కథ:
అమెరికాలో ఉండే వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్న రాజు(రాజా చెంబోలు) కు పెళ్లి సంబంధం కోసం ఇండియాకు వస్తాడు. తెలంగాణలోని బాన్సువాడలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన రేణుకతో రాజుకు పెళ్లి నిశ్చయం అవుతుంది. అయితే ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే.. రేణుక చెల్లి భానుమతి(సాయి పల్లవి)తో వరుణ్ ప్రేమలో పడిపోతాడు. భానుకి కూడా వరుణ్ అంటే ఇష్టం మాత్రమే ఉంటుంది. అయితే స్వతంత్ర్య భావాలున్న భాను తండ్రిని వదిలి ఉండేందుకు అస్సలు ఒప్పుకోదు. వరుణ్ కి మాత్రం అమెరికాలో సెటిల్ అయిపోవాలనే డ్రీమ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుణ్ లవ్ ప్రపోజల్ ను తిరస్కరించటం, ఇద్దరి మధ్య ధ్వేషం పీక్ స్టేజీలోకి వెళ్లిపోతుంది. మరి వరుణ్ భానుమతిని ఎలా కన్విన్స్ చేశాడు, తన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడు అన్నదే కథ.
ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్ లో ఓ మార్క్ వేయించుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ ఊపును కొనసాగించలేకపోయాయి. దీంతో పునర్వైభవం కోసం కాస్త గ్యాప్ తీసుకుని ఫిదాను తెరకెక్కించాడు. మెగా తనయుడు వరుణ్ తేజ్ , మళయాళం ప్రేమమ్ ఫేమ్ సాయి పల్లవి జంటగా నటించగా, ఫ్యామిలీ చిత్రాల మేకర్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా రూపొందించబడింది. మరి ఈ చిత్రం శేఖర్ కు, వరుసగా రెండు ఫ్లాపులతో ఉన్న వరుణ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
విశ్లేషణ:
మిడిల్ క్లాస్ జనాలు కూడా ముచ్చటపడేలా ఆహ్లాదకరమైన సినిమాలను అందిస్తాడనే శేఖర్ కమ్ములకు పేరుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, విలేజ్ బ్యాక్ డ్రాప్, సిస్టర్ సెంటిమెంట్, వాళ్లు మాట్లాడుకునే సంభాషణలు.. ఇలా అన్నీ అలాంటి ఫీలింగ్ నే అందించాయి. అయితే ఆ ఫీల్ ను సెకండాఫ్ లో కొనసాగించలేకపోయాడు దర్శకుడు.
కథ మాములుదే అయినప్పటికీ బలమైన భానుమతి క్యారెక్టర్, ఆమె చేత చెప్పించిన డైలాగులు యూత్ తోపాటు ఫ్యామిలీస్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. హీరో అన్న పెళ్లి ఎపిసోడ్ ను చాలా నేచురల్ గా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఎపిసోడ్ బాగుంటుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ కన్విన్సింగ్ గా అనిపించదు. దేనైనా బ్రాడ్ మైండ్ తో ఆలోచించే భానుమతి వరుణ్ ప్రపోజల్ ను రిజక్ట్ చేయటం, అతన్ని అనుమానించటం ప్రాక్టికల్ గా సెట్ కాలేదు.
సెకండాఫ్ వచ్చే సరికి కథ యూఎస్ కు షిఫ్ట్ అయ్యాక పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. అయితే ప్రపోజల్ చేసే సమయంలో భాను రియాక్ట్ అయ్యే సీన్ హిల్లేరియస్ గా ఉంటుంది. కథ నెమ్మదిగా సాగుతుండగా మధ్యలోకి వచ్చేసరికి పరమ బోరింగ్ గా మారిపోతుంది. ప్రేమ-ద్వేషం-మళ్లీ ప్రేమ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటానికి ప్రేక్షకుడికి సమయం పట్టేలోపే, ఇద్దరు కలిసిపోవటం మరింత కన్ఫ్యూజన్ కు గురి చేస్తుంది. పైగా అది అంత హర్ట్ టచింగ్ గా అనిపించదు కూడా. కేవలం లోకేషన్ల ను చూపించటమే తప్ప అసలు కథలో ఎలాంటి ప్రెష్ నెస్ లేకుండా పోయింది. అయితే ఫస్టాఫ్ మ్యాజిక్ తో ఓవరాల్ గా ఓ ఫీల్ గుడ్ మూవీని చూశామనే అభిప్రాయం కలుగుతుంది.
నటీనటుల విషయానికొస్తే... వరుణ్ తేజ్ ఎన్నారై యువకుడిగా బాగానే చేశాడు. ఇంతకు ముందు సినిమాల కంటే నటన మెరుగైనప్పటికీ అది పూర్తిస్థాయి కాలేదేమో అనిపిస్తుంది. ఫిట్ నెస్ మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. డైలాగ్ డెలివరీలో సాయి పల్లవి డామినేషన్ ఉండటంతో చాలా వరకు సేఫ్ అయ్యాడు. ఇక సినిమా కు మెయిన్ అస్సెట్ గా మారింది సాయి పల్లవి. పక్కా మాస్ తెలంగాణ యువతిగా అదరగొట్టింది. డబ్బింగ్ లో కూడా యాస స్పష్టంగా పలికించగలిగిందంటే గ్రేట్ అనే చెప్పాలి. స్వతహాగా మంచి డాన్సర్ కావటంతో "వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే" లో చెలరేగిపోయింది. అయితే క్లోజప్ షాట్లలో ముఖం మరీ ఎబ్బెట్టుగా అనిపించకమానదు. హీరో అన్న పాత్రలో రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా చెంబోలు బాగా చేశాడు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ లో శరణ్య ప్రదీప్, తండ్రి రోల్ లో సాయి చంద్ ఫర్ ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... శక్తికాంత్ కార్తీక్ సంగీతం సినిమాకు సగం బలంగా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. విజయ్ సి కుమార్ కెమెరా పనితనం సినిమాకు మిగతా సగబలం అందించింది. పల్లెటూరి లోకేషన్లను చూపించిన తీరు బాగుంది. సినిమా నిడివి విషయంలో మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగా హెల్ప్ అయ్యింది. డైలాగులు సింపుల్ అండ్ స్వీట్ గా ఉన్నాయి. దిల్ రాజు ప్రోడక్షన్ వాల్యూస్ ఎప్పటిలాగే బాగున్నాయి.
ఫస్ల్ పాయింట్లు:
ఫస్టాఫ్
హీరోయిన్
డైలాగులు
మైనస్ పాయింట్లు:
సాగదీత సెకండాఫ్
బోరింగ్ లవ్ ట్రాక్
తీర్పు:
ఎప్పటికప్పుడు జనరేషన్ ను అబ్జర్వ్ చేసి తన సినిమాల్లో వాళ్లు ఎలా ఉంటున్నారు అన్న పాయింట్ మీదే పాత్రలను ఎలివేట్ చేసే కమ్ముల ఇప్పడూ అదే పని చేశాడు. అయితే అది అనుకున్నంత స్థాయిలో లేదనే చెప్పాలి. ఫిదా లో డల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, హ్యుమర్, లవ్, ఎమోషన్స్ లాంటి ఫస్ పాయింట్లు సినిమాకు హెల్ప్ అయ్యాయి. శేఖర్ కమ్ముల బెస్ట్ పనితనం అని చెప్పలేకపోయినప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ మంచి కాఫీ లాంటి సినిమానే అనుకోవచ్చు.
చివరగా... ఫిదా ఓ ఫీల్ గుడ్ మూవీనే...