సంభోగమనే మాట ఎత్తితే ఛీ చీ అది అనగూడని మాట, నలుగురిలో చెయ్యగూడని ప్రస్తావన, పత్రికలలో రాయగూడని, పిల్లలు చదవగూడని పదప్రయోగం అని పెద్దలు ఆక్షేపిస్తారు. కానీ 'సంభోగం' అనే పదంలో 'ఇద్దరూ ఆనందాన్ని సమానంగా పంచుకునేది' అనే అర్థం ఉంది. అది తప్పు ఎలా అవుతుంది? ఈ విషయం మనుషులలో ముఖ్యంగా పురుషుల మనసులోకి ఇంకినప్పుడు అత్యాచారాలు తగ్గిపోయే అవకాశం ఉంది.
మహిళల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి?
కేవలం సంభోగమంటే అర్థం తెలియకపోవటమే కాదు. పురుషుల, స్త్రీల శరీర నిర్మాణంలో తేడా ఉన్నట్లుగానే వాళ్ళ మానసిక ప్రవృత్తిలో కూడా తేడా రావటమే అసలు కారణం. స్త్రీ శరీరమంతా శృంగారానికి ఉపయోగించేదే అనేది పురుషులకున్న పెద్ద తప్పు ఆలోచన. దాని వలన అవతలివాళ్ళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా, వాళ్ళ కోరికలకు విలువనివ్వకుండా శృంగారమంటే కేవలం పురుషులు అందిపుచ్చుకునేదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. స్త్రీ అంగాంగ వర్ణన, చిత్రాలలో ఆడవాళ్ళ వివిధ భాగాలను ప్రత్యేకంగా చూపించటం వలన శృంగారం మీద దురభిప్రాయాలు బాగా ఏర్పడ్డాయి. ఆడవాళ్ళకే కాదు ఎక్కడబడితే అక్కడ నొక్కి ఏ సమయంలో పడితే ఆ సమయంలో కోరిక తీర్చమని వేధిస్తే మగవాళ్ళకు కూడా రోత పుడుతుంది. అటువంటిది, బలవంతం చేసినట్లయితే అది నరక యాతనే అవుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా శృంగారమనేది ఇచ్చేది కాని తీసుకునేది కాదు. చిన్నపిల్లలు చాక్లెట్ తింటుంటే పెద్దవాళ్ళకి తృప్తి ఎందుకు వస్తుంది. అది వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటున్నందుకు కానీ వాళ్ళ చాక్లెట్లలో పాలు పంచుకున్నందుకు కాదు. వాళ్ళను ఆనందపరచామనే తృప్తి పెద్దవాళ్ళకు వాళ్ళు తిన్నదానికంటే ఎక్కువ తృప్తినిస్తుంది. అలాగే శృంగారంలో కూడా భాగస్వామిని మెప్పించటంలో ఆనందం ఉంటుందని అందరికీ తెలుసు. అయినా ఆ తప్పు జరుగుతోందంటే అది అవగాహనా రాహిత్యం కంటే ఇంకా ఏదో నిగూఢమైన కారణం ఉంది.
అందుకు మార్గాంతరాలున్నాయి.
దర్మపాలనకు, ఆచరణలో సన్మార్గానికి పేరుగాంచిన భారత దేశంలో వరుసగా జరుగుతున్న మహిళల మీద అత్యాచారాలు ప్రతి ఒక్కరినీ సిగ్గుతో తల వంచుకునేట్టుగా చేస్తున్నాయన్నది నిజం. దానికి తోడు భయం కూడా చోటు చేసుకుంటోంది. రేపొద్దున్న వార్తలలోకి ఎక్కే అమ్మాయి మన అమ్మాయే అయితే- అనే బెరుకు తెలియకుండానే వచ్చేస్తోంది.
మౌలికంగా మగపిల్లలకు శృంగారం మీద సరైన అవగాహన లేకపోవటమే అసలు కారణం. ఆ మాట చెప్పే సరికి శృంగారం మీద అవగాహనను పెంచటమనే వ్యాపారం చేద్దామన్న భావనతో ముందుకొచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని ఒక పాఠ్య భాగంగానే లేకపోతే ప్రత్యేక శిక్షణగానో తయారు చెయ్యనక్కరలేదు. శృంగారం మీద సరైన అవగాహన అంటే అందులో అతి ముఖ్యమైన భాగం ఆడవాళ్ళు ఆటబొమ్మలు కారని తెలియచెప్పటం.
1. భారతీయ సంస్కృతికి మూలాలైన మన గ్రంధాలను విస్మరించటం ఒక కారణం.
