తనదైన బాడీలాంగ్వేజ్, మేనరిజమ్స్, ఎనర్జీతో తన కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో రవితేజ. అయితే తన చిత్రాలలో రోటీన్ గా వుండటం వల్ల భారీ హిట్ కావడం లేదని భావించిన రవితేజ.. రోటిన్ కు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకుడు వి.ఐ.ఆనంద్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `డిస్కోరాజా`. గతంలో రవితేజతో `నేలటిక్కెట్టు` సినిమాను నిర్మించిన రామ్ తాళ్లూరియే ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంతో రవితేజకి సక్సెస్ వచ్చిందా? దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఈ చిత్రంలో రవితేజను ఎలా ప్రెజెంట్ చేశాడు.? సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రేక్షకులను రవితేజ ఎలా మెప్పించాడన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి ఎంటర్ కావాల్సిందే.
వాసు(రవితేజ) అనాథ. తనతో పాటు మరికొంత మంది అనాథలను చేరదీసి పెంచుతుంటాడు. వారు ఉంటున్న ఇల్లును కొనుక్కోవాలని అనుకుంటారు. దాని కోసం పాతిక లక్షల రూపాయలను పోగు చేస్తారు. అయితే ఆ డబ్బులు వేరొకరు దొంగలిస్తారు. ఆ డబ్బును వెతుక్కుంటూ వాసు గోవా వెళతాడు. అయితే వాసు లడక్‌లో చనిపోయి మంచు గడ్డల్లో కూరుకుపోతాడు. అతని శవాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఆ శవంలోని అవయవాలు పాడు కాకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభుత్వానికి తెలియకుండా తాను చేస్తున్న ఓ ప్రయోగం ద్వారా ఆ శవానికి ప్రాణం పోస్తాడు.
అయితే ప్రాణం వచ్చిన తర్వాత సదరు వ్యక్తికి ఏవీ గుర్తుండవు. అతని గురించి తెలిసిన కొందరు వ్యక్తులు చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు వారికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. డాక్టర్ల ప్రయోగం ద్వారా ప్రాణం పోసుకుంది వాసు కాదని.. 35 ఏళ్ల క్రితం చంపబడ్డ డిస్కోరాజా అని. అసలు డిస్కోరాజా ఎవరు? అతని 35 ఏళ్ల క్రితం ఎవరు చంపేస్తారు? మరి వాసు ఏమవుతాడు? వాసు ఎవరు? డిస్కోరాజాకి, సేతుకి ఉన్న వైరమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ
డిస్కోరాజా..డిస్కో మ్యూజిక్‌ను ఇష్టపడే రాజా అనే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే సినిమా లైన్. రెగ్యులర్ కమర్షియల్ మూవీ. నాన్న రవితేజ చనిపోవడం.. అతనికి కొడుకు రవితేజ ఉండటం. అతనిపై పగ సాధించడానికి వచ్చిన విలన్స్ భరతం ఎలా పట్టారనేది మూల కథ. అయితే దీనికి తండ్రి పాత్రలో1980 బ్యాక్‌డ్రాప్‌లో కాస్త టచింగ్ ఇవ్వడం . కొడుకు పాత్రను అనాథ చూపించి అతని చుట్టూ కథను నడపడం. చివరకు తండ్రే అసలు తన వెనుక కథ ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో నడిచే సినిమా.
ఇక సినిమాను నడిపించే మెయిన్ పాత్ర డిస్కోరాజాది. ఈ పాత్రతో పాటు అతని కొడుకు పాత్రను రవితేజ క్యారీ చేశాడు. తండ్రి పాత్ర.. కొడుకు పాత్ర ఒకే ఏజ్‌లో ఉండే కాన్సెప్ట్ ఉండే సినిమా కావడంతో రవితేజను ఎక్కడా ఏజ్ డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ విషయంలో డైరెక్టర్ వి.ఐ.ఆనంద్‌ను అభినందించాలి. ఈ రెండు పాత్రలకు ఉన్న కమర్షియల్ టచ్.. కొత్తదనం లేని పాత్రలు కావడంతో రవితేజ రెండు పాత్రలను తనదైన స్టైల్లో చేసేశాడు. లుక్ పరంగా యంగ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.
