర్ స్థాయిలో చూపించే సునీల్, హస్యాన్ని తనదైన బాణీలో చూపించారు. హాస్యాన్ని పండించినా, విలనీ హాస్యనటుడిగా చేసినా, అమాయకత్వాన్ని ప్రదర్శించినా, కథా నాయకుడిగా చేసినా ఏ పాత్రకు తగ్గ నటన ఆ పాత్రలో చూపించటమే కాకుండా ఎవరి అనుకరణా ఎక్కడా కనిపించదు. ఆదర్శం చిరంజీవి కానీ అనుకరణ ఎక్కడా ఉండదు. అనుసరణ తప్పు కాదు కానీ అనుకరణ ఎంతో కాలం నిలవదు కాబట్టి సునీల్ తన దైన ప్రత్యేకమైన శైలిని అలవరచుకుని ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు.  ఇష్టమైన నటి శ్రీదేవి.

ఎవరెంత పొగిడినా "థాంక్సండీ, ఈ సారి ఇంకా బాగా చెయ్యటానికి కృషి చేస్తా"ననే అంటారు సునీల్. టివి ఇంటర్వూలో తన అభిమాన హాలీవుడ్ హీరో జిమ్ కారీ అని చెప్పిన సునీల్, "మరి ఆయన్ని మించిపోతారా?" అని అడిగితే, "అది చాలా పెద్ద ఆశండి" అంటూ, అదేమో కానీ జిమ్ కి మాత్రం వెళ్తుంటానండీ, అక్కడికి టిఫిన్ కారియర్ ని క్యారీ చేస్తా" అంటూ ఇలా దేన్నైనా తేలిగ్గా తీసేసుకుని తను సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్నవారినీ సంతోషంగా చూడాలనే మనస్తత్త్వంతోనూ, సర్దుకుపోయే గుణంతోనూ జీవితాన్ని సరదాగా గడిపేయటానికే చూస్తుంటారు.

ఈ రోజు సునీల్ జన్మదిన సందర్భంగా ఆంధ్రావిశేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సునీల్ సినిమాజీవితంలో ఇప్పటివరకూ ఎదుగుతూ వస్తున్నట్టుగానే ఇంకా ఎన్నో ఎత్తులకు అలవోకగా ఎక్కెయ్యాలని కోరుకుంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with dr c narayana reddy
A narasimha reddy chairman ap bar council  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles