ఆంద్రప్రదేశ్ రాష్ట్రవిభజన జరిగి అప్పుడే నాలుగేళ్లు అయ్యింది. మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా వనరులు అంటూ అందోళనలు చేసిన తెలంగాణ వాదులు తమ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుని నాలుగేళ్లల్లో ప్రగతి పథాన సాగుతున్నారు. అయితే ఈ విభజనతో తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పిన సీమాంద్ర ప్రజలకు ప్రత్యేకహోదా తాయిలంగా చూపిన కేంద్రం.. ఈ విషయంలో హడావిడిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో ప్రకటన చేయించింది. అయితే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తే చాలదన్న బీజేపి.. దానిని పదేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. తీరా రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల తరువాత ఏపీకి ప్రత్యేక హోదా లేదు సరికదా, సంజీవని కన్న మిన్నైన ప్యాకేజీ కూడా లేదు. నాలుగేళ్ల తరువాత చూస్తే అంధ్రప్రదేశ్ యువతకు మిగిలింది నిరాశే.
తల్లిని చంపి బిడ్డను బతికించారు.. ఇది ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్రమోడీ అన్న మాట. తల్లి బిడ్డ న్యాయం చేయకుండా తల్లిలాంటి అంధ్రప్రదేశ్ ను హతమార్చి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిడ్డకు బారసాల చేసిందని అప్పట్లో ఎద్దేవా చేశారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా న్యాయం జరగాలంటే అది కేవలం బీజేపితో మాత్రమే సాధ్యమని, కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వస్తే.. ఏపీకి ప్రత్యేకహోదాను కల్పిస్తామని కూడా అప్పటి బీజేపి పార్టీ ప్రధాని అభ్యర్థి.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ హామి ఇచ్చారు. ఇక అదే సభలో యూపీఏ ప్రభుత్వం కేవలం ఐదేళ్లు మాత్రమే ప్రత్యేకహోదాను కల్పించిందని, దానిని పదిహేనేళ్లుకు పెంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విన్నవించారు.
పార్లమెంటు తలుపులు మాసివేసి.. అర్థరాత్రి హైడ్రామా మధ్య రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం విభజించిందని.. పార్లమెంటు అంటే దేవాలయమని, అలాంటి దేవాలయం తలుపులు మూసి యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేసిందని అటు నరేంద్రమోడీ, ఇటు చంద్రబాబు.. వీరికి తోడుగా వెంకయ్యనాయుడు అంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ప్రజలు కూడా వీరిని పూర్తిగా విశ్వసించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారని.. దీనిని సీమాంధ్ర అని పలువురు అంటున్నారని, కాగా కొందరు నవ్యాంధ్ర అంటున్నారని కానీ తాము మాత్రం అవశేష అంధ్రగా పరిగణిస్తున్నామని కూడా రాజకీయ విమర్శకులు పేర్కోన్నారు.
ఈ అవశేష అంధ్ర అభివృద్దిలో పరుగులు వేయాలంటూ అది హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ది చేసిన చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు బీజేపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు. కేంద్రంలో అసీనమయ్యేది తమ ప్రభుత్వమేనంటూ.. ఎన్డీయేలో భాగమైన టీడీపీతో మాత్రమే రాష్ట్ర పురోగాభివృద్ది సాధ్యమని అన్నారు. ఈ రెండు పార్టీలతో పాటు కొత్తగా అవిర్భవించిన పవర్ స్టార్ పవన్ కల్యాన్ అధ్యక్షతన ఏర్పడిన జనసేన పార్టీ కూడా ఇదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో అప్పటివరకు కాసింత డైలిమాలో వున్న తటస్థ ఓటర్లు కాసింత క్లారిటీకి వచ్చారు. దీంతో కేంద్రంలో బీజేపి, రాష్ట్రంలో టీడీపీలు అధికారంలోకి వచ్చాయి.
