బాల్యంలోనే బతుకు కళని కనిపెట్టినవాడు మారుతి. డిగ్రీ పూర్తి కాగానే తనలోని చిత్రకళకి మెరుగులు దిద్దుకోవాలని బందరు నుండి భాగ్యనగరం చేరుకున్నాడు. 'యానిమేషన్' లోతుల్ని పరిశీలించే క్రమంలోనే 'బన్నీ'తో చెలిమి కలిసింది. తనలో రేకెత్తే భావాలకు రూపం కల్పించాలనే తపనతో వెండితెరవైపు అడుగులు వేసి 'ఎ ఫిలిం బై అరవింద్', 'ప్రేమిస్తే' చిత్రాల కో- ప్రొడ్యూసరయ్యాడు. ఈ మ«ధ్యనే 'ఈరోజుల్లో...' చిత్ర దర్శకుడిగా యువతని ఉర్రూతలూగించి, త్వరలో 'బస్టాప్' చిత్రంతో మన ముందుకు రాబోతున్న యువ దర్శకుడు మారుతి చెప్పిన హ్యాపీడేస్ ఇవి.
చిన్నతనం నుండి గుంభనంగా, పైకి ఏమీ ఎరగనట్టు అమాయకంగా బిల్డప్ ఇచ్చేవాణ్ణి కానీ నేనెంత అల్లరి పిడుగునో, పెంకి ఘటాన్నో నాకు మాత్రమే తెలిసిన పరమ రహస్యం. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ జనాల్ని పరుగులు పెట్టించడమంటే గొప్ప సరదా నాకు.
నెంబర్ ప్లేట్లతో పాకెట్ మనీ
మధ్యతరగతి కుటుంబం కావడంతో ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్లు. నాన్నది అరటిపండ్ల వ్యాపారం. బండి ఉండేది. అమ్మ మిషన్ కుట్టేది. తను జాకెట్లు కుడుతుంటే నేను హుక్స్ తగిలిస్తూ ఉడత సహాయం చేసేవాణ్ణి. నాకు ఆర్ట్ వేయడం కూడా వచ్చు కాబట్టి పిల్లలు తమ క్లాసు పుస్తకాలపై నా చేత పేర్లు రాయించుకుని, కీ చెయిన్స్‌పై బొమ్మలు వేయించుకుని సంతోషించేవాళ్లు. టెన్త్ క్లాసు చదువుతుండగానే మా మామయ్య నడిపే ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఆఫీసు బాయ్‌గా చేరాను. రిజిస్ట్రేషన్ అయిన వెహికిల్స్‌కి నెంబరు ప్లేట్స్ రాస్తూ, స్టిక్కర్లు కట్ చేసి అతికిస్తూ పాకెట్ మనీ సంపాదించేవాణ్ణి. వాటితో సినిమాలు చూడ్డమే కాదు, నా స్కూలు ఫీజులు కూడా నేనే కట్టుకునేవాణ్ణి.
