ప్రాచీనకాలంలో మన పూర్వీకులు తమ జీవితం సంతోషంగా గడవాలని, కుటుంబసభ్యలు కలకాలం సుఖంగా బతకాలని, గృహంలో అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలని దేవతల కోసం కొన్ని ప్రత్యేకమైన వ్రతాలను, నోములను, పండుగలను నిర్వహించుకునేవారు. పండితుల సహకారంతో వాటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు, శుభ ముహూర్తాన్ని తెలుసుకుని తూచాతప్పకుండా వాటిని అవలంభించేవారు. దాంతో వారు ఎంతో సుఖంగా తమ జీవితాన్ని గడిపేవారు. అటువంటి తెలుగు పండుగలలో ‘అట్లతద్ది’ ఎంతో ప్రత్యేకమైనది, ముఖ్యమైనది కూడా!
ఆశ్వయుజ పౌర్ణమి గడిచిన తరువాత వచ్చే మూడవరోజునాడు అట్లతద్ది పండుగను నిర్వహించుకుంటారు. సాధారణంగా ఈ పండుగ సెప్టెంబర్ నెలాఖరులోగానీ, అక్టోబర్ మొదటివారంలోగానీ వస్తుంది. ఎంతో ఆధ్మాత్మికతతో కూడిన ఈ పండుగ వినోదాన్ని కూడా అందిస్తుంది. పూర్వకాలం నుంచి ఈ పండుగను పెళ్లయిన ఆడవాళ్లు మాత్రమే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను స్త్రీలు ఆనందంగా, వినోదాత్మకంగా జరుపుకుంటారు.
అట్లతద్ది నోము కథ :
పూర్వం ఒకనాడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు నలుగురు ఎంతో స్నేహంగా వుండేవారు. ఒకనాడు అట్లతద్దిరోజు వచ్చింది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం ప్రతిఒక్కరు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలందరూ దేవీ పూజలో నైవేద్యం కోసం అట్లు వేస్తున్నారు. అందరూ భోజనం సేవించకుండా ఉపవాసం వున్నారు. కానీ రాజుగారి కూతురు మాత్రం ఆకలితో నీరసించిపోతుంది. ఆమె తమ్ముడయిన రాజకుమారుడు తన చెల్లి పడుతున్న అవస్థను చూడలేకపోయాడు. తను చెల్లికి భోజనం చేయించాలనే నెపంతో మంత్రజాలం చేసి, ఒక అద్దంలో తన చెల్లికి ఒక తెల్లని వస్తువు చూయించి... ‘‘అదిగో చంద్రదోయమయింది. నువ్వు పండ్లు తీసుకుని కొద్దిసేపు సేద తీర్చుకున్న తరువాత పూజాకార్యక్రమాలు చేసుకో’’ అని అన్నాడు.
రాజకుమార్తె తన అన్న చెప్పిన మాటలను విస్వసించి, తను ఇచ్చిన ఆహారాన్ని సేవించి, పూజ చేసుకుంటుంది. పూజానియమం ప్రకారం.. చంద్రోదయం చూసిన తరువాత షాడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందువల్లే ఈ వ్రతాన్ని ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని కూడా అంటారు. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.
కొన్నాళ్ల తరువాత తన స్నేహితురాళ్లంతా ఆరోగ్యంగా వున్న మగవారిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈమెకు మాత్రం వచ్చిన సంబంధాలు అన్నీ వెనక్కు వెళ్లగా.. చివరకు ఒక ముసలివాడు భర్తగా లభిస్తాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆ రాకుమార్తె ఎంతగానో దు:ఖిస్తుంటుంది. ‘‘నాకెందుకు ఇటువంటి ముసలి భర్త లభించాడు. నా స్నేహితురాళ్లందరికి యవ్వనంలో వున్న భర్తలు లభించారు. నేనెటువంటి అపచారం చేశానని ఇటువంటి ముసలి భర్త దొరికాడు’’ అంటూ ఆమె పార్వతీపరమేశ్వరులకు ప్రార్థిస్తుంది. ఆమె బాధను చూసిన పార్వతీపరమేశ్వరులు ఆమె ముందుకు ప్రత్యక్షమై... ‘‘నీ అన్న అజ్ఞానం వల్లే నీకు ఈ బాధలు కలుగుతున్నాయి. అందులో అతని తప్పు కూడా ఏమీలేదు. నీమీద అతనుకున్న ప్రేమవల్లే వ్రతభంగం జరిగింది. అయినా నువ్వు చింతించకు... ఆశ్వయుజ బహుళ తదియనాడు నువ్వు తిరిగి నియమనిష్టలతో ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనమంతుడు అవుతాడు’’ అని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారు చెప్పిన విధంగానే రాకుమార్తె వ్రతాన్ని పూర్తి చేసి, ఆ అక్షింతలను తన ముసలి భర్త మీద వేస్తుంది. అతను వెంటనే యవ్వనవంతుడిగా మారిపోతాడు.
అట్లతద్ది పండుగను జరుపుకునే విధానం :
ఈ పండుగకు ముందురోజు నుంచే అన్ని వస్తువులను, సముదాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక స్త్రీలు తమను తాము అలంకరించుకోవడం కోసం రాత్రినుంచే తమ చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా పూసుకోవడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు అందుతాయి. తరువాత ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలను ముగించుకుని, స్నానం ఆచరించాలి. ఉదయం భోజనం చేసిన తరువాత ఎటువంటి తినుబండారాలను కూడా ముట్టుకోకూడదు. రోజంతా అభోజనంగానే వుండాలి. సాయంత్రం అవగానే గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, చంద్రునిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఈ పండుగ ప్రత్యేకత అయిన అట్లను తిని, ఉపవాసాన్ని విరమించుకుంటారు. చాలావరకు ఈ పండుగరోజు 11 రకాల కూరలతో కూడిన వంటకాలను చేసుకుంటారు.
అట్లతద్దినాడు స్త్రీలు, పిల్లలు తమకెంతో ఇష్టమైన ఉయ్యాలను ఊగుతారు. సరదాపాటలు పాడుకుంటూ రోజంతా హాయిగా గడుపుతారు. గౌరీదేవికి పూజలో కుడుములు, పాలితాలికలు, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోమును నిర్వహించుకున్నవారు 11 మంది ముత్తయిదువులను ఆహ్వానించి, వారికి భోజనాలను తినిపిస్తారు. నోమును నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా ఉపవాసం వుండాలి. లేకపోతే ఎటువంటి ఫలితాలు దక్కవు. పూజలో చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు వంటి మొదలైన పుష్పాలను పత్రాలతో 11 ముడులు వేసి తోరలు కట్టుకుంటారు. పసుపు రంగులో వున్న గౌరీదేవిని, గణపతిని ఒక కలశంలో వుంచుతారు.
ఒక పళ్లెంలో బియ్యం పొసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములను వుంచుతారు. వాటిమధ్యలో పసుపు, కుంకుమలను వేస్తారు. అలాగే మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. ఇలా చేసిన దానిని కైలాసంగా భావిస్తారు మహిళలు. పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తర శతనామావళిని ఖచ్చితంగా చదువుకోవాల్సి వుంటుంది. తరువాత అట్లతద్ది కథను చదువుకోవాలి. పూజా కార్యక్రమం పూర్తియిన తరువాత పిలిచిన 11 మంది ముత్తయిదువులకు 11 అట్లు చొప్పున పెట్టి.. గౌరీదేవి వద్ద పెట్టిన కుడుములలోనుంచి ఒక్కొక్కటి పెట్టి వాయనమివ్వాలి.
ఈ విధంగా అట్లతద్ది నోములో వాయనాన్ని అందుకున్న స్త్రీలు... అందులో వున్న అట్లను వాళ్లుగానీ వారి కుటుంబీకులుగానీ మాత్రమే తినాలి. ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల అరిష్టాలు కలిగే పరిణామాలు వున్నాయి. వాయనం ఇచ్చే సమయంలో స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనాన్ని అందిస్తారు. ఆ వాయనాన్ని అందుకునే స్త్రీలు కూడా అదే పద్ధతిని పాటించాల్సి వుంటుంది. ఇలా ఈ విధంగా అట్లతద్ది పండుగను మన తెలుగు మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
మరికొన్ని విశేషాలు :
మన ఆంధ్రదేశంలో జరుపుకునే ఈ అట్లతద్ది పండుగ... ఉత్తర భారతదేశంలో స్త్రీలు ప్రత్యేకంగా జరుపుకునే ‘కార్వాచౌత్’ పండుగతో సమానం. రోమ్ లో కూడా ఇటువంటి ఆచారాలు, పద్ధతులతో కూడిన పండుగను అక్కడి స్త్రీలు అవలంభించుకుంటారు. ఈ పండుగను వారు జనవరి 21వ తేదీన ‘‘సెయింట్ ఆగ్నెస్ ఈవ్’’గా పేర్కొంటారు.
పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్తలు ఎటువంటి అనారోగ్య ఇబ్బందులతో బాధపడకుండా పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా వుండాలనే ఈ అట్లతద్ది పండుకను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రస్తుతకాలంలో ఈ పండుగ ప్రభావం తగ్గినప్పటికీ.. ఇంకా చాలామంది స్త్రీలు దీనిని జరుపుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more