ముంబైలోని ఓ హాస్పిటల్లో చనిపోయాడనుకున్న గాడ్సే(బాలకృష్ణ) స్పృహలోకి వస్తాడు. అక్కడికి గాడ్సే తమ కొడుకు అంటూ పలకరించే జయసుధ, చంద్రమోహన్ లకు.. తాను గాడ్సే కాదని బోస్ అని చెప్తాడు. కానీ ఈ తల్లితండ్రులు తనే గాడ్సే అనే అన్ని ఆధారాలు చూపిస్తారు. అయితే అసలు తాను గాడ్సేనా, బోసా? అనే విషయం తెలుసుకోవడానికి హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ తను పెరిగిన ఇంటికి వెళ్లి, తన తల్లితండ్రులను కలుస్తాడు. అయితే.. వాళ్లందరూ కూడా తనెవరో తెలియదు అంటారు. దీంతో అయోమయంలో పడిపోయిన గాడ్సేకు అనుకొని ఓ సంఘటన వలన బోస్ గతం గురించి తెలుస్తుంది.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. గతంలో రాష్ట్రముఖ్యమంత్రి మరణిస్తాడు. ఆ మరణం వెనకున్న మిస్టరీని చేధించే కేసును పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్ అయిన బోస్(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. ఆ కేసు విచారణ సమయంలోనే బోస్ కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు బోస్ ఎవరు? గాడ్సే ఎవరు? గాడ్సే ఎందుకు హాస్పిటల్లో చేరాడు? మంత్రి మరణం వెనుక వున్నదెవరు? అసలు బోస్ ఏమయ్యాడు? అసలు బోస్, గాడ్సేలకు సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే వెండితెరపై ‘లయన్’ సినిమా చూడాల్సిందే.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్’. జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ సంగీతం అందించిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 14న ఘనంగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నందమూరి బాలకృష్ణ. బాలయ్య లేకపోతే ‘లయన్’ సినిమాలేదనే విధంగా వుంది. గతంలో బాలయ్య తాను నటించిన సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘లయన్’లోనూ అద్భుతంగా నటించాడు. గాడ్సే, బోస్ అనే రెండు విభిన్నమైన పాత్రలకు బాలయ్య పూర్తిగా న్యాయం చేశాడు. వయసు పెరుగుతున్నకొద్ది బాలయ్య ఎనర్జీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మరోసారి తన డాన్సులు, ఫైట్ల ద్వారా మరోసాని నిరూపించేశాడు.
ఇక తొలిసారి బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన త్రిష చాలా చక్కగా, గ్లామర్ పరంగా తనదైన శైలిలో క్యూట్ గా నటించింది. బాలయ్యతో త్రిష కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. రాధిక ఆప్టే పర్వాలేదనిపించింది. ఇక విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ తన పాత్రకు సరైన న్యాయం చేసాడు. బాలయ్యను ఢీకొట్టే సరైన విలన్ గా ప్రకాశ్ రాజ్ చాలా చక్కగా నటించాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు చాలా చక్కగా నటించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైనింగ్, ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ తో కొనసాగగా... సెకండ్ హాఫ్ యాక్షన్ నేపథ్యంలో కొన్ని ట్విస్టులతో అదరగొట్టేసింది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమిలేవు కానీ.. బాలయ్య, త్రిషల మధ్య వచ్చిన కొన్ని రొమాంటిక్ సీన్లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రాధిక ఆప్టే కేవలం పాటలలో తప్ప మిగతా సన్నీవేశాలలో అంతగా మెప్పించలేకపోయింది. ఇక సహజనటిగా పేరు తెచ్చుకున్న నటి జయసుధ ఏ మాత్రం తన పాత్రకు న్యాయం చేయలేకపోయింది. ఇక స్టోరీలోకి వెళితే.. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కు ముందు ట్విస్ట్ తెలిసిపోయాక... సెకండ్ హాఫ్ లో ఏం జరుగబోతుందో ఇట్టే చెప్పేయవచ్చు. అలాగే యాక్షన్ సీన్లు రొటీన్ గానే వున్నాయి.
సాంకేతికవర్గ పనితీరు:
ఈ సినిమా దర్శకుడు సత్యదేవా గురించి చెప్పుకుంటే.. అనుకున్న కథ రొటీన్ అయినప్పటికీ కథనంలో కాస్త కొత్తదనం చూపించాడు. కానీ స్ర్కీన్ ప్లేను మరింత జాగ్రత్తగా తీర్చిదిద్ది వుంటే బాగుండేది. దర్శకుడిగా ఇది తనకు మొదటి చిత్రమైనప్పటికి చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన స్టంట్స్, యాక్షన్ సీన్లు అద్భుతంగా వున్నాయి. బాలయ్యతో అద్భుతమైన ఫైట్లు చేయించారు. ఇక వెంకట ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి విజువల్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ స్పెషలిస్ట్ గా పేరొందిన మణిశర్మ... ‘లయన్’కు అద్భుతమైన రీరికార్డింగ్ ను అందించాడు. ఇక ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమాలోని కాస్త స్లో ను కట్ చేసుంటే.. సినిమా ఇంకా చాలా బాగా వచ్చుండేది. ఇక రుద్రపాటి రమణారావు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు.
చివరగా:
లయన్: ఫ్యాన్స్ కి నచ్చే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్