ఓ నైట్ క్లబ్ లో డిజేగా పనిచేస్తుంటాడు హరి(రామ్). కనిపించిన అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేయడం... వాళ్లు నో చెప్పడం. హరి ప్రపోజ్ చేసినవాళ్లంతా కూడా మనం ఫ్రెండ్స్ అంటూ హ్యండ్ ఇచ్చేసి వెళ్లిపోతుంటారు. దీంతో తన జీవితంలోకి ప్రేమకు స్థానంలేదని అనుకుంటున్న సమయంలో హరికి శైలజ(కీర్తి సురేష్) కనిపిస్తుంది. శైలజ కూడా అందరిలాగే నో చెప్పి, ఫ్రెండ్స్ గా వుందమని అంటుందేమోననుకొని భావించిన హరికి... అనుకోకుండా శైలజతో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక ఓరోజు కీర్తికి హరి ఐలవ్ యు అని ప్రపోజ్ చేస్తే... ‘I Love You.. But Iam not in Love with You’ అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో హరి దేవదాసులా మారుతాడు. కానీ శైలజ ఎందుకు తన ప్రేమకు నో చెప్పిందనే విషయం హరికి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న హరి ఏం చేసాడు? అసలు ఎంటి ఆ కారణం? శైలజ ప్రేమను హరి ఎలా దక్కించుకున్నాడు? అసలు శైలజకు వున్న సమస్య ఏంటి? చివరకు హరి ప్రేమను శైలజ ఒప్పుకుందా లేదా అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘నేను శైలజ’ చిత్రం చూడాల్సిందే.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘నేను శైలజ’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రామ్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. చక్కని ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు (జనవరి1, 2016) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా రామ్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో ఓసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
నటీనటుల విషయానికొస్తే... ‘నేను శైలజ’కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచింది రామ్-కీర్తిసురేష్. ఇప్పటివరకు ఎనర్జిటిక్ పాత్రల్లోనే రామ్ ను చూసాం. కానీ ఇందులో రామ్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. నటుడిగా రామ్ చాలా మెరుగయ్యాడు. లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్లలో రామ్ అదరగొట్టేసాడు. న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో రామ్ ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. ఇక శైలజ పాత్రలో నటించిన కీర్తిసురేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. శైలజ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. తన క్యూట్ క్యూట్ లుక్స్, హావభావాలతో పక్కింటి అమ్మాయిలా చాలా చక్కగా నటించింది. రామ్-కీర్తిల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇక సత్యరాజ్ తనదైన శైలిలో మెప్పించాడు. తన పాత్ర మేరకు చాలా చక్కగా నటించాడు. ప్రదీప్ రావత్, శ్రీముఖి, ప్రిన్స్ తదితరులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.
‘నేను శైలజ’లో ఫస్ట్ హాఫ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సినిమా చూసే ప్రేక్షకులు ఈజీగా హరి పాత్రకు కనెక్ట్ అయిపోతారు. అలాగే రామ్-కీర్తిల మధ్య వచ్చే సీన్లు, లవ్ ట్రాక్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఎమోషన్ సీన్లు చాలా బాగున్నాయి. మొత్తానికి ‘నేను శైలజ’ ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పుకోవాలి.
మైనస్ పాయింట్స్:
‘నేను శైలజ’కు సెకండ్ హాఫ్ కాస్త మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లవ్, ఎంటర్ టైనర్ గా కొనసాగినప్పటికీ, సెకండ్ హాఫ్ ను సరైన విధంగా డిజైన్ చేసుకోలేదనిపిస్తుంది. కామెడీ, రెండు, మూడు ఎమోషన్ సీన్స్ తీసేస్తే మిగతాదంతా ఊహాజనితంగా వుండటంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు. సెకండ్ హాఫ్ చాలా వరకు ఎమోషనల్ సైడ్ వెళ్లిపోవడంతో ఎంటర్ టైన్మెంట్ పార్ట్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు.
సాంకేతికవర్గం పనితీరు:
సాంకేతికవర్గంలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ మ్యూజిక్, సినిమాటోగ్రఫి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. అలాగే రీరికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసింది. దేవి పాటలకు సమీర్ రెడ్డి తన సినిమాటోగ్రఫితో అందంగా చూపించాడు. విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కాస్త కేర్ తీసుకొని వుంటే బాగుండేది. ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కిషోర్ తిరుమల డీల్ చేసాడు.
కథ పరంగా ఎలాంటి కొత్తదనం లేకపోయినప్పటికీ స్ర్కీన్ ప్లే పరంగా కాస్త పర్వాలేదనిపించాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో తీసుకున్నంత కేర్.. సెకండ్ హాఫ్ లో తీసుకోలేనట్లుగా అనిపిస్తుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. దర్శకుడిగా కిశోర్ తిరుమల పర్వాలేదనిపించాడు. ఇక నిర్మాత స్రవంతి రవికిశోర్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా వున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా రూపొందించారు.
చివరగా:
‘నేను శైలజ’: లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్.