ట్యాక్సీ నడుపుకుంటూ తన తండ్రి(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి జీవిస్తూ వుండే కుర్రోడు బాలు(సాయిధరమ్ తేజ్). పోలీస్ బెల్లం శ్రీదేవి(రాశి ఖన్నా)తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా బాలు జీవితంలోకి రాజన్ అనే ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఎంట్రీ ఇస్తాడు. రాజన్ వచ్చాక బాలు జీవితంలో పలు మార్పులు వస్తాయి. ఆ తర్వాత బాలు కథ పూర్తిగా మారిపోతుంది. అసలు రాజన్ ఎవరు? రాజన్ ఎంట్రీ తర్వాత బాలుకు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు బాలు ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
సాయిధరమ్ తేజ, రాశిఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘సుప్రీమ్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మాతగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ‘పటాస్’ ఫేం హీరోయిన్ శృతిసోది ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. కమర్షియల్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు(మే 5) ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే హీరో మరియు ఎనిమిదేళ్ల కుర్రోడు. వీరిద్దరి మధ్య జరిగే జర్నీ సూపర్బ్. వీరిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. బాలు పాత్రలో సాయిధరమ్ తేజ్ అదరగొట్టేసాడు. ఎప్పటిలాగే తన యాక్టింగ్, డాన్సులు, ఫైట్లతో దుమ్మురేపేసాడు. మంచి ఎనర్జీ వున్న పాత్రలో నటించి మెప్పించాడు. సాయిధరమ్ తేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ మరింత ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇక పోలీస్ ఆఫీసర్ బెల్లం శ్రీదేవిగా నటించిన రాశి ఖన్నా బాగా నవ్వించేసింది. ఫన్ వున్న పాత్రలో నటించింది. సాయిధరమ్ తేజ, రాశిఖన్నాల కెమిస్ట్రీ బాగుంది. రాశిఖన్నా గ్లామర్ బాగా ప్లస్ అయ్యింది.
ఇక హీరో సాయిధరమ్ తేజ తర్వాత చెప్పుకోదగ్గ మరో మేజర్ ప్లస్ పాయింట్ రాజన్. రాజన్ పాత్రలో నటించిన చిన్న కుర్రోడు మైఖేల్ గాంధీ అద్భుతంగా నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా తేజు-కుర్రోడుల మధ్య వచ్చే సీన్లు హైలెట్ గా చెప్పుకోవచ్చు. రాజన్ చెప్పిన డైలాగ్స్ సూపర్. ఇక పృధ్వీ, ప్రభాస్ శీను, రఘుబాబు, వెన్నెల కిశోర్, రవిశంకర్ ల పాత్రల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా నటించారు.
ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాస్త లవ్, రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంటూ ఎంటర్ టైనింగ్ గా సాగుతూ వుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో కాస్త రాశిఖన్నా-తేజుల మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ కాస్త తగ్గినప్పటికీ... ఎమోషన్, కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో అదిరిపోయింది. ఇక అందం హిందోళం అనే రీమేక్ సాంగ్ లో మెగాస్టార్, పవర్ స్టార్, సాయిధరమ్ తేజ్ లు ఒకే స్ర్కీన్ పై కనిపించడం మెగా ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ లో నింపడం ఖాయం.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటూ పెద్దగా ఏం లేకపోయినప్పటికీ... సినిమా అసలు కథంతా మొదటి పావుగంటలోనే తెలిసిపోవడం.. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత మొత్తం సింగిల్ పాయింట్ లో కథంతా సాగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ బాగా తగ్గిపోయింది. అలాగే బాగా యాక్షన్ సీన్లు వున్నాయి. కొన్ని కొన్ని సీన్లు కాకుండా... మిగతా సినిమా అంతా కూడా... తర్వాత సీన్ ఏం జరుగనుందో ప్రేక్షకులు అలవోకగా ఊహించేయవచ్చు. మొత్తానికి రోటిన్ కథ అయినప్పటికీ... విజువల్స్ పరంగా బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు:
‘సుప్రీమ్’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ దర్శకుడు అనిల్ రావిపూడి. కథ అంతగా కొత్తదేమి కాకపోయినప్పటికీ... స్ర్కీన్ ప్లే పరంగా అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక మంచి పాయింట్ ను తీసుకుని ఎమోషన్, లవ్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ను జోడించి అద్భుతంగా స్ర్కీన్ ప్రెజెంట్స్ చేసాడు. ‘పటాస్’ తర్వాత దర్శకుడిగా తన రెండవ సినిమా ‘సుప్రీమ్’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకున్నాడు. సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా వుంది. ఒడిసా నేపథ్యంలో వచ్చే ఓ భారీ ఛేజింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్. సినిమాటోగ్రఫి అదిరిపోయింది. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. విజువల్స్ పరంగా ఆ పాటలు మరింత బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ వర్క్ బాగుంది. తొలిసారిగా నిర్మాతగా మారిన శిరీష్.. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘సుప్రీమ్’: కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్
- Sandy