పరిచయం :
మన దేశంలోయుండే తెలుగువారికి మన చరిత్ర గురించి తెలుసుకోవడం ఒక సంతృప్తినిస్తుంది. ఈ రచన తెలుగులో వ్రాయడానికి కారణం దాదాపు 70 శాతం తెలుగువారు మన రాష్ట్రంలోనేయున్నారు. మిగిలిన 30 శాతం తెలుగువారు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో స్థిరపడియున్నారు. వారందరూ ఇంట్లో తెలుగు మాతృభాషగా వాడుకుంటూ ఆయా ప్రాంతాల రాష్ట్ర/ వాడుక భాషను వారు అమలు జరుపుచూ ఉండటం వలన తెలుగు అక్షరజ్ఞానం చాలామందికి రాకపోవచ్చును. దానికి కారణం ఆయా రాష్ట్రాలలో సరైన తెలుగు బోధనాలయాలు లేకపోవడం, ఆ రాష్ట్ర భాష ప్రధానంగా నేర్చుకొని వాడుకలో పెట్టాలనే గట్టి రాజకీయ పట్టుదల వలన తెలుగువారు ఆయా ప్రాంతీయ రాష్ట్ర భాషలను నేర్చుకొని ఆయా ప్రాంతీయానికి అనుగుణంగా వ్యవహరించుకుంటున్నారు. తమిళనాడులోని తెలుగువారిని ‘వడగర్లు’ అంటారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో వున్న తెలుగువారిని, ఒరిస్సాలో వున్న తెలుగువారిని ‘తెలుగువారు’ అని సంబోధిస్తూ వుంటారు. మహారాష్ట్రలోని తెలుగువారిని ‘మద్రాసీ’లని సంబోధిస్తూ ఉంటారు.
శ్రీశైలము, దాక్షారామము, కాళేశ్వరము వున్న ప్రాంతాదేశాన్ని త్రిలింగదేశముగా స్కందపురాణము పేర్కొన్నది. త్రికళంగ - తెన్ కళింగ పదముల నుండి త్రిలింగ పదమేర్పడినదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కృష్ణ, గోదావరి నదుల మధ్యనున్న త్రికళింగా రాజ్యమున ఉత్తర, మధ్య, దక్షిణ కళింగయుండుటచే త్రికళింగయైనదని చెప్పుదురు. దక్షిణ కళింగను ‘తెన్ కళింగ’ యందురు. ఈ ‘తెన్ కళింగ’యే క్రమంగా తెనుగు లేక తెలుగుగా మారియుండవచ్చునని కొందరు చరిత్రకారుల భావన.
ఆంధ్రులు వింధ్యకు దక్షిణ ప్రాంతంలో పుండ్ర, పుళింద, మూతిబ, శబరులతో కలిసి జీవిస్తున్నట్లు ఐతరేయ బ్రాహ్మనంలో వర్ణించబడినది. ఆంధ్రదేశంలో అనాదిగా నిశిస్తున్న ద్రావిడ, యక్ష, నాగప్రజలు తెనుగు లేక తెలుగు భాషను మాట్లాడేవారు. ఉత్తర హిందూస్థానం నుండి వచ్చిన ఆంధ్రప్రజల వ్యవహార భాష ‘దేశి’. తెనుగుభాష ద్రావిడ కుటుంబానికి చెందినవి. కన్నడ, తెలుగు, తుళు భాషలతో దీనికి సామీప్యం ఉన్నది. ‘అంధ’ అనే ప్రాకృత పదమును సంస్కృతీకరించుట వలన ‘ఆంధ్ర’ అనే పదం ఏర్పడినదని పండితుల అభిప్రాయం. శాతవాహనులను ‘ఆంధ్రులని’ పురాణాలు వర్ణించాయి. కర్ణాటక, రాయలసీమలో ప్రవహించే ‘హంద్రి’ నది ‘ఆంధ్రి’ నదిగా పేర్కొనబడినది. ఆంధ్రులు అత్యధిక సంఖ్యలోనున్న స్థానికులైన తెలుగువారి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ఆంధ్ర, తెలుగు పదముల సమ్మిశ్రణ భాషను వాడుకలో తెచ్చుకొని దానిని ప్రత్యేక భాషగా రూపొందించుకొనినారని చరిత్రకారుల అభిప్రాయం.
శాతవాహనులతో మొదలైన తెలుగు సంస్కృతి నేటివరకు ఆ ప్రాంతంలో అలరారుతూ ఉన్నది. శాతవాహనులని ఆంధ్రులని తెలియుచున్నది. కాని వారి లిపి తెలుగులో ఉన్నట్లు తెలియుటలేదు. వారి నాణాలపై ప్రాకృతము, తమిళము ముద్రించబడినవి. బహుశ తమిళ ప్రాంతంలో చాలాభాగము, ముఖ్యంగా కంచి పరిసర ప్రాంతములు శాతవాహనుల ఆధీనంలో యుండుటచే ఆ నాణాలపై తమిళంలో కూడా ముద్రించి యుండవచ్చును. తెలుగు కొంతవరకు రేనాటి చోళులు 6వ శతాబ్దములోనే వాడినట్లు తెలియుచున్నది. కానీ నన్నయభట్టు కాలము నుండి (11 శతాబ్దం నుండి) తెలుగులో గ్రంధరచన కావింపబడినదని తెలియుచున్నది. తెలుగు బాగుగా అమలు జరిపినవారు వేంగి పాలకులు, పల్లవులు, చాళుక్య చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, కొంతవరకు కుతుబ్ షాహీ సుల్తానులు, విజయనగర రాజులు, మధుర - తంజావూరు నాయకులు. కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో తెలుగు మూడుపూవులు ఆరుకాయలుగా వికసించింది. తమిళనాడులోని తంజావూరు నుండి, ఒరిస్సాలోని కటకందాకా, కర్ణాటక రాష్ట్రంలోని కోలారు, బెంగుళూరు, బళ్లారి దాకా వ్యాపించింది.
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో కూడా తెలుగునకు ప్రాముఖ్యతనిచ్చి వారి నాణాలపై ఉర్దూ, హిందీ, ఇంగ్లీషుతోబాటు తెలుగులో కూడా అచ్చువేసేవారు. దక్షిణాది భాషగా అధికంగా మాట్లాడే తెలుగుని వారు గుర్తించారు. రచయిత్రి మొల్ల, దక్షిణ దేశాన పేరుగాంచిన గాయకుడు నాదబ్రహ్మ త్యాగయ్య, ప్రొఫెసర్ చిన్నయసూరి తమిళనాడు ప్రాంతంలోనే పుట్టి పెరిగినప్పటికి తెలుగును వాడుకలోకి తెచ్చారు. ఆంగ్లేయుడైన చార్లెస్ ఫిలిప్స్ తాను మచిలీపట్నంలో కలెక్టరుగా ఉన్నప్పుడు తాను తెలుగు నేర్చుకొని వేమన పద్యాలను వెలుగులోకి తెచ్చాడు. దశకుమార చరిత్రను వ్రాసిన దండి మహాకవి కొంతకాలం వేంగి రాష్ట్రంలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు.
మనదేశంలో హిందీభాష మాట్లాడేవారి సంఖ్య తర్వాత తెలుగుభాష మాట్లాడే వారి సంఖ్య రెండవదిగా ఆంగ్లేయుల కాలంనుండే గుర్తించబడింది. అటువంటి పురాతన చరిత్ర కల్గిన మన తెలుగువారి పుట్టుపూర్వోత్తరాలు ఉన్న ఆధారాలను బట్టి కొంతైనా తెలుగుకొని తెలుగువారు ఆనందించాలనే కోరికతో ఈ సంక్షిప్త ‘ఆంధ్రుల చరిత్ర’ వ్రాయడమైంది.
Read Also: ఆంధ్రుల చరిత్ర రచయిత: శ్రీ డా. సి.హనుమంతరావు, IAS
ఉపోద్ఘాతము :
భారతదేశంలోని అతి ప్రాచీన జాతులలో ఆంధ్రులొకరు. ఆంధ్ర అను పదం మొదట్లో ఒక తెగ ప్రజల పేరుకు ఉండేది. తర్వాత ఈ తెగ ప్రజలు సంచరించిన ప్రాంతాలలోని నదులకు, కొండలకు ఆ పేరు సంక్రమింపగా వారు స్థిరపడిన ప్రాంతానికి ఆంధ్రదేశము అనే పేరు వచ్చింది. బొంబాయి వద్ద ఆంధ్రలోయ అని పిలువబడే లోయ ఉంది. మహారాష్ట్రలో ఆండ్రి అనే ఒక చిన్న నది ఉంది. అదేవిధంగా తుంగభద్ర నదికి గల ఉపనదులలో ఒకదాని పేరు హంద్రి.
దక్షిణమున సేతు, ఉత్తరమున వింధ్య పర్వతప్రాంతాన్ని దక్షిణాపథమని భరతముని నాట్య శాస్త్రమున, కల్యాణి చాళుక్య రాజుల శాసనములందు తెలుపబడినది. దక్షిణాపథము, ద్రావిడ దేశము వేర్వేరు భాగములని మహాభారతము తెలుపుచున్నది. ‘పెరిఫ్లస్’ అను 1వ శతాబ్ది రచయిత దక్షిణాపథము, తమిళకము (దమరిక) వేర్వేరు భాగములని తెలియుచున్నదని తెలిపాడు. దక్షిణ పథనివాసులలో ఆంధ్రులున్నట్లు మత్స్యపురాణము తెలుపుచున్నది.
‘‘ఆంధ్రాః శకాః పుళిందాశ్చమూతికా యవనాస్తథా
తేషా పరే జనపదః దక్షిణాపథవాసినః’’
వాత్స్యాయన కామసూత్ర వ్యాఖ్యాత జయమంగళుడు
‘నర్మదాయా దక్షిణేనదేశౌ దక్షిణాపథః
తత్రా కర్ణాటక విషయాత్ పూర్వేణాంధ్ర విషయ:
కర్ణాట విషయమే దక్షిణేన ద్రవిడ విషయ:
అని తెలిపెను.
ప్రాచీన తమిళ వాఙ్మయము, తమిళ దేశపుటుత్తర సరిహద్దుగా వేంగడమున్నట్లు సూచించుచున్నది. (వేంగడం = ఉత్తరదిశ తిరుపతి). తమిళ దేశమునకుత్తర సరిహద్దు వెంగడమనియు, శ్రీ వెంకటేశ్వరస్వామి తమిళదేశ ఉత్తర సరిహద్దు రక్షించు దైవమనియు, తమిళ దేశమునకుత్తర సరిహద్దు తిరుపతియున్నట్లు తెలియుచున్నది. నర్మదానదికి, తుంగభద్రానదికి మధ్య భాగమున్న దేశము దక్షిణా పథమనియు, దానికి దక్షణమున సేతు పర్యంతం వ్యాప్తమైయున్నదేశం ‘ద్రవిడము’ లేక తమిళ రాజ్యమనియు భావించవచ్చును.
Read Also: ఆంధ్రుల చరిత్ర రచయిత: శ్రీ డా. సి.హనుమంతరావు, IAS
ఆంధ్రజాతి : ఐతరేయ బ్రాహ్మణమున ఆంధ్రుల ప్రశంసయున్నది.
రామాయణంలో ఒక గాథ ఉన్నది. విశ్వామిత్రుడు నరమేధయాగాన్ని నివారించి యజ్ఞపశువైన శునశ్శేపుని విడిపించి అతనిని తన దత్తపుత్రునిగా స్వీకరించగా శునశ్శేప విశ్వామిత్రుల వృత్తాంతమందు ఆంధ్రులు పేర్కొనబడినవారు. విశ్వామిత్రునికి 100 తనయులు. విశ్వామిత్రుడు శునశ్శుపుని సోదరునిగా స్వీకరించమని నూరుగురు తనయులకు కోరగా, మొదటి ఏబదిమంది (50) పుత్రులందులకు అంగీకరించిరి. కానీ తక్కిన వారందులకు ఒప్పుకొనలేదు. సహజంగా కోపిష్టి అయిన విశ్వామిత్రుడు ఆ ఏబదిమంది కుమారులను ఆర్యాశ్రమ సరిహద్దులందు నివసించునట్లు శపించెను. అట్లు శపింపబడినవారే ఆంధ్రులనియు, శబరులనియు, పుళిందులనియు, మూతిబులనియు పిలువబడుచున్నారనియు విశ్వామిత్రుని సంతతివారే దస్యులలో అధిక భాగము ఏర్పడినరి పై ఐతరేయ బ్రాహ్మణములోని మంత్రము తెలుపుచున్నది. ఆంధ్ర శబ్దము తొలుత జాతిపదము. ఆంధ్రులు నివశించు భూమికి మొదట ఏ పేరుండెనో తెలియదు. ఆంధ్రులు వింధ్యకు దక్షిణ ప్రాంతంలో పుండ్ర, పుళింద, మూతిబ, శబరులతో కలిసి జీవిస్తున్నట్లు ఐతరేయ బ్రాహ్మణంలో వర్ణించబడినది.
ఆంధ్రదేశంలో అనాదిగా నివశిస్తున్న ద్రావిడ, యక్ష, నాగ ప్రజలు తెనుగు లేక తెలుగు భాషను మాట్లాడేవారు. ఉత్తర హిందూస్థానము నుండి దిగివచ్చిన ఆంధ్రప్రజల వ్యవహార భాష ‘దేశి’. తెనుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందినవి. తమిళ, కన్నడ, తుళు భాషలతో దీనికి సామీప్యం ఉన్నది.
‘అంధ’ అనే ప్రాకృత పదమును సంస్కృతీకరించడం వల్లనే ‘అంధ్ర’, ‘ఆంధ్ర’ అనే పదాలు ఏర్పడినవని పండితుల అభిప్రాయము. ఋగ్వేద బ్రాహ్మణమైన ‘ఐతరేయ బ్రాహ్మణంలో(క్రీ.పూ. 1500-1000) ఆంధ్రశబ్దము, ఆంధ్రుల ప్రసక్తి కనబడుచున్నది. వీరు ఆర్యజాతివారని ఉత్తరదేశ వాసులని చెప్తున్నది.
మహాభారతంలో ఆంధ్రులను, ద్రావిడులను, కేరళులను, పాండ్యులను సహదేవుడు జయించినట్లు చెప్పుచున్నది. మహాభారత కాలానికి మార్కండేయ పురాణంలో కూడా ఆంధ్రుల ప్రసక్తియున్నది. ద్రావిడులనగా (దు - గతౌ అను ధాతువు వలన) తరుమబడినవారనియు, పరశురామునిచే ఓడి, పారిపోయిన క్షత్రియజాతివారే ద్రావిడులనియు మహాభారతంలో చెప్పబడింది.
దక్షిణాపథంలోని కొంకణానికి, కుంతలానికి తూర్పుగా వున్న ప్రాంతమే ఆంధ్రదేశమని బ్రహ్మాండ పురాణము తెలుపుచున్నది. మత్స్య, వాయు, బ్రహ్మాండ, భవిష్య, భాగవత పురాణాలు శాతవాహనులను ‘ఆంధ్రులని’ , ‘ఆంధ్రస జాతీయులని’, ‘ఆంధ్ర భృతులని’ వర్ణించాయి. కొన్ని పురాణాలలో ఆంధ్రులకు ఆంధ్రభృత్యులని ఉన్నది. ఒకప్పుడు సేవకులుగా ఆధారపడియున్న ఆంధ్రులు శ్రీముఖుని నాయకత్వంలో (క్రీ.శ.78 సం.లో) సూంగులను, కణ్వులను పెకలించి వైచి రాజ్యం పట్టినారని, వారి మొదటి రాజధాని ధాన్యకటకమని చెప్పినారు.
బ్రహ్మాండ పురాణమునందు, వాయుపురాణమునందు ఆంధ్రులు చక్షునదీ తీరవాసులని తెలుపుచున్నది. చక్షునది నేటి ఆక్సస్ నదిగా వ్యవహరింపబడుచున్నది. దరద, ములక, సారక, పహ్లవాది జాతులవారు ఆంధ్రులకు సమీపముందున్నవారు. మధ్య ఆసియాలోనున్న ‘బలక్’ పడమర వంద అరవై కిలోమీటర్లు దూరమున ‘ఆస్థకుయి’ అను పేరుగల ప్రాంతమున్నది. యుద్ధప్రియులైన ఆఫ్ఘను జాతీయులను ‘అస్థ్రి’ లేక ‘అంధేరి’యని పిలుస్తారు. ఆక్సస్ నదీ తీరమందు ఇరుగుపొరుగు వారుగానున్న వాయుపురాణమున పేర్కొన జాతులవారు దక్షిణాపథమునకు వచ్చి ఆంధ్రులు నివసించు ప్రాంతమునకు సమీపమునందు స్థిరనివాసులైనారు. దరద, పహ్లవ, ములక, పొరటాదులాంధ్రులకు చేరువలోనున్నారు. అశోక చక్రవర్తి ధర్మ లిపిశాసనములందు పారటులు దక్షిణ పథవాసులని తెలుపబడినది. దరదులు మాట్లాడు భాష పైశాచీపాకృతము. దక్షిణాపథమున నివాసమేర్పరచుకొనిన పిదప ఆంధ్ర జాతీయులు స్థానిక జాతులవారితో సంబంధ బాంధవ్యములను నెరిపినారు. అందు నాగులు, యక్షులు, అశ్మకులు, మహిషకులు, తెలుగులు ముఖ్యులు.
