Chiranjeevi introduced pawan in cinemas and politics

Chiranjeevi introduced Pawan in cinemas and politics, Pawan Kalyan Janasena party, Bharatiya Janata party, Telugu Desam party

Chiranjeevi introduced Pawan in cinemas and politics

చిరంజీవి ఆశీర్వాదం, తిరుగులేని స్క్రిప్ట్ తో పవన్

Posted: 03/22/2014 03:28 PM IST
Chiranjeevi introduced pawan in cinemas and politics

చిరంజీవి వలనే పవన్ కళ్యాణ్ కి సినిమాలలో అవకాశం దొరికిందన్నదానిలో ఎవరికీ అనుమానం ఉండదు.  దాన్ని నిలబెట్టుకున్నది పవన్ కళ్యాణే కానీ సినిమాలో ప్రవేశపెట్టింది మాత్రమే చిరంజీవే.  ఆ తర్వాత తనంతట తాను అభివృద్ధి చెంది తనకంటూ సొంత అభిమానులను సంపాదించుకున్నారాయన. 

అలాగే, పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం కూడా చిరంజీవి వలనే జరిగింది.  కానీ దాన్ని కూడా తనదైన పద్ధతిలో తనకు అనుకూలమైన సమయంలో ఉపయోగించుకుంటూ తనకున్న అభిమానులకు సంతృప్తి కరంగా, అప్పటికే ఎన్నో ఆశలతో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల నుండి కానీ పార్టీల నుండి కానీ విభేదాలు రాని విధంగా తన పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సమయాన్ని వృధా చెయ్యకుండా తన పార్టీ నినాదంతో 100 శాతం ఏకీభవించే జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపారు. 

తెలుగు హీరో పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేన ఆవిర్భావాన్ని ప్రకటించటమే తడవుగా పెద్దగా కష్టపడకుండానే భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో నేరుగా కలిసి తన మద్దతుని తెలపటం, ఆయన సంతోషంగా అంగీకరించటం జరిగిపోయింది. 

నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఇంత ప్రత్యేకత ఎలా లభించింది?

అదంతా పవన్ చేసిన ప్రసంగం వెనుక తయారైన స్క్రిప్ట్ మహాత్యం.  పార్టీ ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పటమే కాకుండా ఎన్నికలలో పోటీ చెయ్యటానికి ఇంకా సుముఖంగా లేనని, రాజకీయాల్లో అధికారాన్ని, ప్రభుత్వంలోహోదాను కోరుకోనని అనటం, అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ హఠావో అని పిలుపునివ్వటం జరిగింది.  మొదటి రెండిటి వలన ఎవరూ, ఏ పార్టీ కూడా ఆయనను ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో హానికారకంగా తలవరు.  చివరి అంశంతో భారతీయ జనతా పార్టీకి చేరువవటానికీ అవకాశం దొరికింది! 

పవన్ కళ్యాణ్ సినీ హీరోగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశవ్యాప్తంగా అగ్రతారలలో ఐదవ స్థానంలో నిలబడటం ఆయన ప్రాచుర్యానికి దోహదం చేసింది.   దానితో పాటు ప్రజారాజ్యం పార్టీలో యువ సారధిగా పనిచెయ్యటం, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండటం,  మళ్ళీ ఇప్పడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గళం విప్పటం కూడా పవన్ కళ్యాణ్ కి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 

జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం భాజపాతో చేతులు కలిపి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన తెలుగు దేశం పార్టీతో చేతులు కలపటానికి తయారుగా ఉన్నారు పవన్ కళ్యాణ్.  దానితో తెలంగాణా ప్రాంతంలో కూడా తెలుగు దేశం పాగా వెయ్యటానికి వాతావరణం అనుకూలంగా తయారౌతోంది.  పొత్తు కోసం హిరణ్యాక్ష వరాలు కోరిన భాజపా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వలన తగ్గిరావటానికి అవకాశం ఉంది. 

ఇటు తెలంగాణా అటు సీమాంధ్ర నాకు రెండు కళ్ళంటూ పెద్దమనిషి తరహాలో చెప్పే ప్రయత్నం చేసిన తెదేపా అద్యక్షుడు చంద్రబాబు అందరి విమర్శలకూ పాత్రులయ్యారు.  కానీ అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తే దానికి తిరుగులేని మద్దతు లభించింది.  అందుకు కారణం మళ్ళీ ఆయన ప్రసంగమే!

అంతేకాదు, కులమత ప్రాంతీయతలతో రాజకీయాలు చేస్తున్న ఈ కాలంలో పవన్ కళ్యాణ్ తను భారతీయుడనని, ఏ కులానికీ చెందినవాడను కానని అన్నారు.  సీమాంధ్రలో  ప్రస్తుతం కాపు వర్గానికి సంఖ్యాబలం ఎక్కువగా ఉంది.  కానీ వాళ్ళంతా ఇప్పటికే ఛిన్నా భిన్నమై తేదపా, వైకాపా లలోకి చేరిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఎలాగూ లాభించే అంశం కూడా కాదది. 

అందువలన, మంచి స్క్రిప్ట్ మంచి దర్శకుడిని నమ్ముకుని ముందుకెళ్ళే కధానాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కూడా అదే విధంగా చక్కటి స్కిప్ట్ చక్కటి డైరెక్షన్ లో ఇంతవరకు ముందుకు అడుగులు వేసారు. 

అలా సినీరంగంలోను, రాజకీయ రంగంలోనూ ప్రవేశపెట్టింది అన్న చిరంజీవి అయితే నిలదొక్కుకుంటున్నది మాత్రం తన సామర్థ్యంతో తాను సంపాదించుకున్న అభిమానకోటితోనే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles