అటల్ బిహారీ వాజపేయి (జ.డిసెంబరు 25 1924) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభ కు ఎన్నికైనారు. మధ్యలో వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోకసభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీ కి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. అతడు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన ఆరోగ్య కారణంగా క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబరు 24, 2014 లో భారతరత్న పురస్కారాన్ని పొందినట్లు ప్రకటించారు. ఆయన పుట్టినదినం అయిన డిసెంబరు 25 ను సుపరిపాలనా దినం గా భారత ప్రభుత్వం ప్రకటించింది.
భారతరత్న అయిన అటల్ బిహారీ వాజపేయి డిసెంబరు 25 1924 న గ్వాలియర్ నందలి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు క్రిష్ణాదేవి మరియు కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని భటకేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి వారి నివాస ప్రాంతలో ఒక ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేజి గ్వాలియర్ లోణి సరస్వతి శిశు మందిర్ నందు విద్యాభ్యాసం చేశారు. వాజపేయి గ్వాలియర్ విక్టోరియా కాలేజి (ప్రస్తుతం లక్ష్మీబాయి కాలేజి) లో చేరి హంది,ఆంగ్లము మరియు సంస్కృతం నందు అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. ఆయన రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను కాన్పూరు నందలి దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి పొందారు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.
ఆయన గ్వాలియర్ లోని ఆర్య సమాజం అనే యువ విభాగంలో ఆర్య కుమార్ సభా తో కలసి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన 1944లో ఆ విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) లో కూడా చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతొ ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హారరైనాడు. ఆయన 1947 లో "పూర్తి కాల సేవకుడు" గా మారారు. దీనిని సాంకేతికంగా ఆర్.ఆర్.ఎస్.ప్రచారక్ గా పిలుస్తారు. ఆయన విభజన హక్కుల కోసం న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించారు.
ఆయన ఉత్తరప్రదేశ్ లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క వివిధ పత్రికలైన "రాష్ట్రధర్మ" (హిందీ మాసపత్రిక) , "పాంచజన్య"(హిందీ వారపత్రిక) మరియు దిన పత్రికలైన "స్వదేశ్" మరియు "వీర్ అర్జున్" లలో పనిచేయుటకు ప్రచారక్ గా పంపబడ్డాడు. వాజపేయి తన జీవితకాలంలో వివాహమాడకుండా బ్రహ్మచారిగా జీవించారు.
వాజపేయి ఆగస్టు 1942 లో రాజకీయాలలోనికి మొట్టమొదట ప్రవేశించారు. ఆయన సోదరుడైన "ప్రేమ్" క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో 23 రోజుల పాటు అరెస్టు కాబడిన సమయంలొ ఆయన రాజకీయాలలోనికి ప్రవేశించారు.ఆయన సోదరుడు ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని వ్రాతపూర్వకమైన హామీ యిచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టారు.
1951 లో ఆర్.ఎస్.ఎస్ ద్వారా దీన్ దయాళ్ ఉపాధ్యాయ తో కలసి క్రొత్తగా యేర్పడిన భారతీయ జనసంఘ్ కొరకు పనిచేసే బాద్యతను స్వీకరించారు. ఈ సంస్థ ఆర్.ఎస్.ఎస్ తో కలిసి పని చేస్తున్న హిందూ రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించారు. ఆ తర్వాత శ్యాం ప్రకాశ్ ముఖర్జీ కి అనుచరునిగా మరియు సహాయకునిగా యున్నారు. 1954 లో ముఖర్జీతో కలసి కాశ్మీర్ లో కాశ్మీరీలు కాని సందర్శకుల రక్షణకోసం నిరాహారదీక్ష చేశారు. ముఖర్జీ ఈ సమ్మెకాలంలో జైలులోనే మరణించాడు. 1957లో వాజపేయి భారతదేశ దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికైనారు.ఈయన బల్‌రామ్‌పురం నుండి ఎన్నికైనారు. ఆయన అసాధారణ నైపుణ్యాల మూలంగా ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు.
