పాతికేళ్లయినా నిండకుండా కుర్రకారుని కేక పెట్టించిన ఆ కుర్ర హీరోయే వరుణ్ సందేశ్. ఆయన నిజం 'హ్యాపీ డేస్' ఇవి. జీవితమంత మిరకిల్ మరొకటి లేదేమో! అంటూ తన గతాన్ని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ముచ్చట్లు.
నా చదువు నైన్త్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు న్యూజెర్సీ 'బ్రిడ్జ్‌వాటర్ రేరిటన్' హైస్కూల్లో సాగింది. 8వ తరగతి మాత్రం 'ఒహాయో'లో చదివా. ఇంకా చిన్నతనంలోకి వెళ్తే టెక్సాస్ స్టేట్‌లో. నాన్నగారు విజయ్ జీడిగుంట ఐ.బి.ఎం.లో జాబ్ చేస్తుండేవారు. తను ఉద్యోగరీత్యా తిరగటం వలన చదువంతా ఒకే దగ్గర జరగలేదు. పైగా టెన్త్ పూర్తవగానే ఇంటర్‌కోసం మరో కాలేజీకి వెళ్లే అవసరం లేకుండానే ఆ స్కూల్లోనే క్లాసు మారడం, టెన్త్లోని మిత్రులే లెవెన్త్, ట్వెల్త్ స్టాండర్డ్‌లో కూడా ఉండటం వలన కొత్తగా కాలేజీకి వెళ్లిన ఫీలింగ్స్ లేవు. మారుతి, సాగర్, ఆదిత్య లాంటి ఇండియన్ సెటిలర్ మిత్రులే కాక వారెన్, రాబ్, జోష్, హాల్, జేసన్ లాంటి అమెరికన్ మిత్రులూ నాకు క్లోజుగా ఉండేవారు. ఏం చేసినా అందరం అనుకుని, కలిసికట్టుగా చేయడం ఆనవాయితీ. ఇక టీచర్లంటే ఎలాంటి భయం ఉండేది కాదు. వాళ్లంతా మాతో చాలా జోవియల్‌గా, క్లోజ్‌గా ఉండేవారు. వాళ్లని పేర్లుపెట్టే పిలిచేవాళ్లం.
తలచుకుంటే నోట్లో నీళ్లూరుతాయి....
రైస్, చికెన్ కోసం మా ఫ్రెండ్స్ అంతా ఎంత తహతహ లాడేవాళ్లమో గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. బిర్యానికోసం న్యూయార్క్ సిటీకి అర్ధరాత్రి దొంగచాటుగా కార్లేసుకుని పారిపోయేవాళ్లం. ఇప్పటికీ బాగా గుర్తు న్యూయార్క్‌లోని 53 వ స్ట్రీట్, 6వ ఎవెన్యూలో రోడ్డు పక్కన అరబ్బీవాళ్లు నడిపే చిన్న డాబా ఉండేది. బిర్యాని మమ్మల్ని నిలవనిచ్చేది కాదు. దాని పరిమళం మా ఇళ్లదాకా వ్యాపిస్తున్న ఫీలింగ్ కలిగేది. అందరూ పడుకున్న తర్వాత మెల్లగా ప్లాన్ ప్రకారంగా మాలో ఎవరో ఒకరు కారు తీసుకొచ్చి ఇంటికి కాస్త దూరంగా ఆపి, ఫోన్ చేసేవారు. ఇంట్లో వాళ్లకి మెలకువ రాకుండా (ముందే మావి కర్రమెట్లు) పిల్లిలా జారుకునేవాళ్లం. మా కారు గ్యారేజ్ పైనే మా అమ్మవాళ్ల బెడ్ రూం ఉండేది. ఏమాత్రం చప్పుడొచ్చినా వాళ్లకు తెలిసిపోయేది కాబట్టి నా కారుని తరచూ తీసేవాణ్ణి కాదు. ఆ అర్ధరాత్రి ఎంచక్కా రోడ్డు పక్కనే నిలబడి శుభ్రంగా తినేసి తెల్లారేసరికి మళ్లీ ఎక్కడివాళ్లం అక్కడ గప్చిప్. అబ్బ! తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతుంటాయి. ఆ బిర్యానికోసం ఒక్కోసారి రెండు వందల మంది వరకు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయంటే నమ్మరేమో!
