అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా నటించిన ఇవాళ ప్రపంచవ్యాప్త తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ మంచి మెసేజ్ ఓరియంటెంట్ చిత్రాల నుంచి మరోమారు ఆయనను తన అభిమానులకు మరీ ముఖ్యంగా మాస్ అడియన్స్ కు మరోసారి దగ్గరకు తీసుకువచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. పోకిరి, దూకుడు చిత్రాల్లో మహేష్ మళ్లీ అంతే కొత్తగా అభిమానుల మందుకు తీసుకోచ్చాడు అనీల్ రావిపూడి. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు ఎలా నటించాడు.. అనీల్ రావిపూడి ఎలాంటి వైవిద్యం ప్రదర్శించాడు అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇచ్చేలోపు అసలు కథ ఏంటంటే..
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్‌బాబు) ఎంతో ధైర్యసాహసాలు కలిగిన అర్మీ అధికారి. కొందరు పిల్లలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడంతో స్సెషల్ ఆపరేషన్ కోసం అజయ్ కృష్ణ అతని టీమ్ రంగంలోకి దిగుతుంది. ఉగ్రవాదుల చెర నుంచి విద్యార్థులను విడిపిస్తుంది. అయితే ఈ సమయంలో అజయ్ కృష్ణకు ఊహించిన పరిణామం ఎదురై.. ఆర్మీ నిబంధల ప్రకారం ఆయన స్వయంగా కర్నూలుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే అజయ్ ఒక్కడు కాకుండా అతనితో తన టీజ్ కోలింగ్ రాజేంద్ర ప్రసాద్ (ప్రసాద్)తో కలసి వస్తాడు.
అతను కర్నూలులో ల్యాండ్ అయ్యే సమయానికి అక్కడ కర్నూలు మెడికల్ కాలేజీ ఫ్రోఫెసర్ భారతి ప్రాణాంతకమైన సమస్యల్లో ఇరక్కుపోతుంది. ఆమెను టార్గెట్ చేసింది కూడా రాష్ట్రానికి చెందిన ఓ పలుకుబడి గల మంత్రి నాగేంద్రప్రసాద్ (ప్రకాష్ రాజ్). ఆర్మీ మేజర్ అయిన అజయ్ కృష్ణ మెడికల్ కాలేజీ ప్రోఫెసర్ గా వున్న భారతిని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందీ.? అమెకు ఎందుకు సాయం చేయాల్సి వచ్చింది.? మంత్రితో వైరం పెట్టుకుని ఎలా దారికి తీసుకోచ్చాడు.? చివరకు అతనేమయ్యాడు.? అజయ్ కృష్ణకు.. సంస్కృతి (రష్మిక)కు మధ్య ఎలా పరిచయం సాగిందీ.? అన్న వివరాలు తెలియాలంటే.. తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
మాస్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేశ్‌బాబు తన అభిమానులకు ఫుల్ మీల్స్ బోజనం వడ్డించాడు. సగటు అభిమాని ఏం కోరుకుంటాడో అవన్నీ రంగరించి తయారు చేసుకున్న కథలా అనిపిస్తుంది. ఆర్మీ అధికారి అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ లుక్, యాక్షన్ అదిరిపోయింది. అదే సమయంలో ప్రొఫెసర్ భారతిని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించాడు. ఆర్మీ నేపథ్యంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
ఆర్మీ మేజర్ గా ఉగ్రవాదుల నుంచి మహేశ్ బాబు విద్యార్థులను కాపాడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అప్పటివరకు సీరియస్ గా వున్న కథ అజయ్ కర్నూలు ప్రయాణంతో కామెడీ ట్రాక్ ఎంట్రీ ఇస్తోంది. రైలులో రష్మిక, సంగీత, రావు రమేష్, బండ్ల గణేశ్ తదితర పాత్రలు ప్రవేశించడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. రైలులో జరిగే సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయి. అజయ్ ను ప్రేమించే అమ్మాయిగా రష్మిక నటన, మేనరిజం.. బ్లేడ్ గ్యాంగ్‌గా బండ్ల గణేష్ హంగామాతో ప్రథమార్ధం కితకితలు పెట్టిస్తుంది.
రైలు కర్నూలు చేరుకున్న తరువాత కథ మళ్లీ సీరియస్ ట్రాక్ లో రన్ అవుతుంది. ఇక్కడి నుంచి అజయ్, భారతి-నాగేంద్ర ప్రసాద్ మధ్య పోరు మొదలవుతుంది. ఒక హత్య కేసు కోసం భారతి పోరాటం చేయడం, ఆమె కుటుంబంపై నాగేంద్ర ప్రసాద్ కక్ష సాధించడం, విషయం తెలిసిన అజయ్ ఆ చర్యలను అడ్డుకోవడం ఇలా సన్నివేశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మహేశ్-విజయశాంతి-ప్రకాష్‌రాజ్ ఒకరితో మరొకరు పోటీ పడి మరీ నటించారు. ప్రథమార్ధంలో కామెడీకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు ద్వితీయార్ధంలో కథనం సీరియస్ గా నడిపించాడు.
అయితే క్రైమ్ బ్రాంచ్ కోటిగా సుబ్బరాజు, కిషోర్ లతో కామెడీని రన్ చేశాడు. రాజకీయ నాయకులను బంధించి మహేశ్ బాబు చెప్పే పిట్ట కథ, వాళ్లను భయపెట్టడానికి బాంబు పెట్టడం తదితర సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఇక విజయశాంతి-మహేశ్ బాబుల మధ్య ఆర్మీ గొప్పదనం గురించి సన్నివేశాలు ఉద్విగ్నతకు గురి చేస్తాయి. ఆ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఒళ్లు గగురుపొడిచేలా చేస్తుంది. ముఖ్యంగా మహేశ్ కర్నూలు వచ్చిన కారణాన్ని చెప్పే సన్నివేశంలో భావోద్వేగాలు అద్భుతంగా పండాయి.