నీతిని కథల రూపంలో మనకు చెప్తూ వచ్చిన పురాణాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. వాటిని చదివే ఓపిక, సమయం ఇప్పుడు ఎవరికీ లేదు. చదువుకునే సమయంలో చదువు తప్ప మరే ఆలోచనా రాగూడదు. ఎందుకంటే డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్ వేర్ వృత్తులకు చెందిన ఉద్యోగాలను సంపాదించాలంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చదువుకే పూర్తిగా అంకిమైపోవాలి. అందులో నీతిని ప్రబోధించే కథలు ఎక్కడా ఉండవు. ఆ తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో వివిధ శిక్షణలు పొందాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా మంచి ఉద్యోగం కోసం నిరంతరం కృషి చేయాలి. ఉద్యోగంలో ఒత్తడి, పెళ్ళి, సంసారం ఇలా సామాన్య మానవులకు మన ప్రాచీన గ్రంధాలను చదివటానికి సమయం లేదు. ఎవరైనా వాటివైపు మొగ్గు చూపిస్తే వాళ్ళని అవహేళన చేస్తారేమో అన్న భయం కూడా జాస్తిగానే ఉంటుంది. పూర్వకాలం పెద్దలకు మాత్రమే అని ఉన్న సినిమాలకు పోయినప్పుడు, అటువంటి పుస్తకాలను చదివేటప్పుడు ఎవరి కంటా పడగూడదని అనుకునేవారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటానికి బెరుకు చూపించటం జరుగుతోంది.
2. వినోదం పంచటంలో అత్యధికంగా భాగస్వామ్యం వహిస్తున్న సినిమాలు.
సినిమాలలో ఇతివృత్తం కేవలం శృంగారం, హింసాత్మక చర్యల మీద ఆధారపడివుంటోంది. మంచితనం, మానవత్వం, త్యాగం, దేశభక్తి, విద్యుక్త ధర్మం, సాటిమానవుల మీద ప్రేమాభిమానాలు ఇలాంటివి ప్రభోదించే కథలతో సినిమాలు ఎందుకు నిర్మించరు అని అడగటం అనవసరమే. అవి నడవవు అని నిర్మాతల ఉద్దేశ్యం. ప్రేక్షకులు వాటినే కోరుకుంటున్నారు అని అంటారు. అయితే వాళ్ళు వాటిని కోరుకునేట్టుగా చేసిందెవరు. వాళ్ళకి అటువంటి కథలనే ఆదరించే వ్యసనాన్ని కలుగజేసిందెవరు- తమ వ్యాపారాభివృద్ధి కోసం సినిమా నిర్మాత దర్శకులే.
మార్కెట్ లోకి అసలు మత్తు పదార్థాలే రాకపోతే ఆ వ్యసనాలు కలిగివుండేవా. అధిక పెట్టుబడితో సినిమా నిర్మాణం చేసి దాన్ని మళ్ళీ లాభంతో సహా తిరిగి పొందుదామనుకునే సినీ నిర్మాతలకు యువతను ఆకర్షించే విధంగా సినీ నిర్మాణం చెయ్యాలనే తపనతో హీరోగా చిత్రీకరిస్తున్నవాళ్ళ చేత ఒంటి చేత్తో పది మందిని మట్టి కరిపించినట్లుగా చూపిస్తున్నారు. ఐటమ్ సాంగ్ పేరుతో ఉర్రూతలూగించే నృత్యాలు చేయిస్తున్నారు.
దుష్ట పాత్రల మీద కధానాయకుడు చెయి చేసుకోవటం, ప్రాణాలు తీయటం లాంటివి సమంజసంగా కనిపించేందుకు దుష్ట పాత్రలతో అతి నికృష్టమైన కార్యాలు చేయిస్తున్నారు. విలనంటే చుట్టూ ఆడవాళ్ళు మాలిష్ చేస్తూ, సమయంతో సంబంధం లేకుండా మద్యపానం చెయ్యటం, పిచ్చి కోపం చూపించి అందులో ఎవరినిబడితే వాళ్ళని పొడిచి చంపటం ఇవన్నీ యువత మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఆలోచించండి. సినిమాలో హీరో ఎంత మంచివాడైనా, ఆ హీరో దగ్గర అందరినీ కొట్టి హీరో అనిపించుకోవటం, విలన్ దగ్గర అతి విలాసవంతంగా కనిపించే జీవితంలో ఆడవాళ్ళని ఆటబొమ్మలుగా భావించి ప్రవర్తించటం ఇవీ యువత అందిపుచ్చుకునే లక్షణాలు. ఇంటర్నెట్ ద్వారా స్వేచ్ఛగా లభిస్తున్న వీడియోలు కూడా యువతను పెడదోవను పట్టిస్తున్నాయి.