బాక్సింగ్‌లోనూ 'కింగు'నే ...
అదేంటోగాని బాక్సింగ్ అంటే తెగ ముచ్చటగా ఉండేది అప్పట్లో. దానికోసం ప్రత్యేకంగా బాక్సింగ్ గ్లౌజ్‌లు కొనుక్కునే వాళ్లం. కొట్టుకోవడానికి అనువుగా ఉండే ఒక ఏరియాని చూసుకునేవాళ్లం. అదంతా దట్టమైన గడ్డి ప్రదేశం కావడంతో కిందపడ్డా దెబ్బలు తగలేవి కాదు. నా టెన్త్లోనో, లెవన్త్ స్టాండర్డ్ లోనే జరిగిన సంఘటన. బాక్సింగ్ మత్తులో 'హాల్' అనేవాడిని కొడితే వాడి పన్ను సగం విరిగిపోయింది. దాంతో వాడు నా మొఖంపై కొట్టిన పంచ్‌కి దిమ్మదిరిగి ముక్కులోంచి బొటబొట రక్తం కారడం ప్రారంభమైంది. చాలా భయపడిపోయాం. రక్తంతో బట్టలన్నీ తడిసిపోయాయి. సాగరనే ఫ్రెండ్ (గుజరాతీ) నన్ను వాళ్లింటికి తీసుకెళ్లాడు. రక్తం చూసిన వాళ్లమ్మ కంగారుపడిపోయి 'వి'కి ఏమైందని అడిగింది (నన్నంతా 'వి' అనే పిలిచేవారు). బాక్సింగ్ అంటే మా పెళ్లవుతుందని భయపడి బాస్కెట్ బాల్ తగిలిందని అబద్ధం చెప్పాం. అయినా ఆమె నమ్మలేక రకరకాలుగా కూపీ లాగే ప్రయత్నం చేయడం ఇప్పటికీ గుర్తుంది. బహుశా ఈ ముక్కుపచ్చడి సంగతి మా ఇంట్లో వాళ్లకి ఇప్పటికీ తెలీదేమో కూడా!
పాకెట్ మనీ పాట్లు....
దాదాపు పదహారేళ్ల వయసు వచ్చేసరికి ఎవరి పాకెట్ మనీ వాళ్లే వెతుక్కోవడం అమెరికా పద్ధతి. దాని వల్ల డబ్బు విలువ, రెస్పాన్స్‌బిలిటీ కూడా తెలుస్తాయి. లేకపోతే మా లాంటి చదువుకునే కుర్రాళ్లకి కార్లలో తిరుగుతూ బిర్యానీలు గట్రా తినే అవకాశం రాదు కదా. అంచేత ముందుగా 'Wegmans' అనే సూపర్‌మార్కెట్ లాంటి ఒక షాపులో క్యాషియర్‌గా చేరాను. గంటకి ఏడు డాలర్లు ఇచ్చేవారు. నాతో పాటు చైతన్య అనే ఫ్రెండ్ కూడా చేసేవాడు. వచ్చిన కస్టమర్లు సామాన్లని తమ కార్ల దాకా తీసుకెళ్లి ఖాళీ ట్రాలీలని అక్కడే వదిలేసే వాళ్లు. షాపు మూసే టైంలో అవన్నీ ఏరి ఒక దగ్గర పెట్టేవాళ్లం. కేవలం క్యాషియర్ పనే చేస్తానంటే అవదు కదా. నేనూ చైతన్య కలిసే ఏరుకొచ్చేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు పనిచేశాక 'dremecricket.com' లో చేరాను. క్రికెట్ ఆటకు కావలసిన వస్తువులకు చాలా చోట్ల నుండి అంటే ఇతర దేశాలనుండి కూడా ఆర్డర్లు వచ్చేవి. ఎవరెవరు ఏమేం ఆర్డర్ చేశారో చూసి లిస్టు ప్రకారంగా ప్యాక్ చేయించి వాళ్ల అడ్రస్‌లన్నీ ప్రింటవుట్ తీసి, కత్తిరించి బాక్స్‌లపై అతికించడం నా పని. అక్కడ గంటకి 10 డాలర్స్ ఇచ్చేవాళ్లు. అలాంటి 'dreamcricket.com' కు ఆ తర్వాత కాలంలో (నేను హీరోనయ్యాక) బ్రాండ్ ఎంబాసిడర్‌గా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మా నాన్నకి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్. నిజం చెప్పాలంటే అందులో చేరిన తర్వాతే క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను.
