కృష్ణ(నాగశౌర్య).. ఆవారాగా తిరిగే యువకుడు. పాలమూరు అనే గ్రామంలో వుండే కృష్ణ, అతని స్నేహితుడు సత్తి(సత్య) ఇద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. కోటి రూపాయలు సంపాదించాకే తిరిగి మళ్లీ తమ ఊర్లోకి రావాలని భావించి హైదరాబాద్ నగరానికి వెళ్తారు. హైదరాబాద్ వచ్చాక అక్కడ ఏం చేయాలో తెలియక కృష్ణ అయోమయంలో పడిపోతాడు. ఇంతలోనే ఇతనికి అదృష్టం తలుపు తట్టినట్లుగా ఓ అవకాశం వస్తుంది. అదెంటంటే.. ఓ బ్యాంకు వారు తమ దగ్గర లోన్ తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టిన 10 మంది నుంచి కోటి రూపాయలు రికవరీ చేయాలనే ఆర్డర్ ఇస్తారు. ఆ డీల్ నచ్చడంతో కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు కృష్ణ. అయితే.. ఆ డబ్బులు తీసుకున్నవాళ్లంతా రౌడీలే! వాళ్ల దగ్గరికి వెళ్లి కృష్ణ లోన్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా.. వారు కట్టమని చెబుతారు.
దీంతో చేసేదేమి లేక.. కృష్ణ కూడా ఓ గుండా దగ్గర తను రౌడీయిజం చేసి లోన్ రికవరీ చేస్తాడు. అదే టైంలో అక్కడే వున్న రౌడీ మినిష్టర్ జగదీశ్ నాయుడు(కోట శ్రీనివాస్ రావు) కు రైట్ హ్యాండ్ అయిన శ్రీశైలం(జాకీర్ హుస్సేన్).. కృష్ణ దమ్మును చూసి అతనిని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. ఇదిలా వుండగా.. నర్సుగా పనిచేస్తున్న పార్వతి(సోనారిక)ను కృష్ణ చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇక శ్రీశైలం పేరు చెప్పుకొని కృష్ణ ఒక్కొక్కరి దగ్గర లోన్ వసూలు చేస్తూ వుంటాడు. ఓసారి కృష్ణకు తెలియకుండా ఓ ఇంటర్నేషనల్ డీల్ లో శ్రీశైలం అతనిని ఇరికిస్తాడు. ఇక అక్కడినుంచి కృష్ణ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అలాగే పార్వతిని కిడ్నాప్ చేస్తారు. అసలు ఆ ఇంటర్నేషనల్ డీల్ ఏంటిది? కృష్ణను శ్రీశైలం ఎందుకు ఇరికించాడు? పార్వతిని ఎవరు కిడ్నాప్ చేసారు? చివరకు పార్వతి, తన అనుకున్న కోటి రూపాయలను కృష్ణ దక్కించుకున్నాడా లేదా? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే!
‘ఊహలు గుసగుస లాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయవంతమైన చిత్రాలతో లవర్ బాయ్ గా పేరొందిన యువ హీరో ‘నాగ శౌర్య’.. ఇప్పుడు తనకున్న ఇమేజ్ కి భిన్నంగా పూర్తి యాక్షన్ తరహాలో తెరకెక్కిన ‘జాదుగాడు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ రూపొందిస్తున్నారు. ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతిగా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం అవుతోంది. పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ ‘జాదూగాడు’ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేశారు. మరి.. ఈ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందామా..
ప్లస్ పాయింట్స్:
ఇప్పటివరకు ‘లవర్ బాయ్’గా నటించి మెప్పించిన నాగశౌర్య.. తొలిసారిగా పూర్తిస్థాయి మాస్ హీరోగా కనిపించి అదరగొట్టాడు. మాస్ లుక్స్, డైలాగ్స్ తో నాగశౌర్య అద్భుతంగా నటించాడు. కానీ మాస్ హీరోకు వుండాల్సిన మరికొన్ని అంశాలను కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక తొలిసారి తెలుగు ఇండస్ట్రీకీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సొనారిక తన క్యూట్ క్యూట్ లుక్స్ తో చాలా చక్కగా నటించింది. చూడటానికి ముద్దుగా, బొద్దుగా చాలా సెక్సీగా కనిపించింది. తన అందంతో, బాడీతో ప్రేక్షకులకు పిచ్చెక్కించేసింది. నాగశౌర్య, సోనారికల కెమిస్ట్రీ పిచ్చెక్కించాయి. ఇక విలన్ పాత్రలో జాకీర్ హుస్సెన్ నటన బాగుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ బాగుంది... సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన కొన్ని సీన్స్ ను జతచేయడం మైనస్ గా అనిపిస్తుంది. అలాగే సప్తగిరితో ఏదో కొంచెం కామెడీ చేయించాలని కావాలనే ఇరికించినట్లుగా అనిపిస్తుంది. లాజిక్స్ లేనీ కొన్ని కొన్ని సన్నీవేశాలు. ఇక ఎంటర టైన్మెంట్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో కొంతమందికి నిరాశ కలుగుతుంది.
సాంకేతికవర్గ పనితీరు:
సాయి శ్రీరాం అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా చక్కగా చూపించాడు. ఈ సినిమాకు సాగర్ మహతి అందించిన సంగీతం సూపర్బ్. రీరికార్డింగ్ అదిరిపోయింది. ఇక కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న యోగేష్ పర్వాలేదనిపించాడు. ఫస్ట్ హాఫ్ ను చాలా పక్కాగా రాసుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసినట్లుగా అనిపించింది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా వున్నాయి.
చివరగా:
జాదుగాడు: రొటీన్ మాస్ మసాలా తప్ప.. అంత ‘జాదూ’ లేదు!