ఆయనకు గల వాగ్ధాటి మరియు సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్ లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ యొక్క మొత్తం భాద్యత యువ వాజపేయిపై పడింది. ఆయన 1968 లో జనసంఘ్ కు జాతీయ అధ్యక్షునిగా ఎదిగారు. ఆయనతో పాటుగా నానాజీ దేశ్‌ముఖ్ , బాల్‌రాజ్ మధోక్ మరియు లాల్ కృష్ణ అద్వానీ లో పాటుగా జనసంఘ్ ను నడిపించారు.
1975 నుండి 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారత ప్రధాని అయిన శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు కాబడినారు. 1977 లో సంఘసంస్కర్త అయిన జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలతో కలసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాడు. వాజపేయి జనస్ంఘ్ ను క్రొత్తగా యేర్పడిన గ్రాండ్ అలియన్స్ అయిన జనతాపార్టీ లో విలీనం చేశారు.
1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మురార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖామాత్యులుగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగాన్నిచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఆ సమయంలో 1979లో జనతా ప్రభుత్వం విఛ్ఛిన్నం జరిగిన తదుపరి వాజపేయి స్వంతంగా గౌరవప్రదమైన రాజకీయవేత్తగా ఎదిగారు. జనతాపార్టీ 1979లో మురార్జీదేశాయ్ రాజీనామా చేయడంతో రద్దుకాబడినది. జనసంఘ్ జనతాపార్టీలో కలసి ఒక సంకీర్ణపార్టీగా కొనసాగడానికి అంగీకరించినా జనతాపార్టీలోని అంతర్గత విభేదాలవల్ల బయటకు వచ్చింది.
వాజపేయి జనసంఘ్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అధ్వానీ మరియు భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీ ని యేర్పరిచారు. ఆ తర్వాత ఆయన బి.జె.పి అధ్యక్షునిగా యున్నారు. ఆయన జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా నేషనల్ కాంగ్రెస్ కు బలమైన విమర్శకునిగా అవతరించారు.
భారతీయ జనతాపార్టీ సిక్కు తీవ్రవాదులు పంజాబ్ రాష్ట్ర అవతరణ కోసం పోరాడటాన్ని వ్యతిరేకించాడు. ఆయన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని "విభజన మరియు అవినీతి రాజకీయాలు మూలంగా జాతీయ సమైక్యతకు వ్యయంతో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం" గూర్చి నిందించాడు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బ్లు స్టార్ ను వ్యతిరేకించింది. 1984 లో ఇద్దరు సిక్కు అంగరక్షకులచే ఇందిరాగాంధీ హత్యకు గురికాబడటం తదుపరి ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను ఖండించింది. 1984 ఎన్నికలలో బి.జె.పి రెండు సీట్లను మాత్రమే పొందింది. ఆ కాలంలో వాజపేయి బి.జె.పి అధ్యక్షునిగా మరియు విపక్ష నాయకునిగా కూడా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ రాజకీయ నినాదంగా విశ్వహిందూ పరిషత్ మరియు ఆర్.ఎస్.ఎస్ తో కలసి ఉద్యమిస్తున్న రామ జన్మభూమి మందిర ఉద్యమం ను చేపట్టింది. ఈ ఉద్యమం అయోద్యలో రామమందిరం నిర్మాణం కోసం చేయబడినది. దీని కారణంగా 1995 మార్చిలో గుజరాత్ మరియు మహారాష్ట్ర లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని సాధించింది. 1994లో కర్ణాటక లో జరిగిన అసెంభ్లీ ఎన్నికలలో మంచి విజయాలను సాధించింది. ఈ విధంగా పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 1995 నవంబరులో ముంబాయి నందు జరిగిన బి.జె.పి సమావేశంలో బి.జె.పి అధ్యక్షుడైన లాల్ కృష్న అధ్వానీ వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. మే 1996 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి విజయం సాధించింది. వాజపేయి మూడు దశలుగా 1996 నుండి 2004 ల మధ్య ప్రధానమంత్రిగా బాద్యతలు నిర్వహించారు.
