కేరళలోని ఒక చిన్న ప్రాంతంలో జోసెఫ్ కురివిల్లా(విజయ్) తన కూతురు నివేదిత(బేబీ నైనిక)తో కలిసి సాధారణ జీవనం గడుపుతూ వుంటాడు. తన కూతురంటే జోసెఫ్ కు ప్రాణం. నివేదిత స్కూల్ టీచర్ అనీ(అమీ జాక్సన్). ఓ సంధర్భంలో అనీ కారణంగా లోకల్ రౌడీలతో జోసెఫ్ కు చిన్న గొడవ అవుతుంది. ఆ సమయంలో అనీకు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. జోసెఫ్ అసలు పేరు విజయ్ కుమార్. అతనొక ఐపియస్ ఆఫీసర్. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు జోసెఫ్ గా విజయ్ పేరు మార్చుకుని సాధారణ జీవితం ఎందుకు గడుపుతున్నాడు? నివేదిత ఎవరు? అసలు ఐపియస్ గా వుండే విజయ్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అసలు సమంత పాత్ర ఏంటి? చివరకు ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూడాల్సిందే.
ఇళయతలపతి విజయ్ నటించిన ‘తెరి’ చిత్రాన్ని తెలుగులో ‘పోలీస్’ అనే టైటిల్ తో తెలుగులోకి నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తమిళంలో ఈ చిత్రం నిన్న(ఏప్రిల్ 14) విడుదల చేసారు. తెలుగులో నేడు(ఏప్రిల్ 15) విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ రెండు విభిన్న పాత్రలలో నటించారు. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలా వుందో ఒకసారి చూద్దామా!
.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరో విజయ్. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించేసాడు. జోసెఫ్, విజయ్ కుమార్ పాత్రలలో అద్భుతంగా నటించాడు. రెండు పాత్రలలో వైవిధ్యాన్ని చాలా చక్కగా కనబరిచాడు. ఇక యాక్షన్ సీన్లలో విజయ్ యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. పవర్ ఫుల్ పోలీస్ గా విజయ్ అదరగొట్టేసాడు. అలాగే జోసెఫ్ గా కాస్త అమాయకత్వంలో చక్కటి ప్రతిభ కనబరిచాడు. ఇక ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ బేబీ నైనిక. తన పాత్రకు నైనిక పూర్తి న్యాయం చేసింది. విజయ్-నైనికల కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి.
ప్రముఖ తమిళ దర్శకుడు మహేంద్రన్ నటన మరో హైలెట్ గా చెప్పుకోవచ్చు. కూల్ గా వుంటూనే వయలెంట్ వ్యక్తిగా, ఎక్కువగా మాట్లాడకుండా చాలా చక్కగా నటించారు. అమీజాక్సన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బాగుంది. సమంత తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. చీరకట్టులో ప్రేక్షకులను మెప్పించింది. ఇక రాధిక, ప్రభు, రాజేంద్రన్ తదితరులు వారి వారి పాత్రల మేరకు చాలా చక్కగా నటించారు.
సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సింపుల్ గా, ఎంటర్ టైనింగ్ గా సాగుతూ వుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే మేజర్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో విజయ్ అసలు ఎమోషన్, యాక్షన్ సీన్లు దుమ్మురేపేసాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా లవ్, రొమాంటిక్, యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా బాగుంది.
మైనస్ పాయింట్స్:
‘పోలీస్’ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే మైనస్ గా చెప్పుకోవచ్చు. ‘పోలీస్’ సినిమా చూస్తుంటే అజిత్ నటించిన ‘ఎంతవాడు గానీ’ సినిమా గుర్తొస్తూ వుంటుంది. పలు చోట్ల పోలీకలు కనిపిస్తూ వుంటాయి. కథలో కొత్తదనం లేదు. కథనం పరంగా ఎలాంటి కొత్తగా లేకపోగా.. చాలా చోట్ల కథను పక్కదారి పట్టించినట్లుగా అనిపిస్తుంది. పైగా ఈ సినిమాను పూర్తిస్థాయి కథగా చెప్పకుండా బ్లాక్ లుగా చూపించడం అంతగా బాగోలేదు. ఎందుకంటే పూర్తిగా ఫ్యామిలీ లైఫ్, లేదా పోలీస్ లైఫ్ గురించి కాకుండా మిక్సింగ్ చేసేసి బ్లాక్స్ రూపంలో చూపించేసరికి ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఇక పాటలు అంతంతమాత్రంగానే వున్నాయి. పాటల సంధర్భాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
సాంకేతికవర్గం పనితీరు:
సాంకేతికనిపుణుల విషయానికొస్తే ముందుగా దర్శకుడు అట్లీ నుంచి మాట్లాడుకుందాం. ‘రాజా రాణీ’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించిన అట్లీ... తన తర్వాతీ చిత్రాన్ని పూర్తి వైవిధ్యబరితంగా ఎంచుకోవడం గొప్ప విషయమే. ఒక సూపర్ స్టార్ క్రేజ్ వున్న హీరో నుంచి అభిమానులు ఎలాంటి అంశాలతో సినిమాను కోరుకుంటారో... ఆయా అంశాలను దర్శకుడు అట్లీ అద్భుతంగా చూపించాడు. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్... ఇలా అన్నిచోట్ల దర్శకుడిగా అట్లీ ప్రతిభ చాలా బాగుంది. దర్శకుడిగా ‘పోలీస్’ సినిమాతో మరోసారి తనను తాను నిరూపించుకొని సక్సెస్ అయ్యాడు.
జార్జ్ సి విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. సినిమాలోని పలు ఎమోషన్స్ ను చాలా చక్కగా చూపించారు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ తెరకెక్కించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు అంతగా బాగోలేవు. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాకు రీరికార్డింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. జివి.ప్రకాష్ అందించిన రీరికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా, రిచ్ గా నిర్మించారు.
చివరగా:
‘పోలీస్’: రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్.
- Sandy