భీమవరంలో ఉండే రాంబాబు (సునీల్ ) చిన్నప్పటి నుండి మహా పిరికివాడు. దానికి తోడు రాంబాబు ఏ అమ్మాయినైనా చూసి ‘పిల్ల బాగుంది..’ అంటే ఆ పిల్లకు మరొకరితో వెంటనే పెళ్లయిపోతుంది. కానీ ఓ గొడవలో రాంబాబుకు తలకు దెబ్బ తలగడంతో ఆసుపత్రికి వెళితే డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మరో పదిరోజుల్లో చనిపోతావని చెప్పడంతో ఊళ్ళో వాళ్ళ సానుభూతి తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి అక్కడ ఏదైనా మంచి పని చేసేద్దామని అక్కడి రౌడీలను కొట్టేస్తాడు. ఈ క్రమంలో ఓసారి నందిని (ఎస్తేర్ ) ని కూడా కాపాడుతాడు. అప్పటి నుండి ఆమె రాంబాబును ప్రేమిస్తున్నా పట్టించుకోడు. ఈలోగ తనకు బ్రెయిన్ ట్యూమర్ లేదని, తన రిపోర్టులు తప్పుగా చెప్పాడని తెలియడంతో , అప్పుడు నందినిని దక్కించుకోవడంతో పాటు తను గొడవపడ్డ రౌడీలందరి నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. వారి ఎలా తప్పించుకున్నాడు ? తన నందిని ప్రేమను గెలుచుకున్నాడా ? లేదా అనేదే మిగతా కథ.
కమేడియన్ స్థాయి నుండి హీరోగా ఎదిగిన సునీల్ గత కొంత కాలం నుండి పూర్తి స్థాయి హీరోయిజం చేస్తూ... తనలోని కామెడీని తొక్కిపెడుతున్నాడు. గతంలో ఈయన బాడీని, డైలాగ్ డెలవరీలను చూస్తేనే నవ్వొచ్చేది సదరు ప్రేక్షకుడికి. కానీ మళ్ళీ ఇప్పుడు హీరోయిజంలో కామెడీ చేసి ప్రేక్షకుల్ని నవ్వించడానికి ‘భీమవరం బుల్లోడు ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక కెరియర్లో మూడంటే మూడు సినిమాలు తీసిన ఉయయ్ శంకర్ చాలా రోజుల తరువాత ఓ కమర్షియల్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఉదయ్ శంకర్ పై, సునీల్ పై నమ్మకాన్ని ఉంచి సొంతగా నిర్శించాడు ఈ సినిమాను. సురేష్ బాబు వారి పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారా ? లేదో ఈ సినిమా రివ్వూ ద్వారా తెలసుకుందాం.
ఇటీవలి కాలంలో కామెడీ చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు కదా అని ఏవేవో కామెడీ సీన్లు పెట్టేస్తే జనాలు నవ్వేస్తారనుకుంటే పొరపాటే. కామెడీ సినిమాలకు కథా బలం లేకున్నా, టైమింగ్ పంచ్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే సీన్లు ఉండాలి. కానీ ఇవేవి ఈ సినిమాలో లేవు. ఏవో కామెడీ సీన్లు పెట్టారు కదా అని ప్రేక్షకులు బలవంతంగా నవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ కథ పాత చింతకాయ పచ్చడిలా ఉన్నా, చూపిండంలో కొత్త దనం ఉండాలి. అదీ లేదు. సునీల్ సినిమాకు సరిపోయే కామిడీ సీన్లు కూడా రాసుకోలేక పోయారు.
ఈ సినిమాలో ఓ సన్నివేశంలో సయాజీ షిండేకి సునీల్ ‘భీమవరం బుల్లోడు’ సినిమా కథే చెప్తాడు. ఆ కథ విని ‘ఎయిటీస్ స్టోరీలా ఉంది’ అని సయాజీ అంటాడు. దానికి సునీల్ ‘ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉంటుంది’ అని నచ్చచెప్తాడు. అంటే ఈ కథ ఎయిటీస్ కాలం నాటి కథే కానీ మేము కొత్తగా చూపిస్తామని వారే చెప్పారు. కానీ చూపించిన విధానం ఎయిటీస్ లానే ఉంది. ఎంత పాత కథ అయినా కానీ దీంతో కామెడీ పండించలేక పొవడం చూస్తేంటే దర్శకుడికి కామెడీ స్టోరీలను తెరకెక్కించడంలో ఏమాత్రం పట్టు లేదని తెలిసిపోతుంది.
