కథ:
దినేశ్ ( విజయ్ ఆంటోనీ) ఓ ఐటీ ఉద్యోగి. పెళ్లి చేసుకుని భార్య ఐశ్వర్య(అరుంధతీ నాయర్) తో కాపురం చేస్తు హాయిగా జీవిస్తుంటాడు. ఇంతలో కొన్ని అనుకోని పరిణామాలు జరుగుతుంటాయి. దినేశ్ పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తూ సూసైడ్ చేసుకునేందుకు యత్నిస్తుంటాడు. ఆ క్రమంలో క్లోజ్ ఫ్రెండ్ దినేశ్ ను కాపాడి చనిపోతాడు. దినేశ్ మానసిక స్థితి బాగా లేదని వైద్యుడు(కిట్టీ) దగ్గరికి తీసుకెళ్తాడు అతని బాస్ (వైజీ మహేంద్ర).
ఆ తర్వాత దినేశ్ పూర్వ జన్మ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తుంటాయి. తన పరిస్థితికి కారణం అదే అని డిసైడ్ అయిన దినేశ్ జ్నాపకాల గురించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వెతుక్కుంటూ వెళ్లతాడు. ఆ ప్రయాణంలో జయలక్ష్మీ, శర్మ అంటూ కొన్ని పాత్రల పేర్లు వినిపిస్తుంటాయి. వాటికి, అతనికి సంబంధం ఏంటి? ఆ మానసిక సంఘర్షణ నుంచి దినేశ్ ఎలా బయటపడతాడు అన్నదే కథ.
బిచ్చగాడు అనే టైటిల్ తో ఓ సినిమాను రిలీజ్ చేయటం ఒక విషయం అయితే, డబ్బింగ్ సినిమాగా వచ్చి ఊహించని రీతిలో హిట్ కొట్టడం ఒక్క విజయ్ ఆంటోనీకే చెల్లిందేమో. అంతకు ముందు వచ్చిన రెండు చిత్రాలు నకిలీ, సలీం లు కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చటం, బిచ్చగాడు ఏకంగా బ్లాక్ బస్టర్ అయిపోవటంతో తర్వాతి సినిమా భేతాళుడిపై కూడా అంచనాలు అదే స్థాయి లో పెరిగిపోయాయి. రిలీజ్ కు ముందే 15 నిమిషాలు అధికారికంగా విడుదలై మరో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈరోజే మన ముందుకు వచ్చింది. మరి ఫలితం ఎలా ఉందో చూద్దాం.
విశ్లేషణ:
పునర్జన్మ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని అల్లిన ఓ కథ, దానికి సైకలాజికల్ ఫీలింగ్ ను అన్వయించి, పైగా విజయ్ ఆంటోనీ లాంటి సపరేట్ మేనరిజం ఉన్న హీరోను ఎంచుకుని అద్భుతమైన ప్రయోగమే చేశాడు దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి. సినిమాను రెండు భాగాలుగా చేసుకుని మొదటి పార్ట్ లో హీరో పడే మథన, రెండో పార్ట్ లో హార్ట్ కోర్ ఫ్లాష్ బ్యాక్ లను సమానంగా డీల్ చేశాడు. సినిమా మొదటి నలభై సినిమాలు చూస్తున్నంత సేపు ఓ ప్రత్యేక అనుభూతి కలగటం మాత్రం ఖాయం. అయితే ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిపిన దర్శకుడు, సెకండాఫ్ ను మాత్రం రెగ్యులర్ ఫార్మట్ లో కాస్త స్లో నారేషన్ తో నడిపాడు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. లీడ్ రోల్స్ ఫెర్ ఫార్మెన్స్ తో అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
నటీనటుల విషయానికొస్తే... ముమ్మాటికీ ఇది విజయ్ ఆంటోనీ వన్ మాన్ షోనే. కేవలం కళ్లతో భయానక ఎక్స్ ప్రెషన్ల, సైకో ఫీలింగ్స్ ను తెరపై అద్భుతంగా పండించాడు. విజయలక్ష్మీ ఎవరో తెలుసుకునే తాపత్రయం, భేతాళుడిగా ఆత్మహత్య చేసుకోవాలను కోవటం ఒక ఎత్తు అయితే, శర్మ పాత్ర మరో హైలెట్. సినిమా సినిమాకి డిఫరెంట్ జోనర్ ప్రదర్శిస్తూ వస్తున్న విజయ్ ఇందులోనూ మరో గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. విజయ్ కు ఏ మాత్రం తగ్గకుండా అరుంధతీ నాయర్ నటించింది. విజయ్ లక్ష్మీ పాత్రలో మెస్మరైజ్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. చనిపోయే హీరో ఫ్రెండ్ చేసిన వ్యక్తి బాగా చేశాడు. మిగతా పాత్రలు కూడా వాటి పరిధిలోనే కనిపిస్తుంటాయి.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... పాటల కన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే మ్యూజిక్ ఆకట్టుకున్నాడు విజయ్ ఆంటోనీ. శాస్త్రోస్తంగా వచ్చే సంగీతం లౌడ్ నెస్ ఎక్కువైనప్పటికీ, ఆదే సినిమాకు మేజర్ హైలెట్ గా నిలిచింది. ఇక ప్రదీప్ కళైపురయత్ డార్క్ నెస్ సినిమాటోగ్రఫీ బాగుంది. షూటింగ్ కోసం ఎంచుకున్న లొకేషన్లను బాగా చూపించాడు. ఎడిటింగ్ సినిమాపై క్లారిటీ ఉండేలా చేసింది. సొంత సినిమా కావటంతో విజయ్ రిచ్ గానే సినిమాను తెరకెక్కించాడు..
ఫ్లస్ పాయింట్లు:
విజయ్ ఆంటోనీ,
బ్యాగ్రౌండ్ మ్యూజిక్,
కెమెరా పనితనం,
ఫస్టాఫ్
మైనస్ పాయింట్లు:
సెకండాఫ్ రెగ్యులర్ ఎలిమెంట్స్
క్లైమాక్స్
సెకండాఫ్ లో కథ కాస్త గాడి తప్పినప్పటికీ, క్లైమాక్స్ రెగ్యులర్ తరహాలో ముగిసినప్పటికీ, భేతాళుడు బాగానే ఆకట్టుకుంటాడు. ఫ్యామిలీ ప్రేక్షకుల సంగతి ఏమోగానీ, హర్రర్, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడుతూ వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఈ వారాంతంలో మంచి చాయిస్ గా నిలుస్తుంది
చివరగా... భేతాళుడు ఓ ఎంగేజింగ్ థ్రిల్లర్.