కృష్ణానది పాక్ పరివాహప్రాంతము నాగభూమిగా సింహళ, సయాం సాహిత్యములందు వర్ణింపబడినది. నాగజాతివారు ఆర్యావర్తమునుండి వచ్చి దక్షిణాపథమున నివశించినారు. ఋగ్వేద కాలమున (క్రీ.పూ.2000) నాగజాతివారు పంజాబు ప్రాంతమున నివసించు ఆర్య దండయాత్రలను ప్రతిఘటించి, ప్రశాంత జీవనమును గడుపుటకు దక్షిణా పథమునకు ఏతించినారు. వీరు శిశ్నదేవులు. ఆర్యకర్మలనేవగించుకొనువారు. ఆర్యులకు నాగులు బద్ధవిరోధులు.
నాగులు అమరావతి ప్రాంతమున నివసించి రాజ్యములు స్థాపించుకొనినారు. పల్లవ వంశస్థాపకుడగు వీరకూర్చవర్మ నాగరాజు కన్యను వివాహమాడి నాగరాజ్యమునకు వారసుడైనాడు. అమరావతి శిల్పములలోని రాజులకు, రాణులకు సర్పకిరీటములు కనిపించుచున్నవి.
అశోక శాసనాలలో ఆంధ్రుల ప్రసక్తియున్నది. అశోకుని తరువాత కాంచీపురము రాజధానిగా చేసుకొని కృష్ణకు దక్షిణంగా వున్న ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి పల్లవరాజుల ప్రాకృత వాసనాలలో (క్రీ.శ.4వ శతాబ్దంలో) ఆంధ్రపథం అనే పేరుతో ఆంధ్రదేశం పేర్కొనబడింది. అదే కాలానికి చెందిన బాణరాజులు (అనంతపురం, చిత్తూరును ఏలినవారు) శాసనాలలో ఆంధ్రపథం పేర్కొనబడింది. ఆంధ్రులకు దక్షిణంగాయున్న తమిళులు ఆంధ్రులను ‘వడుగర్’ (ఉత్తరాది) వారు అని పిలిచేవారు. క్రీ.శ.తొలి శతాబ్దాలకు చెందిన సంగయుగం సాహిత్యంలో ఆంధ్రులను ‘వడగర్లు’గా పేర్కొనబడ్డారు. యక్షులు శివపూజా దురంధరులు అనార్య జాతివారు. శాతవాహన వంశమునకు మూలపురుషుడు సాతుడను యక్షుని తనయుడు యక్షులు నేడు జక్కులుగా పిలువబడుచున్నారు. యక్షులు గాన ప్రియులు. యక్షగానము ఆంధ్రప్రాంతంలో ప్రాముఖ్యము పొందినది. అశ్మకులు అశ్మక రాష్ట్రవాసులు, అశ్మక, యక్ష జాతీయులు మొదట ఒకే జాతివారుగానున్నట్లు తెలియుచున్నది. (సత = అశ్వము వాహన్ = కుమారుడు అనే ముండారీ భాషలో అర్థము)
మహిషకులు అమిత పరాక్రమవంతులు. ఖారవేలుడు మహిషకాధిపతి. మెదక్, ఆదిలాబాద్, ధార్వార్ ప్రాంతములు మహిషకుల నివాసములు. ఖారవేలుడు కళింగాధిపతి. మహిషకులలోని ఒక శాఖ వారు నేటి ఆదిలాబాదు మండలంలోని మహిష పురమును రాజధానిగా పాలించినారు. ఆ మహిషపురమే నేటి ‘భైంసా’.
ఆంధ్రులు అత్యధిక సంఖ్యలోనున్న స్థానికులైన తెలుగువారితో సన్నిహిత సంబంధములు ఏర్పరచుకొనినారు. నాడు తెలుగు ప్రజలు మాట్లాడు భాష ‘దేశీ’. ఈ దేశీయ భాషాపదములను ఆంధ్రులు స్వీకరించి ఆంధ్ర తెలుగు పదముల సమ్మిశ్రణ భాషను వాడుకలోనికి తెచ్చుకొని, దానిని ప్రత్యేకమైన భాషగా రూపొందించుకొనినారు. ఆంధ్రులు దక్షిణా పథముగనున్న నాగ, యక్ష, దరద, అశ్మక, మహిషక, ఇక్ష, తెలుగు జాతులలో కలిసిపోయిరి. ఈ నానాజాతి సమ్మేళముగ ఆంధ్రజాతి ఏర్పడినది. అందుచే ‘ఆంధ్రాశ్చబహావ:’అని మహాభారతమున పేర్కొనబడినది.
క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందిన మెగస్తనీసు, అతనిని అనుసరించిన పెద్దప్లీనీ ఆంధ్రులు చాలా బలవంతులనీ, వారి దేశం చాలా విశాలమైనదనీ, వారు కందకాలు, కోటగోడలూ. బురుజులలో రక్షితమైన ముప్పై పట్టణాలు కలవారనీ, వారి రాజుకు లక్ష కాల్బలం రెండుడేల అశ్వదళం, వేయి ఏనుగులను సరఫరా చేసేవారని తెలుపుచున్నారు.
క్రీ.శ.7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తన సి-యు-కీ గ్రంథంలో గోదావరి, కృష్ణా నదుల మధ్యలగల తీరాంధ్రదేశాన్ని ఆన్-తో-లో (ఆంధ్ర) అని చెప్పి, దానికి పింగ్-కి-లో (వేంగి) రాజధాని అని పేర్కొన్నారు. తూర్పు చాళుక్య యుగంలో ఆంధ్రదేశం అనేపేరు మరుగునపడి ‘వేంగిదేశం’ అనే పేరు ప్రఖ్యాతి చెందింది. దండి వ్రాసిన దశకుమార చరిత్రంలో వేంగిని ఆంధ్రనగరం అని పేర్కొన్నాడు. చాళుక్యులు తమను వేంగిపాలకులుగా పేర్కొన్నప్పటికీ, వారికి సమకాలికులైన చేది, కుంతల, చోళ దేశపాలకులు తూర్పు చాళుక్యులను ఆంధ్రాధిపతులు అనే పేర్కొన్నారు.
అత్యంత ప్రాచీన కాలంనుండి క్రీ.శ.11, 12వ శతాబ్దాలవరకు గల వాజ్మయంలో ఆంధ్ర పదం మొదట జాతివాచకంగాను, తర్వాత దేశవాచకంగానూ వాడటం జరిగింది. ఆంధ్రపదం భాషావాచకంగా క్రీ.శ.1053లో నన్నయభట్టు రచించిన నందంపూడి శాసనంలోనే మొట్టమొదటగా వాడబడింది. నన్నయకాలంనుండే తెలుగు, తెనుగు, ఆంధ్రము, సమానార్థాలుగా వాడబడుతున్నట్లు అంతకుముందు తెలుగు, తెనుగు పదాలు కనబడవు. 11వ శతాబ్దం తర్వాత ఆంద్రదేశానికి ‘త్రిలింగదేశం’ అనే పదం వ్యాప్తిలోకి వచ్చింది. (శ్రీశైలం, ద్రాక్షారామము, కాళేశ్వరము అనే త్రిలింగములున్న దేశమే త్రిలింగ దేశమైనది).
గోండ్లు, కుయి, కొలామి, నవరభాషలు, మాట్లాడు ప్రజలు తెలుగువారికి సమీప ప్రాంతములందు నివసించుట వలన ఆ భాషలలో తెలుగు పదములు స్థానమును పొందినవి. కృష్ణానదికి దక్షిణమున అరువార్నా ప్రజలున్నట్లు టాలెమీ వ్రాతలు తెలుపుచున్నవి. వారు కొడుందమిళ భాష మాట్లాడువారని తొల్కాపియమను తమిళ కావ్యము వలన తెలియుచున్నది.