అయితే ఎఫ్ 2 మాదిరిగానే ఈ చిత్రం కూడా ప్రథమార్థం ఎంతో ఆసక్తిగా సాగినా.. ద్వితీయార్థంలో కొంత సాగదీత వుందనిపిస్తోంది. అయితే, కథ సీరియస్ గా సాగుతూనే మహేశ్ కామెడీ టైమింగ్ అలరిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల సమయంలోనూ మహేశ్ పంచ్ లు, ప్రాసలు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై తళుక్కున మెరుస్తారు. ఆయన మెరుపులను వెండితెరపై చూడాల్సిందే. అయితే చిత్రంలో కొన్ని సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర పడితే బాగుండు అనిపించిక మానదు.. ఇక రోటిన్ కు బిన్నంగా సాగే క్లైమాక్స్ కూడా అభిమానుల అంచనాలకు దూరంగా వుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
మహేష్ కెరీర్ మొత్తంలో అత్యంత ఉత్సాహభరితమైన పాత్రల్లో ‘సరిలేరు నీకెవ్వరు’లోని అజయ్ క్యారెక్టర్ ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మహేష్ ఫ్యాన్స్ తో పాటు మిగతా ప్రేక్షకులు కూడా ప్రిన్స్ ను ఇలాంటి పాత్రలో చూసి ఇష్టపడతారు. అంత ఎనర్జిటిగ్గా.. సరదాగా సాగుతుంది మహేష్ పాత్ర. సిగ్నేచర్ మేనరిజం, స్టయిల్ రాయలసీమ యాస, కామెడీ టైమింగ్ అన్నింట్లో మహేష్ అదరగోట్టాడు. డ్యాన్సింగ్ స్కిల్స్ ను కూడా ప్రదర్శించాడు. ముఖ్యంగా ‘మైండ్ బ్లాంక్’ పాటలో మహేష్ స్టెప్పులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఓవరాల్ గా మహేష్ తన అభిమానులకైతే కనువిందు చేసేశాడు.
హీరోయిన్ రష్మిక మందన్నా పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఆమె ఉత్సాహంగానే నటించినా.. పాత్ర మరీ సిల్లీగా అనిపిస్తుంది. లుక్స్ పరంగా మహేష్ ముందు ఆమె తేలిపోయింది. కొన్ని సన్నివేశాల్లో మరీ రెచ్చిపోయిందిరో అనిపించేలా వుంది. దాదాపు 13 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. తన హుందా తనంలో చిత్రానికి వెన్నె తీసుకువచ్చింది. మెడికల్ కాలేజీ ఫ్రోఫెసర్ గా తన ప్రత్యేకత చాటుకుంది. సైనికుల గొప్పదనం గురించి చెప్పే సన్నివేశంలో విజయశాంతి నట కౌశలం కనిపిస్తుంది.
ప్రకాష్ రాజ్ గురించి చెప్పడానికేమీ లేదు. సహజంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ఆయన ఈ చిత్రంలో మంత్రి నాగేంద్ర ప్రసాద్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా మహేశ్-ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. రావు రమేష్ రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ సత్యదేవ్ మురళీ శర్మ చాలా మామూలు పాత్రలు ధరించినా వారి పాత్రపరిధి మేరకు వారు బాగా నటించారు. జయప్రకాష్ రెడ్డి.. అజయ్.. సంగీత పర్వాలేదు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సంగీతం, ఆర్మీ గొప్పదనం సన్నివేశంలో వినిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ అదిరింది. పాటలు దృశ్యపరంగా ఆకట్టుకునేలా వున్నాయి. శేఖర్ మాస్టార్ కొరియోగ్రఫీకి మార్కులు పడ్డాయి. డాంగ్ డాంగ్.. మైండ్ బ్లాక్ పాటలతో పాటు దేశభక్తి గీతానిని అందించిన మ్యూజిక్ హాట్సాఫ్. రత్నవేలు ఛాయాగ్రహణం చాలా బాగుంది. పిల్లల కిడ్నాప్, బాంబు పేలుడు సన్నివేశాల్లో ఛాయాగ్రహనం ఆకట్టుకుంది. వీటితో పాటు కశ్మీర్ ఎపిసోడ్లో.. కొండారెడ్డి బురుజు యాక్షన్ సీన్లో విజువల్స్ సూపర్బ్.
నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. దర్శకుడిగా అనిల్ రావిపూడి తన ప్రత్యేకతను రోటీన్ చిత్రాల కథ తరహాలోనే తీసినా.. సూపర్ స్టార్ ఇమేజ్.. అభిమానులు కోరుకునే మాస్ సన్నివేశాలతో మార్కులు వేసుకున్నాడు. కమర్షియల్ సినిమాల్లో కథ పెద్దగా ఉండదు కానీ.. ఇందులో కథ విషయంలో అతను మరీ లైట్ తీసుకున్నాడు. అతను ఎప్పట్లా కామెడీలో తన బలాన్ని చూపించాలని అనుకున్నాడు. అయితే ద్వితీయార్ధంలో తడబడ్డినట్టుగా కనిపించాడు. అయితే తమ్మిరాజు మాత్రం ఇంకాస్త పనిపెట్టింవుంటే సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్లదన్న టాక్ వుంది.
తీర్పు..
‘సరిలేరు నీకెవ్వరు’.. నిడివి ఎక్కువై.. సాగిందే కానీ.. బొమ్మ మాత్రం.. దద్దరిల్లింది.!
చివరగా.. మహేశ్ ఫ్యాన్స్ కు పండగ బోజనమే..!