తొలి ప్రేమ విఫలం
టెన్త్‌లో ఉన్నప్పుడు ... అప్పుడప్పుడే నూనూగు మీసాలతో Äౌవ్వనంలోకి అడుగుపెడుతున్నాను. మా ఇంటి వెనకుండే అమ్మాయి రోజూ నన్ను చూడ్డం, నేను తనను చూడ్డం... చూపులతోనే బాసలు చేసుకుంటూ గడిపేసేవాళ్లం. రామాలయం నుండి ప్రసాదం తీసుకెళ్లి ఇస్తూ ఆ పిల్లకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. మా అడ్డా గుడి ప్రాంగణమే. ఒకరోజు గుడి దగ్గర నిల్చుని ఆ అమ్మాయికోసం ఎదురుచూస్తున్నాను. ఎంతకీ రావట్లేదు. ఆ అమ్మాయి పక్కింట్లో ఉండే ఐదేళ్లబ్బాయి కన్పిస్తే 'నేను తనకోసం వెయిట్ చేస్తున్నానని' కబురు చెప్పమన్నాను వాడితో. వాడు రాకెట్‌లా దూసుకెళ్లి ఇంట్లో అందరూ ఉండగానే 'అక్కా, మారుతి అంకుల్ నిన్ను దొడ్డివైపు రమ్మన్నాడు' అంటూ అరిచాడట. బాంబు పేలిన శబ్దం విన్నట్టు అంతా బిత్తరపోయారట. తనెంతకూ రావట్లేదు కదా అని నేను మా ఇంటికి వెళ్లిపోయి అమ్మకు కుట్టుపనిలో సాయం చేస్తున్నాను. ఇంతలో వీధి గుమ్మంలో 'మా అమ్మాయిని రమ్మంటాడా? అంత మగాడా? ఏదీ వాణ్ణి బయటకి రమ్మను. పిల్లల్ని కనగానే సరిపోదమ్మా .. బాగా పెంచాలి' అంటూ శివాలెత్తుతూ ఆ పిల్ల నాన్న గొంతు వినిపించింది. విషయం అర్థం చేసుకున్న అమ్మ ఇక తప్పదన్నట్టు కొంగు నడుముకు బిగించి రంగంలోకి దిగింది. నిజం చెప్పాలంటే అమ్మంటే ఆ పేటంతా హడలు. ఆయన్ని జాడించిపారేసి ఇంట్లోకొచ్చి 'సిగ్గులేదురా నీకు? వాడి మొహం చూశావా ... అలాంటోడి కూతురిని ప్రేమిస్తావా ... ఇంకెవరూ దొరకనట్టు' అంటూ నాపై విరుచుకుపడింది. పిల్లిలా జారుకున్నాను. అప్పట్నించి ఆ అమ్మాయితో కటీఫ్ అయిపోయింది లెండి.
అంతా నాకు సపోర్టు ఇచ్చేవారే
హిందూ కాలేజీలో డిగ్రీ సెకండియర్‌లో ఉండగా జరిగిన సంఘటన. మన ప్రమేయం లేకపోయినా ఒక్కోసారి కష్టాలు తలకు చుట్టుకుంటాయనే సత్యం బోధపడింది కూడా అప్పుడే. మా క్లాస్‌మేట్ ఒకడు మా కాలేజీ అమ్మాయినే సిన్సియర్‌గా లవ్ చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయేమో వీడిని ఎంతకూ కనికరించేది కాదు. వీడికేమో ఆ అమ్మాయంటే తగని మోజు. ఒకరోజు మేమిద్దరం టూ వీలర్‌పైన వెళ్తుండగా ఆ అమ్మాయి నడుస్తూ కనిపించింది. దాంతో మావాడు రెచ్చిపోయి ఆ అమ్మాయి పక్కనుంచి రయ్యిమంటూ బండిని పోనిచ్చాడు. వెనక కూర్చున్న నా చేయి తగిలి ఆమె చేతిలోని పుస్తకాలన్నీ రోడ్డుపైన పడిపోవడం, వాడేమో బండి ఆపకుండా స్పీడ్‌గా ముందుకు పోనివ్వడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఇద్దరం వెళ్లి 'మాధవా మ్యూజికల్స్'లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఇమిడియట్ రియాక్షన్ - నాకోసం పోలీసులు కాలేజీకి వచ్చారని కబురు. నాలో కంగారు మొదలైంది. పైగా ఆ అమ్మాయి నాన్న న్యాయవాది. విషయం కాలేజీ అంతా గుప్పుమంది. అందరి కళ్లూ నాకోసం ఎదురుచూస్తున్నాయట. రాత్రివరకూ పోలీసుల కంట పడకుండా అక్కడక్కడే దాక్కున్నాం. విషయం తెలిసిన ఎబివిపి, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నాకు సపోర్టుగా ఉంటామని ముందుకు వచ్చారు. తర్వాత మా నాన్నని తీసుకుని ఎం.ఎల్.ఏ. గారితో మాట్లాడటం, ఆయన ప్రిన్సిపాల్‌తో చెప్పించడంతో ... అసలు దోషిని నేను కాదని తేలిపోయింది.
