అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి కృష్ణ(సుధీర్ బాబు) ‘సీఈఓ’గా పనిచేస్తుంటాడు. ఒకనాడు కృష్ణ చదివిన చిన్ననాటి స్కూల్ గెట్ టు గెదర్ ఫంక్షన్లో పాల్గొనడానికి అమెరికా నుంచి తన సొంత ఊరైన కృష్ణాపురంకు బయలుదేరుతాడు. హైదరాబాద్ నుంచి కృష్ణాపురంకు ప్రయాణం మొదలయిన క్షణం నుంచి కృష్ణకు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటాయి. అందులో ముఖ్యంగా రాధ(నందిత).
కృష్ణ చదివే స్కూల్లోనే రాధ కూడా చదువుతుంది. రాధను కృష్ణ ప్రేమిస్తాడు. ఇంటర్లో కూడా వీరిద్దరూ ఒకే కాలేజ్ లో చేరుతారు. అక్కడ రాధను మరింత ప్రేమిస్తాడు. కానీ రాధకు తన ప్రేమను చెప్పాలనుకొని, కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోతాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం కృష్ణ హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడ మళ్లీ రాధను కలుస్తాడు కృష్ణ. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ వీరిద్దరూ విడిపోతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వీరి ప్రేమ ఏమయ్యింది? వీరి ప్రేమకు ఎవరు అడ్డుగా నిలిచారు? అసలు ఈ కథకు, కృష్ణమ్మకు ఏంటి సంబంధం? అనే విషయాలు తెలియాలంటే వెండితెర మీద ఈ సినిమా చూడాల్సిందే.
‘ప్రేమకథా చిత్రమ్’ తర్వాత సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నారు. ఇందులో సుధీర్ మూడు షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే... మూడు స్టేజ్ ల ప్రేమకథ. స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ చదివే వయసులో. మూడు స్టేజ్ లలోని ప్రేమను చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్క స్టేజ్ లో ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారు.
ఇక నటీనటుల విషయానికొస్తే... కృష్ణ పాత్రలో సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు సుధీర్ బాబు చేసిన అన్ని సినిమాల్లో కంటే ఇందులో చాలా చక్కగా నటించాడని చెప్పుకోవచ్చు. ఇక రాధ పాత్రలో నందిత చాలా చక్కగా నటించింది. క్యూట్ క్యూట్ హావభావాలతో ఆకట్టుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది. పోసాని నటించిన సన్నీవేశాలు తక్కువే అయినప్పటికీ చాలా బాగున్నాయి. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు.
సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా సరదాగా సాగుతూనే ఇంటర్వెల్ సమయంలో కాస్త సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నీవేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. స్ర్కీన్ ప్లేను కొన్ని కీలక పాయింట్లతో నడిపించి ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే అంత పెద్దగా ఏం లేవు కానీ... కొన్ని కొన్ని అనవసరపు సీన్లు ఎక్కువయ్యాయి. కథను రెండున్నర గంటలు నడిపించాలనే ఉద్దేశ్యంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇక మొదటి నుంచి చివరి వరకు చాలా స్లోగా సాగుతుంది. కొన్ని కొన్ని సీన్లకు లాజిక్ లేకుండా పోయింది. కృష్ణ మీద రాధకు ప్రేమ వుందని ఒక్కసారి కూడా చూపించకుండా ఇద్దరినీ కలిపేయడం వంటి పలు లాజిక్ లేని సన్నీవేశాలున్నాయి. ఇక అర్థంపర్థం లేని సమయంలో పాటలు వచ్చి మరింత చిరాకు తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు కానీ సంధర్భానుసారంగా పాటలు వుండకపోవడంతో చిరాకు తెప్పిస్తాయి.
సాంకేతికవర్గ పనితీరు:
దర్శకుడు చంద్రు మంచి కథను ఎంచుకున్నారు. మూడు స్టేజ్ లలో మారే ప్రేమను చాలా చక్కగా చూపించాడు. స్ర్కీన్ ప్లే చాలా బాగుంది. రాధ,కృష్ణలు కలుస్తారా లేదా అనే ఉత్కంఠను చివరి వరకు బాగానే మెయింటెన్ చేసాడు. కానీ మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఇక సినిమాటోగ్రఫి సూపర్బ్. ఒక్కో సీన్ ను చాలా చక్కగా చూపించారు. ప్రతి ఎమోషన్స్ ను అద్భుతంగా క్యాప్చర్ చేసారు. విజువల్ పరంగా బాగుంది.
హరి అందించిన పాటలు పర్వాలేదు. విజువల్స్ పరంగా కూడా పర్వాలేదనిపించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ : చక్కని ప్రేమకథా చిత్రం