Kcr short political review on his birthday

kcr-1.gif

Posted: 02/17/2012 12:57 PM IST
Kcr short political review on his birthday

kcr-anim

kcr

            రాష్ట్రం లోనే కాకుండా దేశవ్యాప్తంగా కెసిఆర్ గా సుపరిచితులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంధ్రావిశేష్ కెసిఆర్ జీవిత, రాజకీయ విశేషాలను కొన్నిటిని గుర్తుచేసుకుంటూ, పాఠకులతో పంచుకుంటోంది-

ప్రస్తుతం లోక్ సభ సభ్యులుగా వ్యవహరిస్తున్న కెసిఆర్ మహబూబ్ నగర్ స్థానం నుంచి 15 వ లోక్ సభకు తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి ఆయన సంస్థాపక అధ్యక్షుడు.

మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో ఫిబ్రవరి 17, 1954లో జన్మించిన కెసిఆర్ తెలుగులో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. కోడూరుపాక కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు జె.కేశవరావు కుమార్తె శోభను వివాహమాడారు. ఇద్దరు సంతానం. కొడుకు కె.తారక రామారావు, కూతురు కవిత. తారక రామారావు శాసన సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా సిద్ధిపేట నుంచి శాసన సభకు ఎన్నికై వీరిద్దరూ చేయూతగా నిలిచారు. కూతురు కవిత కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు.

kcr-family

రాజకీయ ప్రస్తానం-

1985లో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా శాసన సభకు ఎన్నికయ్యారు. తెదేపా సభ్యుడిగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగానూ ఉప సభాపతిగానూ వ్యవహరించారు.  కానీ తెలంగాణా రైతులకు కలిగిన విద్యుత్ కొరత వలన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో విభేదాలు వచ్చి ఆ పార్టీ నుండి బయటకు వచ్చేసారు.

తెలంగాణా రైతులే కాకుండా తెలంగాణా ప్రాంతం వెనకబడి ఉండటం, తెలంగాణా ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని, తెలంగాణా ప్రాంతాన్ని ఉద్ధరించటం కోసం తెలంగాణా ప్రజల్లో చైతన్యం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడటం ఎంతైనా అవసరమని గ్రహించిన కెసిఆర్ తెలంగాణా రాష్ట్ర సమితి అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు.

ఆ తర్వాత 2004 లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ, శాసన సభ ఎన్నికలకు పోటీ చెయ్యగా 5 లోక్ సభ స్థానాలు, 24 శాసన సభ స్థానాలు లభించాయి. కేంద్రంలో యుపిఏ ప్రభుత్వ మిత్ర పక్షంలో చేరినా, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు కేంద్ర సహకరించటంలేదని తెలిసి యుపిఏ మిత్ర కూటమి నుంచి ఉపసంహరించుకున్నారు.

2009లో మరోసారి ఎన్నికలలో పోటీచేసారు. ఈసారి ప్రతిపక్షంతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్ళారు.

వేరే చిన్న చిన్న ప్రయోగాలతో రాష్ట్ర విభజన జరిగేటట్టుగా లేదని తెలుసుకుని నవంబర్ 2009 లో కెసిఆర్ ఆమరణ దీక్షను చేపట్టారు. ఆయన పరిస్థితి విషయమంగా మారటంతో వైద్యులు, ప్రభుత్వాధికారులు దీక్షను విరమించమని పట్టుబట్టారు కానీ ఆయన వినలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. డిసెంబర్ 9 న కేంద్ర హోం మంత్రి చిదంబరం, రాష్ట్ర విభజనకు సుముఖంగా ఉన్నట్టు వెల్లడించారు.

kcr-deeksha11 రోజుల దీక్షానంతరం శారీరకంగా బలహీనంగా తయారైన కెసిఆర్ రాజకీయంగా శక్తివంతంగా ఎదిగారు. తెలంగాణా ప్రజలంతా ఆయనకు బాసటగా నిలిచారు. విద్యార్థి లోకం నడుం బిగించి ముందుకొచ్చింది. ఉద్యోగులు, అధికారులు, నిరుద్యోగులు, శ్రామికులు, వ్యాపారులు, లాయర్లు, ఇలా నెమ్మది నెమ్మదిగా అన్ని వర్గాల్లోంచీ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కెసిఆర్ కి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొనటానికి తయారయ్యారు. చిదంబరం చేసిన ప్రకటన అమలు పరచకపోవటంతో తిరిగి ఆందోళన కొనసాగించటానికి పూనుకున్నప్పుడు తెలంగాణా ప్రాంత వ్యాప్తంగా వచ్చిన మద్దతు ఆయనకు బాగా పనికివచ్చింది.

rally

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ సంఘం (జెఏసి) కెసిఆర్ కి తోడుగా ఆందోళనల్లో పాల్గొన్నది. తెరాస, ఐకాస ల సయోధ్యతో సాగించిన సకల జనుల సమ్మె దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన ఆందోళనగా పేరు తెచ్చుకుంది. వీరి పిలుపు మేరకు అన్ని విభాగాల నుంచీ సమ్మెలో పాల్గొనటం, రాస్తారోగోలు, రైల్ రోకోలు, ర్యాలీలు, దీక్షలు, ప్రభుత్వ సేవల్లో సహాయ నిరాకరణ లాంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి తెలంగాణా ఆందోళనను తాజాగా ఉంచుతూ వస్తున్నారు.

