సినిమా పేరు : ‘సుడిగాడు’
విడుదల తేదీ : 24.08.2012
దర్శకుడు : భీమనేని శ్రీనివాస రావు
నిర్మాత : చంద్రశేఖర్ డి. రెడ్డి
సంగీతం: శ్రీ వసంత్
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్, హేమ జయప్రకాశ్ రెడ్డి, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్, తదితరులు.
ఆంధ్రవిశేష్.కాం రేటింగ్ : 3
మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్ కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అయితే.. ఇటీవల కాలంలో డూపర్ హిట్ అవుతాయని ఆశించిన అతని సినిమాలు పూర్తి స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అలాగే.. ప్రస్తుత సినిమా ‘సుడిగాడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన భీమినేని శ్రీనివాసరావు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమాతో ముందుకొచ్చారు. ఇంతవరకూ అల్లరి నరేష్ తన సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమా చెయ్యలేదు. ఆ లోటుని ఈ చిత్రంతో భర్తీ చేసారు. ఈ చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలను తీసుకొని పేరడీ చేసారు. ఈ మూవీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున అత్యధిక థియేటర్లలో విడుదలైన అల్లరి నరేష్ సినిమా ఎలా ఉందో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ ఎలా కనువిందు చేసిందో మొత్తంగా ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమేరకు గిలిగింతలు పెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
స్టోరీ :
అల్లరి నరేష్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో తొలుత కామెడీగా.. కామేష్(అల్లరి నరేష్), అతని భార్య (హేమ)కి పుట్టుకతోనే పువ్వు పరిమళించిన విధంగా సిక్స్ ప్యాక్ కలిగిన ఒక డైనమిక్, కండలు తిరిగిన పవర్ఫుల్ కొడుకు పుడతాడు. ఆ బాలుడుకి తిక్కల్ రెడ్డి (జయప్రకాశ్ రెడ్డి)అనే విలన్ వల్ల ఆపద ఉందని తెలిసి, కామేష్ తన తల్లి(కోవై సరళ) కి ఇచ్చి ఆ బాలుడిని ఊరు దాటిస్తాడు. అలా హైదరాబాద్ కి వచ్చిన శివ (అల్లరి నరేష్) ఒక తెలుగు సినిమా హీరోలా డేర్ మరియు డాషింగ్ గల కుర్రాడిగా ఎదుగుతాడు. శివ లోని వేగాన్ని చూసి పోసాని కృష్ణమురళి ఎంతో తెలివిగా శివాని పందెంలోకి దింపుతాడు. మరో పక్క శివ ప్రియ (మోనాల్ గజ్జర్) ప్రేమలో పడతాడు. తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతూ ఉంటారు, అది తెలుసుకున్న శివ వారితో పోరాడాలని నిర్ణయించుకుంటాడు, మధ్యలో ఎవరూ ఊహించని విధంగా డాన్ డి కూడా శివ పై దాడి చేస్తాడు. డాన్ డి ఎందుకు శివ పై దాడి చేసాడు? వారందరితో శివ పోరాడి తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు? అనేదే మిగిలిన హాస్యభరిత కథ.
ప్రేక్షకులను మెప్పించే అంశాలు :
ఇప్పటికే నవ్వించటంలో ఆరితేరిపోయిన అల్లరి నరేష్ శివ పాత్రలో అద్భుతంగా నటించారు. అతని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది. అంతేకాదు పంచ్ డైలాగులతో సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆద్యంతం నవ్వించాడు. నరేష్ తన కెరీర్లోనే అత్యుత్తమమైన నటనను ఈ చిత్రంలో ప్రదర్శించారు. మోనాల్ గజ్జర్ కూడా సూపర్బ్ గా ఉండటమే కాదు చలాకీగా నటించింది. జయప్రకాశ్ రెడ్డి, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్ మరియు ఎం.ఎస్ నారాయణ నటన అందరినీ ఆకర్షిస్తుంది. వారి గెటప్పులే వీక్షకులను కడుపుబ్బా నవ్వించేస్తాయి.
జెఫ్ఫా రెడ్డి పాత్రలో బ్రహ్మానందం కేక. హేమ మరియు కోవై సరళ తమ పరిధి మేర నటించాగా శ్రీనివాస రెడ్డి ఖలేజాలోని సిద్ద పాత్రకి పేరడీగా రూపొందించిన పాత్రలో బాగా నవ్వించారు. ఫిష్ వెంకట్ మరియు రఘుబాబు ఓకే.
ఇక ఈ మూవీ స్పెషాలిటీ దర్శకులు ముందే చెప్పినట్టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాలను అందరూ మెచ్చుకునేలా పేరడీ చేయడం హైలైట్. అలాగే ఏ ఒక్క పేరడీ సన్నివేశం కూడా ఎవ్వరినీ కించపరిచేలా లేకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. అలాగే సినిమాలో ముఖ్యంగా రెండు పేరడీ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి టీవీ యాంకర్ ఓంకార్ మీద తీసిన పేరడీ మరియు తొడ కొట్టడం అనే కాన్సెప్ట్ మరొకటి. ముఖ్యంగా ఓంకార్ మీద చేసిన పేరడీ సన్నివేశానికి ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతారు. ఆ సన్నివేశాల్లో పోసాని కృష్ణ మురళి కూడా బాగా నవ్వించారు. మొత్తం సినిమా వేగంగా ముందుకెలుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం మంచి కామెడీతో ఎంతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. కామెడీ సినిమా తీయడంలో భీమనేని శ్రీనివాస్ రావు పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
విజయానికి ప్రతిబంధకాలు :
సినిమా విజయం మీద మరీ అంతగా ప్రభావం చూపే మైనస్ పాయింట్లు పెద్దగా లేకపోయినప్పటికీ క్లైమాక్స్ కి చేరుకునే సరికి కొంత వేగం మందగించినట్టు అగుపిస్తుంది. బాగా హైలైట్ కావాల్సిన ఒకానొక సన్నివేశంలో కామెడీ కొంచెం తగ్గింది. కోర్ట్ ఎపిసోడ్ మీద మరింత శ్రద్ద వహించాల్సిందనిపిస్తుంది. చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రానికి పాటలు మరొక మైనస్ గా చెప్పుకోవాలి. సినిమాలో ఒక్క మొదటి పాట తప్ప మిగాతా అన్ని పాటలు అంత ఎంటర్టైనింగ్ గా లేకపోగా కథలో స్పీడ్ బ్రేకర్ల లాగా అడ్డుపడతాయి. అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ మధ్య రొమాంటిక్ ట్రాక్ సరిపోలేదు. ఇక కొండవలస ఎల్.బి శ్రీ రామ్ పాత్రలు ఓ మోస్తరు ప్రయోజనాన్నిచ్చాయి.
టెక్నికల్ వర్క్ :
సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ చిత్రానికి డైలాగ్స్ లో పంచ్ పడింది. శ్రీ వసంత్ ఓకే. ద్వితీయార్థంలో ఎడిటింగ్ పేలవంగా ఉంది. నిర్మాణంలో ప్రామాణిక విలువలున్నాయి.
బాటమ్ లైన్ :
సినిమా చూడండి.. ఎంజాయ్ చేయండి...సరదాగా...
...avnk