గ్రామానికి పెద్ద జమీందార్ (రాధా రవి). ఆ గ్రామంలో అమ్మవారి మూలస్థానం క్షీణించడంతో ఆమెను పాలతో అభిషేకం చేసి, పున: ప్రతిష్టించాలనుకుని అమ్మవారిని నవధాన్యాల్లో వుంచుతారు. కానీ అలా అమ్మవారిని వుంచినన్ని రోజులు అమ్మవారి శక్తి క్షీణిస్తుందని, అందువల్ల దుష్టశక్తులు విరుచుకుపడుతూ, బయటకు వస్తే ప్రమాదాలు సంభవిస్తాయని అంటారు. ఈ సమయంలోనే ఊరి బయట వుండే ఓ దుష్టశక్తి జమీందార్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
సీన్ కట్ చేస్తే... జమీందార్ కు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు తన భార్య పిల్లలతో కలిసి వస్తే.. చిన్న కొడుకు మురళి(సిద్ధార్థ్) తన మరదలు అనిత(త్రిష)తో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడానికి బయటకు వెళతాడు. ఇక ఆ దుష్టశక్తి రాధారవిని మేడపై నుండి తోసేయ్యడంతో కోమాలోకి వెళతాడు. రాధారవికి సేవ చేయడానికి కేరళ నర్స్(పూనమ్ బజ్వా) వస్తుంది. హాలీడే ముగించుకొని వచ్చిన మురళికి ఓ రోజు రాత్రి అరుపులు వినిపించడంతో బయటకు వస్తాడు. బయట ఓ కార్ డ్రైవర్ ‘వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపొండి.. లేకపోతే అందరూ ఆపదలో పడతారని’ చెప్పి చనిపోతాడు.
సీన్ కట్ చేస్తే... అనిత అన్నయ్య నేషనల్ వైల్డ్ ఛానెల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే రవి(సుందర్.సి)ని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు మురళి. ఇక అక్కడినుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఆ దుష్టశక్తి ఎవరు? ఆ జమీందార్ ఇంట్లోనే ఎందుకు చేరింది? వారిపై ఎందుకు పగ తీర్చుకుంటుంది? రవి ఈ పరిస్థితులను ఎలా పరిష్కరించాడు? చివరకు దుష్టశక్తిని ఎలా అంతం చేసారు? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘కళావతి’ చిత్రం చూడాల్సిందే.
తమిళంలో వచ్చిన ‘అరణ్మనై’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన తాజా చిత్రం ‘అరణ్మనై-2’. ‘అరణ్మనై’ చిత్రాన్ని తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో విడుదల చేసారు. ఇపుడు ‘అరణ్మనై-2’ చిత్రాన్ని తెలుగులో ‘కళావతి’ పేరుతో సర్వంత్రామ్ క్రియేషన్స్ మరియు గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ప్రధాన పాత్రలలో నటించిన ఈ హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమీఝా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నేడు (జనవరి 29) తెలుగు, తమిళం భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
నటీనటుల విషయానికొస్తే... ‘కళావతి’ సినిమాలో దాదాపు అందరూ వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారని చెప్పుకోవచ్చు. సుందర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే విధంగా అద్భుతంగా నటించారు. సుందర్ హవాభావాలు, నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే హర్రర్, కామెడీని బాగా మిక్స్ చేసి మెప్పించాడు. ఇక మురళి పాత్రలో నటించిన సిద్ధార్థ్ తొలిసారిగా హర్రర్ సినిమాలో నటించాడు. కాబట్టి.. తన పాత్ర మేరకు పర్వాలేదనిపించాడు. ఇక అనిత పాత్రలో త్రిష అందాల విందు చేసిందని చెప్పుకోవచ్చు. తన గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా నటన పరంగా కూడా చాలా చక్కగా నటించింది. ఇక కథలో చెప్పని మరో పాత్ర మాయ(హన్సిక). ఈ సినిమాలో హన్సిక పాత్ర ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. తన పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. వైభవ్, సూరి, కోవై సరళ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. భయపడుతూ బాగానే నవ్వించారు.
సినిమా విషయానికొస్తే... ‘కళావతి’ సినిమా ప్రారంభమవ్వగానే వచ్చే 103 అడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం సూపర్బ్. ఈ విగ్రహం అసియాలో పెద్ద అమ్మవారి విగ్రహంగా రికార్డ్ కూడా సాధించింది. ఈ విగ్రహాన్ని గ్రాఫిక్స్ లో చేయకుండా రియల్ గా సెట్టింగ్ తో సిద్ధం చేయడం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ విగ్రహం కనిపించే సన్నివేశాల సమయంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో గ్లామర్, ఎంటర్ టైన్మెంట్ తో పాటు కాస్త హర్రర్ తో మెప్పించగా.. సెకండ్ హాఫ్ లో అదిరిపోయే హర్రర్, థ్రిల్లింగ్, కామెడీ ఎంటర్ టైనర్ తో మెప్పించారు. హర్రర్ లో కామెడీని మిక్స్ చేయడం చాలా కష్టం. కానీ దర్శకుడు సుందర్.సి చాలా పర్ఫెక్ట్ గా ‘కళావతి’ చిత్రాన్ని తెరకెక్కించి అదరగొట్టేసాడు.
మైనస్ పాయింట్స్:
కథనం విషయంలో ఎంత కొత్తగా వున్నా.. కథ మాత్రం దాదాపు పాతదే అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని కొన్ని సీన్లకు లాజిక్స్ మిస్ అయ్యాయి. పాటలు మైనస్. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సుందర్. సి అని చెప్పుకోవచ్చు. తన గత చిత్రం ‘అరణ్మనై’ (తెలుగులో ‘చంద్రకళ’)కు ఏమాత్రం తగ్గకుండా, మరింత ఎక్కువ హర్రర్, థ్రిల్లింగ్ కామెడీ ఎంటర్ టైనర్ తో ‘కళావతి’ని తెరకెక్కించాడు. ముఖ్యంగా కథ, కథనం చాలా బాగున్నాయి. స్ర్కీన్ ప్లే సూపర్బ్. ప్రేక్షకులను భయపెడుతూనే నవ్వించడంలో దర్శకుడు సుందర్.సి సక్సెస్ అయ్యాడు. ప్రతి పాత్రను చాలా పర్ఫెక్ట్ గా రాసుకోవడం, అనుకున్న విధంగా ప్రజెంట్ చేయడం సినిమాకు మేజర్ ప్లస్ అయ్యింది. ఇక యుకె. సెంథిల్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. ముఖ్యంగా అమ్మవారు విగ్రహం సీన్ల సమయంలో ప్రేక్షకులు లీనమైపోతున్నారు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించారు. హిప్ హాప్ తమిఝా అందించిన పాటలు పర్వాలేదనిపించినా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.
చివరగా:
‘కళావతి’: భయపెడుతూ నవ్విస్తుంది