ఆంధ్రదేశమున రాజభాషగా ప్రాకృతము క్రీ.పూ.300 నుండి క్రీ.శ.300 వరకు వర్ధిల్లినది. అటు పిమ్మట క్రీ.శ.30-600 వరకు సంస్కృతము రాజభాష అయినది. బౌద్ధమత ప్రచారమునకు అనరియకో ఆంధ్ర, తమిళాది భాషలను వాడవలెనని గౌతమ బుద్ధుడు బౌద్ధ సన్యాసినీ సన్యాసులకు ప్రబోధించెను.
Read Also: ఆంధ్రుల చరిత్ర రచయిత: శ్రీ డా. సి.హనుమంతరావు, IAS
త్రిలింగదేశము: శ్రీశైలము, దాక్షారామము, కాళేశ్వరము, మహేంద్రగిరి ప్రాకారముగా గలిగిన దేశమునకు త్రిలింగదేశమని స్కాందపురాణము పేర్కనినది.
త్రికళింగ - తెన్ కళింగ పదములనుండి త్రిలింగ పదమేర్పడినదని కొందరు చరిత్రాకరులందురు. కృష్ణ, గోదావరి నదుల మధ్యనున్న త్రికళింగ రాజ్యమున ఉత్తర, మధ్య, దక్షిణ కళింగములుండుటచే దానినే త్రికళింగయైనదని చెప్పుదురు. టాలెమి - మోడో కళింగము పేరు తెలిపినాడు. దక్షిన కళంగమును తెన్ కళింగమందురు. తెన్ కళింగము క్రమంగా తెనుగులేక తెలుగుగా మారియుండవచ్చును. కాని తెనుగు పదము కన్న తెలుగు పదము ప్రాచీనమైనది. క్రీ.శ.6, 7 శతాబ్దాలలో పాలించిన గాంగ, తూర్పు చాళుక్యరాజులు త్రికళింగాధీశ్వర బిరుదాంచితులు. త్రికళింగములో ‘క’ మరుగై త్రిలింగము మిగిలినది. క్రీ.శ.130 ప్రాంతము వాడైన టాలమి ట్రిలింగాన్ పదము తెలిపెను. అగత్తియమ్ అను తమిళ వ్యాకరణమున ‘కొంగణం’, ‘కన్నడం కొల్లం’, ‘తెలుంగుం’ అను పదములున్నవి. మార్కండేయ పురాణములో ‘తింగ’ పదము ఉచ్చరింపబడినది. ఆనాడు తిలింగ - త్రిలింగ పదములు సమానార్థక రూపములుగా వాడుకలో నుండెను. సముద్రతీరమందు యుండువారిని కళింగులందరు. ముండా బాషలో దేశస్థ ప్రజలను ‘త్రిలింగు’లనియందురు. కాళింగ జాతివారికి పశ్చిమదిశలో తైలంగులున్నారు. తైలంగులే త్రిలింగవాసులు లేక తెలుగువారు. బర్మాదేశమున క్రీ.పూ.4వ శతాబ్దినాటికే తైలంగులున్నారు. తూర్పు తీరంలోనున్న ఆంధ్రులు, బర్మాలోని తైలంగులు కొలామిజాతి ప్రజలను జయించి అచ్చట రాజ్యస్థాపన మొనర్చియుందరు. శైవమత ప్రాబల్యమున తిలింగ = త్రిలింగగా మారినది. కాపనాయకుడు ఆంధ్రసురత్రాణ బిరుదాంచితుడు. ముస్లింల పాలనలో తెలుగు సీమనంతటిని తెలంగాణముగా వ్వవహరించినారు.