కెసిఆర్ కూతురు కవిత మాటల్లో చెప్పాలంటే, "ఆయన ఏది రైట్ అని అనుకుంటే అదే. ఎవరు ఏం చెప్పినా వ్యతిరేకించినా వెక్కిరించినా సరే తను రైట్ అని అనుకున్నదే చేస్తారు. ఎన్నికల్లో ఆయన ఎప్పుడూ మద్యాన్ని పంచలేదు. ఓడిపోయినా పర్వాలే కానీ నేనొక పాలసీ పెట్టుకున్నా, అదే ఫాలో అవుతానంటారు. అంత మొండి. అంతేకాదు, మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే ఫలితం చెడుగనే ఉంటదని చెప్తుంటారు. ఆయన ప్రిన్సిపుల్ ఆఫ్ నాచురల్ జస్టిస్ ని బాగా నమ్ముతారు."

తెలుగు సాహిత్యం మీద పట్టు ఉండటమే కాకుండా, చారిత్రక రాజకీయ సంఘటనల మీద మంచి అవగాహన కలిగిన కెసిఆర్ తన ఉపన్యాసాల ద్వారా తెలంగాణా ప్రజలను చైతన్యపరచటమే కాక, కాక తగ్గకుండా కూడా చేస్తూ పోయారు. ఇక్కడ సమ్మె సెగ అక్కడ పార్లమెంటులో తగలాలె అన్న కెసిఆర్, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అవతరణ కోసం పార్లమెంటుని స్థంబింపజేసారు.

rail-rokoతెలంగాణా రాజకీయ, ఉద్యమ క్షేత్రంలో కెసిఆర్ మకుటంలో ఎన్నో తురాయిలు చోటు చేసుకున్నాయి. అందులో రాజీనామా ప్రక్రియ ప్రత్యేకతను, విశేషాన్ని సంతరించుకుంది. తెలంగాణా కోసం రాజీనామా చేస్తున్నామని చెప్తూ తన పార్టీలో ప్రజాప్రతినిధులతోనే కాకుండా, ఇతర పార్టీలు, ముఖ్యంగా పాలకపక్షంలోని నాయకులచేత కూడా రాజీనామా చేసే పరిస్థితిని కలిగించిన కెసిఆర్ రాజనీతిని మెచ్చుకోని వారెవరూ ఉండరనటంలో అతిశయోక్తి లేదు. పైకి ఒప్పుకోకపోవచ్చు కానీ ఊకుమ్మడి రాజీనామాలు, సకల జనుల సమ్మె, ఈ రెండూ తెలంగాణా ఉద్యమంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఘన విజయాలు.

వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చెయ్యాలన్న సామెతకు తగ్గట్టుగా రాజకీయాల్లో కూడా ఏం చేసైనా సరే, అనుకున్నది సాధించుకోవటం తప్పనిసరి. ఇతర రాజకీయ పార్టీలను తెలంగాణా ప్రాంతంలో అడుగుపెట్టటానికే భయపడే స్థితికి తీసుకువచ్చిన ఘనత కూడా కెసిఆర్ దే. కెసిఆర్ నాయకత్వంలో తెరాస పార్టీ తెలంగాణా ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకు తీసుకునివచ్చే ప్రయత్నం చేసింది.

chandi-homamఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏ ప్రకటన చేసినా, ఏ నిరసన చూపించినా, ఎటువంటి సవాల్ విసిరినా అన్నిటికీ వెనుక ఏకైక లక్ష్యంతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కెసిఆర్ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆయన చేసే చండీయాగం కూడా యాగ ఫలాన్ని తెలంగాణా సాధన కోసమే అర్పించటం కోసమే జరుగుతోంది.

ఈ సందర్భంగా ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేద పండితులు సూచించిన విధంగా ఆశ్లేష నక్షత్రం లో జన్మించిన కెసిఆర్ కి నిన్న చేసిన నక్షత్ర యాగం, ఈరోజు చండీ యాగంతో ఆయన అభీష్ట సిద్ధి కలగాలని కోరుతూ,

-ఆంధ్రావిశేష్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor tagubothu ramesh interview
Interview with director sukumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles