Makara sankranti festival speciality

Makara Sankranti, Makara Sankranti updates, Makara Sankranti latest, Makara Sankranti festival, Makara Sankranti greetings, Makara Sankranti in andhra pradesh, Sankranti in Andhra, Andhra Sankranti celebrations, Sankranti 2015, pongal 2015, latest updates

Makara Sankranti festival speciality : telugu festival Makara Sankranti have many specialities and traditions. sankranti is also called as harvesting festive as all crops comes to farmers homes. Sankranti is three days festival first day called as Bhogi second day Makara Sankranti and third day Kanuma

ప్రత్యేకం : సంబరాల సంక్రాంతి

Posted: 01/13/2015 03:39 PM IST
Makara sankranti festival speciality

తెలుగు విశేష్’ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారి లోగిళ్ళలో సంబరాలను తీసుకొచ్చే పండగ సంక్రాంతి. ఆంధ్ర రాష్ర్టంలో అతి పెద్ద పండగగా జరుపుకునే సంక్రాంతికి అనేక విశిష్టతలు ఉన్నాయి. కొత్త అల్లుళ్ళ రాక, కోళ్ళ పందాల కోలాహలం, చేతికొచ్చిన పంటతో అన్నదాతల ఆనందం, వంటల ఘుమఘుమలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి ఎంతో సరదాగా సాగిపోయే పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము.

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడని తెలిసిందే. అలా మారే క్రమంలో ప్రతి నెలకూ ఒక సంక్రాంతి ఉంటుంది. కాని మకర సంక్రాంతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణంతో పుణ్యకాలం మొదలవుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే రాబోయే మంచి రోజులను తలుచుకుంటూ మకర సంక్రాంతి పేరుతో సంబరాలకు స్వాగతం పలుకుతారు. ఈ పండగకు ఉన్న ఇతర ప్రత్యేకతలతను చూస్తే. ప్రధానంగా ఇది పల్లెల పండగ అని చెప్పాలి. పల్లెటూళ్లే మన దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెటూరిలో ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయంపైనే. ఆరుగాలం కష్టపడి పండించిన పంట జనవరి సమయంలో చేతికి వస్తుంది. ధనలక్ష్మిని వెంట తీసుకుని ధాన్య లక్ష్మి ఇంటికి రావటంతో అన్నదాతలు సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు.

భోగి
మూడ్రోజుల పాటు జరుపుకునే పండగలో మొదట వచ్చేది భోగి. చలిని చీల్చుకుంటూ వచ్చే మంటలతో ఈ పండగ మొదలవుతుంది. తెల్లవారుతుండగా, ఇండ్ల ముందు, వీధుల్లో భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉండే పాత కర్రలు, అవసరం లేని చెక్క సామాన్లతో ఈ మంటలు వేస్తారు. అవసరం లేని వస్తువులు భోగి మంటలో వేసి తమ ఇంట్లోకి పండగతో కొత్త వస్తువులు తెచ్చకుంటారని దీని ఉద్దేశ్యం. అందంగా రంగవల్లులు వేసుకుని వాటి మద్యలో ఆవుపేడ, పూలతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టడం సాంప్రదాయం. వైద్య పరంగా కూడా క్రిములను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటాయని నిరూపితమైంది. ఈ పండగ రోజున భోగిపండ్లు పోయటం సంప్రదాయంగా వస్తుంది. రైతులు పండించే ధాన్యాలతో పాటు పండగ సమయంలో దొరికే రేగు పండ్లతో భోగి పండ్లను పోస్తారు. ఇలా పోసుకోవటం వల్ల సిరి సంపదలు ఇచ్చే ధాన్యరాశులకు కొదువ లేకుండా ఉంటుందని నమ్మకం. సాయంత్రం పూట మహిళలు బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవటం కూడా ఆనవాయితీగా వస్తుంది.

సంక్రాంతి
మూడ్రోజుల పండగలో ముఖ్యమైనది., మద్యన ఉండేది మకర సంక్రాంతి. సూర్యుడు ఈ రోజునే కొత్త రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇండ్లలో పరమాన్నం, పాయసం సహా పిండి వంటలు చేసుకుంటారు. పితృదేవతలకు ఈ రోజున తర్పణాలు కూడా వదులుతారు. మకర సంక్రమణంకు పితృతర్పణం ఇస్తే 12 నెలలకు ఇచ్చినంత విలువ ఉంటుంది. సంక్రాంతి పండగకు ఊరిలో ఉండే సంబరాలను మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా డూడూ బసవన్నల కోలాహలం చెప్పతరం కాదు. అందంగా అలంకరించిన బసవన్నలను డోలు, సన్నాయి వాయించుకుంటూ ఇంటింటికీ తిప్పుతారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా బసవన్నలు నాట్యమాడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. బసవన్న నాట్యానికి మెచ్చి కుటుంబ సభ్యులు ఇచ్చే కానుకలు.., బహుమతులు ఇచ్చిన వారిని గంగిరెద్దు ఆశీర్వదించటం చూస్తే, పల్లెల్లో మనుషులతో జంతుజాతికి ఉండే అనుబంధం అర్ధమవుతుంది. మరోవైపు హరిదాసు హరి కీర్తనలతో పండగ వాతావరణం కన్పిస్తుంది.

కనుమ
ముచ్చటైన మూడు రోజుల పండుగలో చివరి రోజు కనుమ. తొలి రోజు ప్రకృతిని పూజించుకుని.., రెండవ రోజు పండగను చేసుకున్న అన్నదాతలు మూడవ రోజున తమకు సిరిసంపదల పంటను అందించిన పశుపక్షాదులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. రెండ్రోజులు శ్రద్దాసక్తులతో దేవుడ్ని పూజించే ప్రజలు మూడవ రోజున మాంసాహారం తింటారు. ఇలా మూడు రోజుల పాటు ఆనందోత్సాహాల మద్య సంక్రాంతిని జరుపుకుంటారు.

సంబరాల సంక్రాంతి ప్రతి ఇంటా సరదాలు నింపాలి కానీ.., విషాదాల మయం కాకూడదు. పండగకు కొన్ని చోట్ల కోడి పందాలు ఆడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది సంతోషకర వాతావరణంలో ఉండాలి తప్ప.., కుటుంబాలను చిద్రం చేసేదిగా కాదు. పండగకు వచ్చే సంపదనంతా కోడి పందాలు, పేకాట ఇతర జూద క్రీడలు దోచుకుపోయి రోడ్డునపడితే సంబరాల సంక్రాంతి అని ఎలా అనగలము. కొన్ని క్షణాల ఆనందం కోసం కుటుంబాన్ని ఫణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం. కాబట్టి ఆలోచించండి.. జూదంకు దూరంగా ఉండండి. అప్పుడే సంబరాలు మీతో పాటు మీ కుటుంబానికి దగ్గరవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Makara Sankranti  telugu festivals  Andhra Pradesh  

Other Articles