అక్కడి నుంచి సరిగ్గా మూడు నెలలు గడిచాయి. ఆ తరువాత రెండు నెలలు గడిచాయి. ఇంతలో కేంద్రమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వెంకయ్యనాయుడును విజయవాడలో అక్కడి బీజేపి నేతలు సన్మానించారు. అక్కడ ప్రత్యేక హోదాపై ఆయన నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తరువాత ఆయన పర్యటనను పలు పార్టీలు అడ్డుకుని ప్రత్యేకహాదాపై నిరసనను తెలిపాయి. ఆ సందర్బంగా అసలు తాను ఏపీకి చెందిన వ్యక్తినే కాను.. తాను బెంగళూరు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యానని వెంకయ్య చెప్పడంతో అసలు రాష్ట్రానికి హోదా వస్తుందా.? రాదా.? అన్న విషయంలో రాష్ట్ర ప్రజల్లో సందిగ్ధత ఏర్పడింది.
ఇలా ఏడాది కాలం గడిచిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కూడా అనుమానాలు రేకెత్తాయి. ఏడాది గడిచిన తరువాత కూడా టీడీపీ ఎంపీలు.. ఎందుకని ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం లేదని ఆయన మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఎందుకు ఇంకా మౌనంగా వున్నారు. వారు స్వకార్యాలను చక్కబెట్టుకోవడంలోనే బిజీగా వున్నట్లు వున్నారు. ఇకనైనా స్వకార్యాలను అపి.. రాష్ట్రానికి హోదా కోసం డిమాండ్ చేయాలని విన్నవించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా అధికారం అనుభవిస్తున్నారు. కనీసం వారైనా ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్రమోడీని డిమాండ్ చేయాలని అడిగారు.
అంతే టీడీపీ ఎంపీలకు, ఇక ఎంపీలతో సన్నిహిత్యం కలిగిన ఎమ్మెల్యేలకు లెక్కలేనంత కోసం వచ్చింది. వారి అధికారంలోకి రావడానికి కారణమైన రమారమి ఐదు లక్షలకు లోబడిన ఓట్లు కేవలం పవన్ కల్యాణ్ ప్రచారం వల్లే వచ్చాయని, తాము అందుకనే అధికారంలో కొనసాగుతున్నామని లేదంటే.. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో వున్న తాము.. నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ప్రతిపక్షానికే పరిమితం అయ్యేవాళ్లమన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. తమను గెలిపించి.. అధికారాన్ని అందించిన పవన్ కల్యాణ్ నే విమర్శించారు. ఆయనతో పాటు చిరంజీవిని కూడా విమర్శల్లోకి లాగారు.
ఇది ఒకింత టీడీపీ.. జేఎస్సీకి మధ్య సత్సంభంధాలను చెడగొడుతుందేమోనన్న అనుమానాలకు కూడా దారి తీసింది. అయితే విమర్శలు, ప్రతివిమర్శలకు పార్టీ అధినేత చంద్రబాబు బ్రేక్ పెట్టారు. పవన్ కల్యాన్ తమకు మిత్రపక్షం అని.. ఆయన ఏదైనా సలహా ఇచ్చినా.. సూచనలు చేసినా వాటిని సద్విమర్శలుగా తీసుకోవాలని.. అంతేకానీ విమర్శలు చేయరాదని అదేశించారు. ఇలా చంద్రబాబు చెప్పిన తరువాత కూడా పలవురు పార్టీ నేతలు పవన్ పై విమర్శలు చేశారు. తనను విమర్శిస్తే తనకు ఒరిగే నష్టం ఏమీ లేదని.. అయితే రాష్ట్రానికి హోదా విషయంలో మాత్రం తాను రాజీపడనని, ఇది రాష్ట్రప్రగతికి సంబంధించిన అంశమని పవన్ కూడా ఖరాఖండీగానే చెప్పారు.
చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే కల్పించాలని డిమాండ్లు కూడా ఇక రాష్ట్ర ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ క్రమంలో కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. ఇక కేంద్రం అప్పటి వరకు వున్న ప్లానింగ్ కమీషన్ స్థానంలో ఏర్పాటు చేసిన నీటి అయోగ్ కోర్టులోకి బంతిని పంపింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే అంశంపై నీటి అయోగ్ నిర్ణయం తీసుకుని నివేదిక అందజేస్తుందని చెప్పుకోచ్చింది. ఈ లోపు ఏడాదిన్నర పాటు 14వ ఫైనాన్స్ కమీషన్ ను ప్రత్యేకహోదా విషయంలో దోషిగా నిలిపే ప్రయత్నం చేసింది. ఆ తరువాత రాష్ట్రం నుంచి ఒత్తిళ్లు అధికం అవ్వడంతో.. ఇక నీతి అయోగ్ ను నివేదిక రాగానే దానిపై చర్చిస్తామని చెప్పడం ప్రారంభింది.
ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ప్రజలను వంచనకు గురిచేస్తుందా అన్న అనుమానాలు కలిగేలా అనిపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రత్యేక హాదా అంశంపై కేంద్రమంత్రులు ఒకలా స్పందిస్తే.. అదే మంత్రి ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వచ్చినా అదే అంశంపై మరోలా వ్యాక్యలు చేయడం కనిపింది. ఢిల్లీలో ప్రత్యేక హోదాపై క్లారిటీగా చెప్పని మంత్రులు.. ఇక ఇక్కడకు రాగానే రాష్ట్రానికి ప్రత్యేకహాదా తప్పకుండా కల్పిస్తామని ఎన్నికల హామీనే మరోమారు చెప్పేసి వెళ్లిపోయారు. అయితే మన రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రుల సమావేశాల్లో తాను భాగమయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకహోదా వస్తుందని, ఆ ఫైల్ నీటిఅయోగ్ వద్దనుందని, వారు నివేదిక పంపడమే అలస్యమని అప్పట్లో సెలవిచ్చారు.
ప్రత్యేక హోదా అంశంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎందుకనో దోబుచులాడుతుందని అనుమానం కలిగిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్.. ఈ అంశంలో ఇక అలస్యం చేయకూడదని.. నరేంద్రమోడీ ఎన్నికల హామీని ఇచ్చిన తిరుపతి నుంచే ప్రత్యేక హోదా అందోళనను బలోపేతం చేయాలని భావించింది. 2015 సెప్టెంబర్ 7న తిరుపతిలో ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంధోళన చేపట్టింది. ఈ అంధోళన కార్యక్రమంలో స్థానిక నాయకుడు మునికామకోట రాష్ట్రానికి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రాణత్యాగం చేశాడు. మరుసటి రోజుల అతను చెన్నైలో చికిత్స పోందుతూ మరణించాడు. అంతే మునికామకోటి చేసిన విపరీత చర్యను రాష్ట్రంలోని పలువురు యువకులు, పెద్దలు తమ అందోళనను అదే విపరీత చర్య ద్వారా తెలియజేశారు.
ఇలా యావత్ రాష్ట్రంలో అందోళనలు మళ్లీ వేడెక్కాయి. ఈ క్రమంలో పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి.. ప్రత్యేక హోదా త్వరలోనే సాధ్యమవుతుందని, ఎవరూ అధైర్యపడవద్దని మరీ మీడియా సమావేశాలు నిర్వహించి మరీ చెప్పారు. ఇక కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలుమార్లు లేఖలు రాసి.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్దిని ఇక్కడ శంఖించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం అటకెక్కించిందన్న విషయంలో పత్రికలలో వస్తే తప్ప మేలుకోలేని స్థితిలోకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వుండింది.
ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. రాష్ట్ర ప్రత్యేక హోదా అంశాన్ని గత ఎన్నికలలో విరివిగా వాడుకున్న కేంద్రం తన వైఖరిని మార్చుకూంటు వచ్చింది. 2016 మే 4న కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ప్రత్యక హోదా ఇవ్వలేమని కుండబద్దలు కోట్టారు. అయితే ఏపీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని చెప్పిన విత్తమంత్రి.. 2015-16లో రాష్ట్రానికి 21 వేల 900 కోట్ల రూపాయలను ఇచ్చామని, రూ.6,609 కోట్ల రూపాయల మేర వెవెన్యూ లోటును భర్తీ చేశామని చెప్పారు, పొలవరం నిర్మాణానికి నాబార్డు నుంచి ప్రత్యేక నిధులను ఇవ్వాలని చూస్తున్నామని ప్రకటించారు. అయితే ఏపీకి ప్రత్యేకహోదాకు మించిన నిధులతో ప్యాకేజీని అందిస్తామని కూడా ప్రకటించారు.
మునికామకోటి మరణంతో రాష్ట్రంలో పలువరు అభాగ్యులు ప్రత్యేక హోదా వస్తే తమ జీవితాలు బాగుపడతాని, నిజంగానే విశ్వసించారు. తమ బిడ్డల జీవితాల్లో వెలుగులు వస్తాయని పలువురు పెద్దలు కూడా విపరీత చర్యలకు పాల్పడుతున్న క్రమం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కదిలించింది. తాను ఏడాది కాలంగా అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ఎంపీలకు చెబుతున్నా ఎవరూ పెద్దగా స్పందించకపోవడం వల్లే రాష్ట్రంలో పలు విపరీత ఘటనలు సంభవిస్తున్నాయని ఆయన విమర్శించారు. అంతేకాదు తాను తిరుపతి నుంచే ప్రత్యేక హోదాపై గళం విప్పుతానని మరీ చెప్పారు. సరిగ్గా మునికామ కోటి మరణించిన ఏడాది లోపు అదే తిరుపతి వేదికగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు.
పవన్ కల్యాన్ అందోళన కార్యక్రమాలకు రాష్ట్ర యువత నుంచి పెద్దస్థాయిలో ప్రతిస్పందన లభించింది. పవన్ సభలను యువత విజయవంతం చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా పవన్ సభలకు వచ్చిన జనసైనికులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడం కూడా పవన్ కల్యాణ్ ను తీవ్ర అవేదనకు, దిగ్ర్భాంతికి గురిచేసింది. దీంతో తిరుపతి తరువాత అనంతపురం ఆ తరువాత కాకినాడ సభ వరకు సీన్ మారగానే.. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో వుండగానే ఏపీకి ప్రత్యేకప్యాకేజీపై అర్థరాత్రి హైడ్రామా మధ్య ప్రకటించారు. అయితే వాటి వివరాలను మాత్రం రెండు రోజుల తరువాత వెబ్ సైట్లో పోందుపర్చారు.
దీనిని జనసేనాని తీవ్రంగా వ్యతిరేకిందారు. కాకినాడ సభలో ఆయన కేంద్రం విధానాన్ని తూర్పారబట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్యాకేజీని స్వాగతించడంపై నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి చంద్రబాబు తిరుపతి లడ్డూలను ఇస్తే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి రెండు పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందని తీవ్రంగా వ్యతిరేకించారు. రెండుమూడేళ్లుగా ప్రత్యేకహోదా విషయంలో ప్రజలను అశపెట్టిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ప్యాకేజీ అనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగిరి గంతేసింది. అంతేకాదు ప్యాకేజీలో కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులనే ఇస్తుందని పలువరు రాజకీయ విశ్లేషకులు, విపక్షపార్టీలు గొంతుచించుకుని అరుస్తున్నా.. అవి కేవలం వారి విమర్శలుగా తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకహోదా అంటే సంజీవని కాదని మరోమారు స్పష్టం చేసింది.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేయడంలో రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీ అంగీకరిస్తే.. ఇక ఏం చేస్తామనే స్థితికి ప్రజానికం కూడా నిమ్మకుండిపోయారు. అయినా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఈ విషయంలో దోబుతూలాడుతన్నాయిని బలంగా నమ్మిన విపక్షాలు ఇక ఎదరుదాడికి దిగాయి. వైసీపీ ఏకంగా ఢిల్లీలో దీక్షకు పూనుకోగా, ఇటు రాష్ట్రంలో పవన్ సభలను పెడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విపక్షాలు, జనసేన ముందునుంచి హెచ్చరిస్తున్నట్లుగానే హస్తినలోని కేంద్రం.. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపినట్లుగానే.. ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చి.. కాయితాలపై అంకెలను చూపించే ప్రయత్నాలు చేసింది.
ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకహోదా అంటూ నినదించి.. ఆ తరువాత హోదా సంజీవని కాదు అని వాదించింది. ఐదేళ్ల ప్రత్యేకహోదా ఎందుకు పనికిరాదని పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి.. వాటిని నెలకొల్పడానికే మూడు నాలుగేళ్ల సమయం పడుతుందని వాదించి.. పదిహేను సంవత్సరాల పాటు హోదాను కల్పించాలని కోరిన చంద్రబాబు.. ఇక ఆ హోదా కన్న ప్యాకేజీ ముద్దనే పరిస్థితికి వచ్చారు. హోదాతో కేవలం ఈఏపీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు మాత్రమే వస్తాయని తన వాదనను మార్చారు. ఇక ఈ క్రమంలో ఆయన తన వాదనను సమర్థించుకున్నారు. తనకు స్పెషల్ స్టేటస్ ముఖ్యమని.. అయితే అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఎందుకు వద్దంటామన్న రూటు మార్చారు. ఇక దీనికి కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా.? అంటూ తన రాజకీయ అనుభవంతో చమత్కరించారు చంద్రబాబు.
ప్రత్యేకహోదా పోందిన రాష్ట్రాలు స్వర్గాలుగా మారుతన్నాయన్న వాదనలు విపక్షాలు వినిపిస్తున్నాయని.. అయితే ఐదేళ్లు, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా పొందిన ప్రాంతాలు ఎందుకు స్వర్గాలుగా మారలేదని.. అందుకు కారణాలు ఏంటని మరీ చంద్రబాబే ప్రశ్నించేసరికి రాష్ట్రంలోని విఫక్షాల విషయాన్ని పక్కనబెడితే.. ప్రజలు మాత్రం సందిగ్థతకు లోనయ్యారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు.. దానికి న్యాయం చేయాలంటే ప్రత్యేకప్యాకేజీ కావాల్సిందేనని చెప్పిన నాయకుడే.. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్లేటు ఫిరాయించి.. ప్రత్యేక హోదా విషయంలో విస్మయం గొలిపే ప్రశ్నలను సంధించడమేంటని ప్రజలు అయోమయానికి గురయ్యారు.
క్రమంగా రాష్ట్ర ప్రజల్లో అధికారంలోని చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి వెళ్లగక్కడం ప్రారంభమైంది. అటు వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్రకు రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన రావడం టీడీపీ ప్రభుత్వాన్ని డోలాయమానంలో పడేసింది. ఇదే కొనసాగితే తమ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత ఉత్పన్నం అవుతుందని గ్రహించినా.. కేంద్రంతో సర్థుకుపోయి.. వారి నుంచి నిధులు తెచ్చుకుని రాష్ట్ర అభివృద్దికి పాటుపడాల్సిన బాధ్యత తనపై వుందని, అంతేకానీ కేంద్రంతో పోరాడి సాధించేదేమీ లేదని కూడా ముఖ్యమంత్రి తన మార్చిన వైఖరిని మరోమారు ప్రజలకు చెప్పారు. కొదరు ప్రజలు సీఎం వైఖరితో ఏకీభవించారు. అయితే కొందరు మాత్రం విభేధించారు.
ఈ లోగా నాలుగేళ్లు గడిచాయి. నాలుగో పర్యాయం ఫిబ్రవరి మాసం రానే వచ్చింది. వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతూ కేంద్రం ఆర్థికశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపింది. అర్థరాత్రి హైడ్రామా మధ్య ప్రకటించిన ప్యాకేజీ తాలుకూ నిధులలో నామమాత్రపు కేటాయింపులు తప్ప.. చెప్పుకోదగ్గ రీతిలో ఏ ఒక్కటి లేకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ విషయంలోనూ చూస్తున్నాం.. పరిశీలిస్తున్నాం.. అంటూ వచ్చిన కేంద్రం.. అందులోనూ రాష్ట్రానికి రిక్తహస్తాలను చూపింది. నమ్మి నానబెడితే.. పుచ్చిబుర్రెలయ్యాయన్న చందంగా టీడీపీకి షాక్ తగిలింది. ఎన్డీఏను నమ్మితే నట్టేట ముంచిందని అంగలార్చింది.
అటు రాష్ట్రానికి తాను వచ్చినప్పుడల్లా ఒక ప్రాజెక్టును తీసుకువస్తానని చెప్పిన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఇటు ప్రధానమంత్రి పదవి రేసులో లేకుండా చేసిన పార్టీ అధిష్టానం.. ఆయనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుని రాజకీయాలు చేయకుండా, మాట్లాడకుండా చేసింది. ప్రత్యేకహోదా విషయంలో ఆయనను ఎవరూ వెలెత్తకుండా చేయడంలో బీజేపి సక్సెస్ అయ్యింది. దీంతో అటు వెంకయ్యకు మొరపెట్టుకోనూ లేక.. ఇటు కేంద్రం నుంచి నిధులు రాక.. చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో ఆయన తన ఎంపీలతో పార్లమెంటు సమావేశాల్లో నిరసనలు చేపట్టాలని అదేశించారు.
చేతులు కాలక అకుటు పట్టుకోవడమెంత వెర్రితనమో అందరికీ తెలిసిందే. సరిగ్గా అదే చందంతో వ్యవహరించిన చంద్రబాబు సర్కారు.. ఇన్నాళ్లు కేంద్రంతో సఖ్యతతో వ్యవహరించి పనులు చక్కబెట్టుకుంటానని చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా అని, తరువాత హోదా సంజీవని కాదని, ఆ తరువాత ప్యాకేజీ ముద్దని, ఆ పిమ్మట.. మళ్లీ బిగ్ యూటార్న్ తీసుకుని హోదా రాష్ట్రప్రజల హక్కు అని. చట్టసభల్లో సాక్షత్తు ప్రధాని చేసిన ప్రకటనకు విలువ ఇదేనా..? అంటూ ప్రశ్నించారు. ఇక దీంతో కేంద్రప్రభుత్వంపై తన వ్యతిరేకతను చాటారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మాణం ప్రవేశపెట్టడం.. ఇక హస్తినకు వెళ్లి ఇటు ఎన్డీయే అటు యూపిఏ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపడం.. అన్ని చకచకా చేశారు. ఇక అప్పటి నుంచి వారానికో విధంగా ప్రజల్లో వుండే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇదే ప్రధానిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే ఏపీకి ప్రత్యేకహోదా కావాలని.. అదే తమకు సంజీవని అని.. ఇప్పుడు చేస్తున్నట్లుగానే అప్పుడే ప్రజలతో ఎల్లవేళలా కలిసివుంటూ.. కేంద్ర అవలంభిస్తున్న విధానాలను చెప్పివుంటే.. తప్పక కేంద్రంలోని ప్రభుత్వం రాష్ట్రానికి హోదాను కలిగించేది కాదా.? ఒకసారి హోదా సంజీవని కాదని, మరోసారి అది మా హక్కు అని ప్రజల్లోకి వెళ్తే.. ఎవరు హర్షిస్తారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక దీనికి తోడు ప్రత్యేకహోదా కోసం నినదించే పవన్ కల్యాణ్ వంటి నేతలతో పాటు విపక్షాలను కూడా విమర్శిస్తూ.. కేవలం అసవరానికి అనుగూణంగా అడటం వల్లే రాష్ట్రప్రజల ప్రయోజనాలు పెనం మీద నుంచి పోయ్యిలో పడినట్లు అయ్యాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more