ఐనా ఆ సంఘటన గుర్తుకొస్తే కాస్త టెన్షన్‌గానే ఉంటుందిప్పటికీ.పోలీసులు అర్థం చేసుకుని రావడం మానేశారు కానీ, ఆ అమ్మాయిని ఇష్టపడేవాడు ఇంకొకడు మాత్రం చిందులు తొక్కుతూ పది మందిని వెంటేసుకుని మా కాలేజీకి వచ్చాడు. నేను క్లాసులో ఉండగా కాంటీన్లో నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడట. విషయం తెలిసిన మా మామయ్య షాపులో పని చేసే కుర్రాళ్లు వాళ్ల దగ్గరకు వెళ్లి 'మా వాడిపై చేయి పడిందంటే తలలు లేచిపోతాయని' వార్నింగ్ ఇవ్వడంతో తోక జాడించారట ... ఇవన్నీ తర్వాత తెలిసిన విషయాలు. ఏదైతే నేం? ఈ సంఘటన అప్పటివరకూ తెరమాటునున్న నన్ను ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చి కాలేజీ హీరోని చేసేసింది.
నా జీవిత 'స్పందన'
డిగ్రీ ఫైనల్లో ఉండగా జూనియర్ ఛాంబర్స్ యూత్ ప్రెసిడెంట్‌గా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు 'పాట్ లక్' అనే సందర్భం పెట్టుకుని అంతా కలిసేవాళ్లం. పాట్ లక్ రోజు ఎవరికి వారు తమ ఇంట్లో తయారుచేసిన డిష్‌లు తయారుచేసి తీసుకురావాలి. అదే రోజు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జరిపేవాళ్లం. అప్పట్లో మా చాంబర్‌లోని లేడీస్ సెక్షన్‌లో సభ్యురాలైన ఒకామె తన కూతుర్ని 'పాట్ లక్' కోసం వెంట తీసుకొచ్చింది. ఆ అమ్మాయి స్టేజీపై డాన్స్ చేస్తుంటే చూశాను. తనని చూడగానే పరిచయం చేసుకోవాలని కోరిక కలిగింది. అనుకోకుండానే ఒకరి కొకరం దగ్గరయ్యాం. తన పేరుని స్టిక్కర్లుగా కట్ చేసి బళ్ల వెనకాల అతికించేవాణ్ణి. చూస్తుండగానే నా డిగ్రీ పూర్తయ్యింది. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుండగా జీవితంలో ఎదగాలంటే మరోచోటికి వలస వెళ్లక తప్పదని సలహా ఇచ్చింది తనే. ఆ మాట ప్రకారం అప్పట్లో నా సంపాదనలో దాచుకున్న కొంత డబ్బు తీసుకుని హైద్రాబాద్ వచ్చేసి 'హార్ట్ యానిమేషన్ అకాడమీ'లో చేరాను. మా మధ్య ఏర్పడ్డ చెలిమి ప్రేమ గా చిగురించి, చివరకు ఆమే నా జీవిత 'స్పందన'గా మారిపోయింది.
ఇక నా సినిమా పిచ్చి ... ఇవివి, జంధ్యాల, వంశీగార్ల సినిమాలంటే పడిచచ్చేవాణ్ణండీ బాబూ! అప్పట్లో బందర్లోని 13 థియేటర్లలో ఏ సినిమానీ వదిలేవాణ్ణి కాదు. నచ్చితే వరసపెట్టి ఒకేసినిమా వారం రోజులు కూడా చూసేవాణ్ణి.యానిమేషన్‌లో ఎదిగే క్రమంలో అనుకోకుండా బన్నీ పరిచయం కావడం, తన నుండి ఎన్నో తెలుసుకోవడం కూడా మరిచిపోలేని అనుభవమే. జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్‌ని అనుభవించినవాడే మానవసంబంధాల్ని సరిగ్గా అంచనా వేయగలడనేది నా ఫిలాసఫీ. నాలోని భావాల్ని తెరకెక్కించాలంటే వెండితెర వైపు మళ్లక తప్పదని తెలుసుకుని అటువైపు దృష్టి సారించి ఇలా మీకు చేరువయ్యాను.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more