History of sardar bhagat singh

Shaheed Bhagat Singh Biography - History of Sardar Bhagat Singh - Information on Freedom Fighter Bhagath Singh

History of Freedom Fighter Shaheed Bhagat Singh. Read information on Indian patriot Bhagath Singh

History of Sardar Bhagat Singh.gif

Posted: 07/12/2012 03:19 PM IST
History of sardar bhagat singh

Bhagat_Singh1

Bhagat_Singh‘శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే’ - భగత్‌సింగ్‌ను వీరోచిత పథం వైపు నడిపించిన మాటలివి. ‘పోరుబాట పట్టాక ఒక్కటే అనుకున్నా. దేశం నలుమూలలా ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న నినాదం మార్మోగాలి. అందుకోసం నా జీవితాన్ని త్యాగం చేశా. ఇప్పుడు నేను జైలు గోడల మాటున ఉన్నా. అదిగో... కోట్లాది నా దేశీయుల కంఠాల్లోంచి ఆ ప్రతిధ్వనులు మిన్నుమన్నుల్ని ఏకం చేస్తున్నాయి. ఇంతకన్న ఏం కావాలి నా చిన్ని జీవితానికి’ జైల్లో ఉన్నప్పుడు భగత్ పలికిన మాటలివి.

1919 ఏప్రిల్ 15.
 
అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్. శ్మశానంలా ఉంది. రెండు రోజుల కిందటే మారణహోమం జరిగిందక్కడ. జనరల్ డయ్యర్ వందలాది భారతీయుల్ని కాల్చేసిందిక్కడే! పచ్చపచ్చని ఆ తోట ఇప్పుడో శవాల గుట్ట. రక్తపు మరకలతో ఆ నేల ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. ఆ భూమిని స్పృశిస్తూ పిచ్చిపిచ్చిగా తిరిగాడు భగత్‌సింగ్. భరతమాత దైన్యం తలచి వెచ్చవెచ్చని కన్నీరు కార్చాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. దేశభక్తుల రుధిరంతో తడిసిన ఆ మట్టిని దోసెడు తీసుకున్నాడు. నేరుగా నాలుగు గంటలు ప్రయాణించాడు. తన ఊరు ‘బాంగా’ వచ్చాడు. ఆ పవిత్ర మృణ్మయ రేణువుల్ని సీసాలో పోసి చూస్తుండిపోయాడు. చూసేకొద్దీ అణువణువున ఆవేశంతో ఊగిపోయాడు. అప్పటికి భగత్‌సింగ్ వయసు 12 ఏళ్లే.దేశం కోసం ఏదో చేయాలి-ఇదే ఆలోచన భగత్‌కి. కానీ మార్గం తెలిసే వయసు కాదది. అంతలో 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం చేపట్టారు. అంతే! విదేశీ వస్తువులకు నిప్పంటించాడు భగత్. బ్రిటిష్ విద్యను నిరసిస్తూ లాహోర్ జాతీయ కళాశాలలో చేరాడు. సాక్షాత్తూ లాలాలజపతిరాయ్ స్థాపించిన కాలేజీ అది.

సత్యాగ్రహం, అహింస... దేశమాత సంకెళ్లు తెగడానికి ఇవి చాలనుకున్నాడు.ఇంతలో 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లో చౌరీచౌరా ఘటన జరిగింది. ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపేశాడు మహాత్ముడు. భగత్‌కి మతిపోయినట్లయింది. నోటికందబోయే స్వాతంత్య్ర ఫలం బూడిద పాలైందన్న భావన. గాంధీజీ మెతకదనమే కారణమనిపించింది. ముల్లును ముల్లుతోనే తీయాలనుకున్నాడు. దాన్నే విప్లవమంటారని 15 ఏళ్ల భగత్‌కి తెలీదు.లాహోర్ కాలేజీలో భగత్ అనేక పుస్తకాలు చదివాడు. మాతృభాష పంజాబీతో పాటు అప్పటికే హిందీ వచ్చు. ఉర్దూ మాట్లాడగలడు. సంస్కృతం పర్వాలేదు. ఎటొచ్చీ ఇంగ్లిషే బొత్తిగా రాదు. ఆంగ్లేయుల చరిత్ర తెలుసుకోవాలన్నా, వారికి ధీటుగా తన ఆలోచనల్ని వ్యక్తీకరించాలన్నా ఇంగ్లిషు తప్పనిసరని గుర్తించి కఠోర సాధన చేశాడు. ఆరు వారాలు తిరక్కుండా ఆంగ్లంపై పట్టు సాధించాడు. చదువులో ఆటపాటల్లో నాటకాల్లో సాంస్కృతిక పోటీల్లో ఫస్టే!భగవతీ చరణ్ వోరా, సుఖ్‌దేవ్ లాంటి వీరులు భగత్‌కు పరిచయమైంది ఈ కాలేజీలోనే. వారితో కలిసి 1924లో నవజవాన్ భారత సభ స్థాపించాడు. ఆంగ్లేయులపై ఆకస్మిక దాడులు చేయడం, యువకులకు వ్యాయామం, కత్తి, కర్రసాము శిక్షణ, తుపాకీ రక్షణ, మందుగుండు తయారీ దీని లక్ష్యాలు.

1927 మే 27.

లాహోర్ తోటలో ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు భగత్. హఠాత్తుగా పోలీసుల దాడి. తీసుకెళ్లి లాకప్‌లో వేశారు. లేనిపోని నేరాల్ని భగత్‌పై మోపాలన్నది పోలీసుల పన్నాగం. ఒప్పుకోకపోతే చంపేస్తామన్నారు. చంపేయండి అన్నాడు భగత్. చిత్రహింసలు పెట్టారు. అయినా బెదరలేదు భగత్. చేసేది లేక వదిలేశారు.కానీ ఇంట్లోవారికి ఇది ఆందోళన కలిగించింది. పెళ్లి చేసేస్తే దారికొస్తాడు అనుకున్నారు. ఒత్తిడి పెంచారు. లాభం లేదని 20 ఏళ్ల భగత్‌సింగ్ ఇల్లొదిలి పారిపోయాడు.ఎక్కడెక్కడో తిరిగి కాన్పూర్ వచ్చాడు. రోడ్లపై పత్రికలు అమ్మాడు. విప్లవ సంస్థలకు దగ్గరయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్‌కి సన్నిహితమయ్యాడు. 1928 సెప్టెంబర్‌లో ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ను సుఖ్‌దేవ్, ఆజాద్‌లతో కలిసి స్థాపించాడు.ఈ సంస్థ మ్యానిఫెస్టో ‘ఫిలాసఫీ ఆఫ్ ది బాంబ్’ని తయారు చేశాడు. విప్లవం అంటే ఏమిటి, తమ విప్లవ పంథా ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ ఎలా క్షీణించబోతోంది, గాంధీ చేసిన తప్పిదాలేమిటి... లాంటి అంశాల్ని సవివరంగా రాశాడు. భగత్ చేతలే కాదు, ఆలోచనలు, రాతలు ఎంత పదునుగా ఉంటాయో ఈ మ్యానిఫెస్టో చదివితే తెలుస్తుంది.

1928 అక్టోబర్ 30.

