సినిమా కధ శివరామరాజు (జగపతి బాబు) ఛాలెంజ్ తో మొదలవుతుంది. తన ముగ్గురు కూతుళ్ళు తాను చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటారని వీర్రాజు (సుప్రీత్)తో శివరామరాజు ఛాలెంజ్ చేస్తాడు. ఆ ప్రకారంగానే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయి. మూడవ కూతురు కవిత (రకుల్ ప్రీత్ సింగ్) కాలేజ్ చదివే అమ్మాయి. ఊర్లో ఉండే రాజు(మనోజ్) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. అలా ఉండలేక ఊర్లో అందరి విషయాల్లో వేలుపెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇక ఊర్లో టీచర్ గా పనిచేసే సన్నీ (సన్నీలియోన్)ని రాజు ప్రేమిస్తాడు. ఆ తర్వాత సన్నీ ఏమంటుంది, మళ్ళీ రకుల్ తో ఎలా ప్రేమలో పడతాడు, శివరామరాజును ఎలా ఒప్పిస్తాడు అని సాగే కధను థియేటర్ లో చూడండి.
భారీ అంచనాల మద్య వచ్చిన కరెంట్ తీగ అందుకు తగ్గట్టుగా లేదు. సినిమా ఫస్ట్ ఆఫ్ ప్రధాన పాత్రలను పరిచయం చేయటంతో పాటు కామెడిని చూపించారు. అయితే అంతగా కొత్తదనం కన్పించలేదు. పాత సినిమాల్లో సీన్లు రిపీట్ అవుతున్నట్లుగా తర్వాతి సీన్ ఏంటో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇక సెకండ్ ఆఫ్ డల్ గా ఉంది. ఇంటర్వెల్ తర్వాత కధతో సంబంధం లేకుండా సినిమా కొనసాగింది. ఇక కామెడి కొరత కూడా సెకండ్ పార్ట్ లో కొట్టొచ్చినట్లు కన్పించింది. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది.
అయితే క్లైమాక్స్ లో ఉండే ఫైట్లు హై వోల్టేజితో ఉండటంతో కరెంట్ తీగ అనే పేరుకు కాస్త సార్ధకత ఏర్పడింది. కాని ముగింపు కూడా పెద్దగా ఏమి లేదు. ఇక పాటల గురించి చెప్పాలంటే పరవాలేదు అని మాత్రం చెప్పగలం. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని వచ్చిన అభిమానులు థియేటర్ నుంచి నిరాశగా బయటకు రావచ్చు.
హీరోగా తనను తాను నిరూపించుకున్న మంచు మనోజ్, మరింత ఎనర్జీతో ఈ సినిమాలో కన్పించాడు. సినిమాలో ఫైట్లు, కామెడి కోసం బాగానే కష్టపడ్డాడు అన్పిస్తుంది. హీరోయిన్ రకుల్ కూడా ప్రేక్షకులను అలరించింది. ఊర్లో అమ్మాయిలో, గ్లామర్ గర్ల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక జగపతిబాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమాకు ఆయనే హైలైట్ అని చెప్పాలి. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. అటు కమెడియన్లు వెన్నెల కిశోర్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు తమవరకు పాత్రలకు న్యాయం చేశారు. ఇక తెలుగులో తొలి సినిమా చేసిన సన్నీ లియోన్ ను ఊహించుకుని వచ్చిన అభిమానులకు ఆశించినంత పాత్ర ఏమి లేదు. ఓ పాట, దానికి ముందు వెనక అంతా కలిపి పది నిమిషాల పాటు సన్నీ కన్పిస్తుంది అంతే.
‘కరెంట్ తీగ’ విషయంలో డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి ఫెయిల్ అయ్యారు. పాత కధను తీసుకువచ్చి కొన్ని సీన్లు జతచేసి కథ రాసుకున్నట్లుగా సినిమా ఉంది. కొత్తదనం లేకపోవటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక సినిమా తీయటంలో కూడా విఫలం అయ్యారు. ఫస్ట్ ఆఫ్ అలా సాగింది అన్పిస్తే.., సెకండ్ ఆఫ్ ఎందుకిలా వచ్చింది అని ప్రశ్నించుకునే పరిస్థితి ఉంది. కామెడి, కథతో సంబంధం లేకుండా సెకండ్ పార్ట్ తీశారు. 24ఫ్రేమ్స్ బ్యానర్ నిర్మాణ విలువలు పర్వాలేదు. ఈ సినిమాకు సంగీతం హైలైట్. పాటలతో పాటు, అచ్చు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీ పేరుకు తగ్గట్టు ఉంది. కెమెరా పనితనం కూడా పర్వాలేదు. కాని బాగుంది అని చెప్పుకునేంతగా మాత్రం లేదు. ఎడిటింగ్ కూడా మామూలుగానే ఉంది.
చివరగా :
ఈ సినిమా కరెంట్ లేని తీగ