వెంకటేశ్వరరావు ఆలియాస్ చిన్నా ( విష్ణు ) కి ఎవరైనా సాయం చేస్తే వారికి మళ్లీ సాయం చేయాలనే వక్తిత్వం గల మనిషి . చిన్నప్పటి నుండి చలాకీగా ఉండే చిన్నా ఓ పొరపాటు కారణంగా అలేఖ్య (లావణ్య త్రిపాఠీ ) తన కుటుంబానికి దూరం అవుతుంది. పెద్దయిన జర్నలిస్టుగా చేరి ఓ స్టింగ్ ఆపరేషన్ లో మంత్రిగారి బండారం బయటపెట్టడంతో అతన్ని గుండాలు కొట్టడంతో చిన్నాను కాపాడుతుంది అలేఖ్య. అప్పుడే ప్రేమలో పడిన చిన్నాకి చిన్నప్పుడు తాను చేసిన తప్పు వలనే ఆమె కుటుంబానికి దూరం అయిందని తెలుసుకొని ఆమెను తన కుటుంబంతో కలపడానికి ప్రయత్నించే క్రమంలో కొన్ని నిజాలు తెలుస్తాయి. అవి ఏమిటి ? అవన్నింటిని కొసం చిన్నా ఏం చేశాడనేది మిగతా కథ.
మంచు ఫ్యామిలీ నుండి హీరో గా వచ్చిన మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ఆ మద్య కొన్ని హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ, స్టార్ హీరోగా ఎదగలేక పోయాడు. పోయిన సంవత్సరం వచ్చిన ‘దేనికైనా రెడీ ’ సినిమా మోస్తారు హిట్ ఇవ్వడంతో అదే ఊపులో దర్శకుడు వీరు పోట్ల దర్శకత్వంలో ‘దూసుకెళ్తా ’ చిత్రంలో నటించాడు. గత సంవత్సరంలాగే సెంటిమెంటుగా దసరా సీజన్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ‘దూసుకెళ్ళా ’ డో లేదో చూద్దాం.
కొత్తగా ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగు పెట్టినప్పుడు ఏ శైలిలో సినిమాలు తీస్తారో, తరువాతి సినిమాలను కూడా అదే విధంగా తీస్తున్నారు నేటి దర్శకులు. ఇందుకు వీరూ పోట్ల కూడా మినహాయింపు కాదు. గతంతో ఈయన తీసిన ‘బిందాస్ ’ ఫార్మాట్ లోనే తీశాడు. కానీ కేవలం కామెడీని నమ్ముకొని చిత్రాలు తీస్తున్న శీనువైట్ల లాంటి దర్శకులను అచ్చంగా ఫాలో అయ్యాడని అనిపిస్తుంది. ఇప్పటికే బోర్ కొట్టిన ఈ ఫార్మేట్‌లో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేసే ట్విస్టులు గట్రా ఏమీ ఉండవు. ప్రథమార్థం అంతా ఏదో అలా అలా కాలక్షేపం చేసేసి, ద్వితీయార్థంలో హీరోని విలన్ ఇంట్లో ప్రవేశ పెట్టేసి, మేక. పులి ఆట ఆడించాడు. కాకపోతే తెలిసిన ఈ విషయాన్ని ఎంటర్ టైన్ మెంట్‌ని జోడించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుంది. తెరపై ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. జంప్‌లు ఎక్కువ. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా లెంగ్తీగా సాగుతుంది. ఇంట్రవెల్ కార్డు పడేసరికి దూసుకెళ్తా సినిమా ఫలితంపై అనుమానాలూ వచ్చేస్తాయి. సెకండాఫ్ లో కాస్తంత ఫర్వాలేదనిపించి మమ అనిపించాడు. అతని మూడు చిత్రాలు చూసిన తర్వాత వీరు పోట్ల మరీ ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఓకే కానీ ముందు ముందు ఇలాంటి చిత్రాల్నే నమ్ముకుంటే వీరూకి పోటు తప్పదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విష్ణు అనుకున్నంత స్పీడుగా వెళ్ళలేక ఆర్టినరీ బస్సులా ముందుకు వెళ్లవచ్చు.
అంతకు ముందు మాస్, యాక్షన్ కథలతో ప్రేక్షకుల్ని అలరించిన మంచు ఈ చిత్రంలో ఎక్కువ కామెడీనే పండించే ప్రయత్నం చేశాడు. తన మేనరిజమ్ తో బాడీ లాంగ్వేజీతో ఆకట్టుకోవాలనుకున్నాడు. ఈ చిత్రంలో ఢిపరెంటు గెటప్ లో కనిపించిన విష్ణు అంత గ్లామరస్ గా అనిపించలేదు. కాస్ట్యూమ్స్ , హెయిర్ స్టైల్స్ కొత్తగా అనిపిస్తాయి. లావణ్య గత చిత్రంలో కనిపించినంతగా అందంగా కనిపించలేదు. ఈమె క్యారెక్టర్ ఏదో ఉండాలన్నట్లుగా పెట్టారు. పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రావురమేష్, ఆహుతి ప్రసాద్, కోట, అలీ, అన్నపూర్ణ, రఘుబాబు వాళ్ళ పాత్రల మేరకు చేశారు తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక విలన్ క్యారెక్టర్ పోషించిన పంకజ్ అస్సలు సూట్ కాలేదు. కామెడీ పరంగా బ్రహ్మానందాన్ని బాగా ఇన్వాల్స్ చేసినా అతని పాత్రలు పెద్దగా పండలేదు. వెన్నెల కిషోర్ సీన్లు పండాయి.
సాంకేతికత వర్గం
దర్శకుడిగా, రచయితగా, స్ర్కీన్ ప్లే రచయితగా త్రిపాత్రాభినయం చేశాడు వీరూ పోట్ల. అతని సంభాషణలు పర్వాలేదనిపిస్తాయి. రైటర్ గా మాత్రం పూర్తి అవుట్ పుట్ ఇవ్వలేక పోయాడు. కథ విషయానికి వస్తే రొటీన్ స్టోరీని ఎంచుకొని కొత్త దనం లేకుండా తెరకెక్కించాడు. అదే స్టోరీని ఈ ట్రెండ్ కి తగినట్లు తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. వీరూ శైలి శీను వైట్లను అనుకరించినట్లు అనిపిస్తుంది. మణిశర్మ తన ఫామ్ చాటుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. ట్యూన్స్‌లో కొత్తదనం లేదు. పెప్పీ పాటలకు ఆస్కారం ఉన్నా.. ఇవ్వలేకపోయాడు. మెలోడీ అందించినా అక్కడా తన మార్కు చూపిచలేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సినిమా నిడివి మరీ ఎక్కువ ఉంది. ఎడిటర్ జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.