జై (వరుణ్ సందేశ్) అనే కుర్రాడు ప్రతిసారి అమ్మాయిల చేతుల్లో మోసపోతుంటాడు. ప్రతిఒక్కరు ఇతని అమాయకత్వంతో ఆడుకుంటుంటారు. దాంతో జై డిప్రెషన్’లో వుండిపోతాడు. ఒకనాడు ఇతగాడు ట్రైన్’లో జర్నీ చేస్తాడు. అప్పుడే ఇతనికి అనుకోకుండా ఆ ట్రైన్’లో మహాలక్ష్మీ(హరిప్రియ)తో పరిచయం ఏర్పడుతుంది. మొదట్లో ఆ అమ్మాయితో కాస్త దూరంగానే వుంటాడుగానీ తర్వాత ప్రేమలో పడతాడు. కానీ ఆమెతో వ్యక్తపరచలేకపోతాడు.
జర్నీ అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత తన ప్రేమను మహాలక్ష్మీకి తెలియజేయాలనుకుంటాడు జై. దీంతో అతడు మహాలక్ష్మీ ఊరికి బయల్దేరుతాడు. మహాలక్ష్మీ ఇంటికి వెళ్లిన జైకు ఓ పెద్ద షాక్.. అప్పటికే మహాలక్ష్మీ ఎవరితోనే జంప్. మహాలక్ష్మీ కుటుంబసభ్యులు కూడా షాక్’లో వుండిపోతారు. ఆ తర్వాత జై ఏం చేసాడు? మహాలక్ష్మీ ఏం అయ్యింది? జై తన ప్రేమ విషయాన్ని మహాలక్ష్మీకి చెప్పాడా? అసలు చివరకు ఏం జరిగింది? అనే విషయాలు వెండితెరపైన చూడాలి.
చిన్నసినిమాల హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వరుణ్ సందేశ్.. ‘ఏమైంది ఈవేళ’ సినిమా తర్వాత అతనికి సరైన విజయం దక్కలేదు. దాంతో సక్సెస్ కోసం కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు నటించిన ‘ఈ వర్షం సాక్షిగా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరుణ్, హరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి రమణ మొగిలి దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా వరుణ్ కు ఎలాంటి విజయం అందించనుందో చూద్దాం..
ప్లస్ పాయింట్స్:
గత సినిమాల్లోలాగే ఈ చిత్రంలోనూ వరుణ్ తన జై అనే అమాయకపు పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. హరిప్రియ తన మహాలక్ష్మీ పాత్రకు న్యాయం చేస్తూ.. అందచందాలతో, నటనతో బాగానే ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ హాఫ్’లో వచ్చే కామెడీ సీన్స్ పర్వాలేదనిపించాయి. వేణు, ధన్ రాజ్, చంద్రల కామెడీ సెకండ్ హాఫ్’లో బాగా నవ్వించాయి. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కథలో కొత్తగా ఏమిలేదు. సెకండ్ హాఫ్’లో అనవసరపు ట్విస్టులు, మలుపులు... మరీ బోర్’గా ఫీలవడం జనాల వంతయ్యింది. తరువాత సన్నీవేశం ఏం జరుగబోతుందో ప్రేక్షకులు ముందుగానే చెప్పేయవచ్చు. కామెడియన్లతోనే సినిమా కథ అంతా నడిపించాలని అనుకున్నారు. కానీ మొత్తం బెడిసికొట్టేసింది.
సాంకేతిక వర్గం పనితీరు:
కథ, కథనం రెండూ ఫెయిల్ అయ్యాయి. స్ర్కీన్ ప్లే పూర్తిగా నిరాశపరిచింది. దర్శకుడు రమణ మొగిలి ఒక పాత కాన్సెప్టు కథలతోనే సినిమా తీసి, చేతులు కాల్చుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు అనిల్ గోపిరెడ్డి అందించిన పాటలు పర్వాలేదు. సాహిత్యం కూడా చాలా సాఫ్టుగా వుంది. ఎడిటింగ్ లో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
ఈ వర్షం సాక్షిగా.. చాలా బోరింగ్ సినిమా!