Bapu was an Indian film director and screenwriter known for his works in Telugu cinema

Bapu was an indian film director and screenwriter known for his works in telugu cinema

Bapu, Sattiraju Lakshmi Narayana, Bapu cinemas, film director, screenwriter, Telugu cinema

Sattiraju Lakshmi Narayana, known professionally as Bapu, was an Indian film director, and screenwriter known for his works in Telugu cinema. He was also a music artist, painter, illustrator, cartoonist, and designer.

తెలుగింటిని సుసంపన్నం చేసిన ఋషి బాపు

Posted: 12/16/2015 04:20 PM IST
Bapu was an indian film director and screenwriter known for his works in telugu cinema

కార్టూనిస్ట్‌గా, పెయింటర్‌గా, ఇల్లేస్టేటర్‌గా, రచయితగా, దర్శకుడిగా పలు విభాగాల్లో రాణించిన బాపు అసలు పేరు సత్తి రాజు లక్ష్మీ నారాయణ. 1933, డిసెంబర్‌ 15వ తేదీన నర్సాపురం (వెస్ట్‌ గోదావరి)లో జన్మించారు. బి.కాం., బి.ఎల్‌. పూర్తి చేసిన బాపు తొలుత పొలిటికల్‌ కార్టూనిస్ట్‌గా 'ఆంధ్రపత్రిక'కు పనిచేశారు.  రామాయణం, మహాభారతంలోని పాత్రల్ని ఆధారంగా తీసుకుని ఆయన గీసిన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. అంతేకాదు తనకంటూ ఓ ప్రత్యేక అక్షరశైలిని కూడా రూపొందించి అందరి మన్ననలు పొందారు. ఆయన డిజైన్‌ చేసిన 'బాపు' ఫాంట్స్‌ అధిక ప్రాచుర్యంలో ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. బాపు గీసిన బొమ్మలతో విడుదలైన 'అమరావతి కథలు', పిల్లలకు సంబంధించి 'బుడుగు' వంటివి విశేష ఆదరణ పొందాయి. అలాగే పబ్లిసిటీ డిజైనర్‌గా కూడా పనిచేశారు. ఆయన చిత్రాల్లోని కథా, కథనాలు.. పాత్రలు.. ఆ పాత్రల తీరు తెన్నులు.. ఇలా ఏది తీసుకున్నా తెలుగుదనానికి ప్రతీకలుగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటని నిరూపించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి అందాల్ని, పల్లెటూరి సోయగాల్ని వెండితెర మీద అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత కూడా బాపుకే దక్కుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

బాపు జీవితంలో అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం.. బాపు, రమణల స్నేహం. బాల్యం నుంచి ప్రారంభమైన వీరిద్దరి స్నేహం ఎటువంటి విభేదాలు లేకుండా కడవరకు సాగింది. ఈ ఇద్దరూ నర్సాపురంలోని టేలర్‌ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. 14 ఏళ్ళ వయసులో ముళ్ళపూడి వెంకటరమణ 'అమ్మ మాట వినకపోతే' అనే పేరుతో ఓ షార్ట్‌ స్టోరీ రాశారు. ఆ స్టోరీకి బాపు బొమ్మల్ని వేశారు. పిల్ల్లల మ్యాగజైన్‌ 'బాల'లో ఆ కథ ప్రచురితమైంది. ఇక్కడ్నుంచి ప్రారంభమైన వీరిద్దరి స్నేహం సినిమాల్ని రూపొందించే వరకు వచ్చింది. కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన 'సాక్షి' (1967) చిత్రంతో బాపు దర్శకుడిగా సరికొత్త బాధ్యతలు చేపట్టారు. బాపు దర్శకుడిగా మారటానికి ఆప్తమిత్రుడు రమణే కారణమని బాపు పలు సందర్భాల్లో చెప్పారు. తొలి చిత్రం 'సాక్షి' ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది బాపుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో ఆయన మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఈ ఇద్దరు 66 ఏళ్ళకు పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు, కలసికట్టుగా తమ రంగంలో విశేష కృషి చేశారని చెబితే.. ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర్లేదు.
'
సాక్షి' చిత్రం తర్వాత 'బంగారు పిచుక', 'బుద్ధిమంతుడు', 'ఇంటి గౌరవం', 'సంపూర్ణ రామాయణం', 'అందాల రాముడు', 'శ్రీరామాంజనేయ యుద్ధం', 'త్యాగయ్య', 'ముత్యాల ముగ్గు', 'సీతా కళ్యాణం', 'శ్రీ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌', 'భక్త కన్నప్ప', 'స్నేహం', 'మనవూరి పాండవులు', 'గోరంత దీపం', 'తూర్పు వెళ్ళే రైలు', 'వంశ వృక్షం', 'రాజాధి రాజు', 'కలియుగ రావణాసురుడు', 'రాధా కళ్యాణం', 'కృష్ణావతారం', 'పెళ్ళీడు పిల్లలు', 'ఏది ధర్మం ఏది న్యాయం', 'మంత్రి గారి వియ్యంకుడు', 'సీతమ్మ పెళ్ళి', 'పెళ్ళి పుస్తకం', 'మిస్టర్‌ పెళ్ళాం', 'శ్రీనాథ కవి సార్వభౌముడు', 'పెళ్ళి కొడుకు', 'పరమాత్మ', 'రాంబంటు', 'రాధాగోపాళం', 'సుందరకాండ', 'శ్రీరామ రాజ్యం' వంటి తెలుగు చిత్రాలతోపాటు 'హమ్‌ పాంచ్‌', 'బేజుబాన్‌', 'మొహబ్బత్‌', 'వో సాత్‌ దిన్‌', 'ప్యార్‌ కా సిందూర్‌', 'దిల్‌జలా', 'సీతా స్వయంవర్‌' వంటి హిందీ చిత్రాలూ ఉన్నాయి. అలాగే తమిళంలో 'నీతి దేవన్‌ మయగుజిరన్‌' చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

బాపు దర్శకత్వం వహించిన చిత్రాల సరళి చూస్తే వేటికవే వైవిధ్యంగా ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఎటువంటి కథలోనైనా గ్రామీణ నేపథ్యాన్ని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు బాపు పెద్ద పీట వేస్తారని ఆయా చిత్రాలు చెప్పకనే చెప్పాయి. అంతేకాదు ఏనాడూ కమర్షియాలిటీ పాకులాడలేదని కూడా స్పష్టం చేశాయి. వీటితోపాటు షాట్‌ కంపోజింగ్‌, మేకింగ్‌, విజువలైజేషన్‌, నేపథ్య సంగీతం.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిం చారని సినీ విమర్శకులు సైతం అభినందించిన సందర్భాలెన్నో ఉన్నాయి. తెలుగు గడ్డకే పరిమితమై పోయిన అంతర్జాతీయ ఫిల్మ్‌ మేకర్‌గా బాపుకి మంచి పేరు కూడా ఉంది. ఓ కథతో కథా నాయకుడ్ని ఎంతగా ఎలివేట్‌ చేయగలరో అదే స్థాయిలో ప్రతినాయ కుడిని కూడా ఎలివేట్‌ చేయొచ్చని 'ముత్యాల ముగ్గు'లోని రావుగోపాల రావు పాత్ర ద్వారా బాపు నిరూపించారు.

ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సాక్షి' తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అలాగే 'సీతా కళ్యాణం' చిత్రం బిఎఫ్‌ఐ లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోను, చికాగో చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమై ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే 'త్యాగయ్య', 'పెళ్ళి పుస్తకం' చిత్రాలు ఇండియన్‌ పనోరమ విభాగంలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (1991)లో ప్రదర్శితమయ్యాయి. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందించిన 'శ్రీరామ రాజ్యం' చిత్రం సైతం 2011లో జరిగిన గోవా చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమై అందర్నీ అలరించింది.

'ముత్యాల ముగ్గు', 'మిస్టర్‌ పెళ్ళాం' చిత్రాలకుగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డుల్ని సైతం సొంతం చేసుకున్నారు. 'బాలరాజు కథ', 'అందాల రాముడు', 'ముత్యాలముగ్గు', 'పెళ్లి పుస్తకం', 'మిస్టర్‌ పెళ్ళాం', 'శ్రీరామ రాజ్యం' చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఏడు రాష్ట్ర నంది అవార్డుల్ని అందుకున్నారు. 1986లో అత్యంత ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుని పొందారు. అలాగే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టునిస్ట్స్‌ 2001లో లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుతో ఘనంగా సత్కరించారు. తిరుపతి అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వారు రాష్ట్రపతి అవార్డుతో గౌరవించారు. వీటితోపాటు మరెన్నో అవార్డుల్ని, పురస్కారాల్ని బాపు సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో బాపు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంతో సముచితంగా గౌరవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bapu  Sattiraju Lakshmi Narayana  Bapu cinemas  film director  screenwriter  Telugu cinema  

Other Articles