Bjp followed congress way

BJP followed Congress way, State Reorganization Bill, Sushma Swaraj, Bharatiya Janata Party, Congress party, High drama in T Bill passage

BJP followed Congress way, State Reorganization Bill

భాజపా కూడా కాంగ్రెస్ మార్గంలోనే

Posted: 02/19/2014 09:01 AM IST
Bjp followed congress way

రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని లోక్ సభలో ప్రకటించినప్పుడు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు మోదీ రాహుల్ భాయ్ భాయ్ అని అరిచారు.  ఎంత జాగ్రత్తగా పదాలను ఎంపిక చేసి కూర్చి మాట్లాడినా, రాష్ట్ర విభజన బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ మార్గంలోనే పయనించిందన్న విషయం స్పష్టంగా అర్థమౌతోంది. 

సీమాంధ్ర ప్రజలకు కాని, నాయకులకు కానీ ఎక్కువగా బాధ కలిగించిన విషయమేమిటంటే వాళ్ళ ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు చేసేది వేరు ముందు ప్రకటించేది వేరుగా విషయాన్ని నానుస్తూ వచ్చినట్లు నటిస్తూనే కాంగ్రెస్ పార్టీ ధృఢమైన అడుగులతో విభజన బిల్లును ముందుకు తీసుకుపోవటం.  సోనియా గాంధీ ఏమీ పైకి చెప్పకపోవటం, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి చూస్తాం అని మాటివ్వటం,  కేంద్ర మంత్రులు ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు వివిధ రకాలుగా ప్రకటనలు చేస్తూ విషయాన్ని ముసుగులోనే నడిపిస్తుండటం తీరా నిర్ణయం తీసుకునేటప్పుడు పెట్టుకున్న ఆశల్లో ఏ ఒక్కటీ కనపడక, వాళ్ళ మాటలకు, ఆందోళనలకు, సూచనలకు విలువ ఇవ్వకుండా, వాళ్ళన గడ్డిపోచల్లా చూస్తున్న అధిష్టానం మీద కోపం, బాధా కూడా కలిగిస్తూ వచ్చాయి. 

అయితే అదే ధోరణిని భాజపా కూడా అనుసరించింది.  తెలంగాణా రాష్ట్రానికి మేము సానుకూలమే అంటూ చెప్తూ వచ్చిన భాజపా మధ్యలో సీమాంధ్రకు న్యాయం చెయ్యాలని, బిల్లును ఆ రూపంలో అంగీకరించబోమని, మూజువాణీ ఓటుని అనుమతించమని, రాష్ట్ర శాసనసభలో తిరస్కరించిన బిల్లుని పార్లమెంట్ లో ఎలా పెడతారని వ్యాఖ్యానాలు చేస్తూ, సీమాంధ్ర నాయకులకు స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేసింది. 

కానీ ఎప్పుడైతే తెలంగాణా బిల్లుకు మేము సిద్ధమే కానీ భాజపాయే అడ్డుపడుతోందన్న సంకేతాలు కాంగ్రెస్ నుంచి రావటం మొదలుపెట్టాయో భాజపా జాగ్రత్తగా అడుగులు వెయ్యటం మొదలుపెట్టింది.  సీమాంధ్ర నాయకులతో భేటీ అవుతూ వాళ్ళకి మేమున్నామని హామీ ఇస్తూ చివరకు పార్లమెంట్ లో రాష్ట్ర విభజనకు మా మద్దతు నిస్తున్నామని సుష్మా స్వరాజ్ ప్రకటించటం, వెంటనే సంఖ్యాబలం ఉందన్న వాదనతో బిల్లుని ఆమోదిస్తున్నట్లుగా స్పీకర్ మీరా కుమార్ ప్రకటించటం జరిగింది.  ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీ భాజపా ఒకరినొకరు విమర్శించుకోవటం కూడా జరిగింది.  కానీ కలిసే బిల్లు ఆమోదానికి పనిచేసారని స్పష్టంగా తెలుస్తూనేవుంది.

సీమాంధ్రలో తిరుగుతూ తెలుగు దేశం పార్టీతో కలిసి తెలంగాణా బిల్లు విషయంలో కాంగ్రెస్ ఆటలు సాగనివ్వమన్న సంకేతాలిస్తూ వచ్చిన భాజపా స్వరంలో గత వారం రోజులుగా మార్పు వచ్చింది.  దానితో తెదేపా కూడా భాజపాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.  అలా భాజపా కూడా కాంగ్రెస్ మార్గంలోనే సీమాంధ్రులను తప్పుదోవ పట్టించటం వాళ్ళకి అత్యంత బాధాకరమైన విషయంగా తయారైంది.  జరిగిన నష్టం కంటే నష్టం జరిగిన విధానం, మన సెంటిమెంట్లతో ఆడుకున్నారే అనే భావనే ఎక్కువ బాధను కలిగిస్తోంది సీమాంధ్ర నాయకులకు.

అందువలన మంగళవారం చెదురుమదురుగా సీమాంధ్ర ప్రాంతాలలో భాజపా కార్యాలయాల మీద దాడులకు ప్రయత్నాలు కూడా జరిగాయి.  వివిధ రకాల నిరసనలతో పాటు కాంగ్రెస్ పెద్దలతో, వివిధ పార్టీల నాయకులతో చేసిన భేటీలు, ప్రధాన ప్రతిపక్షమైన భాజపాకి పెట్టుకున్న మొరలు అన్నీ అరణ్య రోదనాలయ్యాయన్నది పెద్ద మనస్తాపంగా తేరుకోలేని షాక్ గా తయారైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles