హిమాచల్ ప్రదేశ్ లో కులు పర్యాటక ప్రాంతం శరీరాలకు, మనసుకి చల్లగా సేదదీర్చే క్షేత్రం. కానీ అక్కడకు విహారయాత్రకు వెళ్ళినవారి పాలిట మృత్యువుగా మారి, వాళ్ళ పార్థివ శరీరాలకోసం వేటాడవలసిన అగత్యం ఏర్పడింది.
కులు ప్రాంతంలో మండీ జిల్లాలోని బియాస్ నదిపైన కట్టిన ఆనకట్ట, దాని పక్కనే లార్జీ విద్యుత్ కేంద్రం ఉన్నాయి. ఉన్నట్టుండి ఆనకట్ట నుండి నీరు వదిలిపెట్టటం జరిగింది. అది కూడా 2820 క్యూసెక్స్ నీటిని 29 విడతలుగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 7.30 వరకు. నీరు వదిలిపెడుతున్నట్లుగా సూచనలేమీ ఇవ్వలేదు. నీరు వదలాలని మనసులో మెదిలింది, వెంటనే గేట్లు ఎత్తివేయటం జరిగింది. వాళ్ళ మనసులోని ఆలోచనను కనిపెట్టలేని విద్యార్థులు ఆ నదిలో కొట్టుకుపోయారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాలోట్ గ్రామానికి శరవేగంతో చేరిన నీరు అక్కడున్న విద్యార్థులను చుట్టపెట్టుకుని తీసుకునిపోయింది.
{besps}beasrivertragedy{/besps}
24 మంది విద్యార్థులతో పాటు ఆ టూర్ ఆపరేటర్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానికి కారకులెవరన్నది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తేల్చినవారెవరూ లేరు. ఆ నదిలో నీళ్ళు వదిలినవాళ్ళే హడావిడిగా దర్యాప్తులు నిర్వహించటం మావాళ్ళ తప్పేమీ లేదనటం జరిగింది. కానీ ఎన్నో ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాలు లేవు.
ఆ ప్రశ్నలు ఇవే-
1. అంత నీటిని అప్పుడు ఎందుకు వదిలారు?
2. జల విద్యుదుత్పాదనకోసం ఆనకట్ట కట్టి నిల్వచేసుకున్న నీటిని ఆ ఉద్యేశ్యం కోసం వాడాలి కానీ వదిలిపెట్టవలసిన అవసరమేమిటి?
3. జలాశయం నిండిపోయి ఆనకట్టకి ప్రమాదం వాటిల్లే సందర్భమేమీ రానప్పుడు నీటిని ఎందుకు వదిలిపెట్టవలసివచ్చింది?
4. నీటిని వదిలిపెట్టటం అవసరమైతే రాత్రిపూటే వదిలిపెట్టవలసినవారు పగటిపూట ఎందుకు వదిలారు?
5. నీటి దిగువన తిరిగే ప్రజలకు హెచ్చరికలు ఎందుకు చెయ్యలేదు?
6. జల విద్యుత్ కేంద్రాన్ని నిర్వహించేవారు ఏ నిర్వాకం చెయ్యటం కోసం నీటిని వదిలిపెట్టారు. అమాయకులను పొట్టన పెట్టుకోవటానికేనా?
7. దోషులను శిక్షించకుండా దర్యాప్తు పేరుతో మసిపూసి మారేడుకాయ చేసి విషయాలను ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేసారు?
8. లార్జీ ప్లాంట్ సామర్థ్యం 128 మెగావాట్ల విద్యుత్ అయితే దాని సామర్థ్యాన్ని 36 మెగా వాట్లకు ఎందుకు కుదించారు?
9. అలా సామర్థ్యాన్ని కుదించటానికే నీటిని వదిలిపెట్టారా?
10. నీటిని వదిలిపెట్టటం వలన నీరు వృధా కావటం లేదా?
11. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండి సామర్థ్యాన్ని తగ్గించుకోవలసిన అవసరమే వచ్చివుంటే మిగిలిన ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థల సామర్థ్యాన్ని 15 శాతం వరకు పెంచుకునేందుకు ఎలా వీలైంది?
12. ప్రభుత్వ సంస్థ విద్యుదుత్పత్తిని తగ్గించి ప్రైవేట్ సంస్థలకు మేలు చెయ్యటానికే నీటిని వదలవలసివచ్చిందా?
13. కర్చమ్ వాంగ్డూ విద్యుత్ కేంద్రం 100 మెగావాట్లు, అలెయిస్ డుహాంగన్ 192 వాట్ల విద్యుత్తును, ఎన్ జె పి సి ఏకంగా 1500 వాట్ల విద్యుత్ ను నిరాటంకంగా ఉత్పత్తి చేస్తుంటే లార్జీ డ్యాం దగ్గర స్థాపించిన ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కేంద్రం తన సామర్థ్యాన్ని 36 మెగా వాట్లకెందుకు తగ్గించినట్లు?
14. విద్యుదుత్పత్తిని నీటి ప్రవాహం దృష్ట్యా తగ్గించుకోవలసిన అవసరమే వస్తే అందరూ సమానమైన నిష్పత్తిలో తగ్గించుకోవాలి కానీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థకే ఆ అగత్యం ఏర్పడిందా?
15. ఇసుక మాఫియాకు అలా అప్పుడప్పుడూ నీటిని వదిలిపెట్టటం వలన ఇసుకమేటలు వేసి వాళ్ళ బొక్కసాలు నింపే అవకాశాలను పెంచుతుంటాయా?
16. అసలు ఆ నదివెంట రాకపోకలేమీ ఉండవు. కేవలం ఇసుక రవాణా కోసమే నిర్మించినట్లుగా రోడ్లు వేసివున్నాయెందుకు?
17. పగటిపూట నీటిని వదిలిపెట్టటంతో ఇసుక బాగా వచ్చి చీకటిపడకముందే ఇసుక మాఫియా తనపని కానిచ్చుకోవటానికి అవకాశం ఏర్పడుతుందా?
పై ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టాలంటే పైస్థాయి దర్యాప్తు సంస్థ చేపట్టినట్లయితేనే వారితో అది సాధ్యమౌతుంది.
హడావిడిగా చేసిన దర్యాప్తును హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి శాంతా కుమార్ విమర్శించారు. ఇంజినీర్ల నిర్లక్షమే పిల్లల ప్రాణాలు తీసిందని ఆయన అన్నారు. దర్యాప్తులో మాత్రం ఇంజినీర్ల తప్పేమీ లేదని గట్టిగా తేల్చి చెప్పారు. హెచ్చరికలు చెయ్యకుండా సమయాన్ని చూడకుండా నీటిని వదిలిపెట్టి అందులో వాళ్ళ తప్పేమీ లేదంటే మరి ఎవరి తప్పో కూడా తేల్చి చెప్పాలి కదా.
పై విషయాలన్నీ పరిశీలిస్తే పేరుకుపోయిన అవినీతే విద్యార్థుల ప్రాణాలను పోవటానికి కారణమని తెలుస్తోంది. అది ప్రైవేట్ సంస్థలను మేపటానికా లేక ఇసుక మాఫియాను ఉద్ధరించటానికా అన్నది దర్యాప్తులో తేలవలసిన విషయం. ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆ సంస్థ భారీ ప్రమాణంలో నష్ట పరిహారం చెల్లించాలి. అప్పటికీ ఆ లోటు తీరేది కాదు కానీ మొగ్గలోనే తుంచేసి వాళ్ళ కుటుంబీకులకు తీరని శోకాన్ని మిగిల్చినవారిని కఠినంగా శిక్షించటంతో వాళ్ళకి కాస్త ఊరటైనా కలుగుతుంది.
ఈ ఘటన మీద లోతుగా దర్యాప్తును సాగించినట్లయితే మరెన్నో అవినీతి కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.
జరిగింది ఇది-
హైద్రాబాద్ లోని V.N.R. Vignana Jyothi Institute of Engineering and Technology నుంచి 60 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కులు మనాలి లో పర్యటించటానికి వెళ్ళారు. దురదృష్టకరమైన ఆ ఘటన జరిగిన సమయంలో వాళ్ళు తాలౌట్ ప్రాంతంలో హనోగీ మాత్ ఆలయం దగ్గర నదీ తీరంలో ఫొటోలు తీసుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి నదిలో నీటి మట్టం పెరిగిపోయి వాళ్ళను ముంచివేసింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుంచి హెచ్చరికలేమీ లేకుండా ఉన్నట్టుండి నీరు చేరటంవలన ఈ ప్రమాదం జరిగిందని డెప్యూటీ కమిషనర్ దేవేష్ కుమార్ అప్పుడే తెలియజేసారు. ఆ నీరు లార్జి పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ నుంచి వదిలిని నీళ్ళని సీనియర్ రాష్ట్ర అధికారు రాకేష్ కన్వర్ కూడా ప్రకటించారు. జరిగినదానికి నిరసన చూపిస్తూ స్థానికులు పర్యాటకులు కాసేపు అక్కడ ఆందోళన చేసారు కూడా.
ప్రత్యక్ష సాక్షి హైద్రాబాద్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ విద్యార్థి రమణ్ తేజా చెప్పినదాని ప్రకారం మొత్తం 65 మంది ఇండస్ట్రియల్ టూర్ మీద అక్కడకు వెళ్ళారు. అక్కడ తక్కువగా ఉన్న నీటి మట్టంలో నిలుచొని ఫొటోలు తీసుకోవటం ప్రారంభించిన పది నిమిషాల తర్వాత ఫ్లడ్ గేట్లు వదిలిపెట్టారంటూ స్థానికుడు ఒకతను గట్టగా కేకలు వేసాడు. అయితే మిగతావాళ్ళకా విషయం చెప్పి వాళ్ళని బయటకు తీసుకునివద్దామనుకుంటే నీరు అప్పటికప్పుడే పెరిగిపోయింది. ఆ తర్వాత మూడు గంటల వరకు వాళ్ళని రక్షించటానికి ఎవరూ రాలేదని, పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని చెప్పాడతను.
దుర్ఘటన జరిగిన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకి 200 కి.మీ. దూరంలో కులు మనాలి జిల్లాల సరిహద్దులో ఉంది.
ప్రవాహం చాలా వేగంగా ఉందని, అందులో బ్రతికి ఉండటం కష్టమని, అందువలన ఇప్పుడిక వెతకటం కూడా వృధాయేనంటూ సాయంత్రం 7.00 కి అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ రాయ్ నదిలో కొట్టుకుపోయినవారిని వెదికే కార్యక్రమాన్ని తెల్లవారికి వాయిదా వేసారు.
కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, జరిగిన దానికి దిగ్భ్రాంతిని, విచారాన్ని ప్రకటించారు. వీరభద్ర సింగ్ దర్యాప్తుకి ఆదేశాలిచ్చారు, బాధ్యులను కఠినంగా శిక్షించమని ఆదేశించారు. కానీ క్రియారూపంలో తూతూ మంత్రంలా జరిగిన దర్యాప్తు, ఇంజినీర్ల తప్పేమీ లేదని, వాళ్ళు నోటితో ఇచ్చిన ఆదేశాలను పాటించారని మాత్రం తేల్చి చేతులు దులుపుకున్నారు.
శవాలను మాత్రం వారం రోజుల పాటు వెతుకుతూ అప్పుడొకటి ఇప్పుడొకటి బయటకు తీసారు. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ రెండు శాసనసభల్లోనూ చనిపోయిన విద్యార్థుల విషయంలో సంతాపాన్ని తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more