ఉత్తర భారతమునుండి వచ్చి తొలుదొల్త ఆశ్రమములేర్పరచుకొనిన ఆంధ్రులు స్థానికులైన తెలుగు ప్రజల ఆదరాభిమానములు చూరగొనుటకు వారి ఆచార వ్యవహారములనలవరుకొనినారు. ఉత్తర ప్రాంతమునుండి వచ్చిన తొలి దినముల ఆంధ్రులు దృఢమైన శరీరము, పచ్చని పసిమిఛాయ కలిగియుండిరి. తెలుగువారు ఉష్ణప్రాంతముంలదుండుట వలన నల్లని శరీరము కలవారై బలాఢ్యులై యుండిరి. ఆంధ్రస్త్రీలు కుసుమ కోమల శరీరముకలవారు అందమైనవారు. తెలుగు స్త్రీలు ఆంధ్ర పురుషులను, ఆంధ్రస్త్రీలు తెలుగు పురుషులను ఆకర్షించినారు. ఆంధ్ర, తెలుగువారి మధ్య వర్ణ సంకరమేర్పడినది. ఆర్యనార్యా సమ్మేళనమున ఆంధ్రజాతి నేటి తెలుగుజాతిగా రూపుదిద్దుకొనినది. దక్షిణ భారతదేశమునందున్న విద్యావంతులు, పూజారులు, ఆర్య నాగరికతా ప్రభావమునకు ఆకర్షితులై ఆర్యమతమును స్వీకరించిరి. కాలక్రమేణా దక్షిణాపథమున చాతుర్వర్ణ వ్యవస్థవ్యాప్తి చెందినది. రాజులు, రారాజులు, చక్రవర్తులు, ధనికులు, మంత్రి, సామంతులు, వైదిక మతమును అవలంబించి బ్రాహ్మణుల సలహాలను అనుసరించి యజ్ఞయాగాదులు, క్రతువులు నిర్వహించుచుండిరి. సామాన్య ప్రజలు, బీదలు, అనార్యులు, ఈ యజ్ఞకర్మలను నిర్వర్తింప జాలకుండిరి. సంఘమున బ్రాహ్మణులకు విపరీతమైన గౌరవములుండెను. యజ్ఞయాగాదులు చేసిన గాని మోక్షము లభింపదని మోక్షసాధనకు యజ్ఞకర్మలాచరించుట తప్పనిసరియని భావించుట వలన ఆనాటి ప్రజల మనోభావములను, పూజా విధానములను, వర్ణవ్యత్యాసములను, జాతి అహంకారములను, మతము పేరిట, దైవారాధన పేరిట, యజ్ఞయాగాదికర్మ కాండలపేరిట బ్రాహ్మణులు, ఉన్నత వంశజాతులు చేయి దురంతరములను గమనించి మానవ జాతి శ్రేయస్సును దృష్టియందుంచుకొని మహోన్నతాశయాలతో భారతజాతి నుద్ధరించు సదుద్దేశముతో వర్ధమాన మహావీరుడు, గౌతమబుద్ధుడు జైన, బౌద్ధమతములను స్థాపించిరి. అనతికాలంలోనే ఈ రెండు మతములు విశేషముగ ప్రజాదరణ పొందినవి.
బిందుసారుని తనయుడు అశోకుడు క్రీ.పూ.272లో కళింగ దేశముపై దండెత్తెను. ఆ యుద్ధమున లక్షల కొలది సైనికులు క్షతగాత్రులైరి. వేలకొలది మరణించిరి. ఆ యుద్ధము అశోకునిలో గొప్పమార్పు తెచ్చెను. అతడు అహింసయే పరమ ధర్మమని బోధించెను. బౌద్ధమతమును స్వీకరించి ఆ మతమును ప్రచారం చేసెను. ఎర్రగుడి (గుత్తివద్ద), గాజులమందగిరి, ధాన్యకటక ప్రాంతములందు అశోకుని ధర్మలిపి శాసనములున్నవి. అశోకుడు క్రీ.పూ.236లో మరణించెను. మౌర్యుల కాలమున ఆంధ్రులు బలవంతమైన రాజ్యములను కలిగి యుండిరని మెగస్తనీసు వ్రాతలతో తెలియుచున్నది. విజయపురి, ఫణిగిరి, సోదన, ఇంద్రపురి, కొండాపురము వంటి నగరములు ఆనాడు ఆంధ్రరాజ్యము నందుండెను. గోపతి వంశీయులు, శాతవాహనులు తొలుదొల్త గణతంత్రరాజ్య వ్యవస్థను ఏర్పరిచిరి.
సముద్రగుప్తుని దండయాత్ర క్రీ.శ.342-343 సంవత్సరాల మధ్య మగధరాజైన సముద్రగుప్తుడు దక్షిణ దిగ్విజయ యాత్రలో అతడు ఆంధ్రదేశంలో జయించిన వివిధ రాజుల పేర్లను తన అలహాబాదు శాసనములోనున్నవి. ఆ రాజులను జయించి మరల వారి వారి స్థానాలలో ప్రతిష్టించినట్లు తెలుస్తున్నది.
Read Also: ఆంధ్రుల చరిత్ర రచయిత: శ్రీ డా. సి.హనుమంతరావు, IAS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more