భారతీయ జనతాపార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో బి.జె.పి అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ఆనాటి అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వాజపేయిని ప్రభుత్వం యేర్పాటు చేయుటకు ఆహ్వానించారు. అపుడు వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ బి.జె.పి మిగిలిన పార్టీల మద్దతును పొందలేకపోయింది. 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటులో మెజారిటీ పొందలేకపోవడం మూలంగా రాజీనామా చేయవలసి వచ్చింది.
1996 మరియు 1998 లలో రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్‌సభ రద్దు కాబడినది.మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అన్ని పార్టీల కంటె అత్యధిక స్థానాలను కైవశం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్ని బి.జె.పిలో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గా యేర్పడ్డాయి. వాజపేయి రెండవసారి ప్రధానమంత్రిగా భాద్యతలు నిర్వహించారు.
ఎన్.డి.ఎ పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. ప్రభుత్వంలో సంకీర్ణ భాగమైన జయలలితకు చెందిన ఎ.సి.డి.ఎం.కె మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది.[14] ఈ ప్రభుత్వం ఏప్రిల్ 17, 1999 లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ఓడిపోయింది. విపక్షాలలో ఎవరూ ప్రభుత్వం యేర్పాటుకు అవసరమైన మెజారిటీని కలిగి యుండనందున మరలా లోక్ సభ రద్దయినది. మరలా ఎన్నికలు జరిగాయి. మరలా ఎన్నికలు జరిగిన వరకూ వాజపేయి ప్రధానమంత్రిగా కొనసాగారు.
మే 1998 లో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్ష 24 సంవత్సరాల తరువాత అనగా 1974 లో జరిగిన "ప్రోఖ్రాన్--I" తరువాత జరిగినది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్--II" గా పిలుస్తారు. ఈ పరీక్షలు ప్రభుత్వం యేర్పడిన నెలరోజుల తర్వాత జరిగినవి. రెండు వారాల అనంతరం పాకిస్థాన్ స్పందించింది. ఈ పరీక్షకు రష్యా,ఫ్రాన్స్, సమర్థించాయి. మరికొన్ని దేశాలు యు.ఎస్.ఎ, కెనడా, జపాన్, బ్రిటన్ మరియు యూరోపియన్ దేశాలు భారతదేశం సమాచారం, వనరులు మరియు సాంకేతిక అంశాలపై ఆంక్షలు విధించాయి.
1988 చివరలో మరియు 1999 మొదట్లో వాజపేయి పాకిస్థాన్ తో శాంతి కోసం చర్యలు ప్రారంభించారు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును ఫిబ్రవరి 1999 లో ప్రారంభించారు. వాజపేయి కాశ్మీర్ సమస్యను పరిష్కరించుటకు పాకిస్థాన్ తో నూతన శాంతి ఒప్పందానికోసం పాకిస్థాన్ ను ఆహ్వానించాడు.
కార్గిల్ యుద్ధం , భారత్ పాకిస్తాన్ మధ్య మే - జులై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి(వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలు మరియు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలు బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది. వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).
కార్గిల్ పరిణామాల తరువాత జరిగిన 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తో కూడిన ఎన్.డి.ఏ కు 303 స్థానాలు వచ్చాయి. అపుడు భారత దేశ పార్లమెంటులో స్థిరమైన మెజారిటీని పొందినందున వాజపేయి మూడవసారి అక్టోబరు 13,1999 న ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
డిసెంబర్ 1999 లో జాతీయ సంక్షోభం ఉద్భవించింది. ఖాట్మాండు నుండి న్యూఢిల్లీ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం-814 ను ఆప్ఘనిస్థాన్ కు చెందిన తాలిబాన్ టెర్రరిస్టులు హైజాక్ చేశారు. హైజాకర్లు అనేక డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. వాటిలో భారత జైలులో ఉన్న మౌలానా మసూద్ అజహర్ అనే టెర్ర్రరిస్టును విడిచిపెట్టాలనేది. అప్పటి విదేశాంగమంత్రి ఐన జశ్వంత్ సింగ్ ఆప్ఘనిస్థాన్ వెళ్ళీ అజహర్ ను అప్పగించి ప్రయాణీకులను విడుదల చేయించారు.
