సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారమైనవి గాలి, నీరు, నేల. ఈ మూడింటిలో జలం తర్వాతే జీవకోటి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. జలాధారాలతోనే నాగరికతను రూపు సంతరించుకుందని సప్తరుషులు సైతం పేర్కొన్నారు. అంతటి విశిష్టత ఉన్న జలాన్ని దేవత రూపానిచ్చి తల్లిగా ఆరాధించడం ఒకప్పుడు హిందూ సాంప్రదాయంగా ఉండేది. అందుకోసం నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తున్నాం. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రకారం నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.
పుష్కరుడి గాథ:
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.
బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం.
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
నది రాశి
గంగా నది - మేష రాశి
రేవా నది (నర్మద) - వృషభ రాశి
సరస్వతీ నది - మిథున రాశి
యమునా నది - కర్కాట రాశి
గోదావరి - సింహ రాశి
కృష్ణా నది - కన్యా రాశి
కావేరీ నది - తులా రాశి
భీమా నది - వృశ్చిక రాశి
పుష్కరవాహిని/రాధ్యసాగ నది - ధనస్సు రాశి
తుంగభద్ర నది - మకర రాశి
సింధు నది - కుంభ రాశి
ప్రాణహిత నది - మీన రాశి
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
కృష్ణవేణి (కృష్ణా) నది:
పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత ఆలంపూర్ కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమలకొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి.విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
పుట్టుకపై పురాణాలేమంటున్నాయి :
పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పశ్చిమకనుమల్లో సహ్యాద్రిపైన ఒక యజ్ఞం చేయతలపెట్టాడు. ఆయన మొదటిభార్య అయిన సరస్వతి అక్కడకు చేరడానికి సమయం మించడంతో, విష్ణువు, పరమశివుని సలహాపై ఆయన రెండో భార్య అయిన గాయత్రిని ప్రక్కన కూర్చోబెట్టుకుని క్రతువు ఆరంభించారట. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న సరస్వతిదేవి ఆగ్రహం చెంది అక్కడున్న త్రిమూర్తులతో సహా అక్కడున్న వారందరినీ నదులుగా మార్చివేసింది. అప్పుడు విష్ణువు కృష్ణానదిగాను, శివుడు వేణీ నదిగానూ, బ్రహ్మ కాకుద్మతీ నదిగాను మారి ఈ త్రిమూర్తులు కలిసి పశ్చిమ కనుమల్లో ప్రవహించారు.
మిగిలిన దేవతలు, ఋషులు నదులుగా మారి కృష్ణలో కలిశారు. నాకంటే చిన్నదైన గాయత్రీ బ్రహ్మదేవునికి దక్షిణభాగంలో నా స్థానంలో నాకంటే చిన్నదైన గాయత్రీ బ్రహ్మదేవునికి దక్షిణభాగంలో నా స్థానంలో దీక్షాపరురాలై కూర్చింది కనుక ఈమె ఎప్పుడూ లోకంలో జనులకు కనబడని శరీరంతో నదీ రూపాన్ని పొందుగాక అని సరస్వతీ దేవి శపించింది. నన్ను వృధాగా శపించావు కనుక నీవు కూడా నదీ రూపాన్ని పొందుతావని సరస్వతిని శపించింది గాయత్రీదేవి.
ఈ గాయత్రీ, సరస్వతీ రెండు నదులు పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమించి సావిత్రి నది అని పేరు పొందాయి. సహ్యాద్రిపై బ్రహ్మ తపస్సు చేసిన చోట బ్రహ్మగిరి. వేదాలు మూర్తి రూపం పొంది శివుని స్తుతించిన స్థలంలో వేదగిరి ఆ వేదగిరి దగ్గర కృష్ణపరమాత్మ అశ్వత్థరూపం దాల్చాడని చెబుతారు. అలాగే మహర్షులు పరమశివుణ్ణి స్తుతించగా ఆయన లింగాకారంలో అక్కడ వెలిశాడని అక్కడ గల ఉసిరిక వృక్షం నుండి వేణీ నది అవతరించి కృష్ణానదిలో కలిసి కృష్ణవేణిగా ఏర్పడిందని పురాణాలు చెపుతున్నాయి.
కృష్ణమ్మ పుష్కరాలు:
దేవగురువైన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినపుడు మనకు ఈ కృష్ణానదీ పుష్కరాలు వస్తాయి. శ్రీ దుర్మిఖి నామ సంవత్సరం దక్షిణాయణం, వర్ష రుతువు, శ్రావణ మాస, శుక్ల అష్టమి, తత్కాల నవమి, గురువారం, అనురాధ నక్షత్రం, బ్రహ్మయోగ సమయం అనగా రాత్రి 9.28 నిమిషాలకు ప్రారంభమైనది కనుక 12-08-2016 నుంచి 12 దినములు అనగా 23-08-2016 వరకూ త్రికోటి సహిత కృష్ణవేణి పుష్కరాలు జరుగును.