3. పాశ్చాత్య ధోరణిలో జీవన శైలికి మోజు చూపించటం.
సినిమాలు, టివి షోలు చూసి పాశ్చాత్య జీవితమంటే కేవలం డేటింగ్, స్వేచ్ఛగా తిరగటం అనుకుంటోంది యువత. మన సంస్కృతిలో, జీవన శైలిలో పాశ్చాత్య జీవన శైలిని ఇరికిద్దామని చూస్తే అది విష ఫలితాలే ఇస్తుంది. వేగవంతమైన జీవన విధానంలో పాశ్చాత్యులను రోజూ ఇల్లు కడిగి ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమలు అద్ది అప్పుడు కాని బయటకు పోగూడదంటే వాళ్ళకి కుదురుతుందా. మన దేశంలోనే ఇప్పుడది కుదరదే. అలాంటిదే మన సంస్కృతికి పాశ్చాత్య విధానాన్ని జోడించటమంటే.
4. సినిమాలు, టివి ల వలన ప్రభావం ఎంతవరకు పోయిందంటే,
ఆడవాళ్ళు కూడా తాము మగవాళ్లను ఆకర్షించటానికే పుట్టినట్టుగా భావించేవాళ్ళు తయారయ్యారు. కట్టూ బొట్టూ సినిమాల పంథాలోనే జరుగుతున్నాయి. కానీ ఆ సినిమాలలో పనిచేసే వాళ్ళు కూడా ఏ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కో లేదా సినిమా వేడుకలకో బయటకు వచ్చినపుడు సాధారణ దుస్తులలో రావటం గమనిస్తే అంతకు ముందు అది కేవలం సినిమాకోసం చేసిందే అని అర్థమౌతుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ సహజం. కానీ దాన్ని పెంచుకుందామనే ఆలోచనతో చేసే చేష్టల వలన సినిమాలో చూపించిందంతా నిజమేనేమో అనే భావన మగపిల్లలలో కలిగే అవకాశం ఉంది. అందువలన సమాజంలో మార్పు తేవాలనే యజ్ఞంలో ఈ విషయంలో స్త్రీల సహకారం కూడా కావాలి.
దీన్ని చాలా మంది మహిళలు అంగీకరించకపోవచ్చు. దుస్తుల వలనే ఆకర్షించబడ్డట్లయితే తలనుంచి పాదాల వరకు ముసుగులో ఉన్న 50 ఏళ్ళ యువతి మీద అత్యాచారం ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు కొందరు. సరిగ్గా ఆలోచిస్తే అర్థమౌతుంది- ఆకర్షణ కలిగింది మరేదో సినిమానో లేక వీడియోనో చూసి, అవకాశం దొరికింది ఆ సమయంలో అని.
5. మహిళల మీదనే అత్యాచారం జరగటం లేదు.
పురుషల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ కొన్నే బయటపడుతున్నాయి. అయితే అవి కూడా పురుషులు చేస్తున్నవే. జైళ్ళల్లో, స్కూళ్ళలో, చివరకు తిరుపతి వేద పాఠశాలలో కూడా చిన్న పిల్లల మీద అత్యాచారం జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
అంటే దీనికి కారణం అవగాహన లేకపోవటం ఒక్కటే కాదు, సినిమాలు వీడియోల వలన రెచ్చి పోయే కోరికలను మనసులో అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసినా అదను దొరికినపుడు అవకాశం కుదిరినపుడు అవి సాధారణంగా ఉండేదానికంటే ఎక్కువ ప్రమాణంలో మనిషిని మానసిక దౌర్బల్యానికి గురిచేసి పర్యవసానం కూడా ఆలోచించకుండా ఉన్మాదిలా ప్రవర్తించటానికి పురిగొలుపుతోంది.
ప్రభుత్వ ప్రమేయంతో మానసిక నిపుణులు, జీవితానుభవంగల పెద్దలు, సంఘ సంస్కర్తలు ముందుకు వచ్చి కనీసం భావి తరాలకైనా ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించి పటిష్టమైన ప్రణాళికలను రూపొందించ వలసిందే. అప్పుడే సరైన ఈ మానసిక రోగ నిర్ధారణ, అందుకు అవసరమైన చికిత్స ఏమిటనే నిర్ణయాలు జరుగుతాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more