‘అలా మొదలైంది’ క్లైమాక్స్‌లో తాగొచ్చి నానా గొడవా చేసి, అందరినీ కడుపుబ్బ నవ్వించిన వ్యక్తి గుర్తున్నాడుగా! తాగినట్టు నటించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుని, తన పేరుముందు ‘తాగుబోతు’ అని చేర్చుకున్న ఆ నటుడు... రమేష్. తను అంత బాగా నటించడానికి స్ఫూర్తి తన తండ్రే అంటూ రమేష్ ‘ఫన్డే’తో మనసు విప్పి చెప్పిన ముచ్చట్లు...
మీ ఊరు, కుటుంబం...?
మాది కరీరంనగర్ జిల్లా, గోదావరిఖని. అమ్మానాన్నలిద్దరూ చనిపోయారు. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక చెల్లి.
నటనపై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పట్నుంచీ మిమిక్రీ చేసేవాడిని. పండుగలప్పుడు ఫ్రెండ్సంతా స్టేజిమీద నాతో మిమిక్రీ చేయించేవారు. ఘంటసాల పాటలు పాడే శంకర్ అనే అన్న సినిమాల్లోకి వెళ్తే గొప్ప నటుడివవుతావు అన్నాడు. అప్పుడే నటనమీద ఆసక్తి మొలకెత్తింది.
తొలి అడుగులు ఎలా పడ్డాయి?
మా అమ్మ టీబీతో చచ్చిపోయాక ఏదో ఒకటి చేసి జీవితంలో స్థిరపడాలను కున్నాను. మా బంధువయిన మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యు దగ్గర పనిలో కుదిరాను. తర్వాత నాన్న కూడా చనిపోవడంతో బాధ్యతలు మీద పడ్డాయి. అన్న దమ్ములంతా కలిసి చెల్లెలి పెళ్లి చేశాం. బాధ్యతలు తీరిపోయాయి కాబట్టి సినిమా ఫీల్డ్‌కి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నా. అన్నయ్యలు నన్ను ప్రోత్సహించి, దీక్షితులుగారి ‘అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో చేర్పించారు.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. అవకాశాలెప్పు డొస్తాయో తెలీదు కాబట్టి ముందు పార్ట్‌టైమ్ జాబ్‌లో చేరాను. తీరిక వేళల్లో ఫొటోలు పట్టుకుని ఆఫీసులకు తిరిగేవాడిని. అలా కొన్నాళ్లు తిరిగాక ‘జగడం’లో అవకాశం వచ్చింది.
ఆ తరువాత...?
‘జగడం’ చేస్తున్నప్పుడే వేణు, ధనరాజ్, ‘చిత్రం’ శ్రీను, మరికొంతమంది పరిచయమయ్యారు. అప్పటికే వాళ్లు చాలా యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ల ద్వారా ఏడెనిమిది సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘వాడే కావాలి’ సినిమా చేస్తున్నప్పుడు ‘చిత్రం’ శ్రీను నన్ను ఉత్తేజ్‌కి పరిచయం చేశాడు. ఆయన, మరికొందరి ద్వారా ‘మహాత్మ’లో ఛాన్స్ వచ్చింది. దాంతో పూర్తిస్థాయి నటుడినయ్యాను. అయినా కృష్ణవంశీ సినిమాలో చేసినవాడికి ‘వీడు నటుడు’ అని మార్క్ పడినట్టే!
‘అలా మొదలైంది’ అవకాశం ఎలా వచ్చింది?
‘మహాత్మ’ చేసేటప్పుడు రచయిత లక్ష్మీభూపాల్ లొకేషన్‌కి వచ్చేవారు. ‘నిజంగా తాగినోడికంటే బాగా చేస్తున్నావు’ అంటూ ఉండేవారు. ఆయన నందినీరెడ్డికి నా గురించి చెప్పారు. ‘భీమిలి కబడ్డీజట్టు’ నుంచీ నానితో పరిచయం ఉండటంతో నేనూ తనని అడిగాను. దాంతో ‘అలా మొదలైంది’లో అవకాశం దొరికింది. ఒక్కసారిగా నా జీవితం మలుపు తిరిగింది.
