కథ:
ఓపెన్ చేస్తే 16వ శతాబ్దానికి చెందిన రామా అనే యువకుడు దేవుడిని చూడాలన్న కోరికతో చిన్నప్పటి నుంచి తహతహలాడిపోతుంటాడు. గురువు(సాయి కుమార్) బోధనలతో శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోతాడు. అయితే తప్పస్సు చేస్తున్న సమయంలో సాక్షాత్తూ దేవుడే వచ్చినా పట్టించుకోడు. దీంతో తాను చేసిన తప్పు తెలిసి పశ్చాత్తపం కోసం తిరుమల చేరతాడు. అక్కడ కొండపై జరిగే అన్యాయాలను కనిపెట్టి ఆలయ ధర్మకర్త గోవిందరాజు(రావు రమేష్) కి ఎదురు తిరుగుతాడు. అంతే కాదు ఆగమ శాస్త్రం పాటించకుడా అపవిత్రం చేస్తున్నాడంటూ భక్తులతో కలిసి తిరగుబాటు కూడా లేవదీస్తాడు.
ఇక ఈ విషయాలు తెలిసిన రాజు(సంపత్ రాజు) రామాను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమిస్తాడు. కృష్ణమ్మ(అనుష్క) అనే భక్తురాలి సాయంతో తిరుమల ప్రశస్తిని తెలియజేస్తూ కాలం గడుపుతుంటాడు రామా. ఇంతలో రామా భక్తికి మెచ్చి స్వయంగా శ్రీనివాసుడే పాచికలు ఆడటం, అందులో తన నగలను కోల్పోవటం జరుగుతుంది. దేవుడి ఆభరణాలు రామా ఆశ్రమంలో కనిపించే సరికి రాజు అతన్ని బంధిస్తాడు. మరి రాజు చెర నుంచి రామాను దేవుడు ఎలా రక్షిస్తాడు? ఆపై రామా హథారాం బావాజీగా ఎలా మారతాడు? చివరకి భగవంతుడి అనుగ్రహం పొంది ఎలా జీవసమాధి అవుతాడు అన్నదే కథ.
భక్తిరస చిత్రాలను అందించటంలో అక్కినేని నాగార్జున, రాఘవేంద్ర రావులది ఎప్పుడూ ప్రత్యేక శైలే. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి ఇలా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల మధ్యలో వదలటం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. అలాంటి కాంబోలో మళ్లీ నమో వేంకటేశాయ అంటూ ఓ సినిమా రావటం చర్చనీయాంశమైంది. అంతగా పరిచయం లేని హథీరాం బాబా జీవిత కథను సినిమాగా తెరకెక్కించటంతో ఆ అంచనాలు పెరిగాయి. మరి నాగ్-దర్శకేంద్రుడి భక్తి మ్యాజిక్ ఈసారి ఎలా పని చేసిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
విశ్లేషణ:
భక్తి అనే పాయింట్ కు ఎమోషనల్ డ్రామాను యాడ్ చేస్తే అది ఖచ్ఛితంగా వర్కువట్ అయిన ఫార్ములాను ఇంతకు ముందు అన్నమయ్య, శ్రీరామదాసులలో రాఘవేంద్ర రావు అల్రెడీ చూపించాడు. కొత్తగా హథీరాం బాబా గురించి స్టడీ చేసింది తక్కువే అయినా కథను దానిని బిల్డప్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. రామదాసు లోని కారాగారానికి పంపటం అనే అంశాన్ని పట్టకుని ఓ పరమ భక్తుడు దేవుడిని మెప్పించటం ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా తెరకెక్కించాడు దర్శకేంద్రుడు.
ఇదే సమయంలో తిరుమల మీద జరిగే కొన్ని స్వామివారి శేష వస్త్రం, అగ్ని తీర్థం, వెంకటగిరి, నిత్య కళ్యాణం లాంటి ఘట్టాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించటం అభినందనీయం. దీనికితోడు సిచ్యుయేషనల్ గా వచ్చే నాలుగు పాటలు, సెకంఢాఫ్ లో వచ్చే కథ, క్లైమాక్స్ లో ఎమోషన్ సన్నివేశాలు సినిమాను పీక్స్ లోకి తీసుకెళ్లాయి. అయితే ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని అనవసర సన్నివేశాలు, రాముడు భగవంతుడితో పాచికలు ఆడే సిచ్యుయేషన్, రెండు పాటలు సినిమా లెంగ్త్ ను పెంచాయోమో అనిపించక మానదు.
నటీనటుల విషయానికొస్తే... రొమాంటికే కాదు, భక్తిరస పాత్రలంటే కూడా ఎంత లీనమయిపోతాడో తెలియంది కాదు. అన్నమయ్య, రామదాసుల కంటే హథీరాం గురించి జనాలకు పెద్దగా పరిచయం లేదు. అలాంటి క్యారెక్టర్ ను ఛాలెంజ్ గా తీసుకుని నాగ్ చేసిన ఫెర్ ఫార్మెన్స్ చూస్తే నిజంగా హథీరాం ఇలాగే ఉండేవాడేమో అన్న ఫీలింగ్ కలగక మానదు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లలో అంతగా డెప్త్ చూపించాడు. ఇక యాక్షన్ సన్నివేశాలలో, మరోవైపు స్వామివారి కోసం పరితపించే ప్రియ భక్తుడిగా మెప్పించాడు. రాఘవేంద్రరావు తన మీద నిలబెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వంద శాతం న్యాయం చేశాడు.
ఇక శ్రీవెంకటేశ్వర స్వామి పాత్రలో చేసిన సీరియల్ నటుడు సౌరభ్ రాజ్ జైన్ కూడా మంచి ఫెర్ ఫార్మెన్స్ నే ఇచ్చాడు. లిప్ సింక్ మిస్సయినప్పటికీ, ఎలాగూ పౌరాణిక పాత్రలు చేసిన అనుభవం మూలానో ఏమో ఆ పాత్ర హవభావాలను బాగానే పండించాడు. అయితే ఎటోచ్చి కుర్రాడు కావటం మూలానోఏమో పాత్ర మెచ్యూరిటీకి వయసు సరిపోలేదేమో అనిపిస్తుంది. కృష్ణమ్మగా అనుష్క మంచి రోల్ నే సంపాదించింది. రామా మరదలి క్యారెక్టర్ లో ప్రగ్న్యా జైస్వాల్ చిన్నరోల్ లో నే కనిపించినప్పటికీ, ఒక్క పాటలో గ్లామర్ రసాన్ని ఒలకబోసింది. విలన్ పాత్రలో గోవిందరాజులుగా రావు రమేష్, చక్రవర్తిగా సంపత్ రాజులు ఓకే అనిపించారు. జగపతి బాబు పాత్ర కేవలం పాటకే పరిమిత అయినట్లు అనిపిస్తుంది. బ్రహ్మీ రోల్ వేస్టయ్యింది.
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. ఎప్పటిలాగే తన మ్యూజిక్ మ్యాజిక్ తో నిలబెట్టాడు కీరవాణి. అఖిలాండ కోటి పాటలో అతనిచ్చిన మ్యూజిక్ అమోఘం. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఇచ్చాడు. సీనియర్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి రాఘవేంద్రరావు టేస్ట్ కు తగ్గట్లుగానే చూపించాడు. జేకే బైరవి రాసిన డైలాగులు ఓ మోస్తరుగా ఉన్నాయి. రిస్క్ తీసుకోకుండా ఇప్పటి స్లాంగ్ తోనే వాటిని రాసేశాడు. గౌతంరాజు ఎడిటింగ్ ఫర్వాలేదు. భక్తి రస చిత్రాలకు ముఖ్యమైన ఆర్ట్ వర్క్ ను కిరణ్ కుమార్ బాగా చేశాడు. నిర్మాత మహేష్ రెడ్డి సినిమాకు గ్రాండ్ లుక్కు తెచ్చేందుకు చేసిన ఖర్చు నిర్మాణ విలువల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఫ్లస్ పాయింట్లు:
నాగ్ నటన
పాటలు
సంగీతం
మైనస్ పాయింట్లు:
కొన్ని అనవసర సన్నివేశాలు
కామెడీ
తీర్పు:
కలియుగ ప్రత్యక్ష దైవం కృప కోసం ఓ గొప్ప భక్తుడు అయిన రామా హథీరాం బావాజీ గా ఎలా మారాడు అన్న కథను చాలా ఎఫెక్టివ్ గా తెరపై చూపించగలిగాడు దర్శకుడు రాఘవేంద్ర రావు. నాగ్ నటన, పాటలు, మిగతా ఆర్టిస్ట్ ల సపోర్ట్ ఇలా సమిష్టి కృషితో ఓం నమోవేంకటేశాయ రూపొందించాడు. అయితే మునుపటి సినిమాల కన్నా ఎమోషనల్ పాలు కాస్త తక్కువైనప్పటికీ, ఓ డీసెంట్ చిత్రాన్నే అందించటంలో దర్శకేంద్రుడు విజయవంతం అయ్యాడనే చెప్పుకోవచ్చు.
చివరగా... హథీరాం బాబాగా నాగ్ నట విశ్వరూపం.. ఓ ఆధ్యాత్మిక ప్రయాణం...