ఇంట్రవెల్ వరకూ బండి బాగానే నెట్టుకొచ్చిన దర్శకుడు సెకండాఫ్ మాత్రం నీరశించాడు. అసలు విలన్స్ అందరినీ వదిలేసి హీరోయిన్ తండ్రి షాయాజీ షిండేని విలన్‌ని చేశాడు. లవ్ ట్రాక్, దాన్ని సాధించడానికి కథానాయకుడు వేసే ప్లాన్‌ల నడుమ సెకండాఫ్ నడిపించేశాడు. కనీసం ద్వితీయార్థంలో అయినా సునీల్ సినిమాలా కామెడీగా ఉంటుందని అనుకుంటే, ఎక్కడా పట్టుమని పది నిముషాలు నవ్వించిన పాపాన పోలేదు. కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న సునీల్ ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు కాకుండా కామెడీ సినిమాలు చేస్తేనే మనకీ, ఆయనకు మంచిది.
సునీల్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. కామెడీని, సీరియెస్ నెస్ ని అవలోకగా పండిస్తాడు. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ కి తగ్గ నటనను కనబర్చినా, తనకు రాసిచ్చిన కామెడీ డైలాగుల్లో టైమింగ్ పంచ్ లేకపోవడంతో అవి పెద్దగా పేలలేదు. డాన్సులు, ఫైటింగుల్లో ఫర్వాలేదనిపించాడు. అందరి హీరోల్లాగా సీరియస్ హీరో అయిపోదామంటే అది సునీల్ కి వర్కౌట్ అవ్వదు. తన బాడీ ల్యాంగ్వేజ్ కి తగ్గట్లు కామెడీని నమ్ముకుంటేనే మంచిది. ఇక ఎస్తేర్ గురించి చెప్పాలంటే ఆమెకి హీరోయిన్ గా ఎదిగే ఫీచర్ కనిపించలేదు. ఆమె నటన, ఎక్సప్రెషన్స్ సినిమాకు మైనస్సే అని చెప్పవచ్చు. ‘30 ఇయర్స్ ’ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కొన్ని పంచ్‌లతో అక్కడక్కడా నవ్వించాడు. ఈ సినిమాలో నట వర్గం బాగానే ఉన్నా వారంతా పేరుకే. పోసాని హాస్యం అస్సలు పండలేదు. రఘుబాబు, షాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, సత్యం, రాజేష్ లాంటి వారు రొటీన్‌గా చేసారు. కొత్తగా చేసిందేమి లేదు.
కళాకారుల పనితీరు
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఎబ్బెట్టుగా ఉంది. ఒక్కపాట కూడా విని ఆనందించే విధంగా లేదు. నితిన్ సినిమాకు ఎంతో మంచి సంగీతం ఇచ్చిన అనూప్ ఈ సినిమాలో ట్యూన్స్ అన్నీ ఎక్కడో ఏరుకొచ్చిన వాటిలా ఉన్నాయి. తరువాతి సినిమాల్లోనైనా ఈ తరహా సంగీత ధోరణి మార్చుకోవాలి. సినిమాటోగ్రఫీ అంత గొప్పగా లేమీ లేదు. సునీల్‌పై తీసిన ఫైన్స్ ప్రేక్షకులకు కాన్త నసలాగా అనిపిస్తాయి. ఎలాగు సిక్స్ ప్యాక్ బాడీనే కదా అని తనకు ఇష్టం వచ్చినట్లు చేయించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఏ మాత్రం పని చెప్పలేదు.
అనవసరమైన సీన్లు కొన్ని కత్తిరిస్తే బాగుండు. డైలాగుల్లో ప్రాస కోసం బాగా కష్టపడ్డా అవి అంతగా పేలలేదు. నిర్మాణ విలువలు సురేష్ ప్రొడక్షన్స్ స్థాయిలో లేవు. సినిమాని చుట్టేయాలన్న తాపత్రయం కనిపించింది. ఇక దర్శకుడు చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి ఎలాంటి సినిమా తీయాలో కన్ ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తుంది. గతంలో కామెడీ సినిమాలు తీసిన అనుభవం లేని ఈయనకు దాని పై గ్రిప్ దొరకలేదు. పాత కథను కొత్తగా చూపించే ప్రయత్నం కూడా చేయకుండా నస పెట్టాడు.
చివరగా : కామెడీతో భయపెట్టే ‘బుల్లోడు ’