తాగుబోతుగా అంత నేచురల్‌గా ఎలా చేయగలుగుతున్నారు?
దానికి కారణం మా నాన్న. ఆయన బొగ్గు గనిలో తట్ట మోసేవాడు. అది చాలా కష్టమైన పని. దాంతో ఆ శ్రమను మర్చిపోడానికి బాగా తాగేవాడు. ఆయన్ని నేను బాగా గమనించేవాడిని. అమ్మ డల్‌గా ఉన్నప్పుడు నాన్నను అనుకరించి నవ్వించే వాడిని. అందరూ తాగుబోతులా అద్భు తంగా చేస్తున్నాననేవారు. అసలు ఆ తాగు బోతు నటనను నమ్ముకునే ఫీల్డ్‌కొచ్చాను.
బయటికి వెళ్లినప్పుడు జనం స్పందన...?
‘తాగుబోతు రమేష్’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. చాలామంది ‘నిజం చెప్పు తమ్ముడూ, నువ్వు తాగే అలా నటించావు కదా’ అని అడుగుతుంటారు.
‘తాగుబోతు’ రమేష్ అంటుంటే బాధగా లేదా?
లేదు. పైగా చాలా గర్వంగా ఫీలవుతాను. ఆ పాత్రల వల్లేగా ఇవాళ ఇలా ఉన్నాను!
కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్...?
‘కళ్లు’ సినిమా దర్శకుడు ఎం.వి.రఘుగారు మా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ ప్రాక్టికల్స్‌కి వచ్చేవారు. ఆయననేవారు- ‘తాగుబోతు నటనలో కేస్టో ముఖర్జీ (బాలీవుడ్ నటుడు) తర్వాత నువ్వే అంత గొప్ప నటుడివి’ అని. అలాగే నన్ను పీఎల్ నారాయణ, ఎమ్మెస్ నారాయణలతో పోలుస్తారు. అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది!
మీలో మీకు నచ్చేది/నచ్చనిది?
నేను నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాను. వాళ్ల కోసం ఏదైనా చేస్తాను. అది నాలో మంచి లక్షణం. ఇక నచ్చనిదంటే... నా తప్పు లేనప్పుడు ఎవరైనా నన్ను నిందిస్తే తెగ వాదిస్తాను. నేను మంచోణ్నని నాకు తెలుసు, వాళ్లకు తెలియాలని లేదుగా. అలాంటప్పుడు ‘నువ్వొక్కడివే మంచోడివా’ అని విసుక్కుంటారు. ఆ అలవాటు కాస్త తగ్గించుకోవాలి నేను.
ఫ్యూచర్ ప్లాన్స్...?
‘రచ్చ’, ‘ఈగ’లతో పాటు మరికొన్ని చేస్తున్నాను. కొన్నింట్లో తాగుబోతుగా, కొన్నింట్లో మామూలుగా. అన్ని రకాల పాత్రలూ చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. మా అన్నలకు, చెల్లెలికి ఏ లోటూ రాకుండా చూసుకోవాలి. ఇంతకుమించి పెద్ద పెద్ద లక్ష్యాలేమీ లేవు.
నాకు తాగుబోతు నటన తప్ప మరేమీ రాదని కొందరు కామెంట్ చేస్తుంటే బాధనిపిస్తుంది. నాన్నను చూసీ చూసీ ఆ నటన నా బ్లడ్‌లో ఇంకిపోయింది కాబట్టి బాగా చేస్తాను. అలాగని అది మాత్రమే వచ్చనుకోకూడదుగా! ‘భీమిలి కబడ్డీజట్టు’లో హీరో చచ్చిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే, షూటింగ్ చూడ్డానికొచ్చినవాళ్లు నన్ను చూసి... ‘ఆ పిల్లాణ్ని చూడండి, నిజంగా చచ్చిపోయినట్టే ఎలా ఏడుస్తున్నాడో’ అన్నారు. అంటే నాకు మామూలు నటన కూడా వచ్చనేగా!
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more