ఆస్తితో పాటు మంచి విలువలున్న ఫ్యామిలీ వారసుడు శ్రీను(గోపిచంద్). స్నేహితులతో సరదా ఎంజాయ్ చేస్తుండే శ్రీను అనుకోకుండా ఓసారి ట్రైన్ జర్నీలో శైలజ(రెజీనా)ను చూసి ప్రేమలో పడతాడు. మొదట్లో శ్రీను ప్రేమను నిరాకరించినప్పటికీ, ఆ తర్వాత శ్రీను ప్రేమను ఒప్పుకుంటుంది శైలజ. సీన్ కట్ చేస్తే... శైలజను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. కానీ గొడవలకు దూరంగా వుండమని శ్రీను తండ్రి కృష్ణారావు(ముఖేష్ రుషి) చెప్పడంతో శైలజను వెతకడం మానేస్తాడు శ్రీను. గతంలో శ్రీను పెట్టుకున్న గొడవల కారణంగా భావూజీ (ప్రదీప్ రావత్) మనుషులు అతన్ని చంపాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శైలజను ఎవరు కిడ్నాప్ చేసారు? శ్రీనుకు భావూజీకి వున్న గొడవలు ఏంటి? చివరకు శైలజను శ్రీను ఎలా కాపాడుకున్నాడు అనే అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘సౌఖ్యం’ సినిమా చూడాల్సిందే.
‘లౌక్యం’, ‘జిల్’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సౌఖ్యం’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్లు, వీడియో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన తొలిసారిగా రెజీనా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా నేడు (డిసెంబర్ 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
గోపిచంద్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఇందులో కాస్త లుక్స్ పరంగా సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు. యాక్షన్, కామెడీ సీన్లలో అలరించాడు. ఇక రెజీనా తన పాత్రలో చాలా చక్కగా నటించింది. కామెడీ టచ్ వున్న పాత్రలో తొలిసారిగా నటించి, మెప్పించింది. గ్లామర్ పరంగా బాగానే అందాలు ఆరబోసింది. 30 ఇయర్స్ పృధ్వీ తన పాత్ర మేరకు బాగానే నటించాడు. తనదైన శైలిలో బాగానే నవ్వించాడు. ఇక శావుకార్ జానకి, రఘుబాబు, శివాజీ రాజా వారి వారి పాత్రల మేరకు నటించి, కామెడీతో ఆకట్టుకున్నారు. ఇక ఐటెం సాంగ్ లో నటించిన శ్వేత భరద్వాజ్ గ్లామర్ పరంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కామెడీ తో పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది.
మైనస్ పాయింట్స్:
ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినప్పటికీ, కథనంలో కూడా సరైన మ్యాజిక్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ లో అయితే తర్వాత సీన్లు ఏం జరుగబోతుందో ప్రేక్షకులు ముందుగానే చెప్పేయగలరు. సెకండ్ హాఫ్ పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. కామెడీ అనేది కావాలని ఇరిక్కించినట్లుగా అనిపిస్తుంది. హీరో పాత్ర చాలా స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేసినప్పటికీ.. విలనిజాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఏదో కామెడీ ఎంటర్ టైనర్ సినిమా అనే ఉద్దేశ్యంతో చాలా మంది ఆర్టిస్టులను పెట్టేసుకున్నారు. కానీ దాదాపు చాలా మంది స్టార్ కమెడియన్లు నవ్వించలేకపోగా.. చిరాకు తెప్పించారు. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ తెగ బోర్.
సాంకేతికవర్గ పనితీరు:
ప్రసాద్ మూరెళ్ల అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి విజువల్ ను చాలా గ్రాండ్ గా చూపించారు. అనూప్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో చాలా సీన్లకు కత్తెర పడాల్సింది. బాగా సాగదీసినట్లుగా వుంటుంది. కథ, కథనం ఏం కొత్తదనం లేదు. దర్శకుడిగా రవికుమార్ చౌదరి పర్వాలేదనిపించాడు. నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా వున్నాయి.
చివరగా:
సౌఖ్యం: బోరింగ్ సినిమా