వాసు అనే పాత్ర కంటే డిస్కోరాజ పాత్రకున్న ప్రాధాన్యత ఎక్కువ. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాత్రలో రవితేజ లుక్ అప్పటి రెట్రో లుక్‌ను పోలి ఉంది. రవితేజ రెట్రో లుక్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లేవు. హీరో డాన్‌గా ఎదిగడం.. అతని ఓ శత్రువు ఉండటం.. మరో కనపడని శత్రువు ఉండటం కామన్‌గా ఇతర సినిమాల్లో ఉన్నట్లే ఉంది. డిస్కోరాజా గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే క్రమంలో బ్యాంకు దొంగతనం కామెడీగా అనిపిస్తుంది. బ్యాంకును దొంగతనం చేసిన దెవరో తెలిసినా పోలీసులు ఆలస్యంగా వస్తారు.
ఇక డాన్‌గా ఎదిగే క్రమంలో రవితేజను ప్లేబోయ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతను మాటలు రాని.. వినపడని హీరోయిన్‌ను ప్రేమించడం ఆమె ప్రేమకోసం గ్యాంగ్‌స్టర్ కనుమరుగై కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనిపై దాడి జరగడం. రొటీన్ కమర్షియల్ సినిమా. ఈ విషయాలు తెలియని కొడుకు రవితేజ.. తండ్రిని చంపాలనుకోవడం.. కానీ నిజం తెలుసుకుని మెయిన్ విలన్ దగ్గరకు వెళ్లడం అతన్ని చంపేస్తారు. కానీ ఇక్కడ అసలు ట్విస్టు. అసలు హీరో కష్టాలకు కారణమైన విలన్ మరొకడుంటాడు. అతన్ని చంపడంతో సినిమా ముగుస్తుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
రవితేజ వన్ మేన్ షో అని చెప్పొచ్చు. ఆయన పాత్రలో పలు కోణాలు కనిపిస్తాయి. వాటన్నింట్లోనూ చక్కగా ఒదిగిపోయాడు. డాన్‌గా, వాసు అనే ఒక సాధారణ యువకుడిగా చాలా బాగా నటించాడు. ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, తాన్య హోప్ తదితర కామెడీ గ్యాంగ్‌తో కలిసి బాగా నవ్వించాడు. ద్వితీయార్ధంలో డిస్కోరాజ్‌గా కనిపించిన విధానం ఇంకా బాగుంటుంది. బాబీ సింహా నటన చిత్రానికి ప్రధాన బలం. బర్మా సేతుగా ఆయన పాత్రకి ప్రాణం పోశాడు. విలనిజం బాగా పండింది. సునీల్ నటన, ఆయన పాత్రని తీర్చిదిద్దిన విధానం సినిమాకి ప్రధాన ఆకర్షణ. పాయల్ రాజ్‌పుత్ మాటలు కూడా లేకుండా హెలెన్‌గా చక్కటి అభినయం ప్రదర్శించింది. అందంతోనూ, పాతకాలంనాటి లుక్‌తోనూ కట్టిపడేస్తుందామె. పాయల్ రాజ్‌పుత్ పాత్ర జస్ట్ ఓకే. ఓపాట మరికొన్ని సీన్స్‌తో తన పాత్రను పరిమితం చేశారు. కానీ తనకు ఈ పాత్ర పెద్ద బ్రేక్ ఇవ్వదని సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఇక తాన్యా హోప్ పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత బెటర్. ఇక రాంకీ, సత్య, సునీల్, రఘుబాబు, భరత్, వెన్నెలకిషోర్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
సాంకేతిక విభాగం మంచి పనితీరుని కనబరిచింది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను, లద్దాఖ్ నేపథ్యాన్ని చాలా బాగా చూపించారు. తమన్ సంగీతం సినిమాకి మరింత బలాన్నిచ్చింది. `నువ్వు నాతో ఏమన్నావో ...` పాట మాత్రమే వినడానికి బావుంది. పాటలు చూడటానికి గొప్పగా ఏవీ లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ఓకే. ఎడిటర్ మాత్రం సెకండాఫ్‌లో మరో పదిహేను నిమిషాలు కత్తెరకు పని చెప్పి ఉండాల్సింది.ఇతర విభాగాలు కూడా సమష్టిగా పనిచేశాయి. దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఒక కొత్త నేపథ్యంలో కథని రాసుకున్న విధానం బాగుంది నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తీర్పు..
డిస్కోరాజా.. కాస్త 1980 బ్యాక్ డ్రాప్‌తో సాగే సాధారణ కమర్షియల్ డ్రామా..! వెతికినా దొరకని సైన్స్ ఫిక్షన్.!!
చివరగా.. సగటు ప్రేక్షకులకు బోరింగ్ రాజా..!..!