శ్లో|| కన్యారాశిగతే దీవే కృష్ణవేణి నదీ తటే,
స్నానం దానం తథా క్షౌరం త్రికోటికుల ముద్ధరేత్
ఈ పుష్కర కాలంలో ఎవరైతే స్నానం చేసి, పితృదేవతలకు, పిండప్రదానం, క్షురకర్మలు ఆచరిస్తారో వారు త్రికోటి కులాలను ఉద్ధరించిన వారవుతారని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. కలియుగంలో పాపభూయిష్టులై ఉండే జీవులకు తరుణోపాయం ప్రసాదించమని బ్రహ్మ విష్ణువుని ప్రార్థించసాగాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు తన అంశతో కృష్ణానదిని ఉద్భవింపచేసి, ఈ నీటిలో స్నానం చేసిన ప్రాణకోటికి పాపనివృత్తి కలుగుతుందని అనుగ్రహించాడు. మహావిష్ణువు అంశంతో ఉద్భవించిన ఈ కృష్ణానదిలో తాను లింగరూపుడై ఉంటాననీ, ఈ పవిత్ర జలాలతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి సాయుజ్యమిస్తానని పరమశివుడు వరం ఇచ్చాడు.
తెలుగు నేల ఒడ్డున ప్రముఖ ఆలయాలు:
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి
01) మల్లికార్జున ఆలయం - శ్రీశైలం
02) అమరేశ్వర స్వామి ఆలయం - అమరావతి
03) దుర్గ మల్లేశ్వర్ ఆలయం - విజయవాడ
04) మెట్టపల్లి నరసింహ స్వామి ఆలయం - మెట్టపల్లి(నల్గొండ జిల్లా)
05) శివ మరియు నరసింహ స్వామి ఆలయం - వడపల్లి
06) సంగమేశ్వర ఆలయం - అలంపూర్
వీటితోపాటు వేదాద్రి, మోపిదేవి, హంసలదీవి, సీతానగరం(గుంటూరు జిల్లా) లలో కూడా భక్తులు అధికంగానే తరలివస్తుంటారు
పుష్కర ఘాట్ లు:
కృష్ణా నది తెలంగాణ లో నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ రెండు జిల్లాలలోనే కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి.
తెలంగాణ పుష్కర ఘాట్లు ..
మహబూబ్ నగర్ జిల్లాలో : జూరాల, బీచ్ పల్లి, రంగాపూర్, అలంపూర్, నంది అగ్రహారం, చింతరేవుల, నందిమల (నారాయణ్ పేట్), కృష్ణ, పసుపుల మరియు పంచదేవ్ పాడు (ముక్తల్), చెల్లెపాడ్ (వీపనగండ్ల), జట్ప్రోలె (వీపనగండ్ల), సోమశిల (కొల్లాపూర్), మల్లేశ్వరం, మంచాలకట్ట మరియు లింగాల.
నల్గొండ జిల్లలో : నాగార్జున సాగర్, వడపల్లి (దామరచర్ల మండలం) మెట్టపల్లి మరియు సమీపాన ఉన్న 5 ఆలయాలు(మల్లె చెరువు మండలం), ఉట్లపల్లి (పెద్ద వుర మండలం), అడవిదేవులపల్లి(దామరచర్ల), మహంకాళిగూడెం(నేరేడుచర్ల).
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ పుష్కర ఘాట్లు:
కర్నూలు జిల్లాలో : సంగమేశ్వరం, శ్రీశైలంగుంటూరు జిల్లాలో : అమరావతి , హరిశ్చంద్ర పురం(తూళ్లూరు మండలం), తాళ్లయ్యపాలెం (తూళ్లూరు మండలం) , సీతానగరం (తాడేపల్లి మండలం) , రెంటిచింతల, పెనుముడి (రేపల్లె మండలం), చిలుమూరు(కొల్లూరు మండలం).
కృష్ణా జిల్లాలో : జగ్గయ్యపేట, ఇబ్రహీం పట్నం, విజయవాడ, ఘంటసాల, పామిడిముక్కల, మచిలీపట్నం, చందర్లపాడు, కంచికచెర్ల, పెనమలూరు, తోట్లవల్లూరు, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు లలో ఏర్పాటు చేసిన ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చు.
పుష్కర సమయంలో 12 రోజులు చేయవలసిన దానాలు.
మొదటి రోజు;- సువర్ణ దానం, రజితము దానం, ధాన్య దానం , భూదానం చేయాలి.
రెండవరోజు;-వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
మూడవ రోజు;- గుడ(బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
ఐదవ రోజు;-ధాన్యదానం , శకట దానం,వృషభదానం, హలం దానం చేయాలి.
ఆరవవ రోజు;-ఔషధదానం, కర్పూరదానం,చందనదానం, కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు;- గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
ఎనిమిద రోజు;- చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు;-పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.
పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు;-తిల(నువ్వులు)దానం చేయాలి.
కాగా, కృష్ణా పుష్కరాల హెల్ప్ లైన్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కర యాత్రికులకు 8333981170 టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులో ఉంచారు.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more