చిత్ర పేరు : ‘యముడికి మొగుడు’
విడుదలతేదీ : 27.12.2012
బ్యానర్ : ఫ్రెండ్లీ మూవీస్
కథామూలం : జయసిద్ధు,
మాటలు : క్రాంతిరెడ్డి సకినాల,
సంగీతం : కోటి,
కెమెరా : కె.రవీంద్రబాబు.
నిర్మాత : చంటి అడ్డాల
దర్శకత్వం : ఇ.సత్తిబాబు
నటీనటులు: నరేష్, రిచా పనయ్, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్, నరేష్, చలపతిరావు, కృష్ణభగవాన్, భరత్, రఘుబాబు తదితరులు.
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25
పరిచయం :
ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ‘యముడికి మొగుడు’ సినిమా టైటిల్ తో ఈ దఫా.. ప్రొడ్యూసర్స్ పాలిట మినిమం గ్యారంటీ హీరో అల్లరి నరేష్ ముందుకొచ్చాడు. కుల,మతాంతర వివాహాలు జరుగుతోన్న ప్రస్తుతకాలంలో లోకాంతర వివాహాం అనే థీంతో ఈ సినిమా తెరకెక్కింది. సోషియో ఫాంటసీ నేపధ్యమున్న కథలో అల్లరి నరేష్ నటించటం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ యముడికి మొగుడెలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం.
చిత్రకథ :
బతికుండానే హీరో పైలోకానికి కెందుకెళ్ళాడు. అసలు యమలోకంలో యముడి కూతురినే ఎందుకు ప్రేమించాడు? బ్రహ్మ అతడి తలరాత అలాగే ఎందుకు రాశాడు అనే అనే ప్రశ్నలకు జవాబే క్లుప్తంగా ఈ సినిమా... ఇక కథలోకి వెళితే.. బ్రహ్మ చేసిన పొరపాటు వల్ల పుట్టిన నరేష్ (నరేష్) కి నుదిట రాత అనేది ఉండదు. దాంతో అతను దైవుళ్ళతో సమానంగా ఏది కోరుకుంటే అది జరిగే శక్తి పుట్టకతోనే వస్తుంది. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఈ తరుణంలో నారదుడి మాయ వల్ల యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్) భూమి మీదకు వచ్చి... నరేష్ చేత మెళ్లో పూల దండ వేయించుకుంటుంది. దాంతో పూల దండ వేసిన వాడే తన భర్త అని.. తన భర్తకోసం తపిస్తూ ఉంటుంది. విషయం తెలియని నరేష్ ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నిస్తూనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన కూతురు ఓ మానవుడుతో జీవితం పంచుకుంటోందని తెలిసిన యముడు... భూమి మీదకు వచ్చి ఆమెను తనతో తమ లోకానికి తీసుకు వెళ్లతాడు. అప్పుడు నరేష్ ఏం చేసాడు. అనేది చిత్రంలోని కీలకాంశం.
విశ్లేషణ :
ముఖ్యంగా చెప్పాల్సిందేమంటే.. దర్శకుడు స్క్రిప్టుపై సరైన శ్రద్ద పెట్టకపోవటంతో సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఫస్టాఫ్.. పంచ్ డైలాగులు, మంచి కామెడీతో ఫన్ చేసినప్పటికీ సెకండాఫ్ లో బోర్ కొట్టించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డల్ గా, పేలవంగా తేలిపోయింది. యముడు కూతురు యమజ కి అసలు వ్యక్తిత్వం ఉన్నట్లు చూపలేదు. యముడు.. పాత్రను స్త్రీ లోలుడుగా...పాపులుగా వచ్చిన స్త్రీలకు లైన్ వేస్తూ, మందు కొడుతూ ఉండటం అంతగా రుచించలేదు. చిత్ర గుప్తుడు పాత్ర ద్వంద్వార్దాలు పలకటమే జీవితాశయంగా సాగింది. . ఇక ప్రీ క్లైమాక్స్ నుంచీ టీవి సీరియల్ సెంటిమెంట్ క్రియేట్ చేయటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది.
నటీనటుల పనితీరు :
హీరో అల్లరి నరేష్ ఎప్పటిలాగే కామెడీ పండించాడు. అతని పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. ఆడపిల్ల గెటప్ లో అదుర్స్ అనిపించాడు. హీరోయిన్ రిచా పనయ్ నటన ఓ మోస్తరుగా సాగింది. బాగా వళ్లు చేసిన రమ్యకృష్ణ అల్లుడా మజాకాలో అత్తో..అత్తమ్మ కూతురో పాటకు స్టెప్స్ వేస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. షియాజీ షిండే యముడి పాత్రలో పెద్దగా రక్తికట్టించలేదు. హీరో తండ్రిగా చంద్రమోహన్ నటన రెగ్యులర్. తణికెళ్ల భరిణి రొయ్యలనాయుడిగా నెగిటివ్ పాత్ర లో మరీ రెచ్చిపోయాడు. రఘుబాబు పాత్ర లో హాస్యం అక్కడక్కడే పేలింది. మాస్టర్ భరత్ యంగ్ భరత్ అయ్యాడు. మిగతా నటీనటులందరూ వారి పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం :
దర్శకుడి పనితనంలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. సెకండాఫ్ లో కథనాన్ని నడపటంలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. కేవలం యముడ్ని అడ్డం పెట్టుకుని సినిమాని పూర్తి చేద్దామనుకున్నాడు. కెమెరా వర్క్ సోసోగా ఉంది. ఎడిటింగ్ కి ఇంకా పని చెప్పాలి. గ్రాఫిక్స్ వర్క్ ఫర్వాలేదు.
చివరి మాట :
యముడికి మొగుడయ్యాడో లేదో అటుంచితే. ప్రేక్షకులకు మాత్రం నరకలోక సందర్శన జరిగింది.
...avnk