స్పీడ్‌గా డ్రైవ్ చేసి దొరికిపోయేవాణ్ణి....
స్కూల్‌కి బస్‌లోనే వెళ్లాల్సి వచ్చినా, సమయం దొరికితే ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి కారు తీసుకెళ్లేవాణ్ణి. నాది రాష్ డ్రైవింగ్ కాదుగానీ, స్పీడ్ డ్రైవింగ్. దానివల్లే మూడుసార్లు 'టికెట్స్' తీసుకుని ఫైన్ కట్టాను. స్పీడ్‌గా డ్రైవ్ చేయడం ఇష్టం కాబట్టి హైదరాబాద్‌లో కారు డ్రైవ్ చేయడానికి భయపడుతుంటా ఇప్పుడు. ఆటల విషయానికొస్తే బాస్కెట్ బాల్లో ప్రొఫెషనల్ కావాలని ఉండేది కానీ అది అంత సులువు కాదని తెలిసింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా భలే సరదాగా ఉండేది. స్కూల్లో 'trumpet' వాయించేవాణ్ణి. 'బ్యాండ్'లో ఒక్కోసారి ఆలస్యమైనా అమ్మ నాకోసం కారేజ్ తీసుకుని స్కూల్‌కి వచ్చేసేది. అమ్మ ఎప్పుడూ నన్ను కనిపెట్టుకుని నా వెన్నంటే ఉండేది. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రాంలు అవుతుండేవి కాని నేనెప్పుడూ పాల్గొనేవాణ్ణి కాదు. ఎంతసేపూ బాస్కెట్ బాల్ పైనే దృష్టి. మా స్కూల్లోనే కాకుండా చుట్టుపక్కలున్న స్కూళ్లలో కూడా బాస్కెట్ బాల్‌ను ఆడటానికి వెళ్లేవాణ్ణి. నైన్త్ స్టాండర్డ్‌లో ఉండగా ఒక్కసారి కూడా ఓడిపోకుండా వరసగా 25 గేమ్స్ ఆడి గెలిచాను. అదొక స్వీట్ మెమరీ.
అనుకోకుండా 'హ్యాపీ డేస్'లోకి....
నేను ముందుగా చెప్పినట్టు 'హ్యాపీడేస్'లో నటించడం మిరకిలే. ఎందుకంటే అప్పటిదాకా నటన గురించి ఓనమాలు కూడా తెలీవు నాకు. కాకపోతే మా తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి, బాబాయ్ జీడిగుంట శ్రీధర్గార్ల వారసత్వం అంతర్లీనంగా నాలోనూ ప్రవహిస్తుందేమో తెలీదు. తాతయ్య 70 - 80 దశకాల్లో హైద్రాబాద్ ఆకాశవాణి ద్వారా (ముఖ్యంగా కార్మికుల కార్యక్రమంలోని ఏకాంబరం, చిన్నక్కలతో వచ్చే బాలయ్యగా) తెలుగు శ్రోతలకు బాగా తెలుసు. నాటక ప్రయోక్తగా, రచయితగా కూడా ప్రముఖులు. ఇక బాబాయ్ పలు టీవీ సీరియల్స్‌లో కన్పిస్తూనే ఉంటారు.నేను నా చదువులో బిజీగా ఉండగా ఒకరోజు బాబాయ్ ఫోన్ చేసి శేఖర్ కమ్ములగారు తను తీయబోయే కొత్త పిక్చర్కోసంidlebrain.comలో టాలెంటున్న కొత్త నటుల కోసం 'సర్చ్' చేస్తున్నారు అని చెప్పారు. నేను కూడా ఆ వెబ్సైట్ చూసి సరదాగా నా స్టిల్స్‌ని పంపాను. కొద్ది రోజుల్లోనే వాళ్ల దగ్గర్నుంచి రిప్లయ్ వచ్చింది. దాంతో పాటు 'ఆ చిత్రంలోని చిన్న సన్నివేశం స్క్రిప్ట్ పంపుతూ, దాని ప్రకారం నటించి పంప'మన్నారు. అప్పటికి అది 'హ్యాపీడేస్' సినిమా అనికాని, అందులో తమన్నా హీరోయిన్ అనికానీ తెలీదు. (తమన్నా ఇంటికి వెళ్లి కిస్ అడిగి, ఆమె తిరస్కారంతో మర్రోజు కాలేజీలో ఆమెకు సారీ చెప్పే సన్నివేశం అది). మా చెల్లి వీణాసాహితి తమన్నా పాత్ర డైలాగ్స్ పలుకుతూ, డిజిటల్ కెమెరాతో నా నటనని షూట్ చేసింది. ఆ సన్నివేశాన్ని క్యాజువల్‌గా నటించి, దాంతోపాటు బొమ్మరిల్లు సినిమాలోని 'అపుడో ఇపుడో ఎపుడో' (సరదాగా మా బ్రిడ్జ్ వాటర్ ఇంట్లో మెట్లపై పాడుతూ, డాన్స్ చేస్తూ తీసుకున్న) విడియోను కూడా కలిపి గూగుల్‌లో అప్లోడ్ చేసి శేఖర్‌గారికి పంపించాను. ఇదంతా సరదాలో భాగంగానే అనుకుని పంపాను.ఈ విషయం dreamcricket.comలో పనిచేస్తున్న నా కొలీగ్స్‌కు చెబితే నీకు తప్పకుండా చిన్న రోలైనా అందులో ఇస్తారని జోస్యం పలికారు. దాంతో నాక్కూడా ఒక్క తెలుగు సినిమాలో అయినా నటిస్తే బాగుణ్ణు అనే కోరిక మొదటిసారి కలిగింది. తర్వాత కొద్ది రోజుల్లోనే 'అనిష్ కురువిల్లా' ('హ్యాపీడేస్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) గారి నుండి కబురు ... నీవు సెలెక్ట్ అయ్యావు, చిన్న రోల్‌కాదు, సినిమాలోని మెయిన్ రోల్ నీదే అంటూ.
ఇంకేముంది? కేక ...
మరి సందేశ్ చదువుని ఏం చేశాడనే సందేహం మీకు రావచ్చు. మా కాలేజీ ప్రిన్సిపాల్గార్కి సినిమా ఛాన్సు వచ్చిన విషయం చెప్పాను. ఆయన గూగుల్‌లో సర్చ్ చేసి శేఖర్ కమ్ముల అనే తెలుగు దర్శకుడు గతంలో ఆనంద్, గోదావరి లాంటి సినిమాలు తీశారనే పూర్తి వివరాలు తెలుసుకుని 'మంచి ఛాన్సు. వెళ్లు. షూటింగ్ అయిపోయాక వచ్చి ఎగ్జామ్స్ రాయి' అంటూ సెలవు గ్రాంట్ చేశారు.'హ్యాపీడేస్' రష్స్ చూసి దిల్ రాజుగారు తను తీయబోయే 'కొత్తబంగారులోకం' కోసం అడిగారు. కాలేజీ పూర్తవలేదని ఊగిసలాడుతుంటే 'తొందరేం లేదు, చదువు ముఖ్యం. ఎగ్జామ్స్ రాసి వచ్చేశాకే షూటింగ్ మొదలెడదాం' అని భరోసా ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించేస్తారని తెలుసు.
కాలేజీలో చదువుకోలేని లోటుని ఫీలవకూడదనే కాబోలు శేఖర్ కమ్ములగారు 'హ్యాపీ డేస్' అవకాశం కల్పించారేమో. ఆ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేను.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more