ఆయన పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక మరియు మౌలిక సంస్కరణలను చేపట్టారు.వాటిలో ప్రైవేటు సెక్టారును మరియు విదేశీ ఇన్వెస్టుమెంట్లను ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించారు. యు.పి.ఎ ప్రభుత్వం జూలై 1, 2013 లో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం గత 32 సంవత్సరాలోని రోడ్లలో సగం 5 సంవత్సరాలలోనే అభివృద్ధి చెందాయని సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది.
వాజపేయి యొక్క ముఖ్య ప్రాజెక్టులు "నేషనల్ హైవే డెవలప్ మెంటు ప్రాజెక్టు" మరియు "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన". మార్చి 2000 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు అయిన బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించారు. అప్పటికి 22 సంవత్సరాల తర్వాత భారత దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంభంధాల పురోగతికి ముఖ్య మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సందర్శనకు పూర్వము భారత్ లో ప్రోఖ్రాన్ పరీక్షలు మరియు కార్గిల్ యుద్ధం జరిగినవి. ఈ విధానాలు యు.ఎస్. విదేశీవిధానంలో ముఖ్యంగా ప్రతిబించాయి. భారత ప్రధానమంత్రి మరియు అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక సమస్యలపై చర్చలు జరిపారు.కానీ ప్రధాన సాధనగా వాణిజ్య మరియు ఆర్ధిక సంబంధాలు లో ఒక గుర్తించదగిన విస్తరణ జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో చారిత్రక విజన్ డాక్యుమెంట్ పై ఈ పర్యటన సందర్భంగా ప్రధాని వాజపేయి మరియు అధ్యక్షుడు క్లింటన్ సంతకం చేసారు.
బి.జె.పి ప్రభుత్వం దాని సైద్ధాంతిక గురువు అయిన అర్.ఎస్.ఎస్. ఒత్తిడికి తలొగ్గింది. దాని ఫలితంగా విశ్వహిందూ పరిషత్ యొక్క హిందూత్వ అజెండాను తీసుకుంది. కానీ దాని భాగస్వామ్య పక్షాల మద్ధతుతొ కొనసాగుచున్నందున అయోద్యలో రామమందిరం నిర్మాణం మరియు కాశ్మీర్ స్వయంప్రతిపత్తి గూర్చి ఆర్టికల్ 370 మార్పు లేదా ఉమ్మడి సివిల్ కోడ్ వంటి అంశాలను తీసుకురావడానికి కష్టతరమైనది. జనవరి 17, 2000 లో ఆర్.ఎస్.ఎస్. నివేదికలు మరియు బి.జె.పి లోని కొంతమంది నాయకులు జనసంఘ్ ను పునః ప్రారంభించాలని నిర్ణయించడం వాజపేయి పరిపాలనపై వారి అసంతృప్తిని తెలియజేశాయి. పూర్వపు జనసంఘ్ అధ్యక్షుడైన బాలరాజ్ మడోక్ ఆర్.ఎస్.ఎస్. అధ్యక్షుడైన రాజేంద్రసింగ్ కు మద్దతు ఇవ్వవలసినదిగా లేఖ వ్రాసారు.
