ఒక్కోసారి ఆమె పాడితే వెన్నెల కురిసినట్టుంటుంది. ఇంకోసారి ఆమె పాడితే జలపాతం గలగల జాలువారినట్టుంటుంది. మరోసారి ఆమె గొంతు విప్పితే సముద్రం పొంగినట్టుంటుంది. అయితే ఏ పాట పాడినా శ్రోత హృదయం స్వరాల జల్లులో తడిసి ముద్దవుతుంది. విలక్షణమైన స్వరంతో, వైవిధ్యభరితమైన గాత్రంతో అందరినీ ఆకట్టుకునే ఆమె... శ్రావణ భార్గవి. ‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే’ అంటూ దుమ్ము దులిపిన భార్గవి చెబుతున్న కబుర్లు...
పాటతో చెలిమి ఎప్పట్నుంచి?
నిజానికి నాకు సంగీతం కంటే డ్యాన్స్ అంటే ఇష్టం. కానీ అమ్మానాన్నలకు సంగీతమంటే బాగా ఇష్టం. దాంతో చిన్నప్పుడే బి.లలిత గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకోవటానికి చేర్పించారు. నేర్చుకునేదాన్ని గాని, ఎందుకో అంత ఆసక్తి ఉండేది కాదు.
మరి అసలైన ఆసక్తి ఎప్పుడు కలిగింది?
ప్రతి సంవత్సరం చివర్లో సంగీతం పరీక్షలు ఉండేవి. ఆ యేడు పరీక్షలో నాకు ఫస్ట్ వచ్చింది. ఏమాత్రం శ్రద్ధ లేకుండా నేర్చు కున్నా ఫస్ట్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. అప్పుడే మొదటిసారి అనిపించింది... నేను మంచి సింగర్‌ని కాగలనని. అప్పట్నుంచీ మనసు పెట్టి సాధన చేయడం మొదలెట్టా.
మరి చదువు సంగతి...?
దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చేశాను. ప్రస్తుతం ఎంబీయే కూడా చేస్తున్నాను.
సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?
ఈటీవీ ‘సప్తస్వరాలు’లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాను. జడ్జిగా వచ్చిన ఆర్పీ నన్ను రమణ గోగులకు పరిచయం చేశారు. ఆయన ‘బోణీ’ సినిమాలో ‘కాదంటానా’ పాట పాడే అవకాశం ఇచ్చారు.
ఇంతవరకూ ఎన్ని పాటలు పాడారు?
తొంభై వరకూ పాడాను. అన్నిట్లోకీ నాకు బాగా గుర్తింపు నిచ్చింది, నేనేంటో అందరికీ తెలిసేలా చేసింది ‘సింహా’లోని ‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే’ పాట. అందుకే అదంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.
ఏ పాటైనా పాడలేక కష్టపడ్డారా?
పాడలేక అని కాదు గానీ, ‘తీన్‌మార్’లో ‘ఆలెబాలె’ పాట పాడినప్పుడు ఒక ఇబ్బంది ఎదురయ్యింది. మణిశర్మగారికి లిరిక్స్ నచ్చలేదు. కానీ అప్పటికే నేను ఆ పాట పాడేశాను. కొత్త లిరిక్స్ రాయించాక మళ్లీ పాడాను. అయినా ఆయనకు తృప్తి లేకపోవడంతో మళ్లీ రాయించారు. అలా నాలుగుసార్లు రాయించారు. నేను నాలుగు సార్లు పాడాను. సాధారణంగా మొదటిసారి పాడినట్టుగా తర్వాత ఉండదు. ఇక నాలుగోసారి అంటే కచ్చితంగా మార్పు ఉంటుంది కదా! అదే జరిగింది. నేను అనుకున్నంత బాగా పాట రాలేదు.
ఇంకా చాలా వాటిలో ప్రావీణ్యం ఉందిగా?
(నవ్వుతూ) ప్రావీణ్యం అని కాదు గానీ చెయ్యడమైతే చాలా చేస్తున్నాను. బిగ్ ఎఫ్‌ఎంలో ఆర్జేగా చేస్తున్నప్పుడు నా వాయిస్ విని దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్‌సింగ్’లో శృతీహాసన్‌కి డబ్బింగ్ చెప్పించారు. మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘ఓం’ సినిమాలో నికిషా పటేల్‌కి కూడా చెబుతున్నాను.
పాటలు కూడా అద్భుతంగా రాస్తారట?
‘బద్రీనాథ్’లో ‘ఇన్ ద నైట్’ పాట రాశాను. ‘ఈగ’ సినిమాని హిందీలో తీస్తున్నారు. దానిలో ఒక పాట రాశాను. అందులో సమంతాకి డబ్బింగ్ కూడా నేనే చెబుతున్నాను. అలాగే మణిశర్మగారు ఓ హిందీ సినిమాకి పని చేస్తున్నారు. అందులో ఓ పాట రాసి పాడాను.
ఒకేసారి ఇన్ని చేయడం కష్టంగా లేదా?
అలవాటైపోయింది. అయినా మనకు నచ్చిన పని చేయడంలో తృప్తి ఉంటుంది కదా... ఇక అలసట ఎందుకొస్తుంది!
ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం...?
ఓసారి అమెరికాలో షో జరుగుతోంది. హాలంతా చీకటిగా ఉంది. నేను కళ్లు మూసుకుని పాట పాడటంలో లీనమై పోయాను. కళ్లు తెరిచేసరికి అక్కడక్కడా దీపాలు. ఏంటా అని చూస్తే... నా పాటకు ముగ్ధులైన ఆడియన్స్ సెల్‌ఫోన్లు ఆన్ చేసి, వాటిని లయబద్ధంగా అటూ ఇటూ ఊపుతున్నారు. ఎంత అద్భుతమైన దృశ్యమో అది!
వాయిస్‌ని కాపాడుకోటానికి ఏమైనా చేస్తారా?
అస్సలు లేదు. నాకు ఐస్‌క్రీములంటే పిచ్చి. తెగ తింటాను. ఎప్పుడైనా బాగోకపోతే మానేస్తాను కానీ వాయిస్ పాడవుతుందని కంట్రోల్ చేయమంటే నా వల్ల కాదు.
ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా?
సునిధీ చౌహాన్ అంటే చాలా ఇష్టం. ఆవిడ పాడే పద్ధతి, పదాలను పలికే తీరు, ఆ గొంతులోని మాధుర్యం... అన్నీ ఇష్టమే.
భవిష్యత్ ప్రణాళికలు...?
ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాను. అనుకున్న వన్నీ చేయగలుగుతున్నాను. కాబట్టి హ్యాపీనే. అయితే ఇంకో కల మిగిలే ఉంది. ఇళయరాజా, రెహమాన్‌ల దగ్గర పాడాలని. అది కూడా తీరిపోతే మరింత హ్యాపీ!
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more