Alliance crumbles in maharashtra

BJP, Shiv Sena, alliance ends, Maharashtra, Devendra Fadnavis, congress, ncp

Shiv Sena, BJP and NCP Congress to fight Maharashtra polls alone

మహా అసెంబ్లీ సంగ్రామంలో బెడిసికొట్టిన పోత్తులు..

Posted: 09/26/2014 10:27 AM IST
Alliance crumbles in maharashtra

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఒంటరిగానే తలపడనున్నాయి. ఈ దఫా వచ్చిన ఎన్నికలు ఏ ముహుర్థాన వచ్చాయో కానీ.. రాజకీయ పార్టీల మద్య పెనవేసుకున్న ఏళ్ల నాటి స్నేహబంధాన్ని విడదీశాయి. శివసేన, బీజేపిల మైత్రితో పాటు కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య వున్న అనుబంధాన్ని కూడా తెలంచివేసింది. అక్టోబర్ 15న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒంటరిగానే తలపడనున్నాయి.

చిలికి చిలికి.. తెగదెంపుల వరకు..

ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లుగా కొనసాగుతున్న మైత్రిని బీజేపి, శివసేనలు తెంచుకున్నాయి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న ఒకే ఒక్క అంశం.. ఈ రెండు పార్టీల మధ్య తెగతెంపులకు కారణం అయ్యింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 130 స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ.. తమకు 155 కావల్సిందేనని శివసేన పట్టుబట్టాయి. అయితే, 'మహాయుతి' పేరుతో కొన్ని చిన్న పార్టీలతో ఓ కూటమిని ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఈ రెండు పక్షాలు.. వాళ్లకు ఎలా సీట్లు సర్దుబాటు చేయాలో అర్థం కాక.. ముఖ్యమంత్రి పదవిని ఎవరు పంచుకోవాలో తెలియక మొత్తానికి పొత్తు తెంచేసుకున్నారు.

మహాయుతి కూటమితోనే చెడిన బంధం

సీట్ల సర్ధుబాటు విషయమై ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొనింది. ఎట్టకేలకు సీట్ల సర్ధుబాటు జరిగిందని.. ఇక ఎన్నికల సంగ్రామానికి సిద్దం కావాలని నిన్న మధ్యాహ్నం పిలుపునిచ్చిన పార్టీలు.. రాత్రి తెగదెంపులు చేసుకున్నాయి. ఇందుకు మహాయుతి కూటమే కారణమని తెలుస్తోంది. బీజేపి, శివసేనలు దృష్టంతా సీఎం పదవిపై వుండడం.. దీంతో కొన్ని చిన్న పార్టీలతో ఏర్పడిన మహాయుతి కూటమికి కేవలం 7స్థానాలను మాత్రమే కేటాయించడం.. పార్టీల మధ్యనున్న మైత్రి బంధాన్ని దెబ్బతీసింది. తమకు కనీసం 18 స్థానాలను కేటాయించాలని లేని పక్షంలో తాము కూటమి నుంచి వైదోలుగుతామని ముందు నుంచి హెచ్చరిస్తున్న కూటమి పార్టీలు అన్నంత పనిచేశాయి. కూటమి పార్టీలకు సీట్లను పెంచాల్సిందిగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా కోరారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరాఖున 11 స్థానాలు ఇస్తామని శివసేన ప్రకటించింది. దానికి కూటమి పార్టీలు అంగీకరించలేదు. దీంతో తాము కూటమి నుంచి వైదోలుగుతున్నామని కూటమి పార్టీలు ప్రకటించాయి. దీంతో శివసేన తీరుపై మండిపడ్డ బీజేపి కూడా కూటమి నుంచి వైదొలిగి పాతికేళ్ల స్నేహబందాన్ని తెంచుకుంది. ప్రస్తుతం కూటమి పార్టీల పక్షాన బీజేపి నిలిచింది. శివసేనతో బంధాన్ని తెంచుకుని చిన్న పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

తెగిపోయిన కాంగ్రెస్ ఎన్సీల బంధం..

మరోవైపు కాంగ్రెస్ - ఎన్సీపీల మధ్య కూడా పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బంధం తెగిపోయింది. ఇప్పుడు రెండు కూటములలోనూ చీలికలు రావడంతో.. మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ కూటమి మాత్రం ఇప్పటికీ బాగానే ఉందని, సీట్ల పంపీణీ విషయంలో తమ మధ్య ఉన్న విభేదాలు త్వరలోనే తెగిపోతాయని ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ తొలుత ధీమా వ్యక్తం చేసినా.. అది ఏమాత్రం ఫలించలేదు. మహారాష్ట్రలో తమ బలాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తీరాలని కూడా ఆయన అన్నారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలూ వేటికవే విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దాంతో ఈసారి అక్కడ ఎన్నికల వ్యవహారం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ముఖ్యమంత్రి పదవిపై ఆశ తోనే..

రాష్ట్రంలో రెండు కూటములు విచ్ఛిన్నం కావడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సమితి అధినేత రాజ్‌ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎమ్మెన్నెస్‌ల పేర్లు ఎత్తకుండానే ప్రత్యర్థి పార్టీలకు పరోక్షంగా చురకలంటించారు. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ముఖ్యమంత్రి పదవి తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఆశపడుతున్నాయని, ఆ ఆశతోనే విడాకులు తీసుకున్నాయని, ఈ విడాకుల గురించి తర్వాత మాట్లాడతానన్నారు. ముందుగా రాష్ట్రాభివృద్ధిపై పార్టీలు దృష్టిపెట్టాలని హితవు పలికారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shiv Sena  alliance ends  Maharashtra  Devendra Fadnavis  congress  ncp  

Other Articles