Hanuman Jayanthi | Hanuman | Sri rama

Today hanuman jayanthi every where the hindus going to hanuman temples and offer prayers

Hanuman Jayanthi, Hanuman, Sri rama

Today hanuman jayanthi. Every where the hindus going to hanuman temples and offer prayers.

ప్రత్యేకం: నేడు హనుమాన్ జయంతి

Posted: 05/13/2015 08:50 AM IST
Today hanuman jayanthi every where the hindus going to hanuman temples and offer prayers

నేడు హనుమాన్ జయంతి. హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు. హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి తో పాటు కొందరు ఈ జయంతి కూడాజరుపుకుంటారు.

హనుమాన్ జయంతి రోజు..
"అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యమ్ తవకిన్ వధ
రామదూత కృపా సింథో
మత్‌కార్యమ్ సాధయ ప్రభో"- అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.

ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.

ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.

కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే!

యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.

శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.

హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ ఆంజనేయుని అనుగ్రహం కలుగుగాక. లోకాః సమస్తా సుఖినో భవంతు

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hanuman Jayanthi  Hanuman  Sri rama  

Other Articles