బి.జె.పి కాషాయీకరణ ను విద్యావిధానంలో చేర్చుతున్నదనే ఆరోపనలనెదుర్కొన్నది. అప్పటి హోం మంత్రి ఎల్.కె.అధ్వానీ మరియు మానవ వనరుల మంత్రి అయిన మురలీ మనోహర్ జోషీ లు 1992 లో జరిగిన బాబ్రీమసీకు కేసులో నేరాన్ని మోపబడ్డారు.వాజపేయి మరియు యితర బి.జె.పి నాయకులు చేసిన వివాదాస్పద ప్రసంగం మసీదు కూల్చివేతకు ముందురోజు జరిగినదని ప్రజా పరిశీలనకు వచ్చింది. న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్షతన 2009 నివేదిక, మసీదు విధ్వంసానికి 68 మందిని నిందితులుగా పేర్కొంది, వారిలో పెక్కుమంది బి.జె.పి. నాయకులు మరియు కొద్దిమంది బ్యూరాక్రాట్లు ఉన్నారు. నివేదికలో పేర్కొన బడిన వారిలో మాజీ ప్రధాని మంత్రి ఎ.బి.వాజ్‌పేయి, (2009) నాటి పార్టీ పార్లమెంటు నాయకుడు ఎల్.కె.అద్వానీ ఉన్నారు. నివేదికలో మసీదు విధ్వంస సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ కఠిన విమర్శలకు గురయ్యారు. అయోధ్యలో మసీదు యొక్క విధ్వంస సమయంలో మౌనంగా ఉండిపోయిన పోలీసు అధికారులను, ఉన్నతాధికారులను నియమించినందుకు అతడు నిందింపబడ్డాడు. లిబర్హాన్ కమీషన్ నివేదికలో ఎన్డీయే ప్రభుత్వంలో మాజీ విద్యామంత్రి మిస్టర్. మురళీ మనోహర్ జోషి కూడా నేరస్తుడయ్యాడు. ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా ఇండియన్ పోలీస్ అధికారిణి అంజూ గుప్త హాజరయ్యింది. విధ్వంసం జరిగిన రోజున ఆమె అద్వానీ యొక్క భద్రతాధికారిణిగా ఉంది మరియు అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసారని ఆమె బయటపెట్టింది.
అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ముడుపుల వ్యవహారంపై 2001లో తెహల్కా డాట్ కాం అనే వార్తాసంస్థ స్టింగ్ ఆపరేషన్ (రహస్య దర్యాప్తు) నిర్వహించింది. ఆయుధాల డీలర్‌గా వచ్చిన ఓ విలేకరి లక్ష్మణ్‌కు ఒక కాంట్రాక్ట్‌కోసం లక్ష రూపాయలు ముడుపులిచ్చారు. రహస్యంగా అమర్చిన కెమెరాలు బంగారు లక్ష్మణ్ లంచం తీసుకోవడాన్ని చిత్రీకరించాయి. నకిలీ రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు నకిలీ ఆయుధ డీలర్లతో లాలూచిపడి బంగారు లక్ష్మణ్ లంచం తీసుకుంటున్నట్టు తెహల్కా డాట్ కాం చిత్రించి, వెలుగులోకి తెచ్చిన ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వాజపేయి భారత పాకిస్థాన్ ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుటకు గాను ఆగ్రా ఒప్పందం కొరకు పాకిస్థాన్ అద్యక్షుడు అయిన ఫర్వేజ్ ముషారప్ ను ఢిల్లీ కి ఆహ్వానించాడు. అంతకు ముందు కార్గిల్ యుద్ధం జరగడానికి ముఖ్య ప్రణాళిక చేసిన వ్యక్తిని ఆహ్వానించడం ఈ ప్రతిష్టంబన ను తొలగించడానికి చేసిన ప్రధాన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. డిల్లీ రావడానికి ముషరాఫ్ అంగీకరించారు. ముషరప్ మరియు వాజపేయి ల మధ్య జరిగిన చర్చలు జరిగినాయి. వాజ్ పేయి ఇప్పుడు రాజకీయాల నుండి విరామం తీసుకొని కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారు.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more