సైమన్ కమీషన్ లాహోర్ వచ్చింది. ఆనాటి భారత రాజకీయ స్థితిగతుల్ని బేరీజు వేసేందుకు వచ్చిన సంఘమిది. లాలాలజపతిరాయ్ నాయకత్వంలో ధర్నా జరిగింది. అంతలో ఆందోళన కారులపైపోలీసు అధికారి జేమ్స్ స్కాట్ దాడిచేశాడు. లాలా ఒళ్లంతా రక్తపాతమైంది. నవంబర్ 17న ఆయన మరణించాడు.యువ విప్లవ వీరులకు ఇంతకన్న విషాదమేముంటుంది? తన కళ్ల ముందే ఇదంతా జరగడం భగత్‌ను తీవ్రంగా వేధించింది. స్కాట్‌ను చంపాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. రాజ్‌గురు, సుఖ్‌దేవ్, ఆజాద్, జయగోపాల్‌తో కలిసి ఓ పథకం వేశాడు.డిసెంబర్ 17 సాయంత్రం 4 గంటలకు స్కాట్ రాక కోసం మాటుపెట్టుకుని చాటుగా ఉన్నారు. స్కాట్ అనుకుని-భగత్, రాజగురు గుళ్ల వర్షం కురిపించారు. తీరా అతను సాండర్స్ అనే పోలీసు. ఎవరైతేనేం... బ్రిటిష్‌వాడే కదా! అంతా పారిపోయారు.రెండు రోజులపాటు లాహోర్‌లో రహస్యంగా ఉన్నారు. తప్పించుకోడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. భగత్‌సింగ్ గెడ్డం గీశాడు. తలపాగా తీసేశాడు. జుత్తు కత్తిరించి, ఇంగ్లిషు క్రాఫు చేశాడు. సూటూ బూటూతో తెల్లదొరలా తయారయ్యాడు. భగవతి చరణ్ భార్య దుర్గాదేవి - భగత్‌సింగ్ భార్యగా మారింది. తన రెండేళ్ల కొడుకు ‘శచి’ని చంకనెత్తుకుంది. రాజ్‌గురు కూలీవేషం వేశాడు. సూట్‌కేసులు నెత్తిన పెట్టుకున్నాడు. ఆజాద్, సుఖ్‌దేవ్ తదితరులు సన్యాసులుగా మారారు. పోలీసుల కళ్లుగప్పి రెలైక్కి లాహోర్ దాటేశారంతా!

ఆంగ్లేయుల్ని గడగడలాడించేందుకు ఇంకా ఏదో చేయాలనుకున్నాడు భగత్. 1893లో ఫ్రెంచి అరాచకవాది ఎమిలీ హెన్రీ ఫ్రాన్స్ పార్లమెంట్‌పై బాంబు విసిరాడు. అది స్ఫూర్తి అయ్యింది భగత్‌కు. బాంబు తయారీ బాధ్యత జతిన్‌దాస్‌ది. వేసేది భగత్, భటుకేశ్వర్ దత్. 1929 ఏప్రిల్ 8న ఇద్దరూ భారత పార్లమెంటులో బాంబు వేశారు. భయంకరమైన శబ్దం. అంధకారం... అల్లకల్లోలం. ‘చెవిటివారికి వినిపించాలని...’ అనే కరపత్రం వెదజల్లారు. కాని పారిపోలేదు. పోలీసులకు లొంగిపోయారు. తామెందుకు ఆ పని చేశారో కోర్టుకి వివరించాడు భగత్. ‘‘ఆ బాంబును ఎవరికీ హాని కలిగించకుండా తయారుచేశాం. అందుకే క్లోరైడ్ పొటాష్ ఎక్కువ వాడలేదు. ఇనుప ముక్కలు కలపలేదు. కోట్లాది భారతీయుల ఆర్తనాదాలు వినిపించడం లేదు మీ బ్రిటిష్ ప్రభుత్వానికి. అందుకే చెవుల తుప్పు వదిలిపోవడానికి ఇలా చేశాం.’’ మొదట ఢిల్లీ ఆపై మియన్‌వాలీ జైల్లో పెట్టారు భగత్‌ను.బ్రిటిష్ ఖైదీలతో సమానంగా భారత సైనికుల్ని చూడాలంటూ ఏకంగా 116 రోజుల పాటు నిరాహారదీక్ష చేశాడంటే... 22 ఏళ్లు కూడా నిండని భగత్‌సింగ్ ఎంత మొండివాడో అర్థం చేసుకోవచ్చు.

భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు.జైల్లో బ్యారక్ నంబర్ 15లో చిన్నగది భగత్‌సింగ్ ప్రపంచమైంది. తానింక కొద్దిరోజులే బతుకుతానని తెలుసు. అయినా చిరునవ్వు చెదరలేదు. ధైర్యం సడలలేదు. రోజూ పుస్తకాలు చదువుకునేవాడు. జైల్లోనే ‘నేనెందుకు నాస్తికుణ్ని’ అనే పుస్తకం రాశాడు.1929 సెప్టెంబరు 12న కోర్టు ఆదేశంతో జైలు అధికారులు భగత్‌కు ఓ పుస్తకం ఇచ్చారు. 404 పేజీల తెల్ల కాగితాల నోట్‌బుక్ అది. ఇంకొన్ని రోజుల్లో తనను ఉరి తీస్తారని తెలుసు. అది తప్పదని తెలుసు. అయినా భగత్‌కి ఎంత గుండె నిబ్బరం ఉందో, దట్టించిన దమ్ము ఎంత ఉందో, ఆశయాల పట్ల, రాబోయే తరాల పట్ల ఆశ ఎంత ఉందో, దేశం బాగుపడాలన్న కాంక్ష ఎంత ఉందో... ఆ నోట్‌బుక్‌లో అతడు రాసిన డైరీ చదివితే అర్థమవుతుంది.‘ప్రేమికుడికీ, పిచ్చివాడికీ, కవికీ... ఒకే మోతాదులో ఉంటుంది వెర్రితనం’ - ఇదీ ఈ పుస్తకంలో భగత్ రాసిన మాట!

వివిధ దేశాల కరెన్సీ వివరాలు, మానవ సమాజ పరిణామ క్రమం, సామ్రాజ్యవాదపు విష స్వభావం గురించి రాసుకున్నాడు. మార్క్స్, ఎంగెల్స్, టాల్‌స్టాయ్, విక్టర్ హ్యూగ్, బర్ట్రండ్ రసెల్, థామస్ గ్రే, జాన్ స్టువర్ట్ మిల్, జపాన్ బౌద్ధ గురువు కెంకో హోషి, మాక్సిం గోర్కీ... ఇలా ఆ పుస్తకం నిండా ఎన్నెన్ని కొటేషన్లో! అంతేకాదు - ఉమర్ ఖయ్యాం, వర్డ్స్ వర్త్, లార్డ్ బైరన్ కవితల్ని తిరగరాశాడు. 67వ పేజీలో తన మిత్రుడు భటుకేశ్వర్ దత్ ఆటోగ్రాఫ్‌ని పదిలపరుచుకున్నాడు.

1930 జూలై 12న 137వ సెల్‌లో ఉన్న దత్ సంతకమిది అంటూ నోట్ చేశాడు.ఇక రెండు గంటల్లో ఉరి తీస్తారనగా రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ ‘సర్ఫ్ రోషీ కీ తమన్నా’ (దేశభక్తుడి కోరిక) చదువుతూ కూచున్నాడు భగత్. ఆంగ్లేయ అధికారి వచ్చి ‘‘సర్దార్జీ ఉరి తీయడానికి ఆర్డరొచ్చింది. లేవండి’’ అన్నాడు. కంగారుపడలేదు భగత్. ‘‘కాస్త ఆగండి. ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడితో మాట్లాడుతున్నాడు’’ అన్నాడు భగత్ పుస్తకంలో మునిగిపోయి. నిర్మలమైన కళ్లతో, నిశ్చయమైన నవ్వుతో, నిర్భయమైన గుండెతో, నిఖార్సయిన ధైర్యంతో ఉరికంబం వైపు అడుగులు వేశాడు. భగత్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్ గురువులను కూడా నడిపించారు అధికారులు. ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. తోటి ఖైదీలతో ‘సోదరులారా వెళ్తున్నాం’ అంటూ నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు భగత్.

1931 మార్చి 23న లాహోర్ జైల్లో ముగ్గుర్నీ ఉరితీశారు. అప్పటికి భగత్ వయసు - 24 ఏళ్లే!భగత్ పుట్టినప్పుడే తండ్రి, పెదనాన్నలు జైలు నుంచి విడుదలయ్యారు. అందుకే అమ్మమ్మ బుజ్జి భగత్‌ను ‘భగన్‌వాలా’ అని పిలిచేది అదృష్టవంతుడా అంటూ! భగత్ అంటే భక్తుడు అని అర్థం. పేరు నిలబెట్టుకున్నాడు దేశ భక్తుడై! నేటి పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబరు 28న జన్మించాడు భగత్. తండ్రి కిషన్‌సింగ్. తల్లి విద్యావతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajesh khanna the custodian of his own